ల్యాండింగ్‌లో రన్వేను ఢీకొన్న విమానం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా విమానాశ్రయంలో కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముంబై నుంచి వెళ్లిన జెట్ ఎయిర్వేస్ బి737-800 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో తోకభాగం రన్వేను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఉన్న 8 సిబ్బందితో సహా మొత్తం 168 మంది క్షేమంగా బయటపడ్డారు. కాగా విమానం దెబ్బతింది. ఈ నెల 22న ఈ ఘటన జరిగింది. జెట్ ఎయిర్వేస్ ఇంజనీర్లు ఈ విమాన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే బోయింగ్ కంపెనీకి చెందిన ఓ బృందం కూడా ఢాకాకు వెళ్తుందని భావిస్తున్నారు.
బంగ్లాదేశ్ పౌరవిమాయన సంస్థ అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తారని భావిస్తున్నట్టు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయరాదని వారు నిర్ణయిస్తే ఏఏఐబీ విచారణ చేపట్టవచ్చని తెలిపారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తామని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. విమాన ప్రమాదానికి బాధ్యులుగా ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించింది.