air tickets
-
విమాన టికెట్ కంటే ఎక్కువా?
కోల్‌కతా: రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం ఉపసంహరించాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం డిమాండ్ చేశారు. పండుగలు తదితర రద్దీ సందర్భంగా గత వారం దేశవ్యాప్తంగా పలు రూట్లలో రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించిపోతున్నాయని విమర్శించారు. ఇలాగైతే అత్యవసర పరిస్థితిలో రైల్లో ప్రయాణించాల్సిన వారి గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం రద్దు చేయడంతో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మమత గతంలో రైల్వే మంత్రిగా కూడా చేయడం తెలిసిందే. రైలు టికెట్లకు డైనమిక్ ప్రైసింగ్‌ను 2016లో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఛత్ పూజ తదితరాల నేపథ్యంలో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించినట్టు వార్తలొచ్చాయి. -
రూ. 83 లకే విమాన టికెట్: అదిరిపోయే ట్విస్ట్ ఏమిటంటే..!
పండుగల సందర్భంగా చాలా విమానయాన సంస్థలు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులో ఉంచుతాయి. ఈ క్రమంలోనే ఒక డాలరు కంటే (రూ. 83) తక్కువకే దిగి రావడం వైరల్‌గా మారింది. అదీ కొన్ని ఖరీదైన రూట్లలో కూడా కేవలం రూ. 114లకే విమాన టికెట్లు అందుబాటులోకి రావడంతో జనం ఎగబడ్డారు. తొలుత ఫేక్ వెబ్సైట్ అని కొంత తటపటాయించారు. కానీ అది ప్రముఖ వెబ్సైట్ అని ధృవీకరించుకున్న తరువాత టికెట్లను భారీగా కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు డాలరు కంటే తక్కువ ధరకే విమాన టికెట్లు అంటూ బుకింగ్ స్క్రీన్ షాట్లతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. దీంతో విషయం తెలిసిన సంస్థ రంగంలోకి దిగింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని సదరన్ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లో విమాన ఛార్జీలు ఉన్నదానికంటే తక్కువకే దర్శనమిచ్చాయి. గాంగ్జూ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేసే చైనా సదరన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వెబ్సైట్లో దాదాపు 2 గంటలపాటు టెక్నికల్ సమస్య ఏర్పడింది. ఈ లోపం కారణంగా చెంగ్డూ నుండి షాంఘై వంటి కొన్ని రూట్లు 1.37 డాలర్లకంటే (రూ. 114) తక్కువ ధరల్ని ప్రదర్శించాయి. ఎయిర్‌లైన్ యాప్, వివిధ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫారమ్లలోకూడాఇలానే కనిపించింది. చైనాలో అత్యంత రద్దీగా ఉండే ఆన్లైన్ షాపింగ్ కాలం కావడంతో కొనుగోలు దారులు క్యూ కట్టారు. అయినా చెల్లుతాయి అసాధారణ రద్దీతోపాటు ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన సంస్థ టెక్నికల్ సమస్యను ఆలస్యంగా గుర్తించింది. ట్విస్ట్ ఏంటంటే ధరలతో సంబంధం లేకుండా, సాంకేతిక లోపం సమయంలో కొనుగోలు చేసిన అన్ని టిక్కెట్లూ చెల్లుతాయని ప్రయాణికులకు హామీ ఇవ్వడం విశేషంగా నిలిచింది. ఈ మేరకు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ అధికారిక వీబో సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది. అయితే గతంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కానీ తప్పుగా ప్రాసెస్ అయిన టికెట్లు చెల్లవని, సంబంధిత టికెట్ల సొమ్మును వాపసు ఇస్తామని ప్రకటించింది. -
విమాన టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే రీయింబర్స్మెంట్
న్యూఢిల్లీ: ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తుండటంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే, దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని ప్యాసింజర్లకు ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రూట్ల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ఖర్చుల్లో 30–75 శాతం వరకు (పన్నులు సహా) రీయింబర్స్ చేయాలి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. ప్యాసింజర్లు నిర్దిష్ట తరగతిలో ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టికెట్‌ను విమానయాన సంస్థలు వివిధ కారణాలతో దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్న ఉదంతాలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. -
వలస కార్మికులకు ఉచిత ప్రయాణం
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంపెనీ ఏడీఎన్‌హెచ్.. 150 మంది వలస కార్మికులకు దుబాయ్ వెళ్లడానికి ఉచిత వీసాలు, విమాన టికెట్లు సమకూర్చింది. కార్మికులకు క్లీనింగ్, క్యాటరింగ్ సెక్షన్లలో ఉపాధి కల్పిస్తోంది. వలస కార్మికులకు వీసాలను జారీ చేయడానికి లైసెన్స్డ్ ఎజెన్సీలు, సబ్ ఏజెంట్లు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ, వివిధ పట్టణాల్లో బ్రాంచీలు కలిగి ఉన్న జీటీఎం కంపెనీ ద్వారా ఏడీఎన్‌హెచ్ రిక్రూట్ చేసుకుంది. ఉచిత వీసాల వల్ల వలస కార్మికులందరికీ కలిపి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు తప్పింది. వీసాలు పొందిన కార్మికులు దుబాయ్ వెళ్లేందుకు ముంబైకి బయలుదేరి వెళ్లారు. గతంలో ఇదే కంపెనీ ఖతర్‌లో, అబుదాబీల్లో పనిచేయడానికి 2,200 మందికి ఉచిత వీసాలు అందజేసింది. ‘సాక్షి’కథనం వల్లే.. వలస కార్మికులకు బంపర్ ఆఫర్ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల జీటీఎం నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాం. ఎలాంటి సొమ్ము చెల్లించకుండానే దుబాయ్‌కు వెళ్లడం సంతోషంగా ఉంది. పేద కార్మికులకు దీని వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. – పవన్ కళ్యాణ్, పెంబి, నిర్మల్ జిల్లా -
ప్రయాణికులకు రీఫండ్ వోచర్లు..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్ చేసుకుంది. బదలాయింపులకు వీలయిన రిఫండ్ వోచర్లు జారీ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారం చూపవచ్చన్న కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... లాక్డౌన్ సమయంలో రద్దయిన సర్వీసులకు సంబంధించి ప్రయాణి కులకు డబ్బు వాపసు చేస్తే, ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఆర్థికంగా మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ‘బదలాయింపునకు వీలయిన రిఫండ్ వోచర్లను’ ప్రయాణి కులకు జారీ చేస్తే అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలుగదు. వోచర్స్‌ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసిన తమ ఏజెంట్లకు సమర్పించి, డబ్బు వాపసు తీసుకోవచ్చు. లేదా తదుపరి తమ ప్రయాణాల టికెట్ బుకింగ్‌లకు వినియోగించుకోవచ్చు. డబ్బు వాపసు ఇచ్చిన పక్షంలో ఆయా వోచర్లను వేరొకరి ప్రయాణాలకు వినియోగించే సౌలభ్యతను ఏజెంట్లకు కల్పించడం జరుగుతుంది. ఎన్జీఓలు, ప్యాసింజర్ల అసోసియేషన్స్‌సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు రెండు వర్గాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. కేంద్రం, డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తరఫున తుషార్ మెహతా చేసిన ‘బదలాయింపులకు వీలయిన రిఫండ్స్ వోచర్ల’ ప్రతిపాదనకు ట్రావెల్ ఏజెంట్ల సంస్థ తరఫున వాదలను వినిపించిన సీనియర్ అడ్వకేట్ పల్లవ్ సిసోడియా సానుకూల స్పందన వ్యక్తం చేయడం శుక్రవారంనాటి మరో కీలకాంశం. ఇండిగో ఎయిర్‌లైన్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ కూడా సంబంధిత ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. విదేశీ విమాన సర్వీసులకు వర్తించదు! కాగా వాదనల సమయంలో ‘ప్రవాసీ లీగల్ సెల్’ ఎన్జీఏ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్గే విదేశాల నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారికి రిఫండ్ పరిస్థితిని ప్రస్తావించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, విదేశీ విమాన సర్వీసుల అంశంలోకి వెళ్లలేమని పేర్కొంది. సంబంధిత టికెట్లకు రిఫండ్‌ను భారత్ ప్రభుత్వం ఆదేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
ఫ్రీడం సేల్ : వెయ్యికే విమాన ప్రయాణం
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లతో అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ను ప్రకటించగా.. తాజాగా విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా ‘ఫ్రీడం సేల్’ను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ఈ సేల్ కింద విమాన టిక్కెట్ కేవలం రూ.1,099కే లభ్యమవుతుంది. ఈ కొత్త సేల్ ఆఫర్ బుకింగ్స్ ఆగస్టు 14వ తేదీ 00:01 am నుంచి ప్రారంభమై, 11:59 pm వరకు కొనసాగనున్నాయి. ఎస్బీఐ కార్డుద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ కస్టమర్లు 2018 ఆగస్టు 22 నుంచి 2018 అక్టోబర్ 10 వరకు ప్రయాణించవచ్చు. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్లాస్ కస్టమర్లు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు ట్రావెల్ చేయొచ్చు. ఎకానమీ లైట్ కేటగిరీ వారికి వన్-వే ధరలు కేవలం రూ.1,099కే అందుబాటులో ఉన్నాయి. ఎకానమీ స్టాండర్డ్ కేటగిరీ వారికి రూ.1,399కు, ప్రీమియం ఎకానమీ కేటగిరీ వారికి రూ.2,499, బిజినెస్ క్లాస్ కేటగిరీ వారికి రూ.6,099కు విమాన టిక్కెట్లను విస్తారా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద సీట్లు పరిమితం. ఫస్ట్-కమ్-ఫస్ట్ సర్వ్ బేసిస్‌లోనే ఈ సీట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలోనే అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వన్-వే విమాన టిక్కెట్ ధర ఎకానమీ లైట్ కేటగిరీ కింద రూ.1,799 కాగ, ఎకానమీ స్టాండర్డ్ కింద 2,324 రూపాయలు, ప్రీమియం ఎకానమీ కింద 4,199 రూపాయలు, బిజినెస్ క్లాస్ కింద 15,999 రూపాయలుగా ఉంది. మిగతా రూట్ల ధరలను www.airvistara.com లో చూడవచ్చు. -
విమాన ప్రయాణీకులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విమాన ప్రయాణీకులకు ఇది నిజంగా శుభవార్తే. భారీగా బాదేస్తున్న విమాన టికెట్ల కాన్సిలేషన్ చార్జీలపై విమానయాన మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రయాణీకులకు భారీ ఊరట కల్పించనుంది. దేశీయ విమానయాన సంస్థల్లో టికెట్ల రద్దు సమయంలో విధించే చార్జీల సవరణకు కసరత్తు చేస్తోంది. దీనికి బదులు సరికొత్త నిబంధనలను అమలు చేయనుంది. దేశీయ విమానయాన సంస్థలు కాన్సిలేషన్ ఫీజు రూ. 3వేల చొప్పున వసూలు చేస్తున్న నేపథ్యంలో కాన్సిలేషన్ చార్జీల డేటా పంపించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కోరింది. తాజా నివేదికల ప్రకారం, రద్దు ఛార్జీలు బేస్ ఫేర్ కన్నా లేదా ఇంధన సర్ ఛార్జ్ మొత్తం కంటే ఎక్కువగా ఉండరాదు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునేలా నియమాలను రూపొందించనున్నట్టు సమాచారం. ఇటీవల కాన్సిలేషన్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో డీజీసీఏ ఈ చర్యలకు దిగనుంది. కాగ ఉడాన్(తక్కువ ధరల్లో విమాన ప్రయాణ) పథకం గంటకు రూ. 2500 విమాన టికెట్లను అందిస్తోంటే.. దానికంటే కాన్సిలేషన్ చార్జీలు అధికంగా ఉండడంపై ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈ రద్దు ఛార్జీలను తిరిగి నియంత్రించాల్సినవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీటిని సమీక్షించాలని జయంత్ సిన్హా ఆదేశించారు. -
గో ఎయిర్ ఆఫర్: రూ. 599లకే టికెట్
న్యూడిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్ సమ్మర్ స్పెషల్ సేల్ తరువాత దేశీయ ఎయిర్‌లైన్ గో ఎయిర్ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. మాన్ సూన్ క్యాంపెయిన్ పేరుతో అతి తక్కువ ధరకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. రూ. 599 గా ప్రారంభమయ్యే ధరలను శుక్రవారం ప్రకటించింది. ఈ రోజు మే 12 నుంచి మే 15, 2017 అర్ధరాత్రి వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులోఉండనున్నాయని ఎయిర్ లైన్ ఒకప్రకనట లో తెలిపింది. జూలై 01 - సెప్టెంబరు 30, 2017 మధ్య ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. తమ నెట్ వర్క్ లో నాన్ స్టాప్ విమానాల్లో మాత్రమే ఈ డిస్కౌంట్ చెల్లుతుంది. 23 సెక్టార్లలో గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న విమానాల్లో ప్రయాణీకులకు అత్యల్ప ఛార్జీలను అందిస్తుంది. ఇన్ఫాంట్ గ్రూప్ బుకింగ్ కోసం ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదని, ఇతర ప్రమోషనల్ ఆఫర్‌తో లేదా ఏదైనా రూపంలో కలిపి వర్తించదని తెలిపింది. కాగా రూ .899ప్రారంభ ధరలతో మే 8, 2017 న, ఇండిగో 'సమ్మర్ స్పెషల్ సేల్' ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
'ఎయిర్‌టికెట్లకు రీఫండ్ ఇస్తాం'
ట్రంప్ ప్రభుత్వం నిషేధించిన ఏడు ముస్లిం దేశాల నుంచి బుక్ చేసుకున్న ఎయిర్‌టికెట్లకు రీ ఫండ్ ఇస్తున్నట్లు యూ.ఎస్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. నిషేధం విధించిన ఇరాన్, ఇరాక్, లిబ్యా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాల్లోని గ్రీన్ కార్డు హోల్డర్లను మినహా ఎవరినీ అనుమతించబోమని అమెరికాకు చెందిన యూనైటైడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ లు పేర్కొన్నాయి. 90 రోజుల పాటు ఏడు ముస్లిం దేశాలపై గత శుక్రవారం ట్రంప్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్ధ అయిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ తమ కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని చెప్పింది. టికెట్లను రీ బుక్ చేసుకునే సదుపాయం లేదా డబ్బును వెనక్కు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్(యూఏఎల్) సీఈవో ఆస్కార్ మునోజ్ మాట్లాడుతూ నిషేధం తర్వాత బుక్ చేసుకున్న టికెట్లకు రీ ఫండ్ ఇస్తామని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్వేస్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ లు కూడా అమెరికన్ ఎయిర్‌లైన్స్ బాటలో నడవనున్నట్లు చెప్పాయి. అయితే, ఎయిర్‌ఫ్రాన్స్ మాత్రం పెనాల్టీలను దృష్టిలో ఉంచుకని రీ ఫండ్ ఇస్తామని చెప్పింది. జర్మనీకి చెందిన ఎయిర్‌లైన్ దిగ్గజం లుఫ్తాన్సా కస్టమర్లకు రీ బుకింగ్ చేసుకునే సదుపాయన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. -
రూ. 829 నుంచి విమాన టికెట్లు!
వర్షాకాలం మొదలవ్వడంతో విమాన చార్జీలు కూడా తగ్గుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ తన కొత్త ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకొని రూ. 829 నుంచి స్వదేశీ విమాన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్వదేశంలో చేసే విమాన ప్రయానాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ స్కీంలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో మాత్రం ఇండిగో ప్రకటించలేదు. అన్నింటికంటే తక్కువగా ఇంఫాల్-గువాహటి మార్గంలో టికెట్ రూ. 829కి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అయితే ఇతర రూట్లలో మాత్రం టికెట్ల ధరలు దానికంటే కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఢిల్లీ-ముంబై మార్గంలో రూ. 2,486, ఢిల్లీ -చెన్నై మార్గంలో రూ. 3,338 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. అయితే ఇండిగో వెబ్సైట్లో చూస్తే మాత్రం ఢిల్లీ-ముంబై మార్గంలో వచ్చే వారానికి టికెట్ రూ. 5వేలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటినుంచి అమలవుతుందో ఇంకా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఇప్పటికే గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఏషియా లాంటి అనేక సంస్థలు వర్షాకాలం ఆఫర్లను ప్రకటించాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
రూ. 1590కే విమాన టికెట్లు
దసరా, సంక్రాంతి సీజన్లలో ఇళ్లకు వెళ్లడానికి బస్సు, రైలు టికెట్లు దొరకడం లేదా? అయినా ఏమీ ఆందోళన అక్కర్లేదు. హాయిగా విమానం ఎక్కి మరీ వెళ్లిపోవచ్చు. అక్టోబర్ 20వ తేదీ.. అంటే మంగళవారం నుంచి 2016 ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు సంబంధించిన విమాన టికెట్లకు ఎయిర్ ఏషియా ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. నవంబర్ ఒకటో తేదీలోగా టికెట్లు బుక్ చేసుకుంటే, పన్నులన్నీ కలిపి కనిష్ఠంగా రూ. 1590కే ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి కొచ్చి, గోవా మార్గాల్లో వెళ్లడానికి రూ. 1590, అదే బెంగళూరు నుంచి పుణె అయితే రూ. 1990 ధర పెట్టిన ఎయిర్ ఏషియా, ఢిల్లీ- బెంగళూరు మార్గంలో మాత్రం రూ. 4290గా టికెట్ ధర నిర్ణయించింది. ఢిల్లీ-గోవా మార్గంలో రూ. 3990, గువాహటి -ఇంఫాల్ మార్గంలోను, ఢిల్లీ-గువాహటి మార్గంలోను రూ. 1690కి టికెట్లు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీలోగా ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి. వచ్చే ఏడాది ప్రయాణం మరింత చౌక ఎయిర్ ఏషియా విమానాల్లో వచ్చే సంవత్సరం వేసవి నుంచి ప్రయాణాలు మరింత చవగ్గా చేయొచ్చు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి అక్టోబర్ 29 వరకు చేసే ప్రయాణాలకు కనిష్ఠ ధర రూ. 1299 అని ప్రకటించారు. ఈ ఆఫర్ కింద టికెట్లను మాత్రం అక్టోబర్ 25లోగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలు పండుగ సీజన్లు కాబట్టి ఈ సమయంలో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకోడానికి స్పైస్‌జెట్ సంస్థ అర్ధరాత్రి ప్రయాణాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తరహా విమాన సర్వీసులు ప్రధానంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. జెట్ ఎయిర్వేస్, ఇండిగో కూడా ఇలాంటి విమాన సర్వీసులను ప్రకటించాయి. -
అమెరికా విమాన టికెట్.. లక్షకు పైమాటే!!
అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అయితే కొన్నాళ్లు ఆగండి. ఎందుకంటే, ఇప్పుడు అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలన్నీ మండిపోతున్నాయి. మామూలుగా అయితే ఎకానమీ క్లాస్ టికెట్ల ధర సుమారుగా 48 వేల రూపాయలు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 97 వేల వరకు ఉంది. న్యూయార్క్, చికాగో లాంటి నగరాలకు భారతదేశం నుంచి టికెట్లు రూ. 90 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు పలుకుతోంది. న్యూజెర్సీలో స్వామి నారాయణ్ మహోత్సవం జరుగుతోందని, దానికితోడు అక్కడ సెలవులు కూడా ఉన్నాయని, అలాగే అక్కడ కొత్త సెమిస్టర్లు మొదలవుతాయని, అందుకే ఇంత ఎక్కువ ధరలు పలుకుతున్నాయని ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు. స్వామి నారాయణ్ భక్తులు వేలాది సంఖ్యలో న్యూజెర్సీకి వెళ్లి, అక్కడ నిర్మిస్తున్న అతిపెద్ద అక్షర్ధామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. దాంతో ఒక్కసారిగా అన్ని విమానయాన సంస్థల ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలు రూ. 80 వేల నుంచి లక్ష వరకు పలుకుతున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ ఆఫర్ మరో రెండు రోజులు పొడిగింపు
ముంబై: జెట్ ఎయిర్వేస్ సంస్థ ఎకానమి క్లాస్‌కు సంబంధించి స్పెషల్ ఆఫర్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. దేశీయ రూట్లలో ఈ ఆఫర్‌ను గత నెల 31న కంపెనీ ప్రకటించింది. రూ.1,499 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్‌కు టికెట్లను నేడు, రేపు (ఆగస్టు 6,7 తేదీల్లో) బుక్ చేసుకోవచ్చని, ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. బేస్ చార్జీ, ఇంధన సర్‌చార్జీల్లో 40 శాతం డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. తమ దేశీయ నెట్‌వర్క్‌లో డెరైక్ట్, కనెక్ట్ ఫ్లైట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. గ్రూప్ బుకింగ్స్‌కు ఇది వర్తించదని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. ఎమిరేట్స్ స్పెషల్ ఆఫర్లు గల్ఫ్ విమానయాన సంస్థ ఎమిరేట్స్ సంస్ధ 67వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా భారత విమాన ప్రయాణికులకు స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. పశ్చిమాసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికాలకు ఎకానమీ క్లాస్‌కైతే రూ.21,858, బిజినెస్ క్లాస్‌కు అయితే రూ.52,312 నుండి ఈ స్పెషల్ చార్జీలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ స్పెషల్ ఆఫర్లకు బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని, ఈ నెల 10న ముగుస్తాయని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి డిసెంబర్ 10 మధ్య జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది. -
‘జస్ట్’ లక్షల్లో మింగారు!
విమాన టికెట్ల పేరుతో దందా ఆరు రాష్ట్రాల్లో సాగిన మోసాలు ఇద్దరిని అరెస్టు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: బోగస్ ట్రావెల్ ఏజెన్సీలు ఏర్పాటు చేసి... ఇంటర్నెట్లోని జస్ట్ డయల్ వెబ్సైట్లో పొందుపరిచి... విమాన టికెట్ల పేరుతో రూ.లక్షల్లో కాజేసిన అంతరాష్ట్ర ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా.. ప్రధాన సూత్రధారితో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. డీసీపీ జి.పాలరాజు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం... నగరంతో పాటు ఉత్తరాదికి చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్‌తో పాటు పుణె, ముంబై, మంగుళూరు, చెన్నై, జమ్మూకాశ్మీర్‌ల్లో థెరపీ, కాంటినెంటల్, వైభవ్, ఆర్జో పేర్లతో బోగస్ ట్రావెల్ ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. వీటిని జస్ట్ డయల్‌లో ఎన్రోల్ చేయించుకోవడంతో పాటు ఆయా నగరాల్లో స్థానిక ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. విమాన టికెట్లు, ట్రావెల్ ఏజెన్సీల కోసం జస్ట్ డయల్‌ను సంప్రదించే వినియోగదారుల సమాచారం వీరికి చేరేది. ఫోన్ ద్వారా కస్టమర్లను కాంటాక్ట్ చేసి మాట్లాడే ప్రతినిధులు తక్కువ ధరకు విమాన టికెట్లు అందిస్తామంటూ వలవేసే వారు. నగదును తమ ఖాతాల్లో జమ చేయించుకుని టికెట్ బుక్ చేసి దాని పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను వినియోగదారులకు పంపేవారు. టికెట్ బుక్ చేసేది ఈ బోగస్ సంస్థల వారే కావడంతో వాటిని రద్దు చేసే అవకాశమూ వీరికి ఉండేది. దీంతో ప్రయాణ సమయానికి కాస్త ముందుగా వినియోగదారులకు తెలియకుండానే జారీ చేసిన టికెట్లను రద్దు చేసి ఆ నగుదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుని కాజేసేవారు. ఈ విషయం తెలియక ఎయిర్పోర్ట్ వరకు వెళ్లిన వినియోగదారులు అక్కడ అసలు సంగతి తెలుసుకుని ప్రయాణం రద్దు చేసుకోవడం లేదా ఎక్కువ ధరకు మరో టికెట్టు కొనుగోలు చేయడమో చేసేవారు. నిందితుల ఫోన్లు, బ్యాంకు ఖాతాల్లో చాలా వరకు బోగస్ వివరాలతో కూడినవి కావడంతో పట్టుబడేవారు కాదు. ఈ రకంగా ముఠా దేశ వ్యాప్తంగా అనేక మందిని మోసం చేసి రూ.లక్షల్లో స్వాహా చేసింది. నగరంలోని కొందరిని ఈ ముఠా రూ.3 లక్షల మేర మోసం చేయడంతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ పి.రాజు నేతృత్వంలో హెడ్-కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు మురారి విజయ్, సతీష్ సాంకేతికంగా దర్యాప్తు చేసి నిందితులైన సునీల్ శర్మ (మహారాష్ట్ర), మహ్మద్ అస్ఘర్ అలీ (మలక్‌పేట)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూత్రధారి సహా మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ తరహా సంస్థల్ని ఎలాంటి పరిశీలనా లేకుండా ఎన్రోల్ చేసుకుని, పలువురు నష్టపోవడానికి కారణమైన జస్ట్ డయల్ సంస్థకూ సంజాయిషీ కోరుతూ నోటీసు ఇస్తున్నామని డీసీపీ పాలరాజు తెలిపారు. -
గో ఎయిర్ టికెట్లపై రూ.888 డిస్కౌంట్
ముంబై: గోఎయిర్ కంపెనీ అన్ని విమాన టికెట్లపై రూ.888 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా రానున్న ఎనిమిది రోజుల్లో బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ సోమవారం తెలిపింది. వచ్చే నెల 20 వరకూ జరిగే ప్రయాణాలకు ఈ డిస్కౌంట్‌ను అందిస్తామని పేర్కొంది. ఈ సంస్థ 21 నగరాలకు వారానికి మొత్తం 840 విమాన సర్వీసులను నడుపుతోంది. 2005, నవంబర్ 4న సర్వీసులను ప్రారంభించిన ఈ సంస్థ అహ్మదాబాద్, బగ్దోగ్ర, బెంగళూర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్‌కత, లెహ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పోర్ట్బ్లైర్, పుణే, రాంచి, శ్రీనగర్లకు విమాన సర్వీసులందిస్తోంది.