Dividend Payment
-
ఎల్ఐసీ, ఐవోసీ భారీ డివిడెండ్లు
కేంద్రానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డివిడెండ్లను అందించాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండీ సిద్ధార్థ మొహంతి రూ.3,662.17 కోట్ల డివిడెండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఎల్ఐసీ రూ.2,441.45 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను అందించింది. తాజాగా అందజేసిన డివిడెండ్‌తో కలిసి 2023–24లో సంస్థ మొత్తం రూ.6,103.62 కోట్ల డివిడెండ్‌ను అందించినట్లైంది. ఇక ఐవోసీ రూ.5,091 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి సమరి్పంచింది. 2024–25లో ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.10,604.74 కోట్ల డివిడెండ్ అందింది. 2023–24లో డివిడెండ్లు రూ.50,000 కోట్లుకాగా, 2024–25లో ఈ విలువ అంచనాలు రూ.56,260 కోట్లు. -
కేంద్రానికి బ్యాంకుల భారీ డివిడెండ్ @ రూ. 6,481 కోట్లు
న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ను చెల్లించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చెక్ రూపేణా మొత్తం రూ. 6,481 కోట్లు అందించాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2023–24)గాను ప్రభుత్వానికి ఉమ్మడిగా డివిడెండ్‌ను చెల్లించాయి. దీనిలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 2,514 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 1,838 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 1,193.5 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 935.5 కోట్లు చొప్పున డివిడెండ్‌ను అందించాయి. అంతేకాకుండా వీటికి జతగా ఎగ్జిమ్ బ్యాంక్ సైతం రూ. 252 కోట్ల డివిడెండ్ చెక్‌ను ప్రభుత్వానికి అందజేసింది. -
ప్రభుత్వానికి ఎస్బీఐ డివిడెండ్ @ రూ.6,959 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,959 కోట్ల డివిడెండ్‌ను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఈ మేరకు డివిడెండ్ చెక్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా అందించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.13.70 చొప్పున ఎస్బీఐ వాటాదారులకు డివిడెండ్ ప్రకటించడం గమనార్హం. -
డివిడెండ్ జోష్.. సూచీలు ఖుష్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)బోర్డు కేంద్ర ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో గురువారం స్టాక్ సూచీలు సరికొత్త రికార్డు్డలు నెలకొల్పాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో విశ్వాస్వాన్ని నింపాయి. అలాగే దేశంలో ఎగుమతులు పెరగడంతో పాటు మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెల్లడైన గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి ఈ జనవరి 29 తర్వాత అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,197 పాయింట్లు పెరిగి 75,418 ముగిసింది. నిఫ్టీ 370 పాయింట్లు బలపడి 22,968 వద్ద నిలిచింది.కొనుగోళ్ల జోరు – రికార్డు హోరు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం ఫ్లాటుగా మొదలయ్యాయి. మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాల్లో కొనుగోళ్ల వెల్లువెత్తడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలాడాయి. మిడ్‌సెషన్ నుంచి ఆర్బీఐ డివిడెండ్ ప్రకటనల బలపడటంతో ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు దూసుకెళ్లి 75వేల స్థాయిపైన 75,500 వద్ద, నిఫ్టీ 396 పాయింట్లు బలపడి 22,968 వద్ద జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆర్బీఐ భారీ డివిడెండ్ మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు సూచీల పరుగుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.→ జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.4.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.420 లక్షల కోట్లకు చేరింది. → అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ అదానీ గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో చోటు దక్కనుండడంతో ఈ గ్రూప్‌లోని తక్కిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మొత్తం గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.23 లక్షల కోట్లకు చేరింది. → మెప్పించిన గో డిజిట్ ఆన్లైన్ వేదికగా బీమా సేవలు అందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేరు లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.272)తో పోలిస్తే 3% లాభంతో ప్రీమియంతో రూ.281 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.314 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 12% లాభంతో రూ.306 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.28,043 కోట్లుగా నమోదైంది. → ఎన్ఎస్ఈ రికార్డ్ఎన్ఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. గతేడాది డిసెంబర్లో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అందుకుంది. -
కేంద్రంపై ఆర్బీఐ కనకవర్షం
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారీగా రూ.2,10,874 కోట్ల డివిడెండ్‌ను అందించనుంది. ఆర్బీఐ చరిత్రలోనే ఇది రికార్డ్ కాగా.. బడ్జెట్ అంచనాలకన్నా రెట్టింపు. జీడీపీలో 0.2% నుంచి 0.3 శాతానికి సమానం. ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ 608వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేంద్రానికి ఆర్బీఐ నుంచి అందిన అత్యధిక నిధుల బదలాయింపు విలువ( 2018–19) రూ. 1.76 లక్షల కోట్లు. తాజా నిర్ణయాలపై ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు..⇢ 2024–25లో ఆర్బీఐ, ప్రభు త్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్లు అందుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. అయితే దీనికి రెట్టింపు మొత్తాలు రావడం గమనార్హం. ⇢ తాజా బోర్డ్ సమావేశం దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించింది. వృద్ధి అవుట్‌లుక్‌కు ఎదురయ్యే సవాళ్లను, తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించింది. ద్రవ్యలోటు, బాండ్ ఈల్డ్ తగ్గే చాన్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి వచ్చే ఆదాయం చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు రూ.17.34 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిబ్రవరి బడ్జెట్ అంచనావేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం కేంద్ర ఖజానాకు పెద్ద ఊరటకానుంది. తాజా నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గడానికి దోహదపడే అంశం. కేంద్రంపై రుణ భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా బాండ్ మార్కెట్ విషయంలో కేంద్రానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దేశ బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ కూడా 4 శాతం తగ్గి 7 శాతం వద్ద స్థిరపడే వీలుంది.భారీ మిగులుకు కారణం? అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆర్బీఐ ఫారిన్ ఎక్సే్చంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీ ఆదాయాలు ఆర్బీఐ భారీ నిధుల బదలాయింపులకు ఒక ప్రధాన కారణం. దేశీయ, అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీరేట్లు, ఫారిన్ ఎక్సే్చంజ్ భారీ స్థూల విక్రయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఎకానమీపై భరోసాతో 6.5 శాతానికి సీఆర్‌బీఐ పెంపు మరోవైపు సెంట్రల్ బ్యాంక్ నిధుల నిర్వహణకు సంబంధించిన కంటింజెంట్ రిస్క్ బఫర్‌ను (సీఆర్బీ) ఆర్బీఐ బోర్డ్ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6.50 శాతానికి పెంచింది. భారత్ ఎకానమీ రికవరీని ఇది సూచిస్తోంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ మొత్తంలో తన వద్ద ఎంత స్థాయిలో మిగులు నిధులను ఉంచుకోవాలి, కేంద్రానికి ఎంత మొత్తంలో మిగులును బదలాయించాలి అనే అంశంపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ ఒక ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. సీఆర్‌బీఐ 5.5% – 6.5 % శ్రేణిలో ఉండాలని ఈ ఫ్రేమ్‌వర్క్ నిర్దేశించింది. దీని ప్రకారమే ఆర్బీఐ మిగులు బదలాయింపు నిర్ణయాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు, కోవిడ్–19 మహమ్మారి వంటి పరిణామాల నేపథ్యంలో 2018–19 నుంచి 2021–22 వరకూ 5.50 శాతం సీఆర్బీ నిర్వహణకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్రానికి అధిక మిగులు నిధులు అందించి ఆర్థిక పురోగతి, ఎకానమీ క్రియాశీలతకు దోహదపడాలన్నది సెంట్రల్ బ్యాంక్ ఉద్దేశం. ఎకానమీ పురోగతి నేపథ్యంలో 2022–23లో సీఆర్బీని 6 శాతానికి, తాజాగా 6.5 శాతానికి సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ పెంచింది. -
ఎల్ఐసీ రూ. 2,441 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) కేంద్ర ప్రభుత్వానికి రూ. 2,441 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చెక్ అందుకున్నారు. ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెక్రటరీ వివేక్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పనిచేయకుండానే డబ్బు కావాలా..?
అవునండీ.. పని చేయకుండానే డబ్బులు వస్తాయి. ఎలాగంటారా..? ప్యాసివ్ ఇన్‌కమ్‌తో ఇది సాధ్యం అవుతుంది. ప్యాసివ్ ఇన్‌కమ్‌తో కులాసాగా కాలం గడిపేయొచ్చు అనే భావన ఇప్పటికే చాలామందికి వచ్చేసింది. ఇంతకీ ఫ్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఆదాయం అన్నమాట! ఇదేదో బాగానే ఉందే.. ఇక కాయకష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ గణనీయంగా సంపాదిస్తే గానీ, ప్యాసివ్ సంపాదన సాధ్యపడదని మాత్రం గుర్తుంచుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రత్యేక్షంగా మన ప్రమేయం లేకుండా స్థిరంగా డబ్బు వచ్చే విధానం. ఈ ఆదాయం రెంటల్ ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్లు, క్రియేటివ్ వర్క్ రాయల్టీలు, డివెడెండ్లు.. నుంచి జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్పైన డైలీ అటెన్షన్ అవసరం ఉండదు. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చని చాలామంది అంటారు. అయితే అందుకు మాత్రం ముందు చాలా కష్టపడాలి. ఒకసారి మనిటైజేషన్ అయిపోయి ఫాలోవర్లు పెరుగుతుంటూ డబ్బు వస్తూంటుంది. కొన్నిసార్లు వీడియో చేయకపోయినా కొందరు మనం గతంలో చేసిన వీడియోలు చూస్తారు కాబట్టి డబ్బు వస్తుంది. ఇన్‌స్టాలో కొత్తగా ఏదైనా థీమ్ క్రియేట్చేసి ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిపోవచ్చు. కానీ అందుకు చాలా కష్టపడాలి. అయితే ఫ్యాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్‌కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు… ఆరు లైకులకు పరిమితం అవుతారని నిపుణులు చెబుతున్నారు. స్టాక్మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్‌చేసి స్టాక్‌లు పెరుగుతున్నపుడు అందులో మదుపుచేసిన డబ్బు పెరుగుతుంది. దాంతోపాటు కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలు పోస్ట్ చేస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెబుతుంటాయి. అయితే అందుకుగల కారణాలను విశ్లేషిస్తూ సిప్ మోడ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీలు డివెండెండ్ ప్రకటిస్తున్నపుడు పెరిగిన స్టాక్ ధరతో సంబంధం లేకుండా అదనంగా ప్యాసివ్ ఇన్‌కమ్‌ను సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మరెన్నో మార్గాలున్నాయని, కానీ అంతకుముందు యాక్టివ్ మనీను సంపాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి! -
కేంద్రానికి ఎల్ఐసీ రూ.1,831 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) గురువారం రూ. 1,831.09 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్రానికి అందజేసింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి ఈ డివిడెండ్ చెక్కును అందజేశారు. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 22న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో డివిడెండ్‌ను షేర్హోల్డర్లు ఆమోదించినట్లు ఒక ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొంది. రూ.5 కోట్ల తొలి మూలధన పెట్టుబడితో 1956లో ఎల్ఐసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరచి రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ, భారత్ జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోందని ఎల్ఐసీ ప్రకటన పేర్కొంది. -
యూనియన్ బ్యాంక్ రికార్డు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రికార్డు స్థాయి లో రూ. 1,712 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందజేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు ఒక డివిడెండ్ చెక్కును కేంద్రానికి సమరి్పంచినట్లు బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ స్థాయిలో డివిడెండ్‌ను యూనియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరాల్లో ఎన్నడూ సమరి్పంచలేదని కూడా ప్రకటన వివరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ మణిమేఖలై డివిడెండ్ చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. జాయింట్ సెక్రటరీ (బ్యాంకింగ్) సమీర్ శుక్లా తదితర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ట్రెంట్ లాభం 37 శాతం అప్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ రిటైల్ సంస్థ, ట్రెంట్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.16 కోట్లకు పెరిగిందని ట్రెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.539 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.677 కోట్లకు పెరిగిందని ట్రెంట్ చైర్మన్ నోయల్ ఎన్. టాటా చెప్పారు.. మొత్తం వ్యయాలు రూ.522 కోట్ల నుంచి రూ.659 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1.30 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)తో కలుపుకుంటే మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.52.08 కోట్లవుతాయని వివరించారు. గత క్యూ4లో తమ సంస్థ బ్రాండ్, వెస్ట్‌సైడ్ కొత్తగా 27 స్టోర్స్‌ను ప్రారంభించిందని గతంలో ఏ సంవత్సరంలోనూ ఈ స్థాయిలో స్టోర్స్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్ల లాభం ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.117 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్లకు పెరిగిందని నోయల్ తెలిపారు. ఆదాయం రూ.2,109 కోట్ల నుంచి రూ.2,568 కోట్లకు పెరిగింది. గత శుక్రవారం బీఎస్ఈలో ట్రెంట్ షేర్ 0.7% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది. -
మాల్యాకి మరో ఎదురు దెబ్బ
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయ్ మాల్యా మరో భారీ షాక్ తగిలింది. బ్యాంకుల కన్సార్టియానికి వేలకోట్ల రుణాలు బాకీ పడ్డ ఈ లిక్కర్ టైకూన్ కి చెక్ పెట్టే క్రమంలో రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) మరో అడుగు ముందు కేసింది. దీంతో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) కంపెనీ నుంచి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు రావలసిన రూ.9.33 కోట్ల డివిడెండ్ ఆదాయానికి గండి పడింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను మద్యం సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ...మాల్యాకు చెల్లించాల్సిన డివిడెండ్ నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా మాల్యాకు ఈ డివిడెండ్ చెల్లించొద్దని డెట్ రికవరీ ట్రిబ్యునల్ కర్ణాటక ఆదేశించింది. దీంతో కంపెనీ..ఆయన చెల్లింపులను నిలిపి వేసింది. అయితే కంపెనీల చట్టానికి లోబడి అన్ని వివరాలను బహిరంగ పరుస్తాం...ఇంతకుమించి తానేమీ వ్యాఖ్యానించలేనని కంపెనీ సీఈవో శేఖర్ రామమూర్తి వ్యాఖ్యానించగా అతని డివిడెండ్ చెల్లింపును వాయిదా వేసినట్టు మరో ప్రతినిధి ధృవీకరించారు. మరోవైపు యునైటెడ్ స్పిరిట్స్ (యుఎస్ఎల్) చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నందుకు డియాజియో కంపెనీ నుంచి అప్పనంగా వచ్చిన (75 మిలియన్ డాలర్లు) సుమారు రూ 515 కోట్ల రూపాయలకు ఇపుడు ముప్పు ఏర్పడింది. ఈ మొత్తాన్ని మాల్యా చేతికివ్వొద్దని డిఆర్టి ఆ బ్యాంక్‌ను కోరింది. మాల్యా ఖాతాలకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా తనకు సమర్పించాలని జెపి మోర్గాన్ బ్యాంక్‌ను డీఆర్టీ ఆదేశించింది. కాగా మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మే 13 న జరిగిన భేటీలో వాటాదార్లకు ఒక్కో షేరుపై రూ.1.15 చొప్పున డివిడెండ్ చెల్లించాలని యుబిఎల్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇటీవల సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మాల్యాకు చెల్లించాల్సిన డివిడెండ్ నిలిపి వేయాలని యుబిఎల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. యుబిఎల్‌లో మాల్యాతో పాటు అతడి నిర్వహణలోని తొమ్మిది కంపెనీలకు 8,11,88,930 షేర్లున్నాయి.