
హోలీతో సుదీర్ఘ వారాంతం
ఫ్లైట్ బుకింగ్స్ 25 శాతం, చార్జీలు 18 శాతం అప్
హోటల్ బుకింగ్స్ 30 శాతం అధికం
సాక్షి, బిజినెస్ డెస్క్ : మహా కుంభ మేళా హడావిడి ముగిసిన తర్వాత పర్యాటకానికి హోలీ పండుగ రూపంలో మరో కొత్త దన్ను దొరికింది. శుక్రవారం నాడు హోలీ కావడంతో సుదీర్ఘ వారాంతపు సెలవులొస్తున్న నేపథ్యంలో టూరిజానికి డిమాండ్ పెరిగింది. వివిధ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల డేటా ప్రకారం గత సీజన్‌తో పోలిస్తే ఫ్లయిట్ బుకింగ్స్ 25–30 శాతం ఎగిశాయి. అలాగే హోటల్ బుకింగ్స్ కూడా 20–30 శాతం పెరిగాయి.
ఇక వీటితో పాటు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ చార్జీలు సైతం పెరిగాయి. దేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు సగటున 12–18 శాతం, అంతర్జాతీయ రూట్లలో చార్జీలు 8–14 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో వీలైనంత ముందుగా ట్రావెల్ ప్రణాళికలు వేసుకోవాలంటూ కస్టమర్లకు సూచిస్తున్నట్లు వివరించాయి.
లగ్జరీ హోటళ్లలో టారిఫ్‌లు జూమ్..
ఇక హోటళ్ల విషయం తీసుకుంటే, సాధారణ వీకెండ్ బుకింగ్స్‌తో పోల్చినప్పుడు లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల్లో గదుల రేట్లు 30–40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అదే స్టాండర్డ్ హోటళ్లలో చూస్తే ధరల పెరుగుదల 15–20 శాతం మేర ఉన్నట్లు వివరించాయి. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసి, గోవా, అలీబాగ్, లోనావాలా, రిషికేష్, కూర్గ్, కేరళ వంటి డెస్టినేషన్లలో హోటల్ గదుల బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి.
కుటుంబాలు, ఫ్రెండ్స్ బృందాలు ఎక్కువగా ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, ప్రీమియం రిసార్టులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లగ్జరీ ప్రాపర్టీలు, ప్రైవేట్ విల్లాల బుకింగ్స్ సాధారణ వీకెండ్స్‌తో పోలిస్తే 40–50 శాతం పెరిగాయి. రాజస్థాన్, గోవాతో పాటు ప్రధాన మెట్రోలకు సమీపంలో ఉన్న హిల్ స్టేషన్లలో చాలా మటుకు ప్రీమియం, లగ్జరీ హోటల్స్ ఇప్పటికే 70–80 శాతం బుక్ అయిపోయాయి.
కొన్ని రిసార్టుల్లో ఇప్పటికే ఆక్యుపెన్సీ పూర్తి స్థాయికి చేరినట్లు జోస్టెల్ సంస్థ వివరించింది. కాక్స్ అండ్ కింగ్స్ ప్రకారం జైపూర్, వారణాసి, రిషికేష్, గోవాలాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్‌కి భారీ డిమాండ్ నెలకొంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్‌లాంటివి ఫేవరెట్ డెస్టినేషన్లుగా ఉంటున్నాయి.
ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లు..
హోలీ అనంతరం కూడా ప్రయాణాలకు డిమాండ్ భారీగా పడిపోకుండా విమానయాన సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆకాశ ఎయిర్, ఇండిగో తదితర సంస్థలు పరిమిత కాలం పాటు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ డేటా ప్రకారం ఫిబ్రవరి ఆఖరు వారంలో నమోదైన 5.2 లక్షల మంది రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య మార్చి తొలి రెండు వారాల్లో సుమారు 4.8 లక్షల ప్యాసింజర్లకు పడిపోయినప్పటికీ.. వార్షికంగా చూస్తే మాత్రం మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment