లైఫ్‌కి బీమా తప్పనిసరి | Sakshi Interview With Shriram Life Insurance MD and CEO Casparus Kromhout | Sakshi
Sakshi News home page

లైఫ్‌కి బీమా తప్పనిసరి

Published Thu, Dec 12 2024 5:11 AM | Last Updated on Thu, Dec 12 2024 8:08 AM

Sakshi Interview With Shriram Life Insurance MD and CEO Casparus Kromhout

బీమాపై మైండ్‌సెట్‌ మారాల్సిన అవసరముంది

దాన్నో ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడటం వల్లే ‘మిస్‌ సెల్లింగ్‌’

ఉన్నత స్థాయి వర్గాలే ‘ప్యూర్‌ టర్మ్‌’ తీసుకుంటున్నారు

ఎంతోకొంత రక్షణ ఉండేలా చిన్న పాలసీలను విక్రయిస్తున్నాం

అందుకే పాలసీదారుల సంఖ్యలో 7వ స్థానానికి చేరాం

క్లెయిమ్‌ డాక్యుమెంట్లన్నీ ఇస్తే 24 గంటల్లోనే పరిష్కరిస్తున్నాం

‘సాక్షి’తో శ్రీరామ్‌ లైఫ్‌ ఎండీ, సీఈఓ కాస్పరస్‌   

జీవిత బీమా అవసరంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నామని, తక్కువ ప్రీమియంతోనైనా ప్రతి కుటుంబం ఎంతో కొంత బీమాను కలిగి ఉండాలన్నదే తమ ఉద్దేశమని శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఈఓ, ఎండీ కాస్పరస్‌ జేహెచ్‌ క్రామ్‌హూట్‌ చెప్పారు. ఈ వైఖరి వల్లే వ్యాపార పరిమాణం పరంగా తాము దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ పాలసీదారుల సంఖ్యను బట్టి చూస్తే 7వ స్థానంలో ఉన్నామని స్పష్టంచేశారు.

పాలసీదారుల అవసరాలు తెలుసుకోవటానికి,  క్లెయిమ్‌ల పరిష్కారానికి టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటున్నామని, అందుకే తమ సంస్థ లాభదాయకతలోనూ ముందుందని వివరించారు. మంగళవారం ‘సాక్షి’ బిజినెస్‌ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...(సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి) 

కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి బీమా ఇచ్చి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించటమే జీవిత బీమా లక్ష్యం. కానీ కంపెనీలు టర్మ్‌ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యమివ్వటం లేదు. మరి ఆశించిన లక్ష్యం నెరవేరుతోందా? 
నిజమే! దేశంలో 4 శాతం మందికే జీవిత బీమా కవరేజీ ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను చాలామంది అవసరం లేనిదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. తెలంగాణలో లీడ్‌ ఇన్సూరర్‌గా ఉన్నాం కనక మేం రకరకాల అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్‌ పెట్టాం. అందుకే 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బీమా పరిశ్రమ 24 శాతం పెరిగితే మేం 57 శాతం వృద్ధి సాధించాం. మా వ్యాపారంలో గ్రామీణుల వాటా 40 శాతానికిపైగా ఉండటమే మా నిబద్ధతకు నిదర్శనం. 

బీమా కంపెనీలు ‘టర్మ్‌’పై కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపడిన ఎండోమెంట్, యులిప్‌ పాలసీలపై ఫోకస్‌ పెడుతున్నాయెందుకు? 30 ఏళ్ల వ్యక్తికీ 10 ఏళ్ల కాలపరిమితితో జీవితబీమా పాలసీ అమ్మటం మోసం కాదా? 
నిజమే! ఇలాంటి మిస్‌ సెల్లింగ్‌ జరగకూడదు. కాకపోతే తక్కువ ప్రీమియమే అయినా కొన్నేళ్ల పాటు కట్టి... చివరకు పాలసీ గడువు ముగిశాక ఏమీ తిరిగి రాని టర్మ్‌ పాలసీలపై కస్టమర్లు ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లను ఆకర్షించటానికే కంపెనీలు ఇన్వెస్ట్‌మెంట్లు, రాబడులతో ముడిపడ్డ ఎండోమెంట్‌ పాలసీలను తెచ్చాయి. లాభదాయకత కూడా ముఖ్యమే కనక ఈ పాలసీలను విక్రయిస్తున్నాయి.  

మరి 30 ఏళ్ల వ్యక్తికి 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న జీవిత బీమా పాలసీ విక్రయిస్తే... గడువు తీరాక తనకు కవరేజీ ఉండదు కదా? లేటు వయసులో కవరేజీ కావాలంటే 
భారీ ప్రీమియం చెల్లించాలి కదా? 
నిజమే. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారే ప్యూర్‌ టర్మ్‌ పాలసీలు తీసుకుంటున్నారు. ఇది అట్టడుగు స్థాయికి వెళ్లటం లేదు. మున్ముందు ఈ పరిస్థితి మారుతుందన్న విశ్వాసం నాకుంది.

మీరూ ఇదే దార్లో వెళుతున్నారా... లేక? 
అలాంటిదేమీ లేదు. మేం ప్రధానంగా ఏడాదికి 4–15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారిని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారికి ఎంతోకొంత కవరేజీ ఉండేలా పాలసీలను తెచ్చాం. కంపెనీ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో 98 శాతానికిపైనే ఉంది. పైపెచ్చు ఎక్కువ శాతం చిన్న పాలసీలే కనక... సెటిల్‌మెంట్‌కు డాక్యుమెంట్లన్నీ అందజేస్తే 24 నుంచి 48 గంటల్లో పరిష్కరిస్తున్నాం. దీనికి టెక్నాలజీని వాడుతున్నాం.  

మీ వ్యాపారంలో ఆన్‌లైన్‌ శాతమెంత?  
మాకు దేశవ్యాప్తంగా విస్తరించిన శ్రీరామ్‌ గ్రూప్‌ కంపెనీల ఔట్‌లెట్ల నుంచే 40 శాతం వరకూ వ్యాపారం వస్తోంది. ఏజెన్సీల నుంచి మరో 40 శాతం వస్తోంది. మిగిలినది ఆన్‌లైన్, పాత కస్టమర్ల రిఫరెన్సులు సహా ఇతర చానళ్ల ద్వారా వస్తోంది. ఆన్‌లైన్లో ఎంక్వయిరీలొచ్చినా అవి వాస్తవరూపం దాల్చటం తక్కువ. ఆన్‌లైన్‌ ప్రచారానికి ఖర్చు కూడా ఎక్కువే. మాకు అంతర్జాతీయ బీమా దిగ్గజం ‘సన్‌ లామ్‌’తో భాగస్వామ్యం ఉంది కనక ఎప్పటికఫ్పుడు కొత్త టెక్నాలజీలని అందుబాటులోకి తేగలుగుతున్నాం. విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి కనక దేశంలోని 15 రాష్ట్రాలపై ఫోకస్‌ పెట్టి అడుగులు వేస్తున్నాం.  

మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? 
వ్యాపార విలువ పరంగా ప్రస్తుతం దేశంలో 13వ స్థానంలో ఉన్నాం. వచ్చే ఏడాది నాటికి 12వ స్థానానికి... మూడేళ్లలో టాప్‌–1లోకి రావాలనేది లక్ష్యం. ఇక 
పాలసీదార్ల సంఖ్య పరంగా 7వ స్థానంలో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో టాప్‌–3లోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement