Jet Airways flight
-
వేసవి నుంచి మళ్లీ జెట్ ఎయిర్ సర్వీసులు!
ముంబై, సాక్షి: వచ్చే వేసవి సీజన్ నుంచి ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే జాతీయ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నుంచి కంపెనీ టేకోవర్‌కు లైన్ క్లియర్‌కావడంతో డీజీసీఏ, పౌర విమానయాన శాఖ(ఎంసీఏ) నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. భారీ రుణాలు, నష్టాల కారణంగా 2019 నుంచి కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికలకు ఇటీవల ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా ఇకపైన కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలలో జెట్ ఎయిర్వేస్ లిస్టింగ్‌ను కొనసాగించేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశాలకు కనెక్టివిటీ వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి సర్వీసులు ప్రారంభంకావచ్చని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్రణాళికను నవంబర్ 5న ఎన్సీఎల్టీకి కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం అందజేశాయి. బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ తదితర సంస్థల మధ్య పోటీలో రూ. 1,000 కోట్ల ఆఫర్ ద్వారా జెట్ ఎయిర్వేస్ను కల్రాక్ క్యాపిటల్ గెలుచుకుంది. కాగా.. ఇప్పటికే ఎన్సీఎల్టీ నుంచి అనుమతులు పొందడంతో ఎంసీఏ, డీజీసీఏల నుంచి క్లియరెన్స్‌ల కోసం కంపెనీ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. షేరు జోరు కంపెనీ పునరుద్ధరణకు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ గత రెండు నెలల్లో నిరవధికంగా బలపడుతూ వచ్చింది. ఈ బాటలో నవంబర్ 5కల్లా ఎన్ఎస్ఈలో రూ. 79ను అధిగమించింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరంది. తదుపరి అక్కడక్కడే అన్నట్లుగా కదులుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ షేరు 1 శాతం బలపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
ట్రక్కును ఢీకొన్న జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. జెట్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని జెట్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. దుబాయ్ నుంచి వస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానం, ఎయిర్‌పోర్టులోని టర్మినల్ 3 వద్ద ల్యాండ్ అయింది. దానికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తేజ్ శాట్స్ సర్వీసు ప్రొవైడర్ కేటరింగ్ వాహనం అక్కడే ఉండటంతో, ల్యాండ్ అవుతున్న ఆ విమానం రెక్కలు ట్రక్కును ఢీకొన్నాయి. అయితే ఈ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడిందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. -
ల్యాండింగ్‌లో రన్‌వేను ఢీకొన్న విమానం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా విమానాశ్రయంలో కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముంబై నుంచి వెళ్లిన జెట్ ఎయిర్వేస్ బి737-800 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో తోకభాగం రన్‌వేను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఉన్న 8 సిబ్బందితో సహా మొత్తం 168 మంది క్షేమంగా బయటపడ్డారు. కాగా విమానం దెబ్బతింది. ఈ నెల 22న ఈ ఘటన జరిగింది. జెట్ ఎయిర్వేస్ ఇంజనీర్లు ఈ విమాన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే బోయింగ్ కంపెనీకి చెందిన ఓ బృందం కూడా ఢాకాకు వెళ్తుందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ పౌరవిమాయన సంస్థ అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తారని భావిస్తున్నట్టు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయరాదని వారు నిర్ణయిస్తే ఏఏఐబీ విచారణ చేపట్టవచ్చని తెలిపారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తామని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. విమాన ప్రమాదానికి బాధ్యులుగా ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించింది. -
జెట్‌లైట్ విమానానికి తప్పిన ముప్పు
-
జెట్‌లైట్ విమానానికి తప్పిన ముప్పు
శంషాబాద్: కోల్‌కతా నుంచి బెంగళూరు వెళుతున్న జెట్‌లైట్ విమానానికి ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శనివారం సాయంత్రం 134 మంది ప్రయాణికులతో కోల్‌కతా నుంచి బయలుదేరిన ఎస్24364 విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారమిచ్చారు. ఏటీసీ అనుమతితో రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ విమానాశ్ర యంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలడంతో అప్రమత్తమైన ఏటీసీ అధికారులు 20 నిమిషాలపాటు రన్‌వేను బ్లాక్ చేశారు. రాత్రి 9.30 గంటలకు రన్‌వేను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విమానాశ్రయవర్గాలు వెల్లడించాయి. -
ఫ్లైట్‌లో పొగ.. ఉలిక్కి పడిన 65 మంది
బెంగళూరు: క్యాబిన్లో పొగరావడంతో బెంగళూరులో జెట్ విమానాన్ని అత్యవసరం దించివేశారు. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి ఈ పనిచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9డబ్ల్యూ 2839 విమానం 65 మంది ప్రయాణీకులతో బెంగళూరు నుంచి మంగళూరుకు ఉదయం 10గంటల ప్రాంతంలో బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో సమస్య అనిపించడంతోపాటు క్యాబిన్లో పొగలాంటిది రావడంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని తిరిగి బెంగళూరు విమానాశ్రయంలోని 10.20గంటల ప్రాంతంలో దించివేశాడు. దీంతో ప్రయాణీకులు విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమస్యపై పరిశీలన చేస్తున్నారు. -
విమానంలో కన్హయ్యపై దాడి!
ముంబై: విమానంలో తోటి ప్రయాణికుడు తన పీకనులిమి చంపబోయాడంటూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఆదివారం తెలిపారు. ‘ఈ సారి విమానంలో దాడి. ఒక వ్యక్తి నా పీకనులిమాడు. నాపై దాడి చేసిన వారిపై విమాన సిబ్బంది ఏ చర్యలూ తీసుకోలేదు’అని ట్విటర్లో పేర్కొన్నారు. ముంబై నుంచి పుణెకు వెళ్లడానికి కన్హయ్య జెట్ ఎయిర్వేస్ విమానం ఎక్కిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. దీంతో భద్రతా కారణాల రీత్యా కన్హయ్యను విమానం నుంచి దింపి రోడ్డుమార్గంలో విమాన సిబ్బంది పుణెకు పంపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాడి చేసిన వ్యక్తిని పుణె టీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి మనస్ జ్యోతి డేక(33)గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగిందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఈ సంఘటనపై ఇరు పక్షాలు ఫిర్యాదు చేశాయన్నారు. పబ్లిసిటీ కోసం కన్హయ్య చేసిన చీప్ ట్రిక్ అని మనస్ ఆరోపించాడు. కాలు నొప్పి నుంచి ఉపశమనం కోసం కదలగా తన చేయి కన్హయ్య మెడను రాసుకుందన్నాడు. అసలు కన్హయ్య అనే అతను ఎవరో తనకు తెలియదన్నాడు. కాగా, కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సహచర విద్యార్థి తరఫున కన్హయ్య ప్రచారం చేయనున్నారు. మోదీ ప్రభుత్వం వెనుక ఆరెస్సెస్ దాగి ఉందని, వారి హయాంలో దేశం మతతత్వ, దళిత వ్యతిరేక ప్రయోగశాలగా మారిందని కన్హయ్య ఆరోపించారు. -
'పబ్లిసిటీ కోసమే హత్యారోపణలు చేశాడు'
జెఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ పబ్లిసిటీ కోసమే హత్యాయత్నం జరిగిందంటూ ఆరోపణలు చేశాడని నిందితుడైన సహా ప్రయాణికుడు తెలిపాడు. ముంబై-పుణె జెట్ ఎయిర్వేస్ విమానంలో తనపై సహా ప్రయాణికుడు హత్యాయత్నం చేశాడని కన్హయ్యకుమార్ ట్విట్టర్లో తెలిపిన సంగతి తెలిసిందే. తనపై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి తెలియజేయడంతో వారు తనని, దాడి చేసిన వ్యక్తిని కిందకు దింపేశారని వెల్లడించాడు. కన్హయ్యపై హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న సహా ప్రయాణికుడిని మానస్ జ్యోతి దేక (33)గా గుర్తించారు. అతడు పుణెలోని టీసీఎస్ పనిచేస్తున్నాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, మానస్ కన్హయ్య ఆరోపణలను తోసిపుచ్చాడు. పబ్లిసిటీ స్టంట్ కోసమే అతను చౌవుకబారు ఆరోపణలు చేస్తున్నాడని, తన కాలికి గాయం కావడంతో విమానంలో నిలబడేటప్పుడు బ్యాలెన్స్ కోసమే అతన్ని పట్టుకున్నానని, కన్హయ్య వ్యక్తిగతంగా కూడా తనకు తెలియదని చెప్పాడు. అతని ఫొటోలు మాత్రమే చూశానని, అంతేకానీ అతన్ని గుర్తుపట్టేలేనని మానస్ వివరణ ఇచ్చాడు. -
గాల్లో విమానం.. ఇంధనం ఖాళీ!
మీరు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లేటప్పుడు దారిలో పెట్రోలు అయిపోతే ఏం చేస్తారు? కారు పక్కకు ఆపి, ఎలాగోలా పెట్రోలు తెచ్చుకుని ముందుకెళ్తారు. అది రోడ్డు మీద కాబట్టి పర్వాలేదు. అదే విమానంలో అలాంటి అనుభవం ఎదురైతే మీకు ఎలా ఉంటుంది? గుండె ఝల్లుమంటుంది కదూ. దోహా నుంచి కొచ్చిన్ వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇలాగే అయ్యింది. ఉన్నట్టుండి విమానంలో ఇంధనం అయిపోయింది. దాంతో విమానాన్ని అత్యవససరంగా తిరువనంతపురంలో దించేయాల్సి వచ్చింది. అక్కడ దిగేసరికి విమానంలోని ఇంధన ట్యాంకు దాదాపు ఖాళీ అయిపోయింది. అయితే, ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది. కొచ్చిన్‌లో వాతావరణం బాగోకపోవడంతో రన్‌వే ఎక్కడుందో సరిగ్గా తెలియక.. బెంగళూరు, కొచ్చిన్ విమానాశ్రయాల మధ్య ఆరుసార్లు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఆ విమానంలో 152 మంది ప్రయాణికులు ఈ పరిస్థితి చూసి గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అప్పటికే ఇంధనం దాదాపు అయిపోవస్తుండగా, ఇలా చక్కర్లు కొట్టడంతో పూర్తిగా ఖాళీ అయిపోయింది. విమానంలో తప్పనిసరిగా ఉండాల్సిన 3500 కిలోల ఇంధనం కూడా లేదు. దాంతో విసుగెత్తిన పైలట్ తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లిపోయి, అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మరికొద్ది నిమిషాలు గనక ల్యాండింగ్ ఆలస్యం అయి ఉంటే.. ఆకాశం నుంచి రాయి పడినట్లుగా విమానం కింద పడిపోయి ఉండేది! అసలు విమానం బయల్దేరే ముందే దాంట్లో సరిపడ ఇంధనం ఉందో లేదో సరిచూసుకోకుండా వెళ్లినందుకు పైలట్లను డీజీసీఏ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. -
బాంబు ఉందని బెదిరించింది భారతీయుడే
న్యూఢిల్లీ: ముంబయి నుంచి దుబాయ్ వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానం అనూహ్యంగా మస్కట్‌లో దించివేయడానికి ఓ భారతీయ యువకుడే కారణమని పోలీసులు నిర్ధారించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకునేందుకు పంజాబ్‌లోని లూధియానా పోలీసులు సిద్ధమయ్యారు. గురువారం దుబాయ్ వెళ్లాల్సిన భారత జెట్ ఎయిర్ వేస్ 9డబ్ల్యూ 536 విమానంలో బాంబు ఉన్నట్లు ట్వీట్ రావడంతో మస్కట్‌లో దించివేసిన విషయం తెలిసిందే. దీంతో అసలు ఆ సమాచారం ఎలా వచ్చింది.. బాంబు ఉన్నట్లు చెప్పిందెవరు అని శోధించగా రాజస్ధాన్‌లోని జైపూర్‌కు చెందిన సురేందర్ ప్రతాప్ అనే పాతికేళ్ల యువకుడు సమాచారం ఈ పనిచేశాడని గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు లేదా ఐదు రోజుల కిందటే ప్రతాప్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియని ఆ యువకుడు సాధారణంగా సరదాగా ఈ పోస్ట్ చేసినట్లు అతడిని ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. అయితే, రాజస్థాన్ పోలీసులకు తాము సమాచారం ఇచ్చామని, ప్రతాప్ చెప్పిన విషయాలే కాకుండా పూర్తి సమాచారం తమకు అందించాలని కోరినట్లు వివరించారు. -
విమానం టాయిలెట్లో 2.2 కిలోల బంగారం
బెంగళూరు(బనశంకరి) : దుబాయి నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జెట్ ఎయిర్వేస్ విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచిన 2.2 కి లోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. దు బాయి నుంచి పన్ను తప్పించుకోవడానికి బంగారం తెచ్చిన ఓ ప్రయాణికుడు దానిని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మంగళూరులో జెట్ ఎయిర్వేస్ విమానం ఎక్కిన ఓ వ్యక్తి బంగారాన్ని తీసుకుని ముంబాయి ఎయిర్‌పోర్టులో దిగాడు. దీనిపై సమాచారం అం దుకున్న కస్టమ్స్ అధికారులు శనివారం దుబాయి నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులను క్షుణంగా తనిఖీ చేశా రు. విమానం వెనుక గల మరుగుదొడ్డిలో దాచి ఉంచిన బంగారాన్ని కనుగొన్నారు. రెండు ప్యాకెట్లలో 100 గ్రాము లు బరువుగల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. -
టాయిలెట్లో కిలోన్నర బంగారం!
చెన్నై : సింగపూర్ నుంచి చెన్నైకి ఆదివారం రాత్రి చేరుకున్న జెట్ ఎయిర్వేస్ విమానంలోని టాయిలెట్లో రూ.48 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానంలోని ప్రయాణికులు దిగిన వెంటనే టాయిలెట్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది టాయిలెట్లో నల్లని సంచిని చూసి బాంబుగా భయపడ్డారు. బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది పరిశీలించి తెరిచిచూడగా అందులో 1.5 కిలోల బరువున్న రెండు బంగారు బిస్కెట్లు అందులో ఉన్నాయి. సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న ఈ విమానం మరికొద్ది సేపటికి ముంబాయికి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ విషయం ప్రయాణికులకు తెలిసే అవకాశం లేదు. టాయిలెట్‌లోని బంగారాన్ని ముంబయికి చేరవేసేందుకు విమానాశ్రయ సిబ్బంది ఎవరో స్మగ్లర్లకు సహకరించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. -
ప్రయాణికులకు షాకిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి తన మార్కును చాటుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం భార్య, కూతురుతో కలిసి ఇతర ముఖ్యమంత్రుల్లా చార్టర్డ్ విమానంలో కాకుండా జెట్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ విమానం ఎకానమీ క్లాస్ లో నాగపూర్ కు వెళ్లారు. దాంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు, మీడియా వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మహారాష్ట్ర చరిత్రలో ఓ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీలా ప్రయాణించడం ఇదే మొదటిసారని, ఏ ముఖ్యమంత్రీ సాధారణ వ్యక్తిలా అందరితో కలసి ఎకానమీ క్లాస్ లో వెళ్లలేదని ఓ ప్రయాణికుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇది ఒక శుభ పరిమాణం అన్నారు. ఖజానాకు భారం తగ్గించడానికి అధికారులు, రాజకీయ నాయకులు ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస లాంటివి మానుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించిన సంగతి తెలిసిందే.