డివిడెండ్‌ జోష్‌.. సూచీలు ఖుష్‌ | Indian Stocks Hit Record Close on RBI Dividend | Sakshi
Sakshi News home page

డివిడెండ్‌ జోష్‌.. సూచీలు ఖుష్‌

Published Fri, May 24 2024 5:55 AM | Last Updated on Fri, May 24 2024 8:08 AM

Indian Stocks Hit Record Close on RBI Dividend

తాజా గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీలు 

ఇన్వెస్టర్లకు రూ.4.28 లక్షల కోట్ల సంపద 

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)బోర్డు కేంద్ర ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో గురువారం స్టాక్‌ సూచీలు సరికొత్త రికార్డు్డలు నెలకొల్పాయి. కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో విశ్వాస్వాన్ని నింపాయి. 

అలాగే దేశంలో ఎగుమతులు పెరగడంతో పాటు మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెల్లడైన గణాంకాలు  సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి ఈ జనవరి 29 తర్వాత  అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ 1,197  పాయింట్లు పెరిగి 75,418 ముగిసింది. నిఫ్టీ 370 పాయింట్లు బలపడి 22,968 వద్ద నిలిచింది.

కొనుగోళ్ల జోరు – రికార్డు హోరు  
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం ఫ్లాటుగా మొదలయ్యాయి. మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాల్లో కొనుగోళ్ల వెల్లువెత్తడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలాడాయి. మిడ్‌సెషన్‌ నుంచి ఆర్‌బీఐ డివిడెండ్‌ ప్రకటనల బలపడటంతో ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. 

దశలో సెన్సెక్స్‌ 1,279 పాయింట్లు దూసుకెళ్లి 75వేల స్థాయిపైన 75,500 వద్ద, నిఫ్టీ 396 పాయింట్లు బలపడి 22,968 వద్ద జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి.  జూన్‌ 4 తర్వాత స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌ మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు సూచీల పరుగుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.

→ జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద  
సెన్సెక్స్‌ ర్యాలీతో బీఎస్‌ఈలో రూ.4.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.420 లక్షల కోట్లకు చేరింది.  

→ అదానీ గ్రూప్‌ షేర్లకు డిమాండ్‌ 
అదానీ గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో చోటు దక్కనుండడంతో ఈ గ్రూప్‌లోని తక్కిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మొత్తం గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 17.23 లక్షల కోట్లకు చేరింది.  

→ మెప్పించిన గో డిజిట్‌ 
ఆన్‌లైన్‌ వేదికగా బీమా సేవలు అందించే గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ షేరు లిస్టింగ్‌ మెప్పించింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.272)తో పోలిస్తే 3% లాభంతో ప్రీమియంతో రూ.281 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.314 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 12% లాభంతో రూ.306 వద్ద ముగిసింది. మార్కెట్‌ విలువ రూ.28,043 కోట్లుగా నమోదైంది.  

→ ఎన్‌ఎస్‌ఈ రికార్డ్‌
ఎన్‌ఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ తొలిసారి 5 ట్రిలియన్‌ డాలర్లను అధిగమించింది. గతేడాది డిసెంబర్‌లో 
4 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ మైలురాయిని        అందుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement