![Govt, RBI in talks with some South Asian countries for rupee trade - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/7/IMF.jpg.webp?itok=lh3OPHyg)
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్య లావాదేవీలు నిర్వహించడంపై దక్షిణాసియా దేశాలతో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చర్చలు జరుపుతోంది. యూపీఐ విధానం ద్వారా ప్రాంతీయంగా సీమాంతర చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యూపీఐకి సంబంధించి ఇప్పటికే భూటాన్, నేపాల్ తదితర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు తెలిపారు.
అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని ఆయన చెప్పారు. క్లోనింగ్‌వంటి రిస్కులు ఉన్న నేపథ్యంలో డిజిటల్ రూపీని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడంపై ఆర్‌బీఐ ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వంతో కలిసి అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునే విధానంపై ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది. ప్రాంతీయంగా ఇప్పటికే కొన్ని దేశాలతో చర్చలు జరుపుతోంది‘ అని దాస్ వివరించారు.
ద్రవ్యోల్బణ కట్టడికి ప్రాధాన్యం ..
కోవిడ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్కెట్ల నిబంధనలు కఠినతరం కావడం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్ల నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంత దేశాలు విధానపరంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయన్నారు. భారత్ వంటి దక్షిణాసియా దేశాలు ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకోసం విశ్వసనీయమైన ద్రవ్యపరపతి విధానాలతో పాటు సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం, ద్రవ్య.. వాణిజ్య విధానాలు, పాలనాపరమైన చర్యలు అవసరమని ఆయన వివరించారు. ఇటీవల కమోడిటీ ధరలు, సరఫరాపరమైన సమస్యలు కొంత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొన్నారు.
అయితే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగిన పక్షంలో వృద్ధికి, పెట్టుబడులకు రిస్కులు ఏర్పడవచ్చని దాస్ చెప్పారు. దక్షిణాసియా ప్రాంత దేశాలు ఇంధనాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుండటం వల్ల, ఇంధన దిగుమతిపరమైన ద్రవ్యోల్బణంతో సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలు వాణిజ్యం విషయంలో పరస్పర సహకరించుకుంటే ప్రాంతీయంగా వృద్ధికి, ఉపాధికి మరిన్ని అవకాశాలు లభించగలవని దాస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment