30వేల మంది గృహ వినియోగదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : జేపీ ఇన్‌ఫ్రాటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. నోయిడాకు చెందిన ఈ సంస్థపై దివాలా ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఇన్‌సాల్వెన్సీ, బ్రాక్రప్టసీ కోడ్ కింద స్పష్టత కరువైన 30వేల మంది గృహ వినియోగదారులకు కొంత ఊరట కలిగినట్టయింది.
రూ.526 కోట్ల రుణం బాకీ పడిందనే నెపంతో ఐడీబీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలహాబాద్ ఎన్‌సీఎల్‌టీ, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాలా కంపెనీగా ధృవీకరించింది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కింద విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 32వేల మంది గృహవినియోగదారులు ఆందోళనలు పడిపోయారు. అయితే ఈ విచారణపై ఓ గృహదారుడు చిత్రా శర్మ, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
కంపెనీకి వ్యతిరేకంగా ప్రారంభించిన దివాలా ప్రొసీడింగ్స్, ఎలాంటి పరిష్కారం లేకుండా ఉన్నాయని పిల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా తెలిపారు. ఆర్థికమంత్రిత్వశాఖకు, జేపీ ఇన్‌ఫ్రా, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పిల్‌పై అక్టోబర్ 10న గృహ వినియోగదారుల వాదనలను కూడా సుప్రీంకోర్టు విననుంది.