సాధారణ జనజీవనానికి అంతరాయం
నిలిచిన రైలు, విమాన సర్వీసులు
జమ్మూ–శ్రీనగర్ హైవే మూసివేత
శ్రీనగర్: కశ్మీర్‌లో శనివారం భారీగా మంచు కురిసింది. దీంతో స్థానికులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తుండగా సాధారణ జనజీవనానికి మాత్రం అవరోధం ఏర్పడింది. కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఒక మోస్తరు నుంచి భారీగా మంచు కురుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో, రైలు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మంచు కారణంగా కశ్మీర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
శనివారం సాయంత్రం కల్లా 90 శాతం వరకు ఫీడర్లలో సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అననుకూల వాతావరణం కారణంగా కశ్మీర్ విశ్వవిద్యాలయం శనివారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. శ్రీనగర్–సోనామార్గ్ హైవేపై రాకపోకలు నిలిచిపోవడంతో చిక్కుకుపోయిన పర్యాటకులకు గుండ్‌లోని మసీదులో స్థానికులు ఆశ్రయం కల్పించారు. సోనామార్గ్ నుంచి శుక్రవారం తిరుగుపయనమైన పంజాబ్‌కు చెందిన సుమారు డజను మంది శుక్రవారం రాత్రి మసీదులోనే గడిపారని స్థానికులు తెలిపారు. అదేవిధంగా, గండేర్‌బల్ జిల్లా కంగన్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులకు స్థానిక కుటుంబం ఆశ్రయం క ల్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
దక్షిణ కశ్మీర్‌పై ఎక్కువ ప్రభావం
దక్షిణ కశ్మీర్ జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో రెండడుగుల మేర మంచు కురిసిందని అధికారులు వివరించారు. బారాముల్లా జిల్లాలో 4 నుంచి 9 అంగుళాల మేర మంచు నమోదవగా గుల్మార్గ్‌లో 15 అంగుళాల మంచు కురిసింది. పుల్వామాలో 10 నుంచి 15 అంగుళాలు, పొరుగునే ఉన్న కుల్గామ్‌లో 18 నుంచి 25 అంగుళాలు, షోపియాన్‌లో 6 నుంచి 10 అంగుళాల మంచు పేరుకుపోయింది. శ్రీనగర్‌లో 8 అంగుళాల మేర మంచు కురియగా, పొరుగునే ఉన్న గందేర్‌బల్‌లో 7 అంగుళాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతం సోనామార్గ్‌లో 8 అంగుళాల మేర మంచు నమోదైందని అధికారులు చెప్పారు. పర్యాటక పట్టణం పహల్గామ్‌లో శనివారం 18 అంగుళాల మేర మంచు కురిసింది. అనంత్‌నాగ్ జిల్లాలో అత్యధికంగా 17 అంగుళాల హిమపాతం నమోదు కాగా శ్రీనగర్–లేహ్ రహదారి వెంట ఉన్న జోజిలాలో 15 అంగుళాలు, బుద్గాం జిల్లాలో 7 నుంచి 10 అంగుళాల మేర మంచు నమోదైంది.
మైనస్‌కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
శ్రీనగర్‌లో గురువారం రాత్రి మైనస్ 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం రాత్రికి తీవ్రత తగ్గి మైనస్ 1 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుంది. స్కయింగ్‌కు పేరున్న ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో మైనస్ 5 డిగ్రీలు, అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంపున్న పహల్గామ్‌లో మైనస్ 2.8 డిగ్రీలుగా ఉంది. కశ్మీర్‌కు ముఖద్వారం వంటి క్వాజీగుండ్‌లో కనీస ఉష్ణోగ్రత మైనస్ 0.6 డిగ్రీలుగా నమోదవగా, పంపోర్ ప్రాంతంలోని కుగ్రామం కొనబాల్‌లో మైనస్ 1.5 డిగ్రీలుగా రికార్డయింది. కశ్మీర్ లోయలో అతి తీవ్రమైన చలికాలం ‘చిల్లాయ్–కలాన్’ఈ నెల 21 నుంచి మొదలైంది. దాదాపు 40 రోజులపాటు భారీగా మంచు కురియడంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా మైనస్ స్థాయికి పడిపోతాయి. జనవరి 30వ తేదీకల్లా ఈ తీవ్రత తగ్గుముఖం పట్టనుంది. అయితే, చలి గాలులు మాత్రం మరో 40 రోజుల వరకు కొనసాగుతాయి.
ప్రయాణాలను వాయిదా వేసుకోండి
జమ్మూ–శ్రీనగర్ 44వ నంబర్ జాతీయ రహదారిని మంచు కారణంగా అధికారులు మూసివేశారు. నవ్‌యుగ్ టన్నెల్ వద్ద అతి భారీగా మంచు కురుస్తుండటంతో యంత్రాలతో మంచు తొలగింపు పనులకు అంతరాయం కలుగుతోందని ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. వాతావరణం మెరుగుపడి, రోడ్లు క్లియర్ అయ్యేదాకా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వాహనదారులను వారు కోరారు. పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో అధికారులు ముందు జాగ్రత్తగా బనిహాల్–బారాముల్లా సెక్షన్‌లో రైళ్లను రద్దు చేశారు. ట్రాక్‌ను క్లియర్ చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు. మంచు దట్టంగా కురుస్తుండటంతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను నిలిపివేశారు.
ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలను రద్దు చేశామని అధికారులు తెలిపారు. రన్‌వేను క్లియర్ చేసే పనులు చేపట్టామని, వాతావరణం అనుకూలిస్తేనే విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి మొదలవుతాయన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం కోసం వైమానిక సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రాల్లోని ప్రధాన రహదారులు, ఆస్పత్రులకు దారి తీసే రోడ్లపై మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మంచు కారణంగా అంతర్గత రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. వాహనాలు జారుతున్నందున మంచులో డ్రైవ్ చేయడం కష్టసాధ్యమే కాదు, ప్రమాదకరమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment