వేసవి నుంచి మళ్లీ జెట్‌ ఎయిర్‌ సర్వీసులు! | Jet airways services may resume from 2021 summer | Sakshi
Sakshi News home page

వేసవి నుంచి జెట్‌ ఎయిర్‌ సర్వీసులు!

Published Wed, Dec 2 2020 12:26 PM | Last Updated on Wed, Dec 2 2020 1:16 PM

Jet airways services may resume from 2021 summer - Sakshi

ముంబై, సాక్షి: వచ్చే వేసవి సీజన్‌ నుంచి ప్రయివేట్‌ రంగ కంపెనీ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే జాతీయ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) నుంచి కంపెనీ టేకోవర్‌కు లైన్‌ క్లియర్‌కావడంతో డీజీసీఏ, పౌర విమానయాన శాఖ(ఎంసీఏ) నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. భారీ రుణాలు, నష్టాల కారణంగా 2019 నుంచి కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే నష్టాలతో కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ ప్రణాళికలకు ఇటీవల ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కల్‌రాక్‌ క్యాపిటల్‌- మురారిలాల్ జలన్‌ కన్సార్షియం జెట్‌ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా ఇకపైన కూడా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో జెట్‌ ఎయిర్‌వేస్‌ లిస్టింగ్‌ను కొనసాగించేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది.

విదేశాలకు కనెక్టివిటీ
వచ్చే(2021) వేసవిలో యూరోపియన్‌ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి సర్వీసులు ప్రారంభంకావచ్చని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ రిజల్యూషన్‌ ప్రణాళికను నవంబర్‌ 5న ఎన్‌సీఎల్‌టీకి కల్‌రాక్‌ క్యాపిటల్‌- మురారిలాల్‌ జలన్‌ కన్సార్షియం అందజేశాయి. బిగ్‌ చార్టర్‌, ఇంపీరియల్‌ క్యాపిటల్‌ తదితర సంస్థల మధ్య పోటీలో రూ. 1,000 కోట్ల ఆఫర్‌ ద్వారా జెట్‌ ఎయిర్‌వేస్‌ను కల్‌రాక్‌ క్యాపిటల్‌ గెలుచుకుంది. కాగా.. ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీ నుంచి అనుమతులు పొందడంతో ఎంసీఏ, డీజీసీఏల నుంచి క్లియరెన్స్‌ల కోసం కంపెనీ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

షేరు జోరు
కంపెనీ పునరుద్ధరణకు కల్‌రాక్‌ క్యాపిటల్‌- మురారీ లాల్‌ జలాన్‌ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ‍్నల్‌ ఇవ్వడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ గత రెండు నెలల్లో నిరవధికంగా బలపడుతూ వచ్చింది. ఈ బాటలో నవంబర్‌ 5కల్లా ఎన్‌ఎస్‌ఈలో రూ. 79ను అధిగమించింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరంది. తదుపరి అక్కడక్కడే అన్నట్లుగా కదులుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ షేరు 1 శాతం బలపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement