ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు.,
కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రభావం
ఫెడ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
ప్రపంచ పరిణామాలూ కీలకమే
ముంబై: దలాల్ స్ట్రీట్ ఈ వారం భారీ కొనుగోళ్లతో కళకళలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై మరింత స్పష్టత రావడంతో బుల్ పరుగులు తీసే వీలుందంటున్నారు. ఇక అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం నుంచి ఈ వారం మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే దేశీయ ద్రవ్యల్బోణ గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్‌ను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు.
డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం ప్రారంభమై, బుధవారం ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు, ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 76,795 వద్ద కొత్త రికార్డు నమోదుతో పాటు 2,732 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23,339 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మొత్తంగా 759 పాయింట్లు ఆర్జించింది.
కళ్లన్నీ ఫెడ్ సమావేశం పైనే..!
అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలుకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలి రేట్ల తగ్గింపు సెపె్టంబర్‌లోనా.? డిసెంబర్‌లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి.
ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి
దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో4.8శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐఐపీ డేటా 4.9% నుంచి 3.9 శాతానికి దిగిరావచ్చని భావిస్తున్నారు.
రూ.14,794 కోట్ల అమ్మకాలు
దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తొలి వారంలో రూ.14,794 కోట్లను వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.., అదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్ ఆకర్షణీయంగా ఇందుకు ప్రధాన కారణాలు. మరోవైపు డెట్ మార్కెట్‌లో రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇక మే నెలలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాల కారణంగా రూ.25,586 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా ఏప్రిల్‌లో రూ.8,700 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment