Jaypee Infratech
-
జేపీ ఇన్ఫ్రాటెక్ బిడ్డింగ్‌లో పాల్గొనద్దు
న్యూఢిల్లీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించి జేపీ గ్రూప్‌కు అత్యున్నత న్యాయస్థానం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్‌పై (జేఐఎల్) తాజాగా దివాలా ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌టీ) అలహాబాద్ బెంచ్‌ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవద్దని జేఐఎల్‌తోపాటు మాతృసంస్థ జేపీ గ్రూప్‌కు, ప్రమోటర్లకు కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దివాలా చట్టం (ఐబీసీ) కింద జేఐఎల్ హోల్డింగ్ కంపెనీ జేపీ అసోసియేట్స్ లిమిటెడ్‌పై (జేఏఎల్) సైతం కార్పొరేట్ దివాలా పరిష్కార పక్రియ ప్రారంభించేలా బ్యాంకర్లకు తగిన ఆదేశాలివ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) సుప్రీం సూచించింది. ‘‘21,532 మంది గృహ కొనుగోలుదారుల విషయంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయటానికి అటు జేఏఎల్ ఇటు జీఐఎల్‌కు తగిన ఆర్థిక వనరులు లేవన్న విషయం స్పష్టమైపోయింది’’ అని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. రూ.526 కోట్ల చెల్లింపుల్లో జేఐఎల్ విఫలమయ్యిందని పేర్కొంటూ, ఎన్సీఎల్టీ ముందు ఐడీబీఐ బ్యాంక్ కార్పొరేట్ దివాలా ప్రక్రియ పిటిషన్ దాఖలు చేసింది. తొలి రౌండ్ బిడ్డింగ్ ప్రక్రియలో జేఐఎల్ లిక్విడేషన్ విలువకన్నా తక్కువగా ఉన్న దాదాపు రూ.7,350 కోట్ల బిడ్ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. సుప్రీం తాజా రూలింగ్ ప్రకారం– ఇప్పటి నుంచి దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమై 180 రోజుల్లో ముగియాల్సి ఉంటుంది. రుణ దాతల కమిటీలో గృహ కొనుగోలుదారులు కూడా ఉంటారు. కొత్త బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. జేఏఎల్, జేఐఎల్ సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసిన రూ. 750 కోట్లు ఎన్సీఎల్టీకి బదలాయించడం జరుగుతుంది. -
అమ్మకానికి యమున ఎక్స్‌ప్రెస్‌వే
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద రియల్-ఎస్టేట్ డెవలపర్ జేపీ, ఢిల్లీలోని తన ముఖ్యమైన హైవేని అమ్మేస్తుంది. యమున ఎక్స్‌ప్రెస్‌వేను మరో డెవలపర్‌కు రూ.2500 కోట్లకు అమ్మేస్తున్నట్టు జేపీ ఇన్ఫ్రాటెక్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఆగ్రాను కలిపే ఆరు వరుసల యమున ఎక్స్‌ప్రెస్‌వేను, జేపీ 2012లో నిర్మించింది. దీని ఖర్చు రూ.13వేల కోట్లు. ఈ ప్రాజెక్టులో కంపెనీకి వాటా ఉంది. టోల్ ద్వారా సేకరించిన నగదును ఈ కంపెనీనే పొందుతోంది. 30వేల మందికి పైగా ప్రజలకు ఫ్లాట్లు ఇవ్వకుండా దివాలా తీసిన క్రమంలో ఆ మొత్తాన్ని వారికి చెల్లించడానికి కంపెనీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫ్లాట్ ఓనర్ల ప్రయోజనాల మేరకు దివాలా తీసిన జేపీని ఈ నెల 27 వరకు రూ.2000 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఫ్లాట్ల ఓనర్లకు రీఫండ్ చేయొచ్చని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.500 కోట్ల రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాలా తీయమని బ్యాంకులు కోరాయి. ఒక్కసారి కంపెనీ తాను దివాలా తీసినట్టు ప్రకటిస్తే, కొనుగోలుదారులకు తమ అపార్ట్మెంట్లు, పెట్టుబడులు వెనక్కి రావు. ఈ విషయంపై జేపీ కొనుగోలుదారులు కోర్టుకు ఎక్కారు. -
మీ డబ్బు మీకొస్తుంది.. సుప్రీం భరోసా
-
మీ డబ్బు మీకొస్తుంది.. సుప్రీం భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : జేపీ ఇన్ఫ్రాటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టులో మరోసారి భారీ ఊరట కల్పించింది. గృహవినియోగదారులు చెల్లించిన నగదు తిరిగి వారికి వెనక్కి ఇప్పిస్తామంటూ ఉన్నత న్యాయస్థానం భరోసా కల్పించింది. ఈ క్రమంలోనే జయ ప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్(జేఏఎల్)ను రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జేఏఎల్, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు హోల్డింగ్ కంపెనీ. రూ.2000 కోట్లను అక్టోబర్ 27 వరకు డిపాజిట్ చేయాలంటూ సెప్టెంబర్ 11న కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాక తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్(ఐఆర్పీ)ను ఏర్పాటుచేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు కూడా ఆదేశాలు జారీచేసింది. మేనేజ్మెంట్ను టేకోవర్ చేసుకోవాలని తెలిపింది. బ్యాంకుల రక్షణను మాత్రమే కాక, గృహ వినియోగదారుల ప్రయోజనాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుందని తెలిపింది. గృహవినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సుప్రీంకోర్టు అన్ని విధాల భరోసా కల్పిస్తున్నట్టు సీజేఐ దీపక్ మిశ్రా హామీ ఇచ్చారు. ఒకవేళ రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో అవసరం అయితే, ఇంకా ఎక్కువ డిపాజిట్ చేయమని కూడా కోరవచ్చని చెప్పారు. గృహవినియోగదారుల నగదు, తిరిగి వెనక్కి వచ్చేస్తోంది. ఇంకేమి కావాలి? మీకు అంటూ ప్రశ్నించారు. -
జేపీ గృహవినియోగదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని జేపీ ఇన్ఫోటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. అంతకముందు విచారణ సందర్భంగా జేపీ ఇన్ఫ్రాటెక్పై చేపట్టిన దివాలా ప్రొసీడింగ్స్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు, సోమవారం వెలువరించిన తీర్పులో అక్టోబర్ 27 వరకు 2000 కోట్ల రూపాయలను తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఈ సంస్థను ఆదేశించింది. అంతేకాక ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ను, ఇతర డైరెక్టర్లను దేశం విడిచి పారిపోకుండా నిర్భంధిస్తున్నట్టు పేర్కొంది. మేనేజ్మెంట్ను టేకోవర్ చేసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) ఏర్పాటుచేసిన తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్( ఐఆర్పీ) బాడీని ఆదేశించింది. ఫ్లాట్ కొనుగోలుదారుల, క్రెడిటార్ల ప్రయోజనాలను ఎలా రక్షిస్తారో 45 రోజుల్లో తమకు తెలుపాలంటూ ఐఆర్‌పీని ఆదేశించింది. ఈ మేరకు ఓ రిజుల్యూషన్ ప్రణాళికను సమర్పించాలని కూడా తెలిపింది.. సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన ఆదేశాల మేరకు జేపీ అసోసియేట్స్ సిస్టర్ కంపెనీ జేపీ ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్లడానికి లేదు. అయితే డిపాజిట్ చేయాల్సిన రూ.2000 కోట్ల కోసం భూమి విక్రయాలు లేదా ఐఆర్పీ అనుమతితో ఏ ప్రాపర్టీనైనాన విక్రయించుకోవచ్చని అపెక్స్ కోర్టు తెలిపింది. సెప్టెంబర్ 4న ఈ కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జారీచేసిన దివాలా చట్ట విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. -
30వేల మంది గృహ వినియోగదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : జేపీ ఇన్ఫ్రాటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. నోయిడాకు చెందిన ఈ సంస్థపై దివాలా ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఇన్సాల్వెన్సీ, బ్రాక్రప్టసీ కోడ్ కింద స్పష్టత కరువైన 30వేల మంది గృహ వినియోగదారులకు కొంత ఊరట కలిగినట్టయింది. రూ.526 కోట్ల రుణం బాకీ పడిందనే నెపంతో ఐడీబీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలహాబాద్ ఎన్సీఎల్టీ, జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను దివాలా కంపెనీగా ధృవీకరించింది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కింద విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 32వేల మంది గృహవినియోగదారులు ఆందోళనలు పడిపోయారు. అయితే ఈ విచారణపై ఓ గృహదారుడు చిత్రా శర్మ, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కంపెనీకి వ్యతిరేకంగా ప్రారంభించిన దివాలా ప్రొసీడింగ్స్, ఎలాంటి పరిష్కారం లేకుండా ఉన్నాయని పిల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా తెలిపారు. ఆర్థికమంత్రిత్వశాఖకు, జేపీ ఇన్ఫ్రా, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పిల్‌పై అక్టోబర్ 10న గృహ వినియోగదారుల వాదనలను కూడా సుప్రీంకోర్టు విననుంది.