కోల్‌కతా: రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం ఉపసంహరించాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం డిమాండ్ చేశారు. పండుగలు తదితర రద్దీ సందర్భంగా గత వారం దేశవ్యాప్తంగా పలు రూట్లలో రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించిపోతున్నాయని విమర్శించారు. ఇలాగైతే అత్యవసర పరిస్థితిలో రైల్లో ప్రయాణించాల్సిన వారి గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం రద్దు చేయడంతో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మమత గతంలో రైల్వే మంత్రిగా కూడా చేయడం తెలిసిందే. రైలు టికెట్లకు డైనమిక్ ప్రైసింగ్‌ను 2016లో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఛత్ పూజ తదితరాల నేపథ్యంలో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించినట్టు వార్తలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment