అప్పు... ఆర్థిక భద్రతకు ముప్పు! | Govt to focus on reducing debt GDP ratio to about 50 percent | Sakshi
Sakshi News home page

అప్పు... ఆర్థిక భద్రతకు ముప్పు!

Published Sun, Mar 16 2025 2:27 AM | Last Updated on Sun, Mar 16 2025 2:27 AM

Govt to focus on reducing debt GDP ratio to about 50 percent

2024–25 జీడీపీలో 57.1 శాతం

2031 నాటికి 50 శాతానికి తిరిగి తీసుకువస్తామంటున్న కేంద్రం

సవాళ్లున్నా... సానుకూలతలూ ఉన్నాయని భరోసా

ఇప్పుడు ఆర్థికవేత్తల చర్చల్లో కీలకాంశం.. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ), దానితో పోల్చితే భారత్‌ రుణ నిష్పత్తి.  ఒక కుటుంబానికి తీర్చగలిగిన స్థాయిలోనే అప్పు ఎలా ఉండాలో.. ఒక దేశానికి తన ఆర్థిక వ్యవస్థ స్థాయికి తగినట్లుగానే రుణం ఉండాలి. ఒక కుటుంబం ఆదాయం– అప్పు ఎలా బేరీజు వేసుకోవాలో దేశం కూడా తన జీడీపీని, అందులో రుణ నిష్పత్తిని తూకం వేసుకోవాలి. ఒక దేశం ఆర్థిక ‘ఆరోగ్యానికి’ చక్కటి సూచిక జీడీపీ–రుణ నిష్పత్తి.

విస్తృత స్థాయిలో ఆమోదం పొందిన ఈ సూచీని అదుపులో పెడతామని కేంద్రం ఇస్తున్న హామీ ఇప్పుడు ఆర్థిక వర్గాలకు ఊరటనిస్తోంది. అయితే ఇది అంత తేలిక్కాదని వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ అప్పు (సెంట్రల్‌ గవర్నమెంట్‌ డెట్‌) కొంత అదుపులో ఉన్నా.. రాష్ట్రాలను కూడా కలుపుకుంటే (జనరల్‌ గవర్నమెంట్‌ డెట్‌) ఆందోళన కలిగిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం.  ఆయా అంశాలపై చర్చించిందే ఈ కథనం.   –  సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

కేం ద్రానికి రుణ–జీడీపీ నిష్పత్తి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 57.1 శాతం. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే రానున్న 2025–26లో 56.1 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిర్దేశించుకుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం– ద్రవ్యలోటును తగ్గించుకోవడం... ఆర్థికాభివృద్ధి ద్వారా జీడీపీలో రుణ నిష్పత్తిని గణనీయంగా తగ్గించుకోవాలన్న సంకల్పాన్ని బడ్జెట్‌ ఉద్ఘాటించింది. తద్వారా ఈ నిష్పత్తిని 2031 మార్చి 31 నాటికి  ఒక శాతం అటుఇటుగా 50 శాతానికి చేర్చాలని ప్రణాళికలను వెల్లడించింది.

అంటే జీడీపీలో రుణ నిష్పత్తిని 2031 నాటికి ఏడాదికి ఒక శాతం చొప్పున తగ్గించుకుంటూ వెళ్లాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందుకు రెండు ప్రధానదారులు ఒకటి ద్రవ్యలోటు కట్టడికాగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి  మరొకటి. 2024–25లో ద్రవ్యలోటు 4.9 శాతం ఉండాలని బడ్జెట్‌ నిర్ధేశించుకున్నప్పటికీ, ఇది సవరించిన అంచనాల ప్రకారం మరింత మెరుగ్గా 4.8 శాతానికి తగ్గించుకోగలిగింది.

రానున్న ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఈ రేటును 4.4 శాతానికి తగ్గించుకోవాలని కూడా తాజా బడ్జెట్‌ నిర్దేశించుకుంది. లక్ష్యాలకు అనుగుణంగా నడుస్తూ, జీడీపీ– రుణ నిష్పత్తిని లక్ష్యాల మేరకు తగ్గించుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇది బాండ్‌ మార్కెట్, ప్రభుత్వం చెల్లించాల్సిన రుణ వడ్డీరేట్లు స్థిరత్వానికి తద్వారా దేశ ఎకానమీ పురోగతికి దోహదపడే అంశమనడంలో సందేహాలే అక్కర్లేదు.  

తొమ్మిదేళ్లలో రూ.93.26 లక్షల కోట్ల  
నుంచి రూ.200.16 లక్షల కోట్లు

లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన 2018–19లో కేంద్ర ప్రభుత్వ రుణం 93.26 లక్షల కోట్లు.  నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే ఇది 49.3 శాతమే. మహమ్మారి కోవిడ్‌ ప్రభావిత ఆర్థిక సంవత్సరం 2020–21లో రుణ భారం ఏకంగా 121.86 లక్షల కోట్లకు ఎగసింది. జీడీపీలో ఇది 61.4 శాతానికి చేరింది. కరోనా పరిస్థితుల్లో దేశ ఎకానమీ తీవ్రంగా దెబ్బతినడం దీనికి నేపథ్యం. 

అయితే అటు తర్వాత ఆర్థిక సంవత్సరాలు చూస్తే, (2021–22 నుంచి ఇటీవల బడ్జెట్‌ 2025–26) జీడీపీలో రుణ నిష్పత్తులు వరుసగా తీవ్ర స్థాయిల్లో  (వరుసగా 58.8 శాతం, 57.9 శాతం, 58.1 శాతం, 7.1%, 56.1 శాతం)నే కొనసాగాయి తప్ప, తిరిగి 2018–19 నాటి స్థితికి (49.3 %) చేరుతుందన్న ఆశలు మాత్రం కల్పించలేదు.

రూపాయిల్లో చూస్తే, గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రుణ పరిమాణం 93.26 లక్షల కోట్ల నుంచి రెట్టింపుకన్నా అధికంగా 200.16 లక్షల కోట్లకు చేరింది. అయితే తిరిగి వచ్చే ఆరేళ్లలో జీడీపీలో ఒక శాతం అటుఇటుగా 50 శాతానికి రుణ నిష్పత్తిని తీసుకువెళతామని తన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం ఎకానమీ పరంగా కొంత ఊరటనిచ్చే అంశం.

లక్ష్య సాధన తేలిక్కాదు
బడ్జెట్‌లో నిర్దేశించుకున్నట్లు 2031 నాటికి జీడీపీలో రుణ నిష్పత్తిని నిజంగానే తిరిగి  50 శాతానికి చేర్చడం సాధ్యమేనా అన్నది ఇక్కడ బిలియన్‌ డాలర్ల ప్రశ్న.  ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు భారత్‌ ఎకానమీకి ప్రస్తుతం తీవ్ర ప్రతికూలంగా ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌–హమాస్‌ సమస్యలతో తీవ్ర అనిశి్చతిలో ఉన్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ట్రంప్‌ తాజా పాలనా కాలంలో మరింత క్షీణించాయి.

టారిఫ్‌ల యుద్ధం కూడా దాదాపు  ప్రారంభమైంది.  ఒకపక్క అమెరికా టారిఫ్‌ల యు ద్ధం, మరోపక్క చైనాకి విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం వంటి అంశాలు భారత్‌ ఎకానమీపై తీవ్ర ఇప్పుడు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి లక్ష కోట్ల ఎఫ్‌ఐఐ పెట్టుబడులు భారత్‌ నుంచి వెనక్కు మ ళ్లాయి. వీటిలో అధిక భాగం చైనా ఆకర్షించడం గమనార్హం. బలహీనమైన ప్రపంచ డిమాండ్‌.  ఉ త్పాదక రంగంపై ఒత్తిళ్లు, డాలర్‌ మారకంలో రూ పాయి మారకపు విలువలో తీవ్ర అనిశి్చతి, భారత్‌ ఎకానమీకి తీవ్ర సవాళ్లను విసురుతున్నాయి.

అ యితే పటిష్ట దేశీయ డిమాండ్, ప్రైవేటు వినియో గం, ద్రవ్యలోటు వంటి అంశాల్లో క్రమశిక్షణ, పటిష్ట విదేశీ మారకద్రవ్యాలు, సేవల రంగంలో మిగులు, చక్కటి రెమిటెన్సుల (ఎన్‌ఆర్‌ఐలు దేశానికి పంపే విదేశీ డబ్బు) వృద్ధి భారత్‌ ఎకానమీకి మూలస్తంభాలని, ఈ దన్నుతో ఎకానమీ పురోగతి సాధ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దేశ పౌరునిగా అంతా మంచే జరగాలని మనమూ కోరుకుందాం.  

రుణ భారం ఎక్కువైతే...
మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, విద్య వంటి ముఖ్యమైన రంగాలకు కేటాయింపుల కంటే వడ్డీ చెల్లింపులపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.  

భవిష్యత్‌ తరాలకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడుల నుండి ప్రభుత్వం దూరంగా జరిగి.. వడ్డీ వ్యయాలకు అధిక మొత్తాన్ని కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.  

తీసుకున్న రుణం ఎక్కడికి వెళుతోందన్న అంశమూ కీలకం. ఇది వృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల వ్యయాల్లో భాగం కావాలి.  అసమానత, పేదరికం, నిరుద్యోగం సమస్యల పరిష్కారానికి దోహదపడే వ్యయాలు ఎకానమీ పురోగతికి బాటలు వేస్తాయి.  

విదేశీ రుణ భారం.. ఊరట 
అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 2.5 శాతంగా ఉన్న భారత్‌ ప్రభుత్వ రుణ భారం (రూ.4.74 లక్షల కోట్లు), 2025–26కు సంబంధించి ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ లోనూ 2.5 శాతంగా (రూ.8.92 లక్షల కోట్లు) యథాతథంగా కొనసాగడం కొంత ఊరటనిచ్చే అంశం. విదేశీ రుణ భారాలను స్థిరంగా ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని ఇది సూచిస్తోంది.  

రాష్ట్రాలనూ కలుపుకుంటే.. కలవరమే!
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం ఇప్పటికే తీవ్రంగా ఉంది.  కేంద్ర ప్రభుత్వ అప్పుతో పాటు రాష్ట్రాల రుణ భారం కలుపుకొని చూస్తే, పరిస్థితి మరింత ఆందోళన కలిగించేలా మారుతోంది. దీనిని ‘జనరల్‌ గవర్నమెంట్‌ డెట్‌’ (జీజీడీ) అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 80 శాతానికి పైగా స్థిరంగా కొనసాగుతుండటం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ వర్గాలు 2030–31 నాటికి ఈ నిష్పత్తిని 70 శాతం లోపుకు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నా, ఇది అంత తేలికైన విషయం కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు (వ్యయాలు – ఆదాయాల మధ్య వ్యత్యాసం) జీడీపీలో 5 శాతానికి దిగువన కొనసాగుతుందనే అంచనా ఉంది. అయితే రాష్ట్రాల అప్పును కలుపుకుంటే ఈ నిష్పత్తి 7 శాతం పైగా పెరిగే అవకాశం ఉంది, ఇది ఆర్థిక స్థిరత్వానికి హానికరమైన అంశం. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సహా పలు ఆర్థిక సంస్థలు భారత సాధారణ ప్రభుత్వ అప్పు  జీడీపీకి 100 శాతానికి మించిపోవచ్చని ఇప్పటికే హెచ్చరించాయి.

ఈ పరిణామాలు భారత సావరిన్‌ రేటింగ్‌లపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మూడీస్, ఎస్‌అండ్‌పీ, ఫిచ్‌ వంటి అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు భారత్‌కు ఇస్తున్న సావరిన్‌ రేటింగ్‌.. ‘జంక్‌’ స్థాయి కన్నా కేవలం ఒక అంచె ఎక్కువగా ఉండడం గమనార్హం.  ఇది విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపి, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును దెబ్బతీస్తోంది.  

అమెరికాకు 123 శాతం ఉంటే.. భారత్‌కు 56 శాతం.. భయమెందుకు! 
జీడీపీలో అమెరికాసహా కొన్ని అగ్ర దేశాల రుణ నిష్పత్తులు 100 శాతం దాటిపోతే భారత్‌ది 56 శాతమేగా భయమెందుకు? అన్న సందేహాలు కొందరికి కలగవచ్చు. ఇక్కడ ఒక్కటే సమాధానం. కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ఎంత డబ్బు అయినా అప్పు తీసుకోవచ్చు.  అది ఆ వ్యక్తి తేలిగ్గా తీర్చేయగలడు.

ధనికుడు అప్పు అడగడంతోనే ఇచ్చేవాడూ వెనకాముందూ చూడకుండా ఇచ్చేస్తాడు.  మరి పేదవాడు అప్పుచేస్తే అది ఎంత ఎక్కువుంటే..  అతనికి అంత కష్టం. ఇదీ అంతే. అమెరికా, జపాన్‌ వంటివి అగ్ర దేశాలు. వాటి ఎకానమీలు స్వల్పకాలంలో ఆటుపోట్లకు గురైనా.. అవి అత్యంత శక్తివంతమైనవి. అయితే ఆయా దేశాల అప్పులనూ అంత తేలిగ్గా తీసిపారేయవద్దని, ఇది అవి మునగడంతోపాటు, ప్రపంచ దేశాలనూ ముంచే వ్యవహారమనీ.. విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

ముందుచూపు అవసరం 
భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే రాజకీయ పార్టీలు పొదుపు విధానాలను అలవర్చుకోవడంతో పాటు, అప్పులను సమర్థంగా నిర్వహించాలి. వృద్ధిని పెంచే సంస్కరణలను ప్రోత్సహించడంతో పాటు,  ప్రభుత్వ వ్యయాలను సద్వినియోగం అయ్యేల చూడ్డం అత్యవసరం. ఇకపై ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక భద్రతను నిర్దేశించనున్నాయి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement