ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే..
కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే..
ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్‌లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు.
ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ..
తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!!
Comments
Please login to add a commentAdd a comment