
బీఎస్‌ఎన్‌ఎల్ దసరా ప్రత్యేక స్కీములు
లక్ష్మీపురం(గుంటూరు)
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందజేయనున్నామని టెలికం జనరల్ మేనేజర్ ఎం.ఎల్.ఎన్.రావు చెప్పారు. స్థానిక చంద్రమౌళినగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్రాండ్‌బ్యాండ్ హోమ్ అన్ లిమిలెటెడ్ వినియోగదారులకు డౌన్‌లోడ్ స్పీడ్‌ను పెంచుతున్నామన్నారు. ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. 2014 సెప్టెంబర్ 23 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ప్రీపెయిడ్ టాప్ అప్ ఓచర్లపై పూర్తి టాక్‌టైమ్ అందజేస్తామని, ఇవి రూ. 100, రూ. 150, రూ. 250, రూ. 350లలో లభ్యమవుతాయన్నారు. రూ.550, రూ. 575, రూ.750, రూ.790 టాప్ అప్ ఓచర్‌లకు ఫుల్ టాక్ టైమ్‌కు మరికొంత అదనంగా లభిస్తుందన్నారు. నేస్తం ప్రీ పెయిడ్ మొబైల్ ప్లాన్ కాల్‌చార్జిల్లో మార్పులు చేశామని, ఈ మార్పు ఈ నెల 23 నుంచి వర్తింస్తుందని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్ లోకల్, ఎస్‌టీడీ కాల్‌చార్జిని ఇప్పటి వరకు సెకనుకు రూ.1.2 పైసలు వసూలు చేశామని, మార్పు చేసిన తరువాత సెకనుకు రూ.1.3 పైసలు వసూలు చేస్తున్నామని వివరించారు. ఇతర నెట్‌వర్క్‌లకు రూ.1.3పైసల నుంచి రూ. 1.4పైసలకు పెంపుదల చేశామన్నారు. బ్రాండ్‌బ్యాండ్ హోమ్ అన్‌లిమిటెడ్-545 ప్రస్తుతం ఉన్న డౌన్‌లోడ్ స్పీడ్‌ను 15 జీబీ వరకు 2 ఎంబీపీఎస్ ఆపైన 512 కేబీపీఎస్‌కు మార్పు చేశామని వివరించారు. బీబీ హోమ్ కాంబో యూఎల్డీ-675, యూఎల్డీ-800, యూఎల్డీ -900, యూఎల్డీ-999 ప్లాన్‌లలో కూడా డౌన్‌లోడు స్పీడ్ మార్పు చేశామని చెప్పారు. జన్ ధన్ యోజన స్కీము బ్యాంకు ఖాతాదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ సిమ్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్టుసైజు ఫొటోలు, నివాస ధృవీకరణ పత్రం అందజేస్తే సిమ్ ఇస్తామన్నారు. ఈ పథకం 90 రోజులపాటు అమలులో ఉంటుందని, మొదటి రీచార్జి కూపన్ విలువ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. విలేకరుల సమావేశంలో అధికారులు మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీసేవలో బిల్లుల చెల్లింపు.: అనంతరం టెలికం జనరల్ మేనేజర్ ఎం.ఎల్.ఎన్.రావు సాక్షితో మాట్లాడుతూ ఒక వారం రోజుల్లో మీ సేవ కేంద్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ బిల్లులు కట్టించుకునే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పారు. మీసేవ ప్రతినిధులతో చర్చలు ఫలవంతమయ్యాయని, మీ సేవ, బీఎస్‌ఎన్‌ఎల్ మధ్య సర్వర్‌ను లింక్‌చేసే ప్రక్రియ నడుస్తోందని వివరించారు.