కష్టానికి తగ్గ ఫలితం | Announcement of incentives for Singareni workers | Sakshi
Sakshi News home page

కష్టానికి తగ్గ ఫలితం

Published Sun, Feb 9 2025 3:35 AM | Last Updated on Sun, Feb 9 2025 3:35 AM

Announcement of incentives for Singareni workers

సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాల ప్రకటన 

రెండు నెలల్లో 18.27 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం 

కార్మికులు లక్ష్యాన్ని చేరుకుంటే నగదు ప్రోత్సాహకం 

1, 2 కేటగిరీలుగా భూగర్భ గనులు, ఓసీలు, సీహెచ్‌పీలు

సింగరేణి (కొత్తగూడెం): వార్షిక  ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు సింగరేణి కార్మికులకు ఆ సంస్థ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సుమారు రెండు నెలల సమయం ఉంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, గత పది నెలల్లో 53.73 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. 

మిగిలిన 18.27 మిలియన్‌ టన్నులను మార్చి 31లోగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 18 ఓపెన్‌ కాస్ట్‌ గనులు, 24 భూగర్భ గనులతో పాటు సీహెచ్‌పీ (కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌)లను కేటగిరీ 1, 2గా విభజించారు. ఆయా పని ప్రాంతాల్లో రానున్న రెండు నెలల్లో సెలవులు తీసుకోకుండా నెలకు 20 మస్టర్లు చేసే కార్మికులకు ప్రోత్సాహకాలు ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. 

ప్రోత్సాహకాలు ఇలా... 
» భూగర్భ గనుల్లో నెలకు 20 వేల టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసే గనులను కేటగిరి – 1గా పరిగణిస్తారు. వీటిలో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి జరిగితే, అక్కడ పనిచేసే కార్మికులకు రెండు నెలల్లో రూ.1,500 ప్రోత్సాహకంగా ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.2 వేలు, 110 శాతం కంటే అధికంగా ఉత్పత్తి చేసిన వారికి రూ.2,500 చెల్లిస్తారు. 
» భూగర్భ గనుల్లో 20 వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే గనులను కేటగిరీ–2గా పరిగణిస్తారు. వీటిలో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,200 ప్రోత్సాహం ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,700.. 110 కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే రూ.2,200 చొప్పున సంస్థ చెల్లించనుంది. 
» రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్‌ కాస్ట్‌ గనులను కేటగిరీ–1గా పరిగణిస్తారు. వీరు 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,500 ప్రోత్సాహం ఇస్తారు. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.2 వేలు, 110 శాతం కంటే అధికంగా చేసిన వారికి రూ.2,500 ప్రోత్సాహకంగా చెల్లిస్తారు. 
»కేటగిరీ–2లో రోజుకు 30 వేల టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే ఓసీలు ఉన్నాయి. వీటిల్లో 100 నుంచి 104 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,200.. 105 నుంచి 109 శాతం ఉత్పత్తి చేస్తే రూ.1,700, 110 శాతం కంటే అధికంగా ఉత్పత్తి చేస్తే రూ.2,200 చెల్లించనున్నారు.  
»రోజుకు 8 రేక్‌లు (32 వేల టన్నులు) రవాణా చేసే సీహెచ్‌పీలను కేటగిరీ–1గా, అంతకంటే తక్కువ రవాణా చేసేవాటిని కేటగిరీ–2గా పరిగణిస్తారు. ఈ రెండు కేటగిరీల్లోని ఉద్యోగులకు రవాణాకు అనుగుణంగా ప్రోత్సాహక నగదు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.

రక్షణ, హాజరుతో లక్ష్యసాధన 
సింగరేణి యాజమాన్యం రెండు నెలల కోసం కేటగిరీ – 1, 2లను ప్రకటించింది. ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులు(సర్పేస్, అండర్‌ గ్రౌండ్‌) లక్ష్యాల సాధనకు కృషి చేయాలి. ఇదే సమయాన రక్షణ సూత్రాలు పాటిస్తూ హాజరు శాతం తగ్గకుండా పనిచేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు.  – శాలేం రాజు, కొత్తగూడెం ఏరియా జీఎం  

అందరికీ పని కల్పిస్తే ఫలితం 
భూగర్భగనుల్లో చాలా మంది ఉద్యోగులకు మైనింగ్‌ అధికారులు పని ప్రదేశాలను చూపెట్టడం లేదు. దీంతో ఖాళీగా ఉండి వెనుదిరుగుతున్నారు. అలాగే, మైన్స్‌ కమిటీ అలంకారప్రాయంగా మారింది. కొందరు గనుల మేనేజర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే వాట్సాప్‌ నివేదికలు ఇస్తారు. ఇలాంటివి సరిచేస్తే లక్ష్యాలను సాధించవచ్చు. – రియాజ్‌ అహ్మద్,  హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి

సమస్యల పరిష్కారానికి సమరం
» సింగరేణి అధికారుల కార్యాచరణ  
»  వెంటనే డైరెక్టర్ల నియామకానికి డిమాండ్‌
గోదావరిఖని: తమ సమస్యలను పరిష్కరించడంతోపాటు.. అనిశ్చితికి కారణమైన డైరెక్టర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌తో సింగరేణి అధికారులు సమరానికి సిద్ధమయ్యా­రు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సీఎంవోఏఐ కార్యాలయంలో సమావేశమైన అధికారుల సంఘం నేతలు.. భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చే­శా­రు.

మొత్తం 11 ఏరియాలకు చెందిన సుమా­రు 2,500 మంది అధికారులు ఇందులో భాగస్వాములవుతున్నారు. తొలుత ఏరియా జీఎంలకు వినతిపత్రాలు అందజేసి, రోజూ సాయంత్రం జీఎం కార్యాలయాల ఎదుట సమావేశమై ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించా­రు. ఈమేరకు శనివారం జీఎంలకు వినతిపత్రా­లు అందజేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఫెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే(పీఆర్‌పీ) చెల్లించా­లని కోరుతున్నారు.  

ప్రధాన డిమాండ్లు ఇవే..  
»  గతేడాది రావలసిన పీఆర్పీ (పెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే) చెల్లించాలి 
»   కీలకమైన డైరెక్టర్‌ ప్రాజెక్టు అండ్‌ ప్లానింగ్, డైరెక్టర్‌ ఆపరేషన్‌ పోస్టులు భర్తీ చేయాలి 
»    ఏడేళ్ల పీఆర్‌పీతోపాటు 2007 – 2014 వరకు బకాయిలు చెల్లించాలి 
»  పదోన్నతుల విధానాన్ని సరిచేయాలి 
»   ఎస్‌సీడబ్ల్యూఏ నుంచి అధికారిగా పదోన్నతి పొందిన వారికి ఈ–2 నుంచి ఏడాదికే ఈ–3 ఇవ్వాలి 
»   ఎన్‌సీడబ్ల్యూఏ నుంచి ఈ–1కు వచ్చే జేఎంవో, జేటీవో అధికారులకు ఈ–5 వరకు పదోన్నతి విధానాన్ని వర్తింపజేయాలి 
»  ఈ–6 గ్రేడ్‌ ఏడేళ్లు దాటిన వారికి డీజీఎంగా పదోన్నతి కలి్పంచాలి 
»  డీపీసీ (డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) ఏడాదిలో రెండు ఏర్పాటు చేయాలి 
»  ఎఫ్‌ఎంఎంసీ (ఫస్ట్‌క్లాస్‌ మైన్‌ మేనేజ్‌మెంట్‌) సరి్టఫికెట్‌ ఉండి 12 ఏళ్ల సరీ్వసు నిండిన వారికి ఎస్‌వోఎం హోదా ఇవ్వాలి 
» కన్వేయన్స్, హెచ్‌వోడీ వాహనాలకు, ఆఫీస్‌ కార్యాలయాలకు ఏసీ సౌకర్యం కలి్పంచాలి 
» సత్తుపల్లి ఏరియాలో మాదిరిగా మూడు బెడ్‌రూంలతో కూడిన నూతన క్వార్టర్లు నిర్మించాలి 
» ఉద్యోగ విరమణ చేసేవారికి చెల్లింపుల్లో ఆటంకం లేకుండా సీడీఏ నిబంధనలు మార్చాలి 
»  కాలపరిమితితో విచారణలు పూర్తిచేయాలి 
» కోల్‌ ఇండియాలో మాదిరిగా టీఏ, డీఏ నిబంధనలు అమలు చేయాలి 
»  రిటైర్డ్‌ అధికారులకు మెడికల్‌ బిల్లు పరిమితి పెంచాలి 
» కోల్‌ ఇండియా మాదిరిగా హోదా ఇవ్వాలి 
» ఖాళీలను పూరించాలి, పదోన్నతులు కల్పించాలి

ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం   
పదోన్నతులు, పీఆర్‌పీ చెల్లింపులో అధికారులకు అన్యాయం జరిగింది. మా సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణకు సిద్ధమయ్యాం. సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – పొనుగోటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు, సీఎంవోఏఐ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement