2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.11 లక్షల కోట్ల రికార్డ్ డివిడెండ్
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారీగా రూ.2,10,874 కోట్ల డివిడెండ్‌ను అందించనుంది. ఆర్‌బీఐ చరిత్రలోనే ఇది రికార్డ్ కాగా.. బడ్జెట్ అంచనాలకన్నా రెట్టింపు. జీడీపీలో 0.2% నుంచి 0.3 శాతానికి సమానం. ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
ఈ మేరకు గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్‌బీఐ 608వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేంద్రానికి ఆర్‌బీఐ నుంచి అందిన అత్యధిక నిధుల బదలాయింపు విలువ( 2018–19) రూ. 1.76 లక్షల కోట్లు. తాజా నిర్ణయాలపై ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు..
⇢ 2024–25లో ఆర్‌బీఐ, ప్రభు త్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్లు అందుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. అయితే దీనికి రెట్టింపు మొత్తాలు రావడం గమనార్హం.
⇢ తాజా బోర్డ్ సమావేశం దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించింది. వృద్ధి అవుట్‌లుక్‌కు ఎదురయ్యే సవాళ్లను, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించింది.
ద్రవ్యలోటు, బాండ్ ఈల్డ్ తగ్గే చాన్స్...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి వచ్చే ఆదాయం చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు రూ.17.34 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం కేంద్ర ఖజానాకు పెద్ద ఊరటకానుంది. తాజా నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గడానికి దోహదపడే అంశం. కేంద్రంపై రుణ భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా బాండ్ మార్కెట్ విషయంలో కేంద్రానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దేశ బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ కూడా 4 శాతం తగ్గి 7 శాతం వద్ద స్థిరపడే వీలుంది.
భారీ మిగులుకు కారణం?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆర్‌బీఐ ఫారిన్ ఎక్సే్చంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్‌బీఐ భారీ నిధుల బదలాయింపులకు ఒక ప్రధాన కారణం. దేశీయ, అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీరేట్లు, ఫారిన్ ఎక్సే్చంజ్ భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి.
ఎకానమీపై భరోసాతో 6.5 శాతానికి సీఆర్‌బీఐ పెంపు
మరోవైపు సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్‌ను (సీఆర్‌బీ) ఆర్‌బీఐ బోర్డ్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6.50 శాతానికి పెంచింది. భారత్ ఎకానమీ రికవరీని ఇది సూచిస్తోంది. ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగులు నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది.
సీఆర్‌బీఐ 5.5% – 6.5 % శ్రేణిలో ఉండాలని ఈ ఫ్రేమ్‌వర్క్ నిర్దేశించింది. దీని ప్రకారమే ఆర్‌బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు, కోవిడ్–19 మహమ్మారి వంటి పరిణామాల నేపథ్యంలో 2018–19 నుంచి 2021–22 వరకూ 5.50 శాతం సీఆర్‌బీ నిర్వహణకు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్రానికి అధిక మిగులు నిధులు అందించి ఆర్థిక పురోగతి, ఎకానమీ క్రియాశీలతకు దోహదపడాలన్నది సెంట్రల్ బ్యాంక్ ఉద్దేశం. ఎకానమీ పురోగతి నేపథ్యంలో 2022–23లో సీఆర్‌బీని 6 శాతానికి, తాజాగా 6.5 శాతానికి సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment