Shriram Life Insurance
-
లైఫ్‌కి బీమా తప్పనిసరి
జీవిత బీమా అవసరంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నామని, తక్కువ ప్రీమియంతోనైనా ప్రతి కుటుంబం ఎంతో కొంత బీమాను కలిగి ఉండాలన్నదే తమ ఉద్దేశమని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ, ఎండీ కాస్పరస్ జేహెచ్ క్రామ్హూట్ చెప్పారు. ఈ వైఖరి వల్లే వ్యాపార పరిమాణం పరంగా తాము దేశంలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ పాలసీదారుల సంఖ్యను బట్టి చూస్తే 7వ స్థానంలో ఉన్నామని స్పష్టంచేశారు.పాలసీదారుల అవసరాలు తెలుసుకోవటానికి, క్లెయిమ్‌ల పరిష్కారానికి టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటున్నామని, అందుకే తమ సంస్థ లాభదాయకతలోనూ ముందుందని వివరించారు. మంగళవారం ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...(సాక్షి, బిజినెస్ ప్రతినిధి) కుటుంబంలో ఆర్జించే వ్యక్తికి బీమా ఇచ్చి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించటమే జీవిత బీమా లక్ష్యం. కానీ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యమివ్వటం లేదు. మరి ఆశించిన లక్ష్యం నెరవేరుతోందా? నిజమే! దేశంలో 4 శాతం మందికే జీవిత బీమా కవరేజీ ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్‌ను చాలామంది అవసరం లేనిదిగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. తెలంగాణలో లీడ్ ఇన్సూరర్‌గా ఉన్నాం కనక మేం రకరకాల అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్ పెట్టాం. అందుకే 2025 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బీమా పరిశ్రమ 24 శాతం పెరిగితే మేం 57 శాతం వృద్ధి సాధించాం. మా వ్యాపారంలో గ్రామీణుల వాటా 40 శాతానికిపైగా ఉండటమే మా నిబద్ధతకు నిదర్శనం. బీమా కంపెనీలు ‘టర్మ్’పై కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపడిన ఎండోమెంట్, యులిప్ పాలసీలపై ఫోకస్ పెడుతున్నాయెందుకు? 30 ఏళ్ల వ్యక్తికీ 10 ఏళ్ల కాలపరిమితితో జీవితబీమా పాలసీ అమ్మటం మోసం కాదా? నిజమే! ఇలాంటి మిస్ సెల్లింగ్ జరగకూడదు. కాకపోతే తక్కువ ప్రీమియమే అయినా కొన్నేళ్ల పాటు కట్టి... చివరకు పాలసీ గడువు ముగిశాక ఏమీ తిరిగి రాని టర్మ్ పాలసీలపై కస్టమర్లు ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లను ఆకర్షించటానికే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు, రాబడులతో ముడిపడ్డ ఎండోమెంట్ పాలసీలను తెచ్చాయి. లాభదాయకత కూడా ముఖ్యమే కనక ఈ పాలసీలను విక్రయిస్తున్నాయి. మరి 30 ఏళ్ల వ్యక్తికి 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న జీవిత బీమా పాలసీ విక్రయిస్తే... గడువు తీరాక తనకు కవరేజీ ఉండదు కదా? లేటు వయసులో కవరేజీ కావాలంటే భారీ ప్రీమియం చెల్లించాలి కదా? నిజమే. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్నవారే ప్యూర్ టర్మ్ పాలసీలు తీసుకుంటున్నారు. ఇది అట్టడుగు స్థాయికి వెళ్లటం లేదు. మున్ముందు ఈ పరిస్థితి మారుతుందన్న విశ్వాసం నాకుంది.మీరూ ఇదే దార్లో వెళుతున్నారా... లేక? అలాంటిదేమీ లేదు. మేం ప్రధానంగా ఏడాదికి 4–15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారిని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారికి ఎంతోకొంత కవరేజీ ఉండేలా పాలసీలను తెచ్చాం. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 98 శాతానికిపైనే ఉంది. పైపెచ్చు ఎక్కువ శాతం చిన్న పాలసీలే కనక... సెటిల్మెంట్కు డాక్యుమెంట్లన్నీ అందజేస్తే 24 నుంచి 48 గంటల్లో పరిష్కరిస్తున్నాం. దీనికి టెక్నాలజీని వాడుతున్నాం. మీ వ్యాపారంలో ఆన్లైన్ శాతమెంత? మాకు దేశవ్యాప్తంగా విస్తరించిన శ్రీరామ్ గ్రూప్ కంపెనీల ఔట్లెట్ల నుంచే 40 శాతం వరకూ వ్యాపారం వస్తోంది. ఏజెన్సీల నుంచి మరో 40 శాతం వస్తోంది. మిగిలినది ఆన్లైన్, పాత కస్టమర్ల రిఫరెన్సులు సహా ఇతర చానళ్ల ద్వారా వస్తోంది. ఆన్లైన్లో ఎంక్వయిరీలొచ్చినా అవి వాస్తవరూపం దాల్చటం తక్కువ. ఆన్లైన్ ప్రచారానికి ఖర్చు కూడా ఎక్కువే. మాకు అంతర్జాతీయ బీమా దిగ్గజం ‘సన్ లామ్’తో భాగస్వామ్యం ఉంది కనక ఎప్పటికఫ్పుడు కొత్త టెక్నాలజీలని అందుబాటులోకి తేగలుగుతున్నాం. విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి కనక దేశంలోని 15 రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి అడుగులు వేస్తున్నాం. మీ భవిష్యత్తు లక్ష్యాలేంటి? వ్యాపార విలువ పరంగా ప్రస్తుతం దేశంలో 13వ స్థానంలో ఉన్నాం. వచ్చే ఏడాది నాటికి 12వ స్థానానికి... మూడేళ్లలో టాప్–1లోకి రావాలనేది లక్ష్యం. ఇక పాలసీదార్ల సంఖ్య పరంగా 7వ స్థానంలో ఉన్నాం. వచ్చే మూడేళ్లలో టాప్–3లోకి రావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. -
7 నిమిషాల్లో పాలసీ.. 48 గంటల్లో క్లెయిమ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీరామ్ జీవిత బీమా సంస్థ డిజిటల్ వైపు శరవేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే ఆధార్ అనుసంధానిత సేల్స్ యాప్‌ను అభివృద్ధి చేశామని, దీన్ని ఏజెంట్లకు అందించామని కంపెనీ సీఈఓ, ఎండీ కాస్పరస్ జాకబ్స్ హెన్డ్రిక్ క్రౌమ్‌హౌట్ తెలిపారు. 7 నిమిషాల్లో పాలసీ, 48 గంటల్లో క్లయిమ్‌ను అందుకోవడం దీని ప్రత్యేకత. ‘‘బీమా తీసుకొనే కస్టమర్‌కు పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ వంటివేవీ అవసరం లేకుండా కస్టమర్ ఆధార్ నంబర్, వేలిముద్ర ఆధారంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి కేవలం ఏడు నిమిషాల్లో డిజిటల్ రూపంలో పాలసీని అందిస్తుందని.. ఇప్పటివరకు 100 పాలసీలను విక్రయించామని ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా 48 గంటల్లో పరిహారం అందుకోవచ్చన్నారు. ఇప్పటివరకు 120 క్లెయిమ్‌లను ఆమోదించామని పేర్కొన్నారు. గురువారమిక్కడ ఎడ్యుకేషన్ ప్లాన్ జీనియస్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 7 శాతం వాటా ‘‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరింత వేగంగా, నాణ్యమైన సేవలందించేందుకు డిజిటల్, ఆన్లైన్ పాలసీల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. మా మొత్తం వ్యాపారంలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఏపీ, తెలంగాణలతో పాటూ ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి 34 రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. ప్రస్తుతం 23 రకాల బీమా, టర్మ్ పాలసీలున్నాయి. ఏడాదిలో మరో 5 పాలసీలను తీసుకురానున్నాం. ఇందులో 3 పాలసీలు కేవలం ఆన్లైన్లో విక్రయిస్తాం. ప్రస్తుతం 4 ఆన్లైన్ పాలసీలున్నాయి. 2020 నాటికి వీటి సంఖ్యను రెట్టింపు చేయాలని లకి‡్ష్యంచాం. గత ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం ప్రీమియం రూ.1,200 కోట్లకు చేరింది. ఇందులో కొత్త ప్రీమియంలు రూ.680 కోట్లు. మా మొత్తం వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 7 శాతం. తెలుగు రాష్ట్రాల్లో జీవిత బీమా వ్యాపారంలో మాది నాల్గో స్థానం. ఏటా 20 శాతం వృద్ధి చెందుతోంది’’ అని వివరించారు. అవకాశమొస్తే ఐడీఎఫ్‌సీతో విలీనం.. ‘‘ప్రస్తుతం కంపెనీలో చాలినంత నగదు ప్రవాహం ఉంది. కాబట్టి మరో ఏడాది పాటు ఎలాంటి నిధుల సమీకరణ ఆలోచన లేదు. అలాగే రెండేళ్ల పాటు ఐపీవో ఉద్దేశమూ లేదు. వాల్యువేషన్ కారణంగా ఐడీఎఫ్సీ బ్యాంక్‌తో విలీన ప్రక్రియ ఆగిపోయింది. అయితే అది పూర్తిగా ముగిసినట్టు కాదు. మళ్లీ ఏమాత్రం అవకాశమున్నా విలీన యోచన చేస్తాం’’ అని కాస్పరస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ కేఆర్సీ శేఖర్, ప్రెసిడెంట్ ఎస్ వెంకట సుబ్బయ్య, జీఎం వరుణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరామ్ లైఫ్ నుంచి ఏడు కొత్త పథకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ శ్రీరామ్ లైఫ్ కొత్త మార్గదర్శకాలతో కూడిన ఏడు పథకాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో మూడు సంప్రదాయ పాలసీలుండగా, నాలుగు యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యులిప్స్) ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ జైన్ ఈ పథకాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే మరో మూడు నాలుగు పథకాలను విడుదల చేయనున్నామని, వీటికి ఇంకా ఐఆర్డీఏ అనుమతి లభించాల్సి ఉందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు కొత్త ప్రీమియం ఆదాయ వృద్ధి స్థిరంగా ఉన్నప్పటికీ వచ్చే మూడు నెలల్లో 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ‘‘గతేడాది రూ.410 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయం వచ్చింది. అది ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ.450 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం పాలసీదారులు యులిప్స్ కంటే సంప్రదాయ పాలసీలకే మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఒక్కసారి మార్కెట్ లాభాలను అందించడం మొదలు పెడితే తిరిగి యులిప్స్కి డిమాండ్ పెరుగుతుంది’’ అని వివరించారు. ప్రస్తుతం జీవిత బీమా మార్కెట్లో 73 శాతం సంప్రదాయ పాలసీల నుంచి వస్తుంటే, 27 శాతం యులిప్స్ నుంచి వస్తున్నట్లు మనోజ్ జైన్ తెలియజేశారు. దక్షిణ భారతదేశంలో బాగా విస్తరించి ఉన్న తాము ఇప్పుడు ఉత్తర భారత దేశ విస్తరణపై దృష్టిసారించామని, ఇందులో భాగంగా గత పదినెలల్లో 80 శాఖలను ప్రారంభించామని తెలియజేశారు. దేశవ్యాప్తంగా మరో 50 శాఖలను ప్రారంభించడానికి ఐఆర్డీఏకి దరఖాస్తు చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.