ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: చౌక విమానయాన సర్విసులను అందించిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ లిక్విడేషన్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాలు జారీ చేసింది. గో ఫస్ట్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఆర్థిక సమస్యల కారణంగా విమాన సర్విసులు నిలిపివేసింది. 2023 మేలో సంస్థ స్వయంగా తన ఆర్థిక సమస్యలను ప్రస్తావిస్తూ స్వచ్ఛందంగా చట్టపరమైన పరిష్కార ప్రక్రియ కోసం ఎన్‌సీఎల్‌టీలో దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో 15 పేజీల తాజా ఉత్తర్వుల్లో ఎయిర్‌లైన్స్‌ను లిక్విడేట్ చేయాలని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. సంస్థను లిక్విడేట్ చేయాలన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఎన్‌సీఎల్‌టీ ప్రస్తావించింది.
17 సంవత్సరాల ప్రయాణం..
గో ఎయిర్ పేరుతో ప్రారంభమైన ఈ ఎయిర్‌లైన్ తర్వాత గో ఫస్ట్‌గా పేరు మార్చుకుంది. ఇది 17 సంవత్సరాల పాటు సర్విసులు అందించింది. 2023 మే 3న సర్వీసులు నిలిపివేసింది. ఎయిర్‌లైన్ 2005లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తన తొలి సర్విసు ప్రారంభించి, 2018–19లో అంతర్జాతీయ సర్విసులకు శ్రీకారం చుట్టింది. 2022–23లో దాదాపు రూ.1,800 కోట్ల నష్టాన్ని నమోదుచేసుకుంది.
దివాలా పరిష్కార ప్రక్రియ తీరిది...
ఇన్‌సాల్వెన్సీ పరిష్కార ప్రక్రియలో స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్‌తో కలిసి బిజీ బీ ఎయిర్‌వేస్ బిడ్డింగ్ ప్రక్రియలో నిలిచింది. కాగా ఈ బిడ్డింగ్ సమయంలో డీజీసీఏ గో ఫస్ట్‌కు చెందిన 54 విమానాలను డీరిజిస్టర్ చేయడంతో రిజల్యూషన్ ప్రక్రియ అమలు కాలేదు. దీంతో తాజాగా ఎన్‌సీఎల్‌టీ లిక్విడేషన్ ఆదేశాలు జారీ ఆయ్యాయి.
లిక్విడేషన్ అంటే..
ఒక కంపెనీ లిక్విడేషన్ అనేది రుణ బకాయిల్లో ఉన్న కంపెనీ ఆస్తులను అమ్మి అప్పులు తీర్చడం. మిగిలిన ఆస్తులను షేర్‌హోల్డర్లకు పంపిణీ చేయడం. దీన్ని కంపెనీ మూసి వేత (వైండింగ్ అప్) అని కూడా అంటారు.
Comments
Please login to add a commentAdd a comment