న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) వేసిన సంయుక్త బిడ్ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)కి చేరింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్ (ఏసీఆర్‌ఈ) దాఖలు చేసిన ఉమ్మడి రిజల్యూషన్ ప్రణాళికను సింటెక్స్ ఇండస్ట్రీస్ రుణదాతలు ఏకగ్రీవ (కమిటీ ఆఫ్ క్రెడిటార్స్– సీఓసీ) ఇటీవలే ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. దీంతో బిడ్‌ను రుణ పరిష్కార నిపుణులు (ఆర్‌పీ) ఎన్‌సీఎల్‌టీ, అహ్మదాబాద్ బెంచ్‌కు అనుమతి కోసం పంపినట్లు సింటెక్స్ వెల్లడించింది. శ్రీకాంత్ హిమత్‌సింకా, దినేష్ కుమార్ హిమత్‌సింకాతో పాటు వెల్స్పన్ గ్రూప్ సంస్థ ఈజీగో టెక్స్‌టైల్స్, జీహెచ్‌సీఎల్, హిమత్‌సింకా వెంచర్స్ వచ్చిన బిడ్స్‌ను కూడా పరిశీలించిన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్, చివరకు ఆర్‌ఐఎల్, ఏసీఆర్‌ఈ బిడ్‌కు ఆమోద ముద్ర వేశాయి. ఆర్‌ఐఎల్, ఏసీఆర్‌ఈ ఉమ్మడి బిడ్‌ల విలువ వివరాలు తెలపనప్పటకీ, ఇది దాదాపు రూ.3,000 కోట్లని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిల్లో రుణదాతలు 50 శాతం కంటే ఎక్కువ హెయిర్‌కట్ (రాయితీ) తీసుకున్నట్లు కూడా సమాచారం.
పరిష్కార ప్రణాళిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వాటా మూలధనం సున్నాకి తగ్గిస్తారు. అలాగే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నుండి డీలిస్ట్ అవుతుంది. సింటెక్స్ ఇండస్ట్రీస్‌పై దివాలా ప్రక్రియను గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. కంపెనీపై దాదాపు రూ.7,500 కోట్ల క్లెయిమ్‌లు (రుణ బకాయిలు) దాఖలయ్యాయి. దివాలా కోడ్ (ఐబీసీ)నిబంధనల ప్రకారం, తుది క్లియరెన్స్ కోసం ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)కి వెళ్లే ముందు కంపెనీ ఆఫ్ క్రెడిటార్స్ కనీసం 66 శాతం మెజారిటీతో ఒక పరిష్కార ప్రణాళికా బిడ్‌ను ఆమోదించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment