NCLT order
-
ఫ్యూచర్‌పై దివాలా చర్యలు షురూ!
ముంబై: రుణ ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్)పై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ బుధవారం ఆదేశించింది. ఈ విషయంలో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. రూ.3,495 కోట్ల రుణ డిఫాల్ట్‌ల నేపథ్యంలో కంపెనీకి వ్యతిరేకంగా దివాలా పరిష్కార ప్రక్రియను కోరుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బీఓఐ కుమ్మక్కై ఈ పిటిషన్ దాఖలు చేసిందని అమెజాన్ పేర్కొంది. బ్యాంక్ పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ఆమోదిస్తే, ఫ్యూచర్ రిటైల్‌కు సంబంధించి తమ న్యాయ పోరాట ప్రయోజనాలు దెబ్బతింటాయని ఈ కామర్స్ దిగ్గజం వాదించింది. -
ఎన్‌టీసీపై దివాలా చర్యలు షురూ! ఎన్సీఎల్టీ ఆమోదం!
న్యూఢిల్లీ: నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ (ఎన్టీసీ)పై దివాలా చర్యలు చేపట్టడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఢిల్లీ బెంచ్ ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ. 14 లక్షలను డిఫాల్ట్‌గా క్లెయిమ్ చేస్తూ ఎన్‌టీసీపై ఆపరేషనల్ క్రెడిటార్స్‌లో ఒకరైన హీరో సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ ఈ చర్యలకు ఆదేశించిం ది. ఐఆర్‌పీగా (ఇంటిర్మ్ రిజల్యూషన్ ప్రొఫె షనల్) అమిత్ తల్వార్ నియమించిన ట్రిబ్యున ల్, ఎన్టీసీ బోర్డ్‌ను సస్పెండ్ చేసింది. సంస్థపై మారటోరియం ప్రకటించింది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోని ప్రభుత్వ రంగ సంస్థపై (పీఎస్‌యూ)పై దివాలా చర్యలు ప్రారంభించడం బహుశా ఇదే మొదటిసారి. జౌళి మంత్రిత్వశాఖ ఆధీనంలో ఎన్టీసీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. -
జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్లాన్ : ఉద్యోగుల షాక్!
ముంబై: ఎయిర్‌లైన్స్ కోసం జలాన్-కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళికను సవాలుచేస్తూ, ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో అప్పీల్ దాఖలు చేసినట్లు ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ గురువారం తెలిపింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను 2020 అక్టోబర్‌లో జెట్ ఎయిర్వేస్ రుణ దాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ పరిష్కార ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు గత వారం జెట్ ఎయిర్వేస్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తిరిగి ధృవీకరించింది. దీనితో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 2019లో ఆగిపోయిన ఎయిర్‌లైన్ పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియను సవాలు చేస్తూ, ఆ సంస్థ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. బీకేస్, జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, వివిధ సంఘాలు కూడా గత నెలలో ఎన్సీఎల్ఏటీ ముందు అప్పీల్ దాఖలు చేశాయి. రాబోయే నెలల్లో సేవలను పునఃప్రారంభిస్తుందని భావిస్తున్న జెట్ ఎయిర్వేస్ను ప్రస్తుతం మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తోంది. అప్పీల్ ఎందుకంటే... జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, ఫ్లైట్ స్లాట్లు, మరీ ముఖ్యంగా ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులతో సహా కీలక విభాగాల వినియోగం ఎలా అన్నది రిజల్యూషన్ ప్రణాళికలో ఊహాజనితంగా ఉందని ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పావస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే తాము దీనిని సవాలు చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఏప్రిల్ 2018 నుండి జూన్ 2019 వరకు బోనస్, కార్మికులు-ఉద్యోగులందరికీ రిట్రెంచ్‌మెంట్ పరిహారం పూర్తి చెల్లింపులపై తగిన పరిష్కారం చూపాలని ఎన్సీఎల్ఏటీ ముందు దాఖలు చేసిన అప్పీల్లో విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. రిజల్యూషన్ దరఖాస్తుదారు లేదా మానిటరింగ్ కమిటీ ద్వారా తిరిగి నియమించబడిన ఏ ఉద్యోగికైనా అప్పటికే రావాల్సిన వారి గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్ రిట్రెంచ్‌మెంట్ పరిహారం చెల్లించాలని కూడా అసోసియేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. మినహాయింపులను ఎంతమాత్రం అంగీకరించడం జరగదని కిరణ్ పావస్కర్ స్పష్టం చేశారు. రిజల్యూషన్ ప్రణాళిక అస్పష్టమైన వ్యాపార ప్రణాళికతో ముడివడి ఉందని జెట్ ఎయిర్వేస్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఉద్యోగుల న్యాయ సలహాదారు నారాయణ్ హరిహరన్ అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులను, ముఖ్యంగా గ్రాట్యుటీ, ప్రివిలేజ్లీవ్, చెల్లించని జీతం, బోనస్‌లను మాఫీ చేయలని చూస్తున్నట్లు విమర్శించారు. జెట్ ఎయిర్వేస్ ఇంతక్రితం నరేష్ గోయల్, గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్ యాజమాన్యంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం 2019 జూన్‌లో రూ. 8,000 కోట్లకు పైగా బకాయిల కోసం దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. -
దివాలా తీసిన రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్.. ఆ 25 వేల మంది పరిస్థితి ఏంటి?
ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్ కంపెనీ దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నేడు ప్రకటించింది. సూపర్‌టెక్ సంస్థ బకాయిలు చెల్లించడంలో విఫలం అయ్యిందంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ ఎన్సీఎల్టీ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. హితేష్ గోయల్'ను దివాలా ప్రక్రియ పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఏఎల్‌టీ)లో అప్పీల్ దాఖలు చేస్తామని రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్ పేర్కొంది. ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాల వల్ల పలు సంవత్సరాలుగా కంపెనీలో తమ ఇళ్లను బుక్ చేసుకున్న 25 వేల మంది గృహ కొనుగోలుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన కంపెనీ.. "అన్ని ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నందున, ఏ పార్టీకి లేదా ఆర్థిక రుణదాతకు నష్టం కలిగించే అవకాశం లేదు. ఈ ఆదేశాల వల్ల మరే ఇతర సూపర్‌టెక్ గ్రూప్ కంపెనీ కార్యకలాపాలను ప్రభావితం చేయదు" అని రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. గత 7 ఏళ్లలో 40,000 కంటే ఎక్కువ ఫ్లాట్లను అందజేసిన గొప్ప రికార్డు మాకు ఉంది. మా 'మిషన్ కంప్లీషన్ - 2022' కింద మా కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడం కొనసాగిస్తాము, 2022 డిసెంబర్ నాటికి 7,000 యూనిట్లను డెలివరీ చేయాలనే లక్ష్యాన్ని మేము చేపట్టాము అని సంస్థ తెలిపింది. సూపర్‌టెక్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ అరోరాను ఈ విషయమై ప్రస్తావించగా.. "సూపర్‌టెక్ లిమిటెడ్‌లో దాదాపు 11-12 హౌసింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, వాటికి సంబందించి దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. వీటిలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపు రూ.150 కోట్ల రుణాలు తీసుకుంటే, సూపర్‌టెక్ లిమిటెడ్ రుణాల మొత్తం దాదాపు రూ. 1,200 కోట్లు అని ఆయన తెలిపారు. అరోరా తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ-ఎన్సీఆర్టీలో లగ్జరీ ప్రాజెక్ట్ సూపర్నోవా సహా పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్న గ్రూప్‌లో మూడు, నాలుగు ఇతర కంపెనీలు ఉన్నాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) కింద కంపెనీల దివాలా పరిష్కార ప్రక్రియపై ఎన్సీఎల్టీ అథారిటీ ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఎన్‌సీఏఎల్‌టీలో అప్పీల్ చేయవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్లను మే 22న కూల్చివేస్తామ నోయిడాని అధికారులు ప్రకటించారు. (చదవండి: కొత్త కారు కొనేవారికి షాక్ ఇచ్చిన బీఎండబ్ల్యూ..!) -
అప్పుల ఊబి, రిలయన్స్ చేతికి సింటెక్స్!
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) వేసిన సంయుక్త బిడ్ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కి చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ (ఏసీఆర్‌ఈ) దాఖలు చేసిన ఉమ్మడి రిజల్యూషన్ ప్రణాళికను సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణదాతలు ఏకగ్రీవ (కమిటీ ఆఫ్ క్రెడిటార్స్– సీఓసీ) ఇటీవలే ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. దీంతో బిడ్‌ను రుణ పరిష్కార నిపుణులు (ఆర్పీ) ఎన్సీఎల్టీ, అహ్మదాబాద్ బెంచ్‌కు అనుమతి కోసం పంపినట్లు సింటెక్స్ వెల్లడించింది. శ్రీకాంత్ హిమత్సింకా, దినేష్ కుమార్ హిమత్‌సింకాతో పాటు వెల్స్పన్ గ్రూప్ సంస్థ ఈజీగో టెక్స్టైల్స్, జీహెచ్‌సీఎల్, హిమత్సింకా వెంచర్స్ వచ్చిన బిడ్స్‌ను కూడా పరిశీలించిన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్, చివరకు ఆర్ఐఎల్, ఏసీఆర్‌ఈ బిడ్‌కు ఆమోద ముద్ర వేశాయి. ఆర్ఐఎల్, ఏసీఆర్‌ఈ ఉమ్మడి బిడ్ల విలువ వివరాలు తెలపనప్పటకీ, ఇది దాదాపు రూ.3,000 కోట్లని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిల్లో రుణదాతలు 50 శాతం కంటే ఎక్కువ హెయిర్‌కట్ (రాయితీ) తీసుకున్నట్లు కూడా సమాచారం. పరిష్కార ప్రణాళిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వాటా మూలధనం సున్నాకి తగ్గిస్తారు. అలాగే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుండి డీలిస్ట్ అవుతుంది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై దివాలా ప్రక్రియను గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. కంపెనీపై దాదాపు రూ.7,500 కోట్ల క్లెయిమ్‌లు (రుణ బకాయిలు) దాఖలయ్యాయి. దివాలా కోడ్ (ఐబీసీ)నిబంధనల ప్రకారం, తుది క్లియరెన్స్ కోసం ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కి వెళ్లే ముందు కంపెనీ ఆఫ్ క్రెడిటార్స్ కనీసం 66 శాతం మెజారిటీతో ఒక పరిష్కార ప్రణాళికా బిడ్‌ను ఆమోదించాల్సి ఉంటుంది. -
వేసవి నుంచి మళ్లీ జెట్ ఎయిర్ సర్వీసులు!
ముంబై, సాక్షి: వచ్చే వేసవి సీజన్ నుంచి ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే జాతీయ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నుంచి కంపెనీ టేకోవర్‌కు లైన్ క్లియర్‌కావడంతో డీజీసీఏ, పౌర విమానయాన శాఖ(ఎంసీఏ) నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. భారీ రుణాలు, నష్టాల కారణంగా 2019 నుంచి కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికలకు ఇటీవల ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా ఇకపైన కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలలో జెట్ ఎయిర్వేస్ లిస్టింగ్‌ను కొనసాగించేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశాలకు కనెక్టివిటీ వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి సర్వీసులు ప్రారంభంకావచ్చని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్రణాళికను నవంబర్ 5న ఎన్సీఎల్టీకి కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం అందజేశాయి. బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ తదితర సంస్థల మధ్య పోటీలో రూ. 1,000 కోట్ల ఆఫర్ ద్వారా జెట్ ఎయిర్వేస్ను కల్రాక్ క్యాపిటల్ గెలుచుకుంది. కాగా.. ఇప్పటికే ఎన్సీఎల్టీ నుంచి అనుమతులు పొందడంతో ఎంసీఏ, డీజీసీఏల నుంచి క్లియరెన్స్‌ల కోసం కంపెనీ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. షేరు జోరు కంపెనీ పునరుద్ధరణకు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ గత రెండు నెలల్లో నిరవధికంగా బలపడుతూ వచ్చింది. ఈ బాటలో నవంబర్ 5కల్లా ఎన్ఎస్ఈలో రూ. 79ను అధిగమించింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరంది. తదుపరి అక్కడక్కడే అన్నట్లుగా కదులుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ షేరు 1 శాతం బలపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
మళ్లీ సైరన్ మిస్త్రీకే టాటా గ్రూప్ పగ్గాలు..
ముంబై : టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని, గ్రూప్ చీఫ్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి పగ్గాలు చేపట్టాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. టాటా గ్రూప్ తనను బోర్డు నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన క్రమంలో అప్పీల్‌పై తుది నిర్ణయం వెలువడేవరకూ షేర్లు విక్రయించాలని ఆయనను టాటా సన్స్ ఒత్తిడి చేయరాదని ట్రిబ్యునల్ గత ఏడాది ఆదేశించింది. 2016 అక్టోబర్‌లో మిస్త్రీని టాటా గ్రూప్ బోర్డు నుంచి తొలగించారు. ఇక రతన్ టాటా స్ధానంలో డిసెంబర్ 2012లో మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఆర్‌కామ్ దివాలాకు.. తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) దివాలా ప్రక్రియను ఎదుర్కోనుంది. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలు చేపట్టేందుకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించింది. ఎరిక్సన్ పిటిషన్ మేరకు కంపెనీకి వ్యతిరేకంగా దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ లోగడ ఆదేశించగా.., దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌కామ్ గతేడాది జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్‌కామ్, ఆ సంస్థ అనుబంధ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్, రిలయన్స్ టెలికాంకు వ్యతిరేకంగా ఎరిక్సన్ దివాలా పిటిషన్ వేయడంతో ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ 2018 మే 15న తీర్పు జారీ చేసింది. తాత్కాలిక పరిష్కార నిపుణుడిని సైతం నియమించింది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తాజాగా వెనక్కి తీసుకుంది. సంస్థ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దివాలా ప్రక్రియ మెరుగైనదిగా కంపెనీ బోర్డు భావించింది. దీంతో ఎన్సీఎల్టీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఆర్‌కామ్ కోరడంతో అందుకు ఎన్సీఎల్ఏటీ అనుమతించింది. -
రీడ్ అండ్ టేలర్ కేసులో మరో మలుపు
ముంబయి: రీడ్ అండ్ టేలర్ కంపెనీ దివాలా ప్రక్రియ మరో మలుపు తిరిగింది. ప్రమోటర్ నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) వెంకటేశన్ శంకర్ నారాయణన్ పేర్కొన్నారు. మరోవైపు రీడ్ అండ్ టేలర్‌ను గట్టెక్కించడానికి కాకుండా లిక్విడేషన్ కోసమే రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) ప్రయత్నాలు చేస్తున్నారని రీడ్ అండ్ టేలర్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ ఆసోసియేషన్ వ్యాఖ్యానించింది. వివరాలివీ.. రూ.3,524 కోట్ల మేర మోసాలు... రీడ్ అండ్ టేలర్ కంపెనీ రూ.4,100 కోట్ల బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో ఆ కంపెనీపై దివాలాప్రక్రియ కొనసాగుతోంది. ఈ కంపెనీ ప్రమోటర్ నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని రిసొల్యూషన్ ప్రొఫెషనల్ వెంకటేశన్ శంకర్ నారాయణన్ వెల్లడించారు. అందుకని ఆయనపై క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతివ్వాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనాన్ని ఆయన కోరారు. కేపీఎమ్‌జీ నిర్వహించిన ప్రత్యేక ఆడిట్లో నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని తేలిందని ఆర్పీ, వెంకటేశన్ నారాయణన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్సీఎల్టీకి ఈ నెల 1న ఒక లేఖ రాశారు. నేడు విచారణ : కంపెనీని టేకోవర్ చేయడానికి తమకు అవకాశమివ్వాలన్న ఉద్యోగుల సంఘం అభ్యర్థనపై నేడు (మంగళవారం) విచారణ జరగనున్నది. కస్లీవాల్ రూ.3,524 కోట్ల అవకతవకల అంశంపై కూడా విచారణ జరగవచ్చు. -
రూ. 80 వేల కోట్ల రికవరీ..
న్యూఢిల్లీ: బ్యాంకుల రుణ బకాయిల వసూళ్లలో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) పాత్ర కీలకమవుతోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకర్ల రూ.80 వేల రికవరీకి ఎన్సీఎల్టీ దోహదపడిందని అన్నారు. మార్చి చివరినాటికి మరో రూ.70 వేల కోట్ల రికవరీ జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అత్యంత విశ్వసనీయత కలిగిన వేదికగా ఎన్సీఎల్టీ అవతరించిందని జైట్లీ ప్రశంసించారు. ‘‘దివాలా కోడ్ – రెండేళ్లు’ అన్న అంశంపై జైట్లీ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే... ► వాణిజ్యానికి సంబంధించి దివాలా సమస్యలను పరిష్కరించలేని క్లిష్ట పరిస్థితులను కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్లింది. అయితే ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా స్పందించింది. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి పలు చర్యలు తీసుకుంది. దివాలా చట్టానికి పదునుపెట్టింది. ► 2016 చివర్లో ఎన్సీఎల్టీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ కేసులను విచారించడం ప్రారంభించింది. ఇప్పటికి 1,322 కేసుల విచారణను (అడ్మిట్) చేపట్టింది. అడ్మిషన్‌కు ముందే 4,452 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.2.02 లక్షల కోట్లు పరిష్కారమయినట్లు ఎన్సీఎల్టీ డేటా చెబుతోంది. విచారణా ప్రక్రియ ద్వారా 66 కేసులను పరిష్కరించింది. తద్వారా రూ.80 వేల కోట్ల రికవరీ జరిగింది. 260 కేసుల విషయంలో దివాలా చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ► భూషణ్ పవర్ అండ్ స్టీల్, ఎస్సార్ స్టీల్ ఇండియా వంటి 12 బడా కేసులు విచారణ ప్రక్రియ చివరిదశలో ఉంది. వీటిలో కొన్ని కేసుల పరిష్కారం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మరో రూ.70,000 కోట్లు సమకూరుతాయని భావిస్తున్నాం. ఆయా కేసుల పరిష్కారంలో ఎటువంటి రాజకీయ లేదా ప్రభుత్వ ఒత్తిళ్లు లేవు. ► ఎన్పీఏ అకౌంట్లు తగ్గుతుండడం హర్షణీయం. రుణాల మంజూరు, చెల్లింపుల వ్యవస్థల్లో మార్పులను ఈ పరిణామం సూచిస్తోంది. దివాలా చట్టం– రుణదాత, గ్రహీత మధ్య సంబంధాల్లో కూడా సానుకూల మర్పును సృష్టించింది. ► ఖాయిలా పరిశ్రమల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ 1980లో ఖాయిలా పరిశ్రమ కంపెనీల చట్టం తీసుకువచ్చింది. ఇది తీవ్ర వైఫల్యం చెందింది. ఈ చట్టం పలు ఖాయిలా పరిశ్రమలకు రుణదాతల నుంచి రక్షణ కల్పించింది. బ్యాంకింగ్ రుణ బకాయిల వసూళ్లకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటయినా, అది అంత ఫలితమివ్వలేదు. ► 2008–2014 మధ్య బ్యాంకుల విచక్షణారహితంగా రుణాలను మంజూరుచేశాయి.వాటిలో ఎక్కువ మొండిబకాయిలుగా మారాయని ఆర్బీఐ రుణ నాణ్యతా సమీక్షలు పేర్కొంటున్నాయి. ► ఆయా అంశాలే ఎన్డీఏ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు కారణమయ్యింది. 2016 మేలో పార్లమెంటు రెండు సభలూ ఐబీసీ (ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్)కి ఆమోదముద్ర వేశాయి. నేను చూసినంతవరకూ పార్లమెంటు ఆమోదించిన సత్వర చర్యల, అత్యంత ప్రయోజనకరమైన ఆర్థిక చట్టం ఇది. -
అంబానీ బ్రదర్స్ డీల్‌కు సుప్రీం బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్సకు చెందిన ఆస్తుల విక్రయ ఒప్పందానికి సుప్రీం బ్రేక్ వేసింది. దీనికి సంబంధించి ఇటీవల ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఇచ్చిన ఆర్డర్‌పై స్టే విధించింది. ఆర్‌కాం టవర్ సంస్థలో 4శాతం వాటా వున్న హెచ్ఎస్బీసీ డైసీ ఇన్వెస్ట్మెgట్స్ (మారిషియస్) లిమిటెడ్ సవాల్‌ను కోర్టు స్వీకరించింది. దీనిపై మైనారిటీ వాటాదారుల వాదనలు వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. దఈ వార్తలతో స్టాక్మార్కెట్లో ఆర్‌కాం కౌంటర్ 2శాతానికిపైగా నష్టాలతో కొనసాగుతోంది. ఆస్తుల విక్రయానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏప్రిల్ 5న ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీని ద్వారా 25,000 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించనున్నామని తెలిపింది. కాగా స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్వర్క్,మల్టీ ఛానెల్ నెట్వర్క్(ఎంసీఎన్‌ఎస్)విక్రయించేందుకు గత ఏడాది డిసెంబర్లో రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
60 సంస్థల ఆస్తుల విక్రయాలపై నిషేధం
న్యూఢిల్లీ/మారిషస్: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.12,700 కోట్ల రూపాయల స్కామ్‌లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. నీరవ్‌మోదీ, మెహుల్‌చోక్సీ, వారికి సంబంధించిన కంపెనీలు, పీఎన్‌బీకు చెందిన పలువురు ఉద్యోగులు, పరిమిత బాధ్యత కలిగిన భాగస్వామ్య సంస్థలు ఇలా 60కుపైగా సంస్థలను ఆస్తులు విక్రయించకుండా నిషేధం విధిస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. పీఎన్బీ స్కామ్ నేపథ్యంలో కంపెనీల చట్టంలోని పలు సెక్షన్ల కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్టీ ముందు పిటిషన్ దాఖలు చేయగా ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 221 (విచారణ, దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీ ఆస్తులను స్తంభింపజేయడం), సెక్షన్ 222 (సెక్యూరిటీలపై నియంత్రణ విధించడం)ల కింద పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆస్తులు విక్రయించకుండా నిషేధానికి గురైన వాటిలో గీతాంజలి జెమ్స్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్స్, ఫైర్‌స్టార్ డైమండ్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లర్ డైమండ్ తదితర కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ఉన్నాయి. అవసరమైన చర్యలు తీసుకుంటాం అక్రమ లావాదేవీలకు పాల్పడిన సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని మారిషస్ ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం వివిధ దేశాలతోనూ ముడిపడి ఉన్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నీరవ్‌మోదీ, ఆయన బంధువు మెహుల్ చోస్కీలపై మీడియాలో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కమిషన్ (ఎఫ్ఎస్సీ)తెలిపింది. ‘మీడియా లో వచ్చిన వార్తలను పరిగణలోని తీసుకున్నాం. ఇందుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మారిషస్, మారిషస్ రెవెన్యూ అథారిటీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. అలాగే ఎఫ్ఎస్సీ కూడా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. -
యూనిటెక్కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం యూనిటెక్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. యూనిటెక్ వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిర్ణయాన్ని తప్పుపట్టిన అత్యున్నత ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలన్న ఎన్సీఎల్టీ ఆదేశాలపై స్టే విధించింది. గృహ కొనుగోలుదారులు, ఇతర ఇన్వెస్టర్ల ప్రయోజనాలకోసం ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను జనవరి 12కి వాయిదా వేసింది. యూనిటెక్ స్వాధీనంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ఎన్సీఎల్టీ భారీ షాకిచ్చింది. ఎన్సీఎల్టీ ఆదేశాలపై సంక్షోభంలో చిక్కుకున్న యూనిటెక్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూనిటెక్ సుప్రీంను ఆశ్రయించింది. యూనిటెక్ పిటీషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన సుప్రీం ఎన్సీఎల్టీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసును నేటికి వాయిదా వేసింది. కాగా నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఎన్సీఎల్టీ డిసెంబర్ 8 ఆదేశాలు జారీచేసింది. అలాగే రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని కేంద్రాన్నిఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 20లోగా అందించాలని సూచించిన సంగతి తెలిసిందే. -
యూనిటెక్ టేకోవర్‌పై సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ దిగ్గజం యూనిటెక్ టేకోవర్‌పై సుప్రీంకోర్టు ఎన్సీఎల్టీకి అక్షింతలు వేసింది. అత్యున్నత కోర్టు విచారిస్తున్న కేసులో ఎన్సీఎల్టీ స్పందనపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తారని, ఇది చాలా డిస్టర్బింగ్ ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. యునిటెక్ నుంచి గృహాలను కొనుగోలు చేసినవారి ప్రయోజనాలను ఎలా కాపాడాలనే దానిపై కోర్టుకు సూచించాలని కేంద్రాన్ని కోరింది. యూనిటెక్ బోర్డు రద్దు, కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ఎన్సీఎల్టీ తమను సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఎన్సీఎల్టీ, మంత్రిత్వ శాఖ నిర్ణయంపై యూనిటెక్ సుప్రీంను ఆశ్రయించింది ఈ నేపథ్యంతో మంగళవారం యూనిటెక్ వాదనలను విన్న సుప్రీం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎన్సీఎల్టీ, మంత్రిత్వ శాఖ సుప్రీం అనుమతి తీసుకోవాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎన్ ఖాన్విల్కర్, డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే డిసెంబర్ చివరి నాటికి రూ.750కోట్లుచెల్లించాలని యూనిటెక్‌నుఆదేశించింది. బోర్డు డైరెక్టర్ల రద్దు అంశాన్ని రేపు (బుధవారం) విచారించనున్నట్టు వెల్లడించింది. మరోవైపు కేంద్రం యూనిటెక్ ఛాలెంజ్‌పై వాదనలను వినిపించేందుకు కేంద్రం గడువు కావాలని సుప్రీంను కోరింది. -
ఎన్సీఎల్టీ ఆర్డర్‌పై సుప్రీంకు యూనిటెక్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం చర్యపై రియాల్టీ సంస్థ యూనిటెక్ సోమవారం సుప్రీంను ఆశ్రయించింది. ఎన్సీఎల్టీ ఆర్డర్‌ను సుప్రీంలో సవాల్ చేసింది. ట్రిబ్యునల్ ఆర్డర్‌పై ప్రభుత్వం ఆధీనంలోకి రానున్న యూనిటెక్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై యూనిటెక్ వాదనలను రేపు (డిసెంబర్ 12) న సుప్రీం విననుంది. కాగా నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గట్టి షాకిచ్చింది. ని డైరెక్టర్లు వ్యక్తిగత లేదా సంస్థ ఆస్తులను విక్రయించకుండా నిరోధించడంతోపాటు, తదుపరి విచారణ నాటికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుఎన్‌సీఎల్ వివరించింది తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
కొనసాగుతున్న యూనిటెక్ షేరు జోరు
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌కి స్టాక్మార్కెట్లో భారీ ఊరట లభించింది. నిర్వహణ నియంత్రణను చేపట్టేందుకు ప్రభుత్వానికి అనుమతించటంతో యునిటెక్ షేర్లు ఈ రోజు కూడా భారీగా లాభపడుతున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆర్డర్‌తో శుక్రవారం19శాతానికి పైగా లాభపడిన యూనిటెక్ సోమవారం కూడా తన జోరును కొనసాగిస్తోంది. 16శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతోంది. కంపెనీపై అజమాయిషీ తీసుకునే బాటలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) యూనిటెక్‌కి గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని ఆదేశించింది. వారి పేర్లను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచన చేసింది. -
30వేల మంది గృహ వినియోగదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : జేపీ ఇన్ఫ్రాటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. నోయిడాకు చెందిన ఈ సంస్థపై దివాలా ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఇన్సాల్వెన్సీ, బ్రాక్రప్టసీ కోడ్ కింద స్పష్టత కరువైన 30వేల మంది గృహ వినియోగదారులకు కొంత ఊరట కలిగినట్టయింది. రూ.526 కోట్ల రుణం బాకీ పడిందనే నెపంతో ఐడీబీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలహాబాద్ ఎన్సీఎల్టీ, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాలా కంపెనీగా ధృవీకరించింది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కింద విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 32వేల మంది గృహవినియోగదారులు ఆందోళనలు పడిపోయారు. అయితే ఈ విచారణపై ఓ గృహదారుడు చిత్రా శర్మ, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కంపెనీకి వ్యతిరేకంగా ప్రారంభించిన దివాలా ప్రొసీడింగ్స్, ఎలాంటి పరిష్కారం లేకుండా ఉన్నాయని పిల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా తెలిపారు. ఆర్థికమంత్రిత్వశాఖకు, జేపీ ఇన్ఫ్రా, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పిల్‌పై అక్టోబర్ 10న గృహ వినియోగదారుల వాదనలను కూడా సుప్రీంకోర్టు విననుంది.