'పబ్లిసిటీ కోసమే హత్యారోపణలు చేశాడు'
జెఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ పబ్లిసిటీ కోసమే హత్యాయత్నం జరిగిందంటూ ఆరోపణలు చేశాడని నిందితుడైన సహా ప్రయాణికుడు తెలిపాడు. ముంబై-పుణె జెట్ ఎయిర్‌వేస్ విమానంలో తనపై సహా ప్రయాణికుడు హత్యాయత్నం చేశాడని కన్హయ్యకుమార్ ట్విట్టర్‌లో తెలిపిన సంగతి తెలిసిందే. తనపై హత్యాయత్నం జరిగిందన్న విషయాన్ని జెట్ ఎయిర్‌వేస్ సిబ్బందికి తెలియజేయడంతో వారు తనని, దాడి చేసిన వ్యక్తిని కిందకు దింపేశారని వెల్లడించాడు. కన్హయ్యపై హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న సహా ప్రయాణికుడిని మానస్ జ్యోతి దేక (33)గా గుర్తించారు. అతడు పుణెలోని టీసీఎస్ పనిచేస్తున్నాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, మానస్ కన్హయ్య ఆరోపణలను తోసిపుచ్చాడు. పబ్లిసిటీ స్టంట్ కోసమే అతను చౌవుకబారు ఆరోపణలు చేస్తున్నాడని, తన కాలికి గాయం కావడంతో విమానంలో నిలబడేటప్పుడు బ్యాలెన్స్ కోసమే అతన్ని పట్టుకున్నానని, కన్హయ్య వ్యక్తిగతంగా కూడా తనకు తెలియదని చెప్పాడు. అతని ఫొటోలు మాత్రమే చూశానని, అంతేకానీ అతన్ని గుర్తుపట్టేలేనని మానస్ వివరణ ఇచ్చాడు.