గాల్లో విమానం.. ఇంధనం ఖాళీ!
మీరు లాంగ్ డ్రైవ్కు వెళ్లేటప్పుడు దారిలో పెట్రోలు అయిపోతే ఏం చేస్తారు? కారు పక్కకు ఆపి, ఎలాగోలా పెట్రోలు తెచ్చుకుని ముందుకెళ్తారు. అది రోడ్డు మీద కాబట్టి పర్వాలేదు. అదే విమానంలో అలాంటి అనుభవం ఎదురైతే మీకు ఎలా ఉంటుంది? గుండె ఝల్లుమంటుంది కదూ. దోహా నుంచి కొచ్చిన్ వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇలాగే అయ్యింది. ఉన్నట్టుండి విమానంలో ఇంధనం అయిపోయింది. దాంతో విమానాన్ని అత్యవససరంగా తిరువనంతపురంలో దించేయాల్సి వచ్చింది. అక్కడ దిగేసరికి విమానంలోని ఇంధన ట్యాంకు దాదాపు ఖాళీ అయిపోయింది. అయితే, ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది. కొచ్చిన్లో వాతావరణం బాగోకపోవడంతో రన్వే ఎక్కడుందో సరిగ్గా తెలియక.. బెంగళూరు, కొచ్చిన్ విమానాశ్రయాల మధ్య ఆరుసార్లు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
ఆ విమానంలో 152 మంది ప్రయాణికులు ఈ పరిస్థితి చూసి గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అప్పటికే ఇంధనం దాదాపు అయిపోవస్తుండగా, ఇలా చక్కర్లు కొట్టడంతో పూర్తిగా ఖాళీ అయిపోయింది. విమానంలో తప్పనిసరిగా ఉండాల్సిన 3500 కిలోల ఇంధనం కూడా లేదు. దాంతో విసుగెత్తిన పైలట్ తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లిపోయి, అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
మరికొద్ది నిమిషాలు గనక ల్యాండింగ్ ఆలస్యం అయి ఉంటే.. ఆకాశం నుంచి రాయి పడినట్లుగా విమానం కింద పడిపోయి ఉండేది! అసలు విమానం బయల్దేరే ముందే దాంట్లో సరిపడ ఇంధనం ఉందో లేదో సరిచూసుకోకుండా వెళ్లినందుకు పైలట్లను డీజీసీఏ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.