![NCLT ruled Zepto will not require a NOC from the RBI for its reverse flip to India](/styles/webp/s3/article_images/2025/01/14/zepto01.jpg.webp?itok=m-CkHY3g)
ప్రముఖ ఆన్‌లైన్ క్విక్ కామర్స్ యూనికార్న్ జెప్టో మాతృ సంస్థల విలీనానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి నిరభ్యంతర పత్రం (NOC) అవసరం లేదని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జెప్టో తన కార్పొరేట్ కార్యకలాపాలు క్రమబద్ధీకరించడానికి, రాబోయే ఐపీఓకు సిద్ధం కావడానికి మార్గం సుగమం చేస్తుంది.
భారత్‌లో జెప్టోను నిర్వహిస్తున్న ముంబైకి చెందిన కిరాణాకార్ట్ టెక్నాలజీస్‌ను, సింగపూర్‌కు చెందిన అనుబంధ సంస్థ కిరాణాకార్ట్ పీటీఈ లిమిటెడ్‌తో విలీనం చేయడానికి ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది. ఈ విలీనం ‘క్రాస్ బోర్డర్ విలీన నిబంధనల రెగ్యులేషన్ 9’ కిందకు వస్తుందని ట్రైబ్యునల్ పేర్కొంది. దీనికి ఆర్‌బీఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో విలీన ప్రక్రియ సులువైనట్లు అధికారులు తెలిపారు.
చట్టపరమైన సంస్థల సంఖ్యను తగ్గించడం ద్వారా కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలను, వాటి నిర్మాణాన్ని సరళీకృతం చేయాలనే ఉద్దేశంతో ఎన్‌సీఎల్‌టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జెప్టో సైతం తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు రివర్స్ ఫ్లిప్(మాతృ సంస్థల విలీనం) నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వ్యాపార కార్యకలాపాలను పెంచుతుందని, వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహదం చేస్తుందని, ఖర్చులను తగ్గిస్తుందని, భవిష్యత్తు నిధుల సేకరణను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: పండగ వేళ పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్
కంపెనీ బోర్డు 2024 అక్టోబర్‌లో ఈ విలీనం కోసం ఎన్‌సీఎల్‌టీలో అప్పీలు చేసుకుంది. అయితే ఈ ప్రక్రియ ఏప్రిల్ 2025 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. రోజర్‌పే, ఫ్లిప్‌కార్ట్, పైన్ ల్యాబ్స్, మీషో వంటి కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు తాజా ఎన్‌సీఎల్‌టీ నిర్ణయంతో ఆమోదం తెలిపినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment