న్యూఢిల్లీ/మారిషస్: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) రూ.12,700 కోట్ల రూపాయల స్కామ్‌లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. నీరవ్‌మోదీ, మెహుల్‌చోక్సీ, వారికి సంబంధించిన కంపెనీలు, పీఎన్‌బీకు చెందిన పలువురు ఉద్యోగులు, పరిమిత బాధ్యత కలిగిన భాగస్వామ్య సంస్థలు ఇలా 60కుపైగా సంస్థలను ఆస్తులు విక్రయించకుండా నిషేధం విధిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. పీఎన్‌బీ స్కామ్ నేపథ్యంలో కంపెనీల చట్టంలోని పలు సెక్షన్ల కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్‌సీఎల్‌టీ ముందు పిటిషన్ దాఖలు చేయగా ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 221 (విచారణ, దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీ ఆస్తులను స్తంభింపజేయడం), సెక్షన్ 222 (సెక్యూరిటీలపై నియంత్రణ విధించడం)ల కింద పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆస్తులు విక్రయించకుండా నిషేధానికి గురైన వాటిలో గీతాంజలి జెమ్స్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్స్, ఫైర్‌స్టార్ డైమండ్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లర్ డైమండ్ తదితర కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ఉన్నాయి.
అవసరమైన చర్యలు తీసుకుంటాం
అక్రమ లావాదేవీలకు పాల్పడిన సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని మారిషస్ ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం వివిధ దేశాలతోనూ ముడిపడి ఉన్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నీరవ్‌మోదీ, ఆయన బంధువు మెహుల్ చోస్కీలపై మీడియాలో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకున్నామని ఫైనాన్సియల్ సర్వీసెస్ కమిషన్ (ఎఫ్‌ఎస్‌సీ)తెలిపింది. ‘మీడియా లో వచ్చిన వార్తలను పరిగణలోని తీసుకున్నాం. ఇందుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మారిషస్, మారిషస్ రెవెన్యూ అథారిటీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. అలాగే ఎఫ్‌ఎస్‌సీ కూడా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment