ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను హడలెత్తించాయి. ఎగబాకిన ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్యపాలసీ విధానానికి, ఆర్థిక అస్థిరతకు దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు వారాంతపు రోజున ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్ 1,017 పాయింట్లు నష్టపోయి 54,303 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 276 పాయింట్లు క్షీణించి 16,201 వద్ద నిలిచింది. స్టాక్ సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.3.11 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 2,52 లక్షల కోట్లకు దిగివచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్ వంటి అధిక వెయిటేజీ రంగాల షేర్లు డీలా పడటంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఎనిమిది మాత్రమే లాభాలతో గట్టెక్కాయి.
బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు రెండుశాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,974 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,831 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్, హాంగ్‌కాంగ్, కొరియా మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. ఈసారికి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.., రానున్న రోజుల్లో పెంపు తప్పదనే ఈసీబీ వ్యాఖ్యలతో యూరప్ మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు 2% నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,466 పాయింట్లు, నిఫ్టీ 383 పాయింట్లు చొప్పున పెరిగాయి.
నష్టాలు ఎందుకంటే..!
ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఈ పరిణామం దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇటీవల దేశంలో కరోనా కేసులు తిరిగి పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర(121.28డాలర్లకు) మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు రెండు నుంచి నాలుగుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం తదితర అంశాలూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► నష్టాల మార్కెట్లోనూ బజాజ్ ఆటో షేరు రాణించింది. రెండు శాతం లాభంతో రూ.3,965 వద్ద స్థిరపడింది. వచ్చేవారంలో జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ బైబ్యాక్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చనే వార్తలు షేరు ర్యాలీకి కారణమైంది.
► హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, శ్రీ సిమెంట్ షేర్లు ఈ వారంలో ఐదుశాతం నష్టాన్ని చవిచూశాయి.
► మెడ్‌ప్లస్ షేరు మూడుశాతం నష్టపోయి రూ.753 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment