NTR district Latest News
-
ప్రమాదకరంగా గండ్లు..
ఇటీవల వచ్చిన వరద ఉద్ధృతికి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్‌కు ఎడమ వైపు కట్టకు మూడు చోట్ల, కుడివైపు కట్టకు ఏడు చోట్ల గండ్ల పడ్డాయి. తాత్కాలికంగా వాటిని పూడ్చారు. ఆ తర్వాత బుడమేరు వైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. హెడ్ రెగ్యులేటర్ గేట్లు మరమ్మతులకు నోచుకోక పట్టిసీమ నీరు లీకవుతోంది. మరో వైపు పూడ్చిన గండ్ల వద్ద నుంచి నీరు లీకవుతుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు బుడమేరు ఆధునికీకరణ చేయించాల్సి ఉంది. -
ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ( పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ నిధిమీనా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో పీజీఆర్ఎస్ జరిగింది. నిధి మీనా.. డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను ఏరోజుకారోజే ఓపెన్ చేయాలని, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషిచేయాలని సూచించారు. ● జి.కొండూరు గ్రామంలో సర్వే నంబర్ 293/2బిలో 1.10 ఎకరాలు భూమి ఉంది. జాతీయ రహదారి కోసం 31 సెంట్లు భూమి సేకరించారు. అప్పటి నుంచి సర్వే సబ్ డివిజన్ చేయలేదు. సర్వే సబ్ డివిజన్ చేసి పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల్లో మిగిలిన భూమిని ఎంటర్ చేయాలంటూ జి.కొండూరుకు చెందిన మాదాసు కొండలరావు పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. ● అన్యాయంగా తమను తొలగించారంటూ విసన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన సుండురి రత్నకుమారి తో పాటు మరో 8 మంది బుక్ కీపర్లు పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించారు. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా విధుల్లోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నిధిమీనా పీజీఆర్ఎస్కు 97 అర్జీలు పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరిస్తున్న ఇన్చార్జి కలెక్టర్ నిధిమీనా97 అర్జీలు మొత్తం 97 అర్జీలు అందాయని కలెక్టర్ నిధి మీనా తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 38, పోలీస్ 14, మునిసిపల్, పట్టణాభివృద్ధి 14, వైద్య ఆరోగ్యం 6, మార్కెటింగ్ 6, పంచాయతీరాజ్ 5, ఉపాధి కల్పన 2, ఏపీసీపీడీసీఎల్ 2, బ్యాంకింగ్ సేవలకు సంబంధించి రెండు అర్జీలు రాగా పౌర సరఫరాలు, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ధి, ఏపీఈడబ్ల్యూఐడీసీ, డ్వామా, డీఆర్డీఏ, సహకార, సాంఘిక సంక్షేమానికి సంబంధించి ఒక్కో అర్జీ వచ్చాయన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ దీర్ఘకాలంగా పని చేస్తున్న ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, సంబంధం లేని పనులు చేయించకూడదన్నారు. రిటైర్మెంట్ వయసు వరకు పని చేయించుకుని బెనిఫెట్లు ఇవ్వకుండానే ప్రభుత్వం తొలగిస్తోందని, ఇది సరి కాదని హితవు పలికారు. ఆశ వర్కర్లకు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ల పెంపు జీవో వర్తింపజేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు, కొందరు అనారోగ్యంతో ఆశ వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారని, ప్రభుత్వం ఆశ వర్కర్స్కు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా మార్పు చేయాలన్నారు. మెడికల్ లీవ్, మెటర్నిటీ లీవ్, రిటైర్మెంట్ బెనిఫెట్లు రూ. 60వేలు, మట్టి ఖర్చులకు రూ. 20వేలు, వయోపరిమితి పెంపు, సహజమరణానికి రూ. 2లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటిని జీవోల రూపంలో ఇవ్వాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల మాట్లాడుతూ ఖాళీ పోస్టులను రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వమే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, సంఘ జిల్లా నేత సోమేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు కె.దుర్గారావు, విజయవాడ వెస్ట్ సిటీ కార్యదర్శి ఇ.వి.నారాయణ, వెంకట్రావు, నందిగామ తదితరులు పాల్గొన్నారు.యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి -
దుర్గమ్మకు వెండి కిరీటం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మకు ద్రాక్షా రామంకు చెందిన భక్తులు వెండి కిరీటాన్ని సమర్పించారు. ద్రాక్షారామానికి చెందిన కొమ్ముల స్వామినాయుడు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ. 1.30 లక్షలతో 1.300 కిలోల వెండితో కిరీటాన్ని తయారు చేయించి సోమవారం ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ పర్యవేక్షకుడు రమేష్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ముగిసిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీలుగుడివాడ టౌన్: ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్–19 బాలురు, బాలికల వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ నెల 16న ప్రారంభమైన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో స్ట్రాంగ్‌మ్యాన్‌గా డి. భానుతేజ(వైఎస్సార్ కడప జిల్లా), స్ట్రాంగ్ ఉమన్‌గా కె. తరంగిణి(తూర్పు గోదావరి) టైటిల్ సాధించగా ఓవరాల్ చాంపియన్‌షిప్ వైఎస్సార్ కడపజిల్లా క్రీడాకారులు కై వసం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. దామోదరరావు, జిల్లా కార్యదర్శి రవి, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి నరేంద్ర, కృష్ణా జిల్లా ఖో–ఖో అసోసియేషన్ కార్యదర్శి మడకా ప్రసాద్, ఎన్టీఆర్ స్టేడియం జిమ్ కోచ్ మారెళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా వర్సిటీ యోగా జట్టు ఎంపికవిజయవాడస్పోర్ట్స్: సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయాల యోగాసన పోటీలకు ప్రాతినిధ్యం వహించే కృష్ణా యూనివర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు పీబీ సిద్ధార్థ కాలేజీ వ్యాయామ విభాగాధిపతి, పోటీల కార్యనిర్వాహక క్యార్యదర్శి డాక్టర్ టి.వి.బి.కృష్ణారెడ్డి తెలిపారు. తమ కాలేజీలో వర్సిటీ అంతర కళాశాలల పోటీలను నిర్వహించామన్నారు. అనంతరం జరిగిన వర్సిటీ జట్టు ఎంపిక పోటీల్లో పి.ఎస్.రాజు, వరుణ్, రాకేష్, వై.కె.ఎస్.డి. గౌరీనాథ్, శంకర్, ప్రదీప్‌కుమార్ పురుషుల జట్టులో, జ్యోత్స్నాదేవి, మౌనిక, దీపిక, శృతి, సమీర, మెహరీన్ మహిళల జట్టులో స్థానం దక్కించుకున్నారన్నారు. పోటీల్లో విజేతలకు కాలేజీ డీన్ ప్రొఫెసర్ రాజేష్ బహుమతులు అందజేశారన్నారు. కనకదాస కీర్తనలు.. చైతన్యానికి సూచికలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కీర్తనలతో ప్రజల్లో చైతన్యం తేవడంతోపాటు సామాజిక అసమానతలను రూపుమాపేందుకు విశేష కృషిచేసిన కవి, సంగీతకారుడు, స్వరకర్త భక్త కనకదాస జీవితం ఆదర్శప్రాయమని ఇన్చార్జి కలెక్టర్ నిధి మీనా అన్నారు. కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన భక్త కనకదాస రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిధిమీనా మాట్లాడుతూ కనకదాస కన్నడ కురుబ కుటుంబంలో జన్మించారన్నారు. ఆయన విద్య ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష పరిశీలన చేశారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, జిల్లా ఇన్చార్జ్ బీసీ సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ జి.ఉమామహేశ్వరరావు, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ డాక్టర్ బీసీకే నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఐఐసీకి భూమి అప్పగింత తగదు
మాజీఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం: బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆర్ఎస్. నెం.11లో పేదలకు ఇళ్లస్థలాలు, సామాజిక అవసరాల కోసం కేటాయించిన వంద ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీకి ఆయన లేఖ రాశారు. మల్లవల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 2016లో అప్పటి సీఎం చంద్రబాబు సూచన మేరకు ఎమ్మెల్యేగా తాను, రెవెన్యూ అధికారులు కలిసి ఆర్ఎస్. నెం.11లో 1,466 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. ఈ భూసేకరణతో అటవీ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.50వేలు పరిహారం, ఇంటిస్థలం మంజూరు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈమేరకు ఆర్ఆర్. నెం 11లో వంద ఎకరాలను ఇళ్లస్థలాలు, సామాజిక అవసరాలకు కేటాయిస్తూ అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలుపగా, అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీకి అంగీకరించారని గుర్తుచేశారు. అయితే స్థలం లేనివారికి మాత్రమే ఇస్తామంటూ అప్పటి కలెక్టర్లు చెప్పడంతో పంపిణీలో జాప్యం చోటుచేసుకుందన్నారు. ఈవిషయాన్ని మరోసారి అప్పటి సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు 1,924 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. పట్టాలు పంపిణీ చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఎన్నికలు ముగిసినప్పటికీ బాపులపాడు తహసీల్దారు కార్యాలయంలో ఉన్న ఇళ్లపట్టాలను పంపిణీ చేయలేదన్నారు. ప్రస్తుతం ఈ వంద ఎకరాల భూములను ఏపీఐఐసీ బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఈ భూమిలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేసిన జెడ్పీ హైస్కూల్ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తికావచ్చిందని తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు హామీ మేరకు సదరు భూమిలో గ్రామ అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రి, గుడి, మసీదు, చర్చి, షాదీఖానా, కల్యాణ మండపం నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆ భూమిని ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నాలను విరమించుకుని కుల, మత, రాజకీయాలకతీతంగా రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఇంటిస్థలాలను పంపిణీ చేయాలన్నారు. తహసీల్దారు కార్యాలయంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల పట్టాలను సదరు కుటుంబాలకు అందజేయాలని ఆ లేఖలో కలెక్టర్‌ను కోరారు. -
జాతీయ పోటీలకు ఐజీఎంసీ క్రీడాకారులు
విజయజవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) అండర్–19 బాస్కెట్‌బాల్ జాతీయ పోటీలకు ఎంపికై న విజయవాడ క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా డీఎస్డీవో ఎస్.ఏ.అజీజ్ సోమవారం అభినందించారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఎ.అమల్రెడ్డి, జి.నిరంజన్రాయల్ బాలుర జట్టులో, షేక్ హఫ్సా బాలికల జట్టులో సత్తా చాటారు. అనంతరం జరిగిన రాష్ట్ర జట్ల ఎంపిక పోటీల్లోనూ వీరు విశేష క్రీడా నైపుణ్యం ప్రదర్శించి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. వీరు ముగ్గురు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పోరేషన్ స్టేడియం(ఐజీఎంసీ)లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ) కోచ్ ఎస్.సంతోష్‌కుమార్ శిక్షణ తీసుకుంటున్నారని డీఎస్డీవో తెలిపారు. ఇదే క్రీడాస్పూర్తితో జాతీయ పోటీల్లో సత్తా చాటి జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప జేయాలని క్రీడాకారులకు సూచించారు. జాతీయ పోటీలకు పెడసనగల్లు విద్యార్థి... పెడసనగల్లు(మొవ్వ): స్కూల్ గేమ్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఇంటర్ స్ట్రిక్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మొవ్వ మండలం పెడసనగల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఆరేపల్లి దుర్గారావు (పదోతరగతి) ఉత్తమ ప్రతిభ కనపరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం కె.శిరీషా సోమవారం తెలిపారు. ఇటీవల గూడూరు హైస్కూల్లో జరిగిన అండర్–17 బాలికల విభాగంలో త్రోబాల్ పోటీలో రాజులపాటి మౌనిక ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. క్రీడాకారులు దుర్గారావు, మౌనిక, ఫిజికల్ డైరెక్టర్ బి.నాగశివలను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
కన్నేసి.. కై వసం చేసుకోవాలని..
కంచికచర్ల: సీఐడీ పరిధిలో ఉన్న విలువైన అగ్రిగోల్డ్ భూములపై కొందరు పెద్దలు కన్నేసి.. కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. కొంతమంది కూటమి నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూములను స్వాధీన పర్చుకునేందుకు యత్నిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అగ్రిగోల్డ్ ప్రహరీని పగలకొట్టి జేసీబీలను ఆ భూముల్లోకి తీసుకెళ్లారు. దీన్ని గమనించిన తహసీల్దార్ జాహ్నవి వీఆర్వోను అగ్రిగోల్డ్ భూముల వద్దకు పంపించి అక్కడ ఉన్న జేసీబీలను బయటకు పంపించి వారిపై ఫిర్యాదు చేశారు. దీనిపై కంచికచర్ల పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. 350 ఎకరాల భూములు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర, పరిసర ప్రాంతాల్లో సుమారు 350 ఎకరాల అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యానికి విలువైన భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ ఎక్కువగా 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉండటంతో వాటి ధర కోట్లు పలుకుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల యాజమాన్యం గతంలో వ్యవసాయం చేసి పలు రకాల పంటలు పండించేవారు. డెయిరీ ఫారంతో పాటు పలు రకాల ఆహార పదార్థాలు తయారు చేసేవారు. దాదాపు 1000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పెద్దలు అగ్రిగోల్డ్ భూములపై కన్నేశారు. ఆ భూములను టీడీపీ పెద్దలకు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ సంస్థ యాజమాన్యం ప్రజలను నిలువుదోపిడీ చేస్తోందని ప్రజలను నమ్మబలికారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ భూములను లాక్కొనేందుకు యత్నించి వాస్తవాలను పరిశీలించాలని సీఐడీకి అప్పగించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ భూములకు ఎటువంటి రక్షణ కల్పించలేకపోయింది. కేవలం ఆ భూములకు ముఖద్వారానికి తాళం మాత్రమే వేశారు. కీసర, పెండ్యాల, నందలూరు, పల్లగిరి తదితర గ్రామాల సమీపంలో సుమారు 350 ఎకరాల భూమి ఉంది. కీసర నేషనల్ హైవే పక్కన నంబర్ 61–1, 68–4,69–2లో 112 ఎకరాలు ఉంది. ప్రహరీ పగలకొట్టి ఆ భూముల్లో జేసీబీలతో కొంతమంది కబ్జాదారులు ప్రహరీని పగలకొట్టి చదును చేస్తుంటే విషయం తెలుసుకున్న తహసీల్దార్.. వీఆర్వో హిసీనాబేగంను ఘటనా స్థలానికి పంపించారు. భూములను చదును చేస్తున్న వ్యక్తులను విచారణ చేయగా తాము ఈ భూములను కొనుగోలుచేశామని చెప్పారు. సంబంధిత పత్రాలు చూపించాలని వీఆర్వో ఆక్రమణదారులను ప్రశ్నించడంతో వారు లేవన్నారు. వాస్తవానికి సరైన ఆధారాలతో వచ్చి బ్యాంకు లిక్విడేటర్ సమక్షంలో స్వాధీనం చేసుకోవాలని వీఆర్వో అనడంతో వారు వెనుదిరిగారు. వెంటనే వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇటీవల కేసు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ భూముల ఆక్రమణదారులుగా దాసరి రాం ప్రసాద్, జమ్ముల నరేష్, లావణ్యలను గుర్తించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వేలంలో భూముల కొనుగోలు.. కంచికచర్ల మండలం కీసర నేషనల్ హైవే పక్కన 17 ఎకరాల భూములు అగ్రిగోల్డ్ సంస్థకు చెంది నవి. వీటిని అగ్రిగోల్డ్ సంస్ధ యాజమాన్యం కొన్ని జాతీయ, రీజియన్ బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు సమాచారం. యాజమాన్యం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో వాటిని బ్యాంకులు వేలం వేశాయి. వేలంలో కొందరు వీటిని కొనుగోలు చేశారు. బ్యాంకు లిక్విడేషన్ కింద వీటిని కొనుగోలుదారులకు స్వాధీనం చేయాలి. వారు ఆ భూములను స్వాధీనం చేయకుండా కొన్ని పత్రాలు ఇచ్చారు. ఇటువంటి ఆస్తులను ప్రత్యేకంగా బ్యాంకులు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కాని రిజిస్టర్ చేయకముందే వాటిని స్వాధీనం చేసుకోవడం వివాదాస్పదమైందని తెలుస్తోంది. ఈ భూములు ఎకరా దాదాపు రూ. 3 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని రియల్టర్లు చెప్పుతున్నారు. కాని అగ్రిగోల్డ్ భూములు కేవలం రూ. కోటి చొప్పున వేలంలో దక్కించుకున్నారని తమ సొమ్ము వరకు వేలం వేసి బ్యాంకులు వదిలించుకున్నట్లు సమాచారం. పోలీసులు, రెవెన్యూ అధికారుల విచారణలో పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్ భూములపై పెద్దల దృష్టి కంచికచర్ల మండలంలో 350 ఎకరాలకు పైచిలుకే.. సీఐడీ అధికారుల పరిఽధిలో భూములు -
హైకోర్టుకు దుర్గాబ్యాంక్ ఉద్యోగులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేయడంపై ఆ బ్యాంకు ఉద్యోగులు హైకోర్టును సోమవారం ఆశ్రయించారు. బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది. బ్యాంకు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని లిక్విడేటర్‌ను నియమించాలని సూచించింది. దీనిపై ఉద్యోగులు హైకోర్ట్‌ను సోమవారం ఆశ్రయించారు. హైకోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రభుత్వం లిక్విడేటర్ ఆదివారం వరకూ నియమించలేదు. హైకోర్టు ఆదేశాలతో జిల్లా సహకార అధికారి శ్రీనివాసరెడ్డిని లిక్విడేటర్‌గా నియమించినట్లు తెలిసింది. ఆయన పాత తేదీతో చార్జి తీసుకున్నట్లుగా సమాచారం. -
గౌతమ్‌రెడ్డిపై ముందస్తు చర్యలొద్దు : హైకోర్టు
సాక్షి, అమరావతి: విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసులు తనపై నమోదు చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈవ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, గౌతమ్‌రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని గౌతమ్‌రెడ్డిని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. సత్యనారాయణపురంలో ఓస్థలం వివాదంలో ఉమామహేశ్వరశాస్త్రి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గౌతమ్‌రెడ్డిపై కేసు నమోదు చేయగా, ముందస్తు బెయిల్ కోరుతూ గౌతమ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గౌతమ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు, ఫిర్యాదుదారుకు మధ్య ఎప్పటినుంచో భూవివాదం ఉందన్నారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అందువల్లే దురుద్దేశంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోలీసుల తరఫున అసిస్టెంట్ పీపీ వాదనలు వినిపిస్తూ ఈవ్యాజ్యంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ)వాదనలు వినిపిస్తారని తెలిపారు. అందువల్ల విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తూ, గౌతమ్‌రెడ్డిపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
పాఠశాలల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు కృషి
ఎంపీ కేశినేని శివనాథ్ వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్జిల్లా రాష్ట్రంలోని ఇతరజిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిఏటా స్పోర్ట్స్‌మీట్ నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. ఈ ఏడాది క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల, కాలేజీల ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్‌తో కేబీఎన్ కళాశాలలో డీఈవో యూవీ సుబ్బారావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా వసతులు కల్పించడమే ధ్యేయంగా అధికారులతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ మీట్లో భాగం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు పీఈటీ, పీడీలు కృషిచేయాలని సూచించారు. 2027లో అమరావతిలో నేషనల్ గేమ్స్.. సీఎం చంద్రబాబు 2027లో రాజధాని అమరావతి ప్రాంతానికి నేషనల్ గేమ్స్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు. అందులో భాగంగానే అమరావతిలో స్పోర్ట్స్ సిటీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రానుందని ఎంపీ వివరించారు. -
బుడమేరు ప్రక్షాళన చేసి విజయవాడకు ముంపు ముప్పు తొలగిస్తానని మాటిచ్చిన సీఎం చంద్రబాబు మరిచారు. రెండున్నర నెలలు దాటుతున్నా ఆధునికీకరణ ఊసే ఎత్తడం లేదు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం. సర్కార్ వారి మాట.. నీటి మూటగా మారింది. బుడమేరు గేట్లకు కూడా మరమ్మతులు చేయించక
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరును ఆధునికీకరిస్తామని వరదల సమయంలో మాట ఇచ్చిన చంద్రబాబు దాన్ని మరిచారు. మాటిచ్చి రెండున్నర నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నాడు హడావుడి చేసిన పాలకులు నేడు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం. వరదల సమయంలో తాత్కాలికంగా గండ్లు పూడ్చారు. వాటి నుంచి సీపేజీ(గండ్లు పూడ్చిన చోట రాళ్ల కింద నుంచి నీరు) వస్తుండటంతో ఆ ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు గేట్లు రెండు దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు జరగకపోవడం.. పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో గేట్ల నుంచి నీరు లీకవుతోంది. బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలపై సంయుక్త బృందాలు సర్వే చేశాయి. విజయవాడ రూరల్ పరిధిలోని 260 ఎకరాల్లో బుడమేరు వాగులో అక్రమంగా సాగు చేసుకొంటున్నారని, సర్వే నంబర్ల వారీగా గుర్తించారు. సింగ్‌నగర్, ఆర్‌ఆర్‌పేట నుంచి ఎనికేపాడు టన్నెల్ వరకు 80 ఎకరాల్లో బుడమేరు వాగు వెంబడి 3,100 భవనాలను అక్రమంగా నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. బుడమేరు ప్రక్షాళనపై ప్రభుత్వం ఊదరగొట్టింది. కేవలం సర్వేకు పరిమితమై ఆధునికీకరణను నిర్లక్ష్యం చేసింది. అభివృద్ధిపై తీవ్ర ప్రభావం బుడమేరు ఆధునికీకరణ పనులకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలిచి పనులు వేసవి కాలం చేపట్టి, వర్షాకాలం నాటికి పూర్తి చేయకపోతే మరోసారి బెజవాడ ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. శాశ్వత మరమ్మతులు చేయకపోతే, వరద ముంపు భయంతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి, శాంతినగర్, జి.కొండూరు మండలంలో కవులూరు, వెలగలేరు, కందులపాడు, వెల్లటూరు, గుంటుముక్కల, చిన్న నందిగామ, హెచ్ ముత్యాలంపాడు, విజయవాడ రూరల్ మండలంలో పైడూరుపాడు, కొత్తూరు, తాడేపల్లి, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి, నున్నతో పాటు, విజయవాడలో అజిత్‌సింగ్‌నగర్ నుంచి ఎనికేపాడు వరకు బుడమేరు వరద భయం ఉంది. ముంపు భయం వీడకపోతే బెజవాడ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ భూముల ధరలు తగ్గిపోయాయి. రెండు గేట్ల నుంచి లీకేజీ.. బుడమేరుపై వెలగలేరు వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్ 1956లో నిర్మించారు. సరైన నిర్వహణ లేక గేట్లు ఎత్తినప్పుడు, దింపినప్పుడు రాడ్లు బెండు రావడంతో గేట్లు మొరాయిస్తున్నాయి. ఇక్కడ11 గేట్లకు రెండు పూర్తిగా కిందకు దిగడంలేదు. అయితే ఈ ఏడాది ఆగస్టు 31న బుడమేరుకు వచ్చిన వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసే సమయంలో ఈ రెండు గేట్లు మొరాయించడంతో అధికారులు మాన్యువల్‌గానే ఎత్తారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత గేట్లను దించినప్పుడు ఈ రెండు గేట్లు పూర్తిగా కిందకు దిగలేదు. పట్టిసీమ నుంచి పోలవరం కుడికాల్వకు విడుదల చేసిన నీరు ఈ రెగ్యులేటర్‌ను ఆనుకొని బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలవాల్సి ఉంది. అయితే ఈ నెల 15వ తేదీ ఉదయానికి పట్టిసీమ నీటి ప్రవాహం పెరగడంతో హెడ్‌రెగ్యులేటర్ వద్ద నీటి మట్టం 4.5 అడుగులకు చేరింది. ఈ రెండు గేట్లు పూర్తిగా కిందకి దిగకపోవడంతో వీటి నుంచి నీరు ఒకరోజంతా దిగువ బుడమేరు కాల్వకు వెళ్లింది. గేట్ల మరమ్మతుల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉండటంతో పట్టిసీమ నీరు వృథాగా పోతోంది. బుడమేరును ప్రక్షాళన చేసి ఆధునీకరించి, బెజవాడకు వరద ముప్పు లేకుండా చేస్తాం: వరదల వేళ సీఎం చంద్రబాబుబుడమేరు ఆధునికీకరణేదీ? ముంపు లేకుండా చేస్తామన్నారు.. సీఎం సారూ.. మాటిచ్చి రెండున్నర నెలలు దాటుతోంది శాశ్వత మరమ్మతుల ఊసెత్తని సర్కార్ బడ్జెట్లో నిధులు సున్నా! హెడ్ రెగ్యులేటరీ లీకేజీతో దిగువకు నీరు విజయవాడకు తొలగని ముప్పు -
డ్రోన్ ఆపరేటింగ్పై శిక్షణ
విజయవాడస్పోర్ట్స్: జిల్లాలోని 35 మంది గ్రామ/వార్డు సచివాలయాల మహిళా పోలీసులకు డ్రోన్ ఆపరేటింగ్ శిక్షణ చురుగ్గా కొనసాగుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కమిషనర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నేరాలను అరికడుతున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. అందులోభాగంగానే రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా పోలీసులకు డ్రోన్ ఆపరేటింగ్పై శిక్షణ ఇస్తున్నామన్నారు. డ్రోన్ ఆపరేటింగ్‌తో కలిగే ప్రయోజనాలను మహిళా పోలీసులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ హనీష్ పాల్గొన్నారు. 18 మిస్సింగ్ కేసులు ఛేదించాం.. గడిచిన వారం రోజుల వ్యవధిలో తప్పిపోయిన 18మంది మహిళల, బాలికలను గుర్తించి తిరిగి వారి కుటుంబసభ్యులకు అప్పగించామని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న మహిళల, బాలికల మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు డీసీపీ గౌతమి షాలి నేతృత్వంలో సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ యు.హైమావతి, మరి కొంత మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించినట్లు వివరించారు. ఈ బృందాలు చురుగ్గా వ్యవహరిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో మిస్సింగ్ కేసులను ఛేదిస్తున్నాయని వెల్లడించారు. మిగిలిన కేసులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పోలీసు కమిషనర్ వివరించారు. -
రూ.1,300 కోట్ల టర్నోవరే లక్ష్యం
విజయ డెయిరీ చైర్మన్ చలసాని చిట్టినగర్(విజయవాడపశ్చిమ): 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1300 కోట్ల టర్నోవర్ సాఽధించడమే లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) కృషి చేస్తోందని ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. సమావేశం సోమవారం పాలప్రాజెక్టు ఆవరణలోని పరిపాలనా భవనంలో సోమవారం నిర్వహించిన విజయ డెయిరీ బోర్డు డైరెక్టర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రైతులకు బోనస్, పాల సేకరణ ధర పెంపు, రానున్న ఆర్థిక సంవత్సరం లక్ష్యాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ చలసాని మాట్లాడుతూ పాడి రైతులకు మేలు కలిగించేలా పాల సేకరణ ధరను 10 శాతం వెన్న ఉన్న పాలకు లీటర్‌కు రూ.20 పెంచినట్లు తెలిపారు. ఆవు పాలకు లీటర్‌కు రూ.10 పెంచుతున్నామన్నారు. ఇటీవల వరదల నేపధ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాడి రైతుల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు పాడిరైతులకు రెండో విడత బోనస్ రూ.12 కోట్లను డిసెంబర్ నెలాఖరు నాటికి అందించేలా బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, బోర్డు డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బీఎల్ఓలకు వేతనాలు ఇప్పించరూ..
గుడ్లవల్లేరు: పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు)కు మూడేళ్లగా వేతనాలు అందడం లేదు. ఒక్కో బీఎల్ఓకు ఏటా రూ.6వేల చొప్పున మూడేళ్లుగా రాష్ట్రంలోని 46,389 మంది బీఎల్వోలకు కలిపి రూ.83.50కోట్లు అందాల్సి ఉంది. అదేవిధంగా ఈ ఏడాది మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండురోజులపాటు విధులకు హాజరైనందుకుగాను గౌరవ వేతనం కింద ఒక్కో బీఎల్ఓకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సిన మొత్తం రూ.6.96 కోట్ల బకాయిలు విడుదల కాలేదు. బకాయిల కోసం బీఎల్ఓలు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. సెలవు రోజుల్లో సైతం విధులు.. సెలవు రోజులు, ఆదివారాల్లో సైతం బీఎల్ఓలు తమ విధులు నిర్వరిస్తున్నారు. ఏటా ఓటరు లిస్టుల సవరణ నిమిత్తం బీఎల్ఓలు కాలికి బలపాలు కట్టుకుని ప్రతిఇంటికి తిరిగి ఓటు నమోదు చేస్తున్నారు. బీఎల్వోలకు ఎన్నికల కమిషన్ జీఓఆర్టీ నెంబర్ 3191, 23–10–2015ప్రకారం ఏటా రూ.6వేలు వేతనం చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో ఎన్నికలను ఎంతో విజయవంతంగా నిర్వహించామని చెబుతున్న రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ తమ కిందస్థాయిలో ఓటరు జాబితాల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్లకు వేతనాలు చెల్లించే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇకనైనా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ స్పందించి తమకు వేతన బకాయిలు చెల్లించాలని బీఎల్ఓలు కోరుతున్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఉంగుటూరు: స్నేహితుడి అంత్యక్రియలకు వచ్చి ఏలూరు కాలువలో గల్లంతైన దేవేంద్ర వెంకట సత్యనారాయణ మృతదేహం సోమవారం లభించింది. పోలీసుల కథనం మేరకు..తుట్టగుంటకు చెందిన గోళ్ల దేవేంద్ర వెంకట సత్యనారాయణ(35) శనివారం పొట్టిపాడులోని స్నేహితుడి అంత్యక్రియలకు వచ్చి ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలో పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు దేవేంద్ర మృతదేహం లభించింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అతని బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
రియల్ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
కంచికచర్ల: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంచికచర్లలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ బోనగిరి రాజు కథనం మేరకు విజయవాడకు చెందిన కారంపూడి రవీంద్ర(50) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అప్పులు ఎక్కువగా ఉండటంతో విజయవాడ నుంచి మిక్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఓ వెంచర్‌కు వచ్చి అక్కడ గడ్డిమందు తాగాడు. అనంతరం స్నేహితుడికి ఫోన్‌చేసి గడ్డిమందు తాగిన విషయం చెప్పడంతో అతను హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని చూడగా అప్పటికే రవీంద్ర నేలపై కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో అతన్ని చికిత్స కోసం ప్రైవేట్వాహనంలో విజయవాడ తరలిస్తుండగా, మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. వీరంతా అమెరికాలో ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం
ఆటోనగర్ (విజయవాడతూర్పు): ప్రకాశంజిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ఆటోనగర్ ఆర్టీసీ డ్రైవర్ పి.తిరుమలరావు(49) మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడిని తప్పించే క్రమంలో బస్సు, టిప్పర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో డ్రైవర్ తిరుమలరావు బస్సు ముందుభాగంలో ఇరుక్కుపోయి, అక్కడికక్కడే మృతిచెందినట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించినట్టు డిపో మేనేజర్ వివరించారు. -
నాలుగు కేజీల గంజాయి స్వాధీనం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): న్యూరాజరాజేశ్వరీపేటలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు..న్యూఆర్‌ఆర్‌పేట కేజీఎఫ్ అపార్ట్మెంట్ల ప్రాంతంలో గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం అందడంతో సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న తమ్మిన నాగదుర్గారావు, కట్టా విజయేంద్రరాజు అలియాస్ పిత్తాతోపాటు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టులో పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఇద్దరు మైనర్ల జువైనల్ హోమ్‌కు తరలించారు. నలుగురి అరెస్ట్ నిందితుల్లో ఇద్దరు మైనర్లు -
పాలిటెక్నిక్ విద్యార్థుల అపూర్వ కలయిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1971–74 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆదివారం నగరంలోని ఐలాపురం హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఆ బ్యాచ్‌కు చెందిన నీలకంఠేశ్వరరావు, పిట్టల సత్యనారాయణ, సత్యనారాయణ, ఎన్ఎస్సీ బోసు కొల్లి శివప్రసాద్‌ల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. వేడుకల్లో ఆ బ్యాచ్‌కు చెందిన ఇంజినీర్లు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా సావనీర్ విడుదల చేశారు. కళాశాల రోజుల్లో వారిలో ఉన్న కళను నేడు వేదికపై ప్రదర్శించారు. ఆరుపదుల వయసు పైబడినా నవ యువకుల్లా స్టెప్పులు వేశారు. సరదాగా గడిపారు. కొందరు రిటైర్డ్ ఇంజినీర్లు తమ మనువళ్లు, మనవరాళ్లతో సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. వేడుకల్లో పాలిటెక్నిక్ కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ మోటూరి విజయసారథితోపాటు ఆనాటి ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడండి అని ముద్రించిన జ్యూట్ బ్యాగుల్లో జ్ఞాపికలు అందజేశారు. -
ఉచిత ఇసుక విధానంతో నష్టపోతున్నాం
ఉయ్యూరు(పెనమలూరు): లోపభూయిష్ట ఉచిత ఇసుక విధానంతో నష్టపోతున్నామని టిప్పర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రావూరి వీరాస్వామి రాజా పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం టిప్పర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కమిటీ గౌరవ అధ్యక్షుడు రావూరి మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా టిప్పర్ల యజమానులకు కష్టాలు తప్ప లాభం లేదన్నారు. ఉచిత ఇసుక సక్రమంగా అమలుచేయకపోవటంతో టిప్పర్ల యజమానులు, వినియోగదారులకూ నష్టం జరుగుతోందన్నారు. లారీ ఇసుక ధర రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలుకుతోందన్నారు. ఉచిత ఇసుక విధానంతో రూ.12 వేలకు అందాల్సిన టిప్పరు ఇసుక ధర పెరగటానికి గల కారణాలు ఏంటన్నది ఆలోచించాలన్నారు. ప్రైవేటు ఏజెన్సీలు, క్వారీ నిర్వాహకుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. క్వారీల నుంచి ఇసుక తీసుకువెళ్తున్నా రవాణా శాఖ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు కేసులు రాసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానం ఉన్నప్పుడు పర్మిట్లు, మైనింగ్ బిల్లులు ఎక్కడ ఉంటాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌లను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామనుకున్నా అవకాశం కల్పించలేదన్నారు. ప్రభుత్వం ‘ఇసుక’పై ప్రజలకు మేలు జరిగే విధానాన్ని తీసుకురావాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇ.నరేంద్ర, ఉపాధ్యక్షులు మురళీమోహన్రావు తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ -
శభాష్.. మిస్టర్ రాకేష్
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కొందరు బంధువులు, ఆత్మీయుల అవహేళనలే అవకాశంగా మలుచుకుని.. కండలు పెంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు నగరానికి చెందిన 32 ఏళ్ల బోళ్ల తిరువెంగళరాకేష్. మొక్కవోని దీక్షతో.. బాడీబిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఆంధ్రా.. మిస్టర్ ఇండియా టైటిల్స్‌ను సాధించి యోధుడిగా మారాడు. ఓ వైపు సింగ్‌నగర్‌లో జిమ్ కోచ్‌గా.. మరోవైపు బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యే విద్యార్థిలా నిత్యం సన్నద్ధమవుతూ.. అందరితో శభాష్.. రాకేష్ అనిపించుకుంటున్నాడు. సాధారణ కుటుంబంలో జన్మించి.. వన్‌టౌన్ కేఎల్‌రావు నగర్లో రాకేష్, అతని తల్లి దండ్రులు బోళ్ల రామారావు, ఇందుమతి, అతని సోదరి నివసిస్తున్నారు. అతని తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో గుమాస్తా. అతనికి కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటమే కాకుండా రాకేష్ కూడా సన్నగా ఉండేవాడు. అతన్ని అందరూ ఆట పట్టిస్తుండటంతో బాడీ పెంచాలని నిర్ణయించుకున్నాడు. వన్‌టౌన్‌లోని జిమ్‌లలో చేరి శరీర ఆకృతిని పెంచుకునేందుకు శిక్షణ తీసుకునేవాడు. ఒక పూట చదువు.. మరో పూట శిక్షణ.. రాకేష్ పదో తరగతి వరకూ గణేష్ ట్యుటోరియల్స్‌లో, ఇంటర్మీడియట్ శాతవాహన కళాశాలలో, డిగ్రీ శారద కళాశాలలో పూర్తిచేశాడు. తన కుటుంబానికి భారంగా మారకూడదని రాకేష్ ఓ పూట చదువుకుంటూ మరో పూట జిమ్‌లో శిక్షణ ఇస్తూ డబ్బులు సంపాదిస్తూ.. స్వయంకృషితో ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో సింగ్‌నగర్ నందమూరి నగర్లో 2018లో జిమ్‌ను స్థాపించి నిత్యం దానిలోనే కసరత్తులు చేస్తూ.. వందలాది మంది యువకులకు తక్కువ ఫీజులతో శిక్షణ ఇస్తున్నాడు. ఉపాధి అవకాశాన్ని అందించిన జిమ్‌నే దేవాలయంగా భావించి జీవితంలో మరోమెట్టు పైకి ఎక్కేందుకు పరుగులు తీస్తున్నాడు. బాడీ బిల్డింగ్ పోటీల్లో రాణిస్తున్న 32 ఏళ్ల యువకుడు 9 సార్లు ‘మిస్టర్ ఆంధ్రా’.. ఈ ఏడాది ‘మిస్టర్ ఇండియా’గా విజయం ‘మిస్టర్ ఆసియా’ టైటిల్ నా కల అందరూ సన్నాగా ఉన్నానని ఎగతాళి చేయడంతో జిమ్‌లో చేరాను. ఆ తర్వాత జిమ్ నాకు దేవాలయంగా మారిపోయింది. మిస్టర్ ఆంధ్రా, మిస్టర్ ఇండియా టైటిల్స్‌ను గెలవడం చాలా సంతోషంగా ఉంది. ‘మిస్టర్ ఆసియా’పోటీల్లో గెలుపొంది.. ఆ టైటిల్‌ను సాధించాలనేదే నా లక్ష్యం. ప్రస్తుతం దాని కోసం కసరత్తులు చేస్తున్నాను. కచ్చితంగా ఆ టైటిల్‌ను సాధించి నగరానికి మంచి పేరు తీసుకువస్తాను. –బోళ్ల తిరువెంగళ రాకేష్ -
లీజెస్ విభాగంలో లొసుగులు!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన టెండర్ల విభాగంలో లొసుగులు బయట పడుతున్నాయి. దేవస్థానంలోని కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నాయి. టెండర్ల గడువు ముగిసినా దుకాణాలను స్వాధీనం చేసుకోవడంలో అధికారులు అలసత్వం చూపుతుండటంతో దేవస్థానం లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్న వ్యవహారం ఆదివారం వెలుగులోకి వచ్చింది. దుర్గగుడి ఈవో కె.ఎస్.రామరావు రెండు రోజులుగా లీజెస్ సెక్షన్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవస్థానానికి చెందిన కనకదుర్గనగర్‌లోని స్థలంలో మొబైల్ క్యాంటిన్ నిర్వహించడనాఇకి విశాఖపట్నంకు చెందిన కాంట్రాక్టర్‌కు టెండర్ కేటాయించారు. గడువు విషయంలో చోటు చేసుకున్న అలసత్వం ఇప్పుడు దేవస్థానానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టడమే కాకుండా కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేయకుండా మీనమేషాలు లెక్కించడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొంత మంది ఏఈవోలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. కనకదుర్గనగర్‌లోని మొబైల్ క్యాంటిన్ టెండర్ గడువు ముగిసినా ఆయా సెక్షన్ అధికారులు సదరు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఈ వ్యవహారంలో దేవస్థాన అధికారుల తప్పులు వెలుగులోకి రాకుండా ఉండేందుకు వేలం ప్రక్రియను రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచినట్లు రికార్డులు తయారు చేశారు. ప్రతి టెండర్ కేటాయింపునకు ముందుగానే డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా, దేవస్థాన అధికారులు ఆ నిబంధనను తుంగలోకి తొక్కారు. దేవస్థానానికి రావాల్సిన సుమారు రూ. 15 లక్షల మేర వసూలు చేయడంలోనూ ఆలయ అధికారులు అలసత్వం చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తుండగా, సదరు వ్యవహారంపై కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు ఆలయ అధికారులు విషయాన్ని కోర్టు ద్వారా తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో సమీక్షతో బట్టబయలు డబ్బులు వసూలు చేయడంలో అలసత్వం -
24న యూటీఎఫ్ జిల్లా మహా సభలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. శ్రీనివాసరావు, ఎ. సుందరయ్య తెలిపారు. ఆ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో జరిగిన కార్తిక వనసమారాధన కార్యక్రమంలో మహాసభల పోస్టర్‌ను రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా ఏర్పడ్డాక జరిగే తొలి జిల్లా మహాసభలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పలు తీర్మానాలు ప్రవేశ పెట్టి చర్చిస్తామని తెలిపారు. -
బాలల వికాసానికి ప్రత్యేక చర్యలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బాలల వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. రెండు రోజులుగా సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతున్న 7వ అమరావతి బాలోత్సవం (పిల్లల పండుగ) ముగింపు సభ ఆదివారం సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించడానికి ఏటా బాలోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 78 లక్షల మంది, ప్రైవేట్ స్కూళ్లలో 37 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారందరికి వికాసం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మండలిని ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగూడెం బాలోత్సవం వ్యవస్థాపకుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ బాల్యంలోనే ఆనందం, సృజనాత్మకత ఉంటాయన్నారు. కాకినాడ క్రియ పిల్లల పండుగ సంస్థ ప్రతినిధి ఎస్ఎస్ఆర్ జగన్నాఽథరావు మాట్లాడుతూ పిల్లలకు ఆట పాటలు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు లేకుండా చదువులో పరి పూర్ణత రాదన్నారు. బాలోత్సవం అధ్యక్షుడు రామరాజు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, కార్యదర్శి పి.మురళీకృష్ణ, కెనరా బ్యాంకు డీజీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముగిసిన అమరావతి బాలోత్సవం -
‘గోపాత్రుడు’ సామాజిక అంశాల సమాహారం
విజయవాడ కల్చరల్: గోపాత్రుడు నవల సమాజిక అంశాల సమాహారమని చినుకు మాసపత్రిక సంపాదకుడు నండూరి రాజగోపాల్ అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యాన గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గవర్నర్‌పేటలోని సొసైటీ కార్యాలయంలో సీనియర్ సంపాదకుడు కేఎస్‌వై పతంజలి రచించిన గోపాత్రుడు నవల అంశంగా కార్యక్రమం జరిగింది. రాజగోపాల్ మాట్లాడుతూ సమాజంలో నాటి కులవ్యవస్థ, మనుషుల మధ్య ఐక్యత లేకపోవడం, బలవంతులు బలహీనులను దోచుకోవడం అంశంగా నవల సాగుతుందన్నారు. గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ ‘సాక్షి’లో తన సంపాదకీయాల ద్వారా సంచలనాలకు వేదికగా నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశేశ్వశ్వరరావు, ప్రజాశక్తి బుక్ హౌస్ బాధ్యుడు లక్ష్మయ్య పాల్గొన్నారు.