ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి.
ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి.
కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్‌ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు.
► సెప్టెంబర్ క్వార్టర్‌లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్‌ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది.
► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది.
► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది.
► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment