హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీరామ్ జీవిత బీమా సంస్థ డిజిటల్ వైపు శరవేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే ఆధార్ అనుసంధానిత సేల్స్ యాప్‌ను అభివృద్ధి చేశామని, దీన్ని ఏజెంట్లకు అందించామని కంపెనీ సీఈఓ, ఎండీ కాస్పరస్ జాకబ్స్ హెన్‌డ్రిక్ క్రౌమ్‌హౌట్ తెలిపారు. 7 నిమిషాల్లో పాలసీ, 48 గంటల్లో క్లయిమ్‌ను అందుకోవడం దీని ప్రత్యేకత.
‘‘బీమా తీసుకొనే కస్టమర్‌కు పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ వంటివేవీ అవసరం లేకుండా కస్టమర్ ఆధార్ నంబర్, వేలిముద్ర ఆధారంగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి కేవలం ఏడు నిమిషాల్లో డిజిటల్ రూపంలో పాలసీని అందిస్తుందని.. ఇప్పటివరకు 100 పాలసీలను విక్రయించామని ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా 48 గంటల్లో పరిహారం అందుకోవచ్చన్నారు. ఇప్పటివరకు 120 క్లెయిమ్‌లను ఆమోదించామని పేర్కొన్నారు. గురువారమిక్కడ ఎడ్యుకేషన్ ప్లాన్ జీనియస్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల్లో 7 శాతం వాటా
‘‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరింత వేగంగా, నాణ్యమైన సేవలందించేందుకు డిజిటల్, ఆన్‌లైన్ పాలసీల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. మా మొత్తం వ్యాపారంలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఏపీ, తెలంగాణలతో పాటూ ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి 34 రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. ప్రస్తుతం 23 రకాల బీమా, టర్మ్ పాలసీలున్నాయి. ఏడాదిలో మరో 5 పాలసీలను తీసుకురానున్నాం.
ఇందులో 3 పాలసీలు కేవలం ఆన్‌లైన్‌లో విక్రయిస్తాం. ప్రస్తుతం 4 ఆన్‌లైన్ పాలసీలున్నాయి. 2020 నాటికి వీటి సంఖ్యను రెట్టింపు చేయాలని లకి‡్ష్యంచాం. గత ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం ప్రీమియం రూ.1,200 కోట్లకు చేరింది. ఇందులో కొత్త ప్రీమియంలు రూ.680 కోట్లు. మా మొత్తం వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 7 శాతం. తెలుగు రాష్ట్రాల్లో జీవిత బీమా వ్యాపారంలో మాది నాల్గో స్థానం. ఏటా 20 శాతం వృద్ధి చెందుతోంది’’ అని వివరించారు.
అవకాశమొస్తే ఐడీఎఫ్‌సీతో విలీనం..
‘‘ప్రస్తుతం కంపెనీలో చాలినంత నగదు ప్రవాహం ఉంది. కాబట్టి మరో ఏడాది పాటు ఎలాంటి నిధుల సమీకరణ ఆలోచన లేదు. అలాగే రెండేళ్ల పాటు ఐపీవో ఉద్దేశమూ లేదు. వాల్యువేషన్ కారణంగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌తో విలీన ప్రక్రియ ఆగిపోయింది. అయితే అది పూర్తిగా ముగిసినట్టు కాదు. మళ్లీ ఏమాత్రం అవకాశమున్నా విలీన యోచన చేస్తాం’’ అని కాస్పరస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ కేఆర్సీ శేఖర్, ప్రెసిడెంట్ ఎస్ వెంకట సుబ్బయ్య, జీఎం వరుణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment