రూ. 829 నుంచి విమాన టికెట్లు!
వర్షాకాలం మొదలవ్వడంతో విమాన చార్జీలు కూడా తగ్గుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ తన కొత్త ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకొని రూ. 829 నుంచి స్వదేశీ విమాన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్వదేశంలో చేసే విమాన ప్రయానాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ స్కీంలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో మాత్రం ఇండిగో ప్రకటించలేదు. అన్నింటికంటే తక్కువగా ఇంఫాల్-గువాహటి మార్గంలో టికెట్ రూ. 829కి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
అయితే ఇతర రూట్లలో మాత్రం టికెట్ల ధరలు దానికంటే కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఢిల్లీ-ముంబై మార్గంలో రూ. 2,486, ఢిల్లీ -చెన్నై మార్గంలో రూ. 3,338 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. అయితే ఇండిగో వెబ్‌సైట్‌లో చూస్తే మాత్రం ఢిల్లీ-ముంబై మార్గంలో వచ్చే వారానికి టికెట్ రూ. 5వేలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటినుంచి అమలవుతుందో ఇంకా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఇప్పటికే గో ఎయిర్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఏషియా లాంటి అనేక సంస్థలు వర్షాకాలం ఆఫర్లను ప్రకటించాయి. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.