downfall
-
నవంబర్‌లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్‌లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
20 శాతం తగ్గిన మొబైల్స్ ఉత్పత్తి
కోల్‌కత: మొబైల్స్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. 2022తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–ఏప్రిల్‌లో ఉత్పత్తి 20 శాతం వరకు క్షీణించింది. గడిచిన ఆరు నెలలుగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గుతుండడం ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ ప్రకారం.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 అక్టోబర్–డిసెంబర్లో 30 శాతం, 2023 జనవరి–మార్చిలో 18 శాతం స్మార్ట్‌ఫోన్స్ సరఫరా తగ్గింది. విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చిలో పడిపోయాయని భారత్‌లో అతిపెద్ద మొబైల్స్ రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణత.. కేవలం భారత్‌లో మాత్రమేగాక ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో మొబైల్ ఫోన్ పరిశ్రమపై ప్రభావం చూపుతోందని కార్బన్‌తోపాటు ఇతర కంపెనీలకు హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేస్తున్న జైనా గ్రూప్ ఎండీ ప్రదీప్ జైన్ తెలిపారు. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీలు ఉత్పత్తిని సవరించాయని అన్నారు. ఈ ఒత్తిడి కొన్నాళ్లు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ప్రీమియం సెగ్మెంట్ ఇప్పటికీ స్థితిస్థాపకంగా ఉంది. ప్రారంభ, మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో మొబైల్స్ సంస్థలు తయారీని 15–20% కుదించాయని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వివరించారు. పది వారాల నిల్వలు.. ప్రస్తుతం చాలా బ్రాండ్స్ వద్ద 10 వారాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని పాఠక్ వెల్లడించారు. ఉత్పత్తి విషయంలో కంపెనీలు జూన్ వరకు ఇదే స్థితిని కొనసాగిస్తాయని అన్నారు. రెండవ అర్ద భాగంగా చాలా కంపెనీలు స్వల్పంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని వివరించారు. ఉత్పత్తి తగ్గించడం ఈ ఏడాది ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్–జూలై, నవంబర్–డిసెంబర్లో సైతం కంపెనీలు తయారీని కుదించాయి. ఇది కేవలం 5–10 శాతం క్షీణతకే పరిమితం అయిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. మొబైల్స్ డిమాండ్ ఉత్సాహంగా లేదు. కానీ చెప్పుకోదగ్గ తగ్గుదల లేదని థర్డ్ పార్టీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ ఎండీ అతుల్ బి లాల్ తెలిపారు. కొన్ని సంస్థలు హ్యాండ్‌సెట్స్‌ను ఎగుమతి చేస్తున్నాయని గుర్తుచేశారు. -
డాలర్ కోటకు బీటలు! బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి....
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! సైనిక, ఆర్థిక దండోపాయాలతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా ప్రస్తుత పరిస్థితి ఇది. తన మాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందనుకుంటున్నారా? అదేమీ లేదు కాని, ఇన్నాళ్లూ ఏ డాలర్ అండ చూసుకొని అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమలదండులా కదం తొక్కుతున్నాయి. దాదాపు 80 ఏళ్లుగా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా రాజ్యమేలుతున్న డాలర్ కోటను బద్దలుగొట్టేందుకు కరెన్సీ వార్‌కు తెరతీశాయి. రష్యాపై ఎడాపెడా ఆంక్షలు విధించి, వేల కోట్ల డాలర్ల ఆస్తులను సీజ్ చేసిన అమెరికా, అలాగే పశ్చిమ దేశాలు భవిష్యత్తులో తమపైనా ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే దిక్కేంటంటూ మేల్కొంటున్నాయి. డాలర్ కరెన్సీ నిల్వలతో పాటు డాలర్లలో వాణిజ్యానికి నో చెబుతున్నాయి. రష్యా, చైనాతో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పలు దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో తమ సొంత కరెన్సీలను మాత్రమే ఉపయోగిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే సమీప భవిష్యత్తులోనే డాలర్‌తోపాటు అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. అసలు డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఎందుకు చలామణీలో ఉంది? డాలర్‌ను వదిలించుకోవడానికి ప్రపంచమంతా పరుగులు తీయడానికి కారణమేంటి? నిజంగా డాలర్ కుప్పకూలుతుందా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుందో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే! డాలర్‌కు లోకం దాసోహం! అన్ని దేశాలకూ తమ సొంత కరెన్సీలు ఉన్నా, లోకమంతా డాలర్ల వెంటే పరిగెడుతోంది. కేవలం అంతర్జాతీయ వాణిజ్యంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ లావాదేవీల్లో అత్యధిక శాతం డాలర్లలోనే జరుగుతాయి. ప్రపంచంలోని ఏ మారుమూలకెళ్లినా డాలర్ చెల్లుతుంది. డాలర్‌కు అత్యధికంగా స్టోర్ వేల్యూ ఉండటం వల్ల అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ మెజారిటీ విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వలను డాలర్లలోనే కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ వెలుగొందుతోంది. (ఎయిర్‌లాండర్ ఎగిరితే.. పెద్ద ఓడ గాల్లో తేలిపోతున్నట్లే!) అంతర్జాతీయంగా డాలర్లు కుప్పలుతెప్పలుగా చలామణీలో ఉండటం వల్ల అమెరికాలో వడ్డీరేట్లు కృత్రిమంగా ఎప్పుడూ కనిష్ఠ స్థాయిల్లోనే కొనసాగేందుకు తోడ్పడింది. ఈ చౌక డబ్బుతో అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, ఇళ్లు, కార్లు, ఇలా సకల సౌకర్యాలను ఆ దేశ పౌరులు అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు, అక్కడి ఎకానమీ పరుగులకు; సూపర్ పవర్‌గా అవతరించి, ప్రపంచ పోలీసుగా వ్యవహరించడానికి ఈ డాలర్ దన్నే కారణం. అమెరికా ప్రభుత్వాలు భవిష్యత్తు పరిణామాలను పట్టించుకోకుండా లక్షల కోట్ల డాలర్లను ప్రింట్ చేయడం ద్వారానే ఇదంతా సాకారమైంది. ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అవ్వడం వల్ల డాలర్‌ను కంట్రోల్ చేయగలమన్న ధీమాతో ఎడాపెడా డాలర్ ప్రింటింగ్ చేసిన అమెరికా అప్పులకుప్పగా మారింది. 2022 నాటికి మొత్తం యూఎస్ అప్పు 31.5 ట్రిలియన్ డాలర్లు (జీడీపీతో పోలిస్తే 120 శాతం పైనే). ఈ డాలర్ అండతోనే వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్తాన్, లిబియా, సిరియా ఇలా అనేక దేశాలను యుద్ధాలతో నేలమట్టం చేసిన అమెరికాకు చివరికి అప్పులతిప్పలు మిగిలాయి. 25 ఏళ్ల క్రితం ప్రపంచ రిజర్వ్ కరెన్సీలో 72 శాతంగా ఉన్న డాలర్ వాటా ప్రస్తుతం 59 శాతానికి దిగొచ్చింది. ఇప్పుడు రష్యా, చైనాతో నేరుగా కయ్యానికి కాలుదువ్వుతున్న అగ్రరాజ్యానికి గూబ గుయ్యిమంటోంది. యుద్ధభూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ తామేంటో రుచి చూపిస్తున్నాయి ఈ రెండు దేశాలు. ఏకంగా డాలర్‌కే ఎసరు పెట్టేలా పావులు కదుపుతూ శ్వేతసౌధానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాను తవ్వుకున్న గోతిలోనే... తమ గుమ్మం ముందుకు నాటో విస్తరణను ఆపాలన్న రష్యా మాటను పెడచెవిన పెట్టిన అమెరికా, దాని మిత్ర దేశాలు... ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. డాలర్ పతనానికి ఆజ్యం పోసింది ఇదే! రష్యాపై ఆర్థిక ఆంక్షలతో పాటు ఆ దేశానికి చెందిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలను అమెరికా ఇంకా పశ్చిమ దేశాలు సీజ్ చేశాయి. ఇలా ఒక సార్వభౌమ దేశ ఆస్తులను స్తంభింపజేయడం చరిత్రలో ఇదే తొలిసారి. రష్యాను ఆర్థికంగా దివాలా తీయించేందుకు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుండి తొలగించాయి. ఈ చర్యలతో అమెరికా, యూరప్ దేశాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లయింది. ఇదీ చదవండి: దోమల దాడి తట్టుకోలేకపోతున్నారా..? ఇది చేతికి తొడుక్కుంటే... క్రూడ్‌తో సహా అనేక కమోడిటీల ధరలు ఆకాశాన్నంటి జనాలు గగ్గోలు పెట్టడంతో సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా వడ్డీరేట్లను పెంచాల్సిన పరిస్థితి తెలెత్తింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సహా నాలుగు బ్యాంకులు కుప్పకూలాయి. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. డాలర్ రూపంలో విదేశీ కరెన్సీ నిల్వలు కలిగిన ఏ దేశమైనా తనకు ఎదురుతిరిగితే రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా డాలర్‌ను వాడుకుంటుందన్న విషయం రష్యాపై ఏకపక్ష ఆంక్షల ఉదంతంతో తేటతెల్లమైంది. అమెరికా ఆధిపత్య ధోరణితో విసిగి పోయిన దేశాలన్నీ డాలర్‌ను వదిలించుకునే దిశగా చకచకా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ ఊహించని రీతిలో జోరందుకుంటోంది. ‘కింగ్ డాలర్’ ఎప్పుడు ఆవిర్భవించింది? వాస్తవానికి, 105 ఏళ్ల క్రితం డాలర్లలో ప్రపంచ దేశాల ఫారెక్స్ నిల్వలు సున్నా! 1900–1918 వరకు ప్రపంచంలో మూడు ప్రధాన కరెన్సీలు రాజ్యమేలాయి. అవి బ్రిటన్ పౌండ్, జర్మనీ మార్క్, ఫ్రెంచ్ ఫ్రాంక్. ఈ మూడు యూరోపియన్ దిగ్గజాలు అనేక దేశాలను తమ కాలనీలుగా చేసుకొని కొల్లగొట్టిన అసాధారణ సంపదే దీనికి కారణం. 1918 వరకు అసలు అమెరికా డాలర్ సోదిలోనే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ పూర్తిగా చితికిపోవడంతో డాలర్ ప్రాభవం మొదలైంది. యూరోపియన్ల యుద్ధకాంక్ష యూఎస్‌కు వరమైంది. రెండో ప్రపంచ యుద్ధంతో యూరప్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం కావడంతో డాలర్ దశ తిరిగింది. హిట్లర్ అధీనంలో ఉన్న ఫ్రాన్స్‌లో అమెరికా మిత్రదేశ బలగాలు విజయవంతంగా సముద్రదాడి చేయడంతో యూరప్‌పై శ్వేతసౌధం పట్టు బిగించింది. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న అమెరికా, ‘బ్రెటన్ వుడ్స్’ సంప్రదింపుల్లో బ్రిటన్, ఫ్రాన్స్‌ను గుప్పిట్లో పెట్టుకుంది. ఆ సందర్భంగానే ప్రఖ్యాత ఆర్థికవేత్త కీన్స్ ప్రపంచ తటస్థ రిజర్వ్ కరెన్సీగా డాలర్‌ను ప్రతిపాదించారు. దీనికి ఆమోదం లభించడంతో, డాలర్ ఆధిపత్యానికి పునాది పడింది. అయితే, 1947లో ప్రపంచ రిజర్వ్ కరెన్సీల్లో బ్రిటిష్ పౌండ్ వాటా 70 శాతం పైనే. మన రూపాయి కూడా పౌండ్తోనే ముడిపడి ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పకూలడం, భారత్ సహా అనేక దేశాలు స్వాతంత్య్రం పొందడంతో పౌండ్ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1954లో తొలిసారి అమెరికా డాలర్ 40 శాతం పైగా వాటాతో పౌండ్‌ను వెనక్కినెట్టి కింగ్‌గా అవతరించింది. 1980 నాటికి పౌండ్ వాటా 3 శాతానికి పడిపోవడం విశేషం! రిజర్వ్ కరెన్సీ హోదా అంటే..? ప్రపంచ దేశాల విదేశీ కరెన్సీ రిజర్వ్‌ల (ఫారెక్స్ నిల్వలు) ఆధారంగా రిజర్వ్ కరెన్సీని పేర్కొంటారు. ఎక్కువ నిల్వలు ఏ కరెన్సీలో ఉంటే అది ప్రపంచ రిజర్వ్ కరెన్సీ కింగ్‌గా నిలుస్తుంది. ఉదాహరణకు, భారత్‌కు ఉన్న దాదాపు 580 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వల్లో అత్యధిక మొత్తం అమెరికా డాలర్లలోనే ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం అమెరికా బాండ్లలో పెట్టుబడుల రూపంలో, మరికొంత వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, విదేశీ వాణిజ్య బ్యాంకులు, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో యూరో, జపాన్ యెన్, చైనా యువాన్ వంటి ఇతర కరెన్సీల్లో నిల్వ చేస్తుంది. ఇక బంగారం రూపంలో కూడా కొన్ని ఫారెక్స్ నిల్వలను కొనసాగిస్తుంది. అంటే టాప్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న డాలర్‌లోనే దాదాపు ప్రపంచ దేశాలన్నీ తమ ఫారెక్స్ నిల్వలను ఉంచుతాయి. దీనికి కారణం విదేశీ ఎగుమతి–దిగుమతులు, విదేశీ రుణాలకు సంబంధించిన చెల్లింపులు, ఇతరత్రా కరెన్సీ లావాదేవీలన్నీ డాలర్ల రూపంలో జరగడమే. డాలర్ ఆధిపత్యంతో పాటు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలనూ తమ గుప్పిట్లో పెట్టుకున్న అమెరికా, పశ్చిమ దేశాలు... రుణాల ఎరతో అనే దేశాల ప్రభుత్వాలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నాయి కూడా. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు డాలర్‌పై తిరుగుబాటు చేయడానికి ఇదీ కారణమే! మరోపక్క, అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు, చెల్లింపులను నిర్వహించేందుకు ఏర్పాటైన స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్)పై అమెరికా, యూరప్ దేశాలు పెత్తనం చలాయిస్తున్నాయి. రష్యాను ఈ పేమెంట్ వ్యవస్థ నుంచి ఏకపక్షంగా వెలివేయడం దీనికి నిదర్శనం. స్విఫ్ట్‌లో డాలర్, యూరో కరెన్సీ లావాదేవీలే అత్యధికంగా ఉండటంతో పశ్చిమ దేశాలు దీన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నాయి. డాలర్ రిజర్వ్ హోదా కోల్పేతే... డీ–డాలరైజేషన్.. అంటే అమెరికా అలాగే పశ్చిమ దేశాల ఫైనాన్షియల్ వ్యవస్థ నుంచి ప్రపంచ దేశాలు విడిపోవడం అనేది ఏడాదో రెండేళ్లలోనే జరిగే ప్రక్రియ కాదు. రష్యాపై ఆంక్షల తర్వాత ఇప్పుడిప్పుడే మొదలైన ఈ చర్యలు రాబోయే కొన్నేళ్లలో డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాకు కచ్చితంగా చరమగీతం పలుకుతాయనేది మెజారిటీ ఆర్థికవేత్తల మాట. వచ్చే ఐదేళ్లలో డీ–డాలరైజేషన్ కారణంగా ఇతర దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోతుందంటూ స్వయంగా యూఎస్ సెనేటర్ మార్కో రూబియో అంచనా వేయడం గమనార్హం. రష్యా విషయంలో ఆంక్షలు బ్యాక్‌ఫైర్ అవ్వడమే దీనికి సంకేంతం. అంతేకాదు వచ్చే కొన్నేళ్లలో ప్రధాన దేశాలన్నీ తమ సొంత కరెన్సీల్లో (ప్రతిపాదిత బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీతో సహా) వాణిజ్య, ఇతరత్రా లావాదేవీలు నిర్వహించుకోవడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వాటా క్రమంగా తగ్గిపోతుంది. దీంతో డాలర్‌కు డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. అమెరికా బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, ఇతర సెంట్రల్ బ్యాంకుల వద్దనున్న డాలర్ నిల్వలను తగ్గించుకోవడాన్ని చాలా దేశాలు వేగవంతం చేస్తాయి. దీనివల్ల డాలర్ స్టోర్ విలువ మరింత పడిపోతుంది. వడ్డీరేట్లు భారీగా ఎగబాకే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అమెరికా ట్రెజరీ బ్రాండ్స్‌ను కొనే దేశాలు కరువవ్వడంతో ఇప్పటిలాగే డాలర్లను ఇష్టానుసారం ప్రింట్ చేసే అవకాశం ఉండదు. బడ్జెట్ లోటు విపరీతంగా పెరిగిపోతుంది. ధరలు అంతకంతకూ కొండెక్కి అతి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అంతి మంగా దిగుమతులు గుదిబండగా మారడంతో పాటు అమెరికా ప్రభుత్వ రుణ చెల్లింపులు కష్టతరంగా మారతాయి. నిధుల కోసం పన్నులు పెంచాల్సి వస్తుంది. అంతేకాదు, మనీ ప్రింటింగ్‌కు గండిపడటంతో, సైనిక వ్యయం పడిపోయి మిలిటరీ పరంగా కూడా ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తం మీద తాజా పరిణామాలు వేగం పుంజుకుంటే డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ హోదాతో పాటు రాజకీయంగా అమెరికా ‘సూపర్ పవర్’ ప్రాభవం కూడా మసకబారుతుందనేది నిపుణుల విశ్లేషణ! చైనా–రష్యా–భారత్ భాయీ భాయీ.. ‘100 ఏళ్లలో జరగని మార్పులను ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. మనం కలసి ముందుకు సాగితే ఈ మార్పులు సాక్షాత్కరిస్తాయి’ అంటూ పుతిన్‌తో జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం డాలర్ కోటను బద్దలు కొట్టడమే! రష్యా ఇప్పటికే యూరప్‌తో పాటు పలు దేశాలకు రూబుల్స్‌లో మాత్రమే చమురు, గ్యాస్ ఇతరత్రా ఉత్పత్తులను విక్రయిస్తోంది. సౌదీ, ఇరాన్ సైతం తమ సొంత కరెన్సీల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతులకు సై అంటున్నాయి. తద్వారా పెట్రో డాలర్‌కు షాక్ తగిలింది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు కమోడిటీలదే అత్యధిక వాటా. ఇక ఇప్పుడు ఏకంగా డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాకు గురిపెట్టి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో వాణిజ్యాన్ని చైనా కరెన్సీ యువాన్లతో జరుపుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. మరోపక్క, రష్యాపై అమెరికా ఆంక్షలకు చెక్ చెప్పేందుకు భారత్, చైనా రంగంలోకి దిగాయి. రష్యా నుంచి యథేచ్ఛగా క్రూడ్ ఇతరత్రా కమోడిటీలను కొనుగోలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుండి భారత్ క్రూడ్ దిగుమతులు ఏకంగా 22 రెట్లు ఎగబాకాయి (రోజుకు 1.6 మిలియన్ బ్యారెల్స్). రష్యాతో పెనవేసుకున్న భారత్ మైత్రికి ఇది తర్కాణం. చైనా సైతం రష్యాతో వాణిజ్యాన్ని 30 శాతం పెంచుకుంది. గత ఏడాది రష్యా నుంచి చైనాకు 80 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు జరగగా, రష్యా నుంచి చైనాకు ఏకంగా 110 బిలియన్ డాలర్లకు పైగా దిగుమతులు జరిగాయి. ఈ మొత్తం వాణిజ్యం లో మూడు దేశాలు తమ సొంత కరెన్సీలనే ఉపయోగిస్తుండం డాలర్‌కు మరో బిగ్ షాక్! అమెరికా పక్కలో ‘బ్రిక్స్’ బల్లెం.. ప్రపంచ భౌగోళిక రాజకీయాలనే కాదు ఆర్థిక వ్యవస్థను సైతం శాసించేలా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి అంతకంతకూ బలోపేతం అవుతోంది. ప్రపంచ పెత్తనం చేస్తున్న జీ7 దేశాల (అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఇటలీ, యూరోపియన్ యూనియన్‌తో సహా) జీడీపీని 5 బ్రిక్స్ దేశాల జీడీపీ (కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా) అధిగమించడం విశేషం. ప్రపంచ జీడీపీలో జీ7 దేశాల వాటా ప్రస్తుతం 30 శాతానికి పడిపోగా, బ్రిక్స్ దేశాల జీడీపీ వాటా 31.5 శాతానికి చేరింది. అంతేకాదు, సాధారణ జీడీపీలో సైతం ఇప్పటికే బ్రిక్స్ కూటమి అమెరికా జీడీపీని మించిపోయింది. 2035 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమించి చైనా నంబర్ వన్ అవుతుందని బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచానా వేసింది. భారత్ సైతం 2075కల్లా అమెరికాను మించిపోతుందని జోస్యం చెప్పింది. మరోపక్క, బ్రిక్స్ కూటమి విస్తరణతో బ్రిక్స్ ప్లస్‌గా అవతరించే చర్యలు పుంజుకున్నాయి. కీలకమైన సౌదీ అరేబియాతో పాటు ఇరాన్, అర్జెంటీనా, నైజీరియా, యూఏఈ, ఈజిప్ట్, అల్జీరియా, మెక్సికో, వెనెజులా ఇలా మొత్తం 12 దేశాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఇదిలాఉంటే, బ్రిక్స్ కూటమి తమ సొంత కరెన్సీ దిశగా అడుగులేస్తోంది. స్విఫ్ట్ స్థానంలో సొంత పేమెంట్ వ్యవస్థను నెలకొల్పనుంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా బ్రిక్స్ బ్యాంక్ కార్యకలాపాలను పెంచుకుంటోంది. చైనా పర్యటనలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా.. డాలర్ బదులు సొంత కరెన్సీలలో వాణిజ్యానికి పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి మరింత విస్తరించి.. కరెన్సీ, పేమెంట్ వ్యవస్థ సాకారమైతే డాలర్‌కు నిజంగా మరణ శాసనమేనని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. గల్ఫ్.. గుడ్‌బై! చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ మూడోసారి పగ్గాలు చేపట్టాక రష్యాతో మరింత సన్నిహితం కావడంతో పాటు దౌత్యపరంగానూ సత్తా చాటుతున్నారు. దశాబ్దాలుగా వైరం ఉన్న సౌదీ, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చి అమెరికాకు షాకిచ్చారు. టర్కీ–సిరియా మధ్య సంధి కుదిర్చేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. సౌదీ సైతం యెమెన్‌తో యుద్ధానికి ముగింపు పలికేలా అడుగులేస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇన్నాళ్లూ అడిస్తున్న యుద్ధతంత్రానికి ఈ పరిణామాలు చెల్లు చెప్పే అవకాశం ఉంది. మరోపక్క ఇరాన్, సౌదీ నుంచి ఇకపై చైనా యువాన్‌లోనే క్రూడ్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైతం తమ సొంత కరెన్సీలో ట్రేడింగ్‌కు సై అంది. సౌదీ, రష్యాలు సైతం తమ వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పలు రిఫైనరీలను చైనాలో సౌదీ ఆరామ్కో నిర్మించనుంది. ఇందుకు యువాన్లలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. తొలిసారిగా చైనా బ్యాంకుల నుంచి సౌదీ యువాన్లలో రుణాల కోసం డీల్ కుదుర్చుకుంది కూడా. క్రూడ్ ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌తో పాటు అరబ్ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా యువరాజు సల్మాన్ ఇప్పుడు అమెరికాకు పూర్తిగా ముఖం చాటేస్తుండటం విశేషం. గ్లోబల్ సౌత్.. డాలర్ టార్గెట్! బ్రిక్స్ దేశాలకు తోడు ఇప్పుడు ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం డాలర్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. డాలర్ అవసరం లేకుండా ఇకపై నేరుగా తమ సొంత కరెన్సీలోనో లేదంటే చైనా యువాన్లోనో వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలు ఓకే అంటున్నాయి. ముఖ్యంగా భారత్ మలేషియా, టాంజానియాతో రూపాయిల్లో వాణిజ్యానికి డీల్ కుదుర్చుకుంది. మరో 18 దేశాలతో కూడా ఇదేవిధమైన ఒప్పందాలకు రెడీ అవుతోంది. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ తమ సొంత డిజిటల్ పేమెంట్ వ్యవస్థతో స్థానిక కరెన్సీలో సెటిల్మెంట్కు తెరతీశాయి. ఇప్పుడు 10 దేశాల ఆసియాన్ కూటమి తమ మధ్య వాణిజ్యానికి ఇదే వ్యవస్థను వాడుకోవాలని చూస్తోంది. చైనా పర్యటన సందర్భంగా మలేషియా ప్రధాని ఇబ్రహీమ్, ఐఎంఎఫ్ ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు ఆసియా మానిటరీ ఫండ్ (ఏఎంఎఫ్)ను ప్రతిపాదించడం గమనార్హం. తొలిసారిగా యూఏఈ నుంచి చైనా యువాన్లలో గ్యాస్ (ఎల్ఎన్జీ)ను కొనుగోలు చేస్తోంది. ఇక ఆఫ్రికా దేశాలూ డాలర్‌ను డంప్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. కెన్యా ఇకపై సౌదీ, యూఏఈ నుంచి తమ సొంత కరెన్సీలో క్రూడ్ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈజిప్ట్ బ్రిక్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవీ అయితే వీసా, మాస్టర్‌కార్డ్‌ల వినియోగాన్ని దేశంలో ఆపేయాలని పిలుపునివ్వడం విశేషం. ఇక లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ తమ ఎగుమతిదారులకు యువాన్ చెల్లింపుల వ్యవస్థను అమల్లోకి తీసుకొ స్తోంది. బ్రెజిల్, అర్జెంటీనా లాటిన్ అమెరికా ఉమ్మడి కరెన్సీ ప్రయత్నాల్లో ఉన్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలు, కుట్రలు, ప్రభుత్వ కూల్చివేతలకు గురైన ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలన్నీ డాలర్‌పై మూకుమ్మడి ఎటాక్ మొదలెట్టాయి. దీంతో డాలర్, మిలిటరీ, విభజించు–పాలించు... ఈ మూల స్తంభాలపై నిలబడిన శ్వేత సౌధం పునాదులు ఇప్పుడు ఒక్కసారిగా కదిలిపోతున్నాయి. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, ఆర్థిక ముఖచిత్రాన్ని చూస్తుంటే.. డాలర్‌తో పాటు అమెరికా ఆధిపత్యానికి తెరదించేందుకు మరెంతో కాలం పట్టదనే విషయం కళ్లకు కడుతోంది. - శివరామకృష్ణ మిర్తిపాటి -
టాటా కమ్యూనికేషన్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 326 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 365 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం స్వల్ప వృద్ధితో రూ. 4,587 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,263 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 21% ఎగసి రూ. 1,796 కోట్లను తాకింది. 2021– 22లో రూ. 1,482 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 17,838 కోట్లను అధిగమించింది. 2021–22లో రూ. 16,725 కోట్ల ఆదాయం మాత్రమే నమోదైంది. ఫలితాల నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 1,226 వద్ద ముగిసింది. -
నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న వేళ...ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది. -
భారత్ కార్పొరేట్ ఆదాయాలు 12% డౌన్!
ముంబై: భారత్ కార్పొరేట్ ఆదాయాలు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022–23, జనవరి–మార్చి) 10 నుంచి 12 శాతం పడిపోతాయని భావిస్తున్నట్లు క్రిసిల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ తాజా నివేదిక పేర్కొంది. 2021–22 ఇదే కాలంలో ఆదాయాల వృద్ధి 22.8 శాతంగా ఉంది. కంపెనీలు నాల్గవ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో తాజా నివేదిక వెలువడ్డం గమనార్హం. 47 రంగాలకు చెందిన 300 కంపెనీల గణాంకాల విశ్లేణలనకు అనుగుణంగా తాజా నివేదిక వెలువడింది. హై బేస్ కూడా తాజా అంచనాలు ‘తగ్గించడానికి’ కారణమని క్రిసిల్ వర్గాలు వెల్లడించాయి. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2021–22లో కంపెనీల ఆదాయాల వృద్ధి 27 శాతం కాగా, 2022–23లో ఇది 19 నుంచి 21 శాతానికి పరిమితం కానుంది. ► నిర్వహణా లాభాలు కేవలం 3 శాతంగా ఉండనుంది. ► కంపెనీల ఆదాయాలపై ఎగుమతుల మందగమన ప్రభావం పడనుంది. ► వస్తువులు, ఎగుమతి ఆధారిత రంగాలైన టెక్స్టైల్స్, రత్నాలు–ఆభరణాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ఎనేబుల్డ్ సర్వీసుల ఆదాయాలు తగ్గుముఖం పట్టాయి. ► 2022లో మేలో ఎగుమతి సుంకాలు విధించడం వల్ల స్టీల్ ఉత్పత్తి సంస్థల ఆదాయాలు 7 నుంచి 9 శాతం వరకూ పడిపోవచ్చు. అంతర్జాతీయ మందగమన పరిస్థితులూ దీనికి కారణం కావచ్చు. ► మందగమనం వల్ల అల్యూమినియం ఇండస్ట్రీ ఆదాయాలు కూడా 17 నుంచి 19 శాతం వరకూ పడిపోవచ్చు. ► ఎయిర్‌లైన్స్, హోటళ్లు, మీడియా, వినోదం, రిటైల్ వంటి వినియోగదారుల విచక్షణ ఉత్పత్తులు ఆదాయ వృద్ధికి దారితీశాయి. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) వంటి వినియోగదారులకు డిమాండ్ వృద్ధి కొనసాగుతుంది. ► హోటళ్ల పరిశ్రమల 98 శాతం పురోగమించే వీలుంది. ఎయిర్‌లైన్స్ 67 శాతం శాతం పెరిగితే, టెల్కోల ఆదాయాలు 13 శాతం పెరిగవచ్చు. ► ముడి చమురు, నాన్–కోకింగ్ బొగ్గు వంటి కీలకమైన ఎనర్జీ సంబంధ కమోడిటీల ధరలు వాటి గరిష్ఠ స్థాయిల నుండి దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. మందగమన ప్రపంచ డిమాండ్ ప్రభావాన్ని ఈ ‘తగ్గిన ధరలు’ పాక్షికంగా భర్తీ చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, వాణిజ్య పరిమాణాలు పెరగడం వల్ల కార్పొరేట్ల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది. -
కుప్పకూలిన క్రిప్టో కరెన్సీ విలువ
-
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల ఫారెక్స్ డౌన్
ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి. అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది. తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్‌లుక్‌తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. – ఫిచ్ రేటింగ్స్ -
ఢిల్లీలో వరుణుడి ఉగ్రరూపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుణ దేవుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో ఏకంగా 74 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2007 తర్వాత నగరంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇది రెండోసారి. శనివారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వర్షాల వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. వాయు నాణ్యత మెరుగుపడింది. గాలి నాణ్యత సూచి ఆదివారం ఉదయం 9 గంటలకు 54గా నమోదయ్యింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం ఇది ‘గుడ్’ కేటగిరీలోకి వస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది ప్రస్తుత సీజన్లో సగటు కంటే తక్కువే కావడం గమనార్హం. శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలు కాగా, శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు. రెండింటి మధ్య వ్యత్యాసం 2.6 డిగ్రీలు. నగరంలో 1969 తర్వాత ఇదే అతి తక్కువ వ్యత్యాసమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1998 అక్టోబర్ 19న ఈ వ్యత్యాసం 3.1 డిగ్రీలు నమోదయ్యందని చెప్పారు. నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ఢిల్లీలో రుతుపవనాలు గత నెల 29న వెనక్కి మళ్లాయి. రుతుపవనాల సీజన్ ముగిసింది. పశ్చిమ వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. -
కాంగ్రెస్ మునగడంలో క్రియాశీలక పాత్ర గులాం నబీ ఆజాద్‌దేనా?
ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఆయన తిరుగులేని నేత. ఏ రాష్ట్రానికి ఇన్‌చార్జీగా వెళితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం. పార్టీలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని బెదిరించే పనిలో కూడా ఉండేవారు. అయినా వినకుండా సొంతంగా పార్టీ పెట్టుకుంటే కేసులు పెట్టించడంలో క్రియాశీలక పాత్ర. కానీ ఇప్పుడు అదే నేత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఏభై ఏళ్లపాటు కాంగ్రెస్‌లో అనేక పదవులు అనుభవించి, పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో పడవ నుంచి జంప్ చేసేశారు. ఆయనే కేంద్ర మాజీ మంత్రి, జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నారు. చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేమని అనడానికి ఇది కూడా నిదర్శనమే అవుతుంది. గతంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అత్యంత విధేయుడుగా ఆజాద్ పేరొందారు. అలాంటి వ్యక్తి పార్టీకి ఎందుకు దూరం అయ్యారంటే రకరకాల విశ్లేషణలు వస్తాయి. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అసమర్దతా? లేక వారిలో ప్రజాకర్షణ కొరవడిపోయిందన్న భావనా? అజాద్ రాజకీయ స్వార్థ చింతనా? తనకు మళ్లీ రాజ్యసభ ఇవ్వలేదన్న ఆక్రోశమా? బీజేపీ విసిరిన గాలమా?.. ఇలా రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. ఇవన్ని వాస్తవాలే కావచ్చు. అజాద్ చిన్నవయసులోనే పార్టీలో యాక్టివ్ అయ్యారు. దానికి తగినట్లే పదవులు కూడా వచ్చాయి. పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షనేత హోదాను అనుభవించారు. కానీ గతసారి ఆయనకు మళ్లీ ఆ పదవి ఇవ్వలేదు. కర్ణాటకకు చెందిన మరో సీనియర్ నేత మల్లిఖార్జున్‌కు అవకాశం ఇచ్చారు. అలాగే తమిళనాడు కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రాజ్యసభ సీటును రెన్యూ చేశారు. ఇవన్ని ఆయనకు అవమానంగా మారాయి. మరో వైపు కాంగ్రెస్‌లో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతలలో ఈయన ప్రముఖుడు, అప్పటి నుంచే తేడా వచ్చిందన్న సంగతి అర్ధం అయింది. పుండు మీద కారం చల్లినట్లు రాజ్యసభలో అజాద్ రిటైర్ అయిన రోజున ప్రధాని మోదీ ఈయన పట్ల చూపిన జాలి కాంగ్రెస్ వారికే ఆశ్చర్యం కలిగించింది. ఆజాద్‌ను మోదీ ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో అజాద్ బీజేపీలోకి వెళతారని, ఉప రాష్ట్రపతి అభ్యర్థి అవుతారని ఊహాగానాలు వచ్చాయి. అది జరగలేదు. మళ్లీ ఈ మధ్య కాంగ్రెస్‌లో కాస్త యాక్టివ్ అయ్యారు. ఈ తరుణంలో సడన్‌గా పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా, నాలుగు పేజీల లేఖ రాసి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. బాడీగార్డులు, పిఏలతోనే రాహుల్ సంప్రదిస్తారని, పిల్ల చేష్టలతో పరువు తీస్తుంటారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందులో కొన్ని వాస్తవాలు లేకపోలేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక కోర్టు తీర్పును పూర్వపక్షం చేయడం కోసం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చింది. ఆ తీర్పులో రెండేళ్ల శిక్ష పడితే ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి పోతుందని ఉంది. దానిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ప్రెస్‌క్లబ్‌లో మీటింగ్ పెట్టి మరీ చించివేశారు. దాంతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం బాగా డామేజీ అయింది. దానినే ఇప్పుడు అజాద్ కోట్ చేస్తున్నారు. అది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పటివరకు ఎందుకు అజాద్ ప్రశ్నించలేదంటే, అదే రాజకీయం. తన పదవి పోకుండా ఉండడం కోసం అజాద్ మాట్లాడలేదన్నమాట. కాంగ్రెస్‌ను వీడడమే కాకుండా కశ్మీర్లో ప్రాంతీయ పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. ఈయనకు మద్దతుగా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుంటే అధిష్టానానికి ఆగ్రహం వచ్చింది. దాంతో ప్రత్యర్ది పార్టీ అయిన తెలుగుదేశంతో కలిసి జగన్ పై కేసులు పెట్టింది. ఆ ప్రక్రియలో న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడంలో అజాద్ ది కూడా కీలకపాత్రే అన్న అభిప్రాయం ఉంది. ఆ ఒక్క పరిణామంతో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు.. తెలంగాణ ఏర్పాటు హామీ ఇవ్వడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించారు. 2004లో ఏపీలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికిగాను తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్, జి.వెంకటస్వామి వంటివారు పట్టుబట్టారు. ఆ టైమ్‌లో ఆనాటి కాంగ్రెస్ ముఖ్య నేత వైఎస్ రాజశేఖరరెడ్డి టీఆర్ఎస్తో పొత్తును వ్యతిరేకించారు. అయినా అజాద్ టి.కాంగ్రెస్ నేతల డిమాండ్ మేరకు కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ పొత్తు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్కు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. అవన్ని వెరసి కాంగ్రెస్ పతనానికి దారి తీశాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏపీ, తెలంగాణలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలలోకి వెళ్లిపోయారు. వారిలో డి.శ్రీనివాస్ కూడా ఒకరు. నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో అజాద్ ఒక విషయం బహిరంగంగానే చెప్పారు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని, పార్టీని వీడటం వల్ల కష్టాలు పడతారని హెచ్చరించారు. నిజంగానే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా తగ్గించాలన్న తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్టానం జగన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించి జైలులో పెట్టించిందన్న అభిప్రాయం ప్రజలలో ప్రబలింది. జగన్ ఫ్యాక్టర్, తెలంగాణ అంశం కలిసి ఏపీలో కాంగ్రెస్ సర్వనాశనం అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ను విలీనం చేసుకోవడంలో విఫలం అయి, కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించుకోలేకపోయింది. కేసీఆర్ వ్యూహరచన, స్పీడ్ ముందు కాంగ్రెస్ విలవిలలాడింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఇలా ఒక్కో పరిణామం తర్వాత మరో పరిణామం సంభవించడం ద్వారా కాంగ్రెస్ కునారిల్లే పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో శరద్ పవార్, మమత బెనర్జీ, మూపనార్,.. ఇలా అనేకమందిని కోల్పోతూ ఇప్పుడు గులాం నబీ అజాద్‌ను కూడా కాంగ్రెస్ పోగొట్టుకుంది. దీని ప్రభావం సహజంగానే దేశ స్థాయిలో కాంగ్రెస్‌పై పడుతుంది. కశ్మీర్లో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, తదుపరి బీజేపీతో పొత్తు పెట్టుకుని అజాద్ మళ్లీ రాజకీయాలలో కీలకమైన వ్యక్తి అవుతారా? లేదా అన్నది కాలమే తేల్చుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల వాటా డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) వాటాల విలువ వరుసగా మూడో త్రైమాసికంలోనూ క్షీణించింది. మార్నింగ్‌స్టార్ నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్–జూన్(క్యూ1)లో 14 శాతం నీరసించి 523 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్లో ఈ విలువ 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 జూన్ క్వార్టర్‌కల్లా 592 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశ, విదేశాలలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడుల్లో వెనకడుగు వేస్తున్నారు. దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువలోనూ ఎఫ్‌పీఐల వాటా మార్చిలో నమోదైన 17.8 శాతం నుంచి 16.9 శాతానికి నీరసించింది. 2022 జూన్ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు 13.85 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించారు. మార్చి క్వార్టర్లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 14.59 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే కావడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన నిర్ణయాల నేపథ్యంలో ఎఫ్‌పీఐల సెంటిమెంటు బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా బాండ్ల ఈల్డ్స్ సైతం జోరందుకున్నట్లు తెలియజేసింది. వీటికి చమురు హెచ్చుతగ్గులు, కమోడిటీ ధరల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు జత కలిసినట్లు వివరించింది. -
నష్టాల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి. తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీయస్సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
మెప్పించని విప్రో
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ విప్రో లాభాలకు గండి పడింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 21 శాతం పతనమై జూన్ త్రైమాసికంలో రూ.2,564 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.18,252 కోట్ల నుంచి రూ.21,529 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.3,243 కోట్లుగా ఉంది. డాలర్లలో చూస్తే ఆదాయం 17 శాతానికి పైగా పెరిగి 2,735 డాలర్లుగా ఉంది. క్వార్టర్ వారీగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 2 శాతం తగ్గి 15 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 2,817–2872 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని, సీక్వెన్షియల్‌గా (జూన్ త్రైమాసికంతో పోలిస్తే) 3–5 శాతం మధ్య వృద్ధి నమోదు కావచ్చని కంపెనీ పేర్కొంది. ‘‘విప్రో వృద్ధి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాం. వీటి ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆర్డర్ల పుస్తకం వార్షికంగా చూస్తే కాంట్రాక్టు విలువ పరంగా 32 శాతం పెరిగింది. పెద్ద డీల్స్ సొంతం చేసుకున్నాం. నేడు ఆర్డర్ల పైపులైన్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. మా వ్యాపార వృద్ధికి వీలున్న చోట పెట్టుబడులు కొనసాగిస్తాం. మా క్లయింట్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడంపై దృష్ట సారిస్తాం’’అని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్టే తెలిపారు. ఆపరేటింగ్ మార్జిన్లు 15 శాతంగా ఉన్నాయంటే కనిష్ట స్థాయికి చేరుకున్నట్టేనని కంపెనీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సంఖ్య 15,446 పెరిగి 2.58 లక్షలకు చేరింది. -
అరకొరగానే వరి! కారణాలివేనా? కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరి సాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం జరగడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఈ నెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరి సాగవగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగు జరిగింది. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. వరికి స్వల్పం..ఇతర పంటలకు భారీగా.. రుతుపవనాల వైఫల్యానికి తోడు ఈ ఏడాది వరి మద్దతు ధరను కేవలం రూ.100 మాత్రమే పెంచడం..రైతులు వరి సాగుకు మొగ్గు చూపక పోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు వంట నూనెలు, పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా వాటి మద్దతు ధరలను కేంద్రం గణనీయంగా పెంచింది. ఈ కారణంగానే రైతులు వరి సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడే ప్రమాదముంది. ఈ దృష్ట్యా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వరి నాట్లు పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలను కోరారు. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే మంచి ధర వస్తుందని తెలిపారు. -
కార్మిక శక్తి సర్వే.. దేశంలో నిరుద్యోగం తగ్గిందట!?
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం (15 ఏళ్లు, అంతకుమించి) ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) 8.2 శాతానికి తగ్గింది. 2021 మొదటి మూడు నెలల్లో 9.3 శాతంగా ఉండడం గమనించాలి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన ‘14వ కార్మిక శక్తి సర్వే’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2021 మొదటి 3 నెలల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండడానికి కరోనా నియంత్రణ కోసం దీర్ఘకాలం పాటు విధించిన లాక్డౌన్ల ప్రభావం ఉంది. ఇక గతేడాది చివరి మూడు నెలల్లో (2021 అక్టోబర్–డిసెంబర్) నిరుద్యోగం 8.7 శాతంగా ఉంది. అంటే త్రైమాసికం వారీగా చూసినా ఉపాధిలేని వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ► మహిళల్లో నిరుద్యోగ రేటు 2022 జనవరి–మార్చి మధ్య 10.1 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11.8 శాతం. 2021 చివరి త్రైమాసికంలో 10.5 శాతంగా ఉంది. ► పురుషుల్లో ఉపాధి లేకుండా ఉన్న వారి రేటు 2022 మొదటి త్రైమాసికంలో 7.7 శాతానికి తగ్గింది. అంతక్రితం త్రైమాసికంలో ఇది 8.3 శాతంగా ఉంది. ఇక ఏడాది క్రితం ఇదే కాలంలో 8.6 శాతంగా ఉండడం గమనించాలి. ► పట్టణాల్లో నిరుద్యోగ రేటు 47.3 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ ఇది 47.3 శాతంగా నమోదైంది. ► పట్టణ ప్రాంతాల్లో పురుష నిరుద్యోగులు 7.7 శాతంగా ఉన్నారు. ఏడాది క్రితం ఇది 8.6 శాతంగా ఉంటే, గతేడాది చివరి మూడు నెలల్లో 8.3 శాతంగా ఉంది. చదవండి: శాంసంగ్ షాకింగ్ నిర్ణయం..ఆ సిరీస్ ఫోన్ తయారీ నిలిపివేత! ఎందుకంటే! -
మార్కెట్లో ద్రవ్యోల్బణం దడ
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను హడలెత్తించాయి. ఎగబాకిన ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్యపాలసీ విధానానికి, ఆర్థిక అస్థిరతకు దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు వారాంతపు రోజున ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్ 1,017 పాయింట్లు నష్టపోయి 54,303 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 276 పాయింట్లు క్షీణించి 16,201 వద్ద నిలిచింది. స్టాక్ సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.3.11 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 2,52 లక్షల కోట్లకు దిగివచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్ వంటి అధిక వెయిటేజీ రంగాల షేర్లు డీలా పడటంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఎనిమిది మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు రెండుశాతం చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,974 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,831 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్, హాంగ్‌కాంగ్, కొరియా మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. ఈసారికి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ.., రానున్న రోజుల్లో పెంపు తప్పదనే ఈసీబీ వ్యాఖ్యలతో యూరప్ మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు 2% నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,466 పాయింట్లు, నిఫ్టీ 383 పాయింట్లు చొప్పున పెరిగాయి. నష్టాలు ఎందుకంటే..! ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. ఈ పరిణామం దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపించింది. ఇటీవల దేశంలో కరోనా కేసులు తిరిగి పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర(121.28డాలర్లకు) మూడు నెలల గరిష్టానికి చేరుకుంది. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు రెండు నుంచి నాలుగుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం తదితర అంశాలూ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లోనూ బజాజ్ ఆటో షేరు రాణించింది. రెండు శాతం లాభంతో రూ.3,965 వద్ద స్థిరపడింది. వచ్చేవారంలో జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ బైబ్యాక్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చనే వార్తలు షేరు ర్యాలీకి కారణమైంది. ► హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, శ్రీ సిమెంట్ షేర్లు ఈ వారంలో ఐదుశాతం నష్టాన్ని చవిచూశాయి. ► మెడ్‌ప్లస్ షేరు మూడుశాతం నష్టపోయి రూ.753 వద్ద స్థిరపడింది. -
అదానీ పోర్ట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 1,033 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,072 కోట్ల నుంచి రూ. 4,418 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,527 కోట్ల నుంచి రూ. 3,309 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండు ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 4,795 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 5,049 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ 27 శాతం జంప్‌చేసి రూ. 15,934 కోట్లకు చేరింది. గంగవరం పోర్టును మినహాయించిన ఫలితాలివి. కాగా.. కార్గో పరిమాణం 312 ఎంఎంటీను తాకినట్లు కంపెనీ సీఈవో కరణ్ అదానీ వెల్లడించారు. ఒక్క ముంద్రా పోర్ట్‌లోనే 150 ఎంఎంటీ కార్గోను చేపట్టినట్లు తెలియజేశారు. దేశీయంగా ఏ ఇతర పోర్టులోనూ ఈ స్థాయి కార్గో నమోదుకాలేదని వెల్లడించారు. లాజిస్టిక్స్ స్పీడ్ అనుబంధ సంస్థ అదానీ లాజిస్టిక్స్ 29 శాతం అధికంగా 4,03,737 టీఈయూ రైల్ కార్గోను సాధించినట్లు అదానీ పోర్ట్స్ పేర్కొంది. గతేడాది రూ. 11,400 కోట్ల పెట్టుబడులను చేపట్టినట్లు ప్రస్తావించింది. ముంబై, ఇండోర్, పలావ్ల్, రనోలీ, విరోచన్‌నగర్‌లలో నిర్మిస్తున్న వేర్‌హౌసింగ్‌ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) జనవరి–మార్చికల్లా మొత్తం 4 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులోకి రానున్నట్లు వివరించింది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు 5.6 శాతం పతనమై రూ. 710 వద్ద ముగిసింది. -
రెండు నెలల్లో అతిపెద్ద పతనం
ముంబై: ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలతో స్టాక్ మార్కెట్ గురువారం రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్తో సహా దేశీయ కార్పొరేట్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నష్టాలకు ఆజ్యం పోశాయి. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు భారత వృద్ధి రేటు అవుట్‌లుక్‌ను 7.3 శాతానికి కుదించింది. దేశీయ మార్కెట్లో్ల విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, కొనసాగుతున్న రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 1,416 పాయింట్లు క్షీణించి 52,930 వద్ద ముగిసింది. నిఫ్టీ 431 పాయింట్లను కోల్పోయి 16 వేల దిగువున 15,809 వద్ద నిలిచింది. ఈ ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్ఈ స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా రెండున్నర శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో, నిఫ్టీ 50 షేర్లలో ఐటీసీ(3.50%), డాక్టర్ రెడ్డీస్(అరశాతం), పవర్‌గ్రిడ్(0.30%) మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, మెటల్స్ అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 4,900 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3,226 కోట్లను కొన్నారు. ట్రేడింగ్ ఆద్యంతం నష్టాలే.., ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,139 పాయింట్ల భారీ పతనంతో 53,070 వద్ద., నిఫ్టీ 323 పాయింట్లు క్షీణించి 15,917 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ మొదలు.., మార్కెట్ ముగిసే దాకా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేక పోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు క్షీణించి 52,670 వద్ద, నిఫ్టీ 465 పాయింట్లు నష్టపోయి 15,775 వద్ద కనిష్టాలను తాకాయి. భారీగా పతనమైన ప్రపంచ మార్కెట్లు యూఎస్ రిటైల్ దిగ్గజ సంస్థలు వాల్‌మార్ట్, అమెజాన్, క్రోగర్, కాస్ట్కోల రిటైల్ అమ్మకాలు బాగా తగ్గాయి. నీరసించిన గణాంకాలు మందగమన సంకేతాలు సూచిస్తున్నాయనే భయాలతో అక్కడి మార్కెట్లు బుధవారం.., 2020 జూన్ తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. వాల్‌మార్ట్ షేరు ఏకంగా 25 శాతం పడిపోయింది. ముప్పై ఏళ్లలో అతి పెద్ద క్షీణత ఇది. ట్రేడింగ్ ముగిసే సరికి దేశ ప్రధాన ఇండెక్సులు డోజోన్ 3.6%, నాక్‌డాక్ 4.7%, ఎస్అండ్పీ నాలుగుశాతం క్షీణించాయి. స్టాక్ ఫ్యూచర్లు సైతం గురువారం ఒకటిన్నర శాతం నష్టంతో కదలాడాయి. అమెరికా మార్కెట్ల పతనానికి తోడు చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లు రెండు శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లకు చెందిన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు 2.50% నష్టపోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో నష్టాల మార్కెట్లోనూ ఐటీసీ షేరు ఎదురీదింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 4.50% దూసుకెళ్లి రూ.279 వద్ద స్థాయిని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 3.5% లాభంతో రూ.276 వద్ద ముగిసింది. ► ప్రపంచ వ్యాప్తంగా ఐటీ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల సెగ దేశీయ ఐటీ షేర్లను తాకింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు 6శాతం నుంచి ఐదు శాతం నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో టాప్ లూజర్లన్నీ ఐటీ షేర్లే కావడం గమనార్హం. ► మార్కెట్లో అస్థిరతను సూచించే నిఫ్టీ వొలిటాలిటీ ఇండెక్స్ పది శాతానికి ఎగసి 24.56 స్థాయి వద్ద స్థిరపడింది. రూ.6.71 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ రెండున్నర శాతం నష్టంతో రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూడటంతో బీఎస్ఈలో రూ.6.71 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.249.06 లక్షల కోట్లకు దిగివచ్చింది. రూ‘పాయె’! 77.65కి రికార్డు పతనం ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్ ‘ముగింపు’లో కొత్త చరిత్రాత్మక కనిష్టాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం ముగింపుతో చూస్తే 3 పైసలు బలహీనపడి 77.65 వద్ద ముగిసింది. ఇప్పటి వరకూ రూపాయికి ఇంట్రాడే ‘కనిష్టం’ 77.79. మే 17వ తేదీన ఈ పతన స్థాయి నమోదయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు, అమెరికా, భారత్‌సహా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు దశలోకి ప్రవేశించడం, డాలర్ బలోపేత ధోరణి, దేశంలో ఈక్విటీల బలహీన పరిస్థితి నేపథ్యంలో రూపాయి పతన బాట పట్టింది. రూపాయి బుధవారం ముగింపు 77.62. గురువారం ట్రేడింగ్‌లో 77.72 బలహీనతతో ప్రారంభమైంది. 77.63కు బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. రూపాయి కొద్ది సెషన్లలోనే 78కి తాకడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
మణప్పురం లాభం పతనం
న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్ మార్చి త్రైమాసికం పనితీరు విషయంలో ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది. నికర లాభం 44 శాతం తరిగి రూ.261 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.468 కోట్లుగా ఉంది. అధిక ఈల్డ్ బంగారం రుణాలను, తక్కువ ఈల్డ్లోకి మార్చడం వల్ల లాభాలపై ప్రభావం పడినట్టు సంస్థ తెలిపింది. నిర్వహణ వ్యయాలను తగ్గించుకున్నట్టు పేర్కొంది. సూక్ష్మ రుణాల విభాగంలో నాణ్యమైన వృద్ధిపై, రుణ వసూళ్లపై, బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో బలోపేతంపై తాము దృష్టి సారిస్తామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం సైతం 10 శాతం తగ్గిపోయి రూ.986 కోట్లకు పరిమితమైంది. కానీ, డిసెంబర్ త్రైమాసికంలో ఉన్న రూ.953 కోట్లతో పోలిస్తే 3 శాతానికి పైగా పెరిగింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 9 శాతం తగ్గి రూ.1,481 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం రుణాల్లో రూ.2లక్షలకు పైన టికెట్ సైజువి 33 శాతంగా ఉంటాయని సంస్థ తెలిపింది. 2021–22 సంవత్సరానికి సంస్థ నికర లాభం 23 శాతం తగ్గి రూ.1,320 కోట్లుగా ఉంది. ఆదాయం 5 శాతం క్షీణించి రూ.6,061 కోట్లుగా నమోదైంది. -
ఈక్విటీల్లో తగ్గుతున్న ఎఫ్‌పీఐల వాటా
న్యూఢిల్లీ: భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మార్చి త్రైమాసికంలో పలుచబడింది. ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు కలిగి ఉన్న వాటాల విలువ మార్చి త్రైమాసికం చివరికి 612 బిలియన్ డాలర్లకు (రూ.47.12 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడుల విలువ 654 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో నిరాటంకంగా విక్రయాలు చేస్తుండడం తెలిసిందే. వారి వాటాల విలువ తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇక 2021 మార్చి నాటికి ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 552 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మొత్తం విలువ)లో ఎఫ్‌పీఐల వాటా విలువ పరంగా 18.3 శాతం నుంచి 17.8 శాతానికి తగ్గింది. మన దేశ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు ఎక్కువగా ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులను హోల్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆఫ్‌షోర్ ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్ రూపంలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారు. విక్రయాలు.. మార్నింగ్‌స్టార్ నివేదిక పరిశీలిస్తే.. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. 14.59 బిలియన్ డాలర్ల మేర (రూ.1.13 లక్షల కోట్లు) అమ్మకాలు చేశారు. జనవరిలో 4.46 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 4.74 బిలియన్ డాలర్లు, మార్చిలో 5.38 బిలియన్ డాలర్ల చొప్పున విక్రయాలు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోవడంతో విదేశీ ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది. ఈక్విటీల్లో రిస్క్ తీసుకునే ధోరణి తగ్గడంతో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ‘‘త్వరలోనే వడ్డీ రేట్లు పెంచుతానంటూ యూఎస్ ఫెడ్ చేసిన ప్రకటనతో మార్చి త్రైమాసికం ఆరంభంలోనే సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడాన్ని విదేశీ ఇన్వెస్టర్లు వేగవంతం చేశారు’’ అని మార్నింగ్ స్టార్ పేర్కొంది. ఆదుకున్న ఫండ్స్.. దేశీయంగా వృద్ధి ఆధారిత బడ్జెట్, కరోనా మూడో విడత సాధారణంగా ఉండడం కొంత ఉపశమనాన్ని ఇచ్చినట్టు మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది. విక్రయాల ఒత్తిడి కొద్దిగా తగ్గేలా సాయపడ్డాయి. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఇనిస్టిట్యూషన్స్ కొనుగోళ్ల ఈక్విటీ మార్కెట్లను చాలా వరకు ఆదుకున్నాయి. సిప్ రూపంలో ప్రతీ నెలా రూ.11వేల కోట్లకుపైనే పెట్టుబడులు వస్తుండడంతో.. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆకర్షణీయ వ్యాల్యూషన్లకు దిగొస్తున్న కంపెనీల్లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపిస్తుండడం గమనార్హం. ప్రతికూలంగా మారిన పరిస్థితులు చమురు ధరలు గణనీయంగా పెరిగిపోవడం, అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు విదేశీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. అమెరికాలో ఈ పరిస్థితులే రేట్ల పెంపునకు దారితీయడం తెలిసిందే. దీంతో ఎఫ్‌ఫీఐలు భారత ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి చివర్లో యుద్ధం మొదలు పెట్టగా.. రష్యాపై పలు దేశాల ఆంక్షలను చూసి ఇన్వెస్టర్లు అమ్మకాలను మరింత పెంచారు. అప్పటి నుంచి అస్సలు కొనుగోళ్ల వైపే వారు ఉండడం లేదు. 2018 తర్వాత ఫెడ్ మొదటిసారి రేట్లను పెంచడం కూడా ప్రతికూల సెంటిమెంట్‌కు దారితీసింది. మరిన్ని విడతలుగా రేట్లను పెంచనున్నట్ట కూడా ఫెడ్ స్పష్టం చేసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. 2022లో ఇప్పటి వరకు వారు చేసిన విక్రయాలు 18 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సమీప కాలంలోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో అమ్మకాలు కొనసాగించొచ్చని మార్నింగ్ స్టార్ నివేదిక అంచనా వేసింది. -
స్టార్టప్స్‌లోకి తగ్గిన వీసీ పెట్టుబడులు
ముంబై: గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో అంకుర సంస్థల్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థల పెట్టుబడులు సగానికి తగ్గాయి. 82 డీల్స్‌లో 1.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఏప్రిల్‌లో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు 27 శాతం క్షీణించి 5.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చితో పోలిస్తే మాత్రం 11 శాతం పెరిగాయి. కన్సల్టెన్సీ సంస్థ ఈవై, పరిశ్రమ గ్రూప్ ఐవీసీఏ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుతో లిక్విడిటీ (నిధుల లభ్యత) తగ్గవచ్చని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. అయితే, అంతర్జాతీయ ఫండ్ల దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు. పటిష్టమైన వృద్ధి రేటు సాధిస్తున్న భారత్, ఆ నిధులను దక్కించుకోవడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో వర్ధమాన మార్కెట్లకు సారథ్యం వహించవచ్చని వివేక్ వివరించారు. పెట్టుబడులకు రిస్కులు.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు, దేశీయంగా వడ్డీ రేట్ల పెరుగుదలతో పాటు రూపాయితో పోలిస్తే డాలర్ బలపడుతుండటం మొదలైనవి .. వృద్ధి అంచనాలు, పీఈ/వీసీ పెట్టుబడులకు కొంత ప్రతిబంధకాలుగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► ఏప్రిల్‌లో వర్స్ ఇన్నోవేషన్స్ అత్యధికంగా 805 మిలియన్ డాలర్లు సమీకరించింది. మీడియా, వినోద రంగంలో ఇది రెండో అతి పెద్ద డీల్. ► భారీ స్థాయి డీల్స్ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించడం కూడా తగ్గి 1.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో ఇది 2.7 బిలియన్ డాలర్లు. ► ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐపీవోలు.. వేల్యుయేషన్లు తగ్గే అవకాశం ఉంది. ► ఏప్రిల్‌లో 16 ఫండ్లు 1.5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎనిమిది ఫండ్లు 569 మిలియన్ డాలర్లు సేకరించాయి. భారత్‌లో పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఎలివేషన్ క్యాపిటల్ ఫండ్ ఈసారి అత్యధికంగా 670 మిలియ్ డాలర్లు దక్కించుకుంది. -
ఫెర్టిలిటీ తగ్గింది.. ఊబకాయం పెరిగింది
న్యూఢిల్లీ: భారత మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో విడత నివేదిక (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) వెల్లడించింది. జనాభా నియంత్రణ పద్ధతులను పకడ్బందీగా అమలు చేస్తుండటంతో సంతానోత్పత్తి సామర్థ్యం 2.2 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తెలిపింది. ఇది బిహార్ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2019–21 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు 707 జిల్లాల్లో 6.37 లక్షల ఇళ్లలో 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులతో మాట్లాడి నివేదిక రూపొందించారు. పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడేందుకు వీలుగా పౌరుల సామాజిక, ఆర్థిక, ఇతర నేపథ్యాలను కూడా సర్వేలో పొందుపరిచారు... సాధికారత సంకేతాలు... మహిళలు సాధికారత దిశగా దూసుకుపోతున్నారని సర్వే వివరాలు చెప్పకనే చెబుతున్నాయి. ► బ్యాంకు ఖాతాలున్న మహిళల సంఖ్య గత నాలుగేళ్లలో 53 నుంచి 79 శాతానికి పెరిగింది. ► కాలుష్యరహిత, పరిశుభ్రమైన వంట ఇంధనం వాడేవారి సంఖ్య 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగింది. ► పారిశుద్ధ్య సౌకర్యాలు 49 నుంచి 70 శాతానికి పెరిగాయి. ► కరోనా కాలంలో చేతులు పరిశుభ్రం చేసుకోవడం అలవాటుగా మారింది. ► నీళ్లు, సబ్బు సదుపాయాలున్న వారి సంఖ్య 60 నుంచి 78 శాతానికి పెరిగింది! ► 15–49 మధ్య వయసు వివాహితల్లో ఉద్యోగుల సంఖ్య 31 శాతం నుంచి 32కు పెరిగింది. పెరిగిన ఊబకాయం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4తో పోలిస్తే ఊబకాయం సమస్య దేశాన్ని బాగా వేధిస్తోంది. ఊబకాయుల సంఖ్య మహిళల్లో 21 శాతం నుంచి 24 శాతానికి, మగవారిలో 19 నుంచి 23 శాతానికి పెరిగింది. కేరళ, అండమాన్ నికోబర్ దీవులు, ఆంధ్రప్రదేశ్, గోవా, సిక్కిం, మణిపూర్, ఢిల్లీ, తమిళనాడు, చండీగఢ్, లక్షద్వీప్, పాండిచ్చేరిల్లో మూడో వంతుకు పైగా మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. పిల్లల్లో తగ్గిన కుంగుబాటు చిన్నారుల్లో కుంగుబాటు గత నాలుగేళ్లలో తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల్లో కుంగుబాటు 38 నుంచి 36 శాతానికి తగ్గినట్టు తేలింది. పట్టణాల (30 శాతం) కంటే గ్రామీణ బాలల్లో (37 శాతం) కుంగుబాటు ఎక్కువగా ఉంది. మహిళల్లో నాలుగో వంతు యుక్తవయసుకు ముందే పెళ్లాడారు దేశవ్యాప్తంగా 18–29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 25 శాతం మంది, 21–29 ఏళ్ల పురుషుల్లో 15 శాతం మంది యుక్త వయసుకు ముందే పెళ్లి చేసుకున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. భారత్‌లో అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు పెళ్లికి యుక్తవయసన్నది తెలిసిందే. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 42 శాతం మంది మహిళలకు యుక్తవయసుకు ముందే పెళ్లయింది. బిహార్ (40 శాతం), త్రిపుర (39), జార్ఖండ్ (35), ఏపీ (33), తెలంగాణ (27) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యుక్తవయసుకు ముందే తాళి కడుతున్న వాళ్ల అబ్బాయిల సంఖ్య బిహార్‌లో అత్యధికంగా 25 శాతంగా తేలింది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్ (24 శాతం), జార్ఖండ్ (22), అరుణాచల్‌ప్రదేశ్ (21) ఉన్నాయి. మొత్తమ్మీద బాల్య వివాహాలు తగ్గుముఖం పడుతున్నాయని సర్వే పేర్కొంది. 12 ఏళ్లపాటు, అంతకుమించి చదువుకునే అమ్మాయిలు మిగతా వారికంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని తెలిపింది. టీనేజీ తల్లుల సంఖ్య ముస్లింల్లో ఎక్కవగా (8 శాతం) ఉంది. గర్భ నిరోధక పద్ధతుల వాడకం పెరిగింది ► గర్భనిరోధక పద్ధతుల వాడకం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ► కుటుంబ నియంత్రణ పాటించని వారి సంఖ్య 13 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. ► ఆస్పత్రి ప్రసవాల సంఖ్య కూడా 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. ► గ్రామీణ ప్రాంతాల్లో కూడా 87 శాతం గర్భిణులు ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ఇది పట్టణ ప్రాంతాల్లో 94 శాతం. ► గర్భనిరోధం మహిళల బాధ్యతేనని 35.1 శాతం మంది పురుషులు భావిస్తున్నారు. వీరి సంఖ్య చండీగఢ్‌లో అత్యధికంగా (69) ఉంది. ► మహిళల్లో గర్భ నిరోధక పద్ధతుల వాడకం వివాహేతర సంబంధాలకు దారి తీయొచ్చని 19.6 శాతం మగవాళ్లు అనుమానిస్తున్నారు! ఇలా భావిస్తున్న వారి సంఖ్య కేరళలో అత్యధికంగా (44.1) ఉంది!! ► అబార్షన్ చేయించుకుంటున్న వారిలో దాదాపు సగం మంది అవాంఛిత గర్భాన్నే కారణంగా చెప్తున్నారు. ► వీరిలో 16 శాతం అబార్షన్ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలన్న ఆసక్తి ఉన్నా అవగాహన లేక, వాటి వాడకం తెలియక దంపతులు ఎక్కువ మందిని కనేవారు. ఆ పరిస్థితుల్లో మార్పు రావడం మంచి పరిణామం – కేంద్రం -
పసిడి డిమాండ్‌కు ధర దడ
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) 18 శాతం పడిపోయింది. 135.5 టన్నులుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ డిమాండ్ 165.8 టన్నులు. బంగారం ధరలు భారీగా పెరగడమే డిమాండ్ తగ్గడానికి కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది. ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2022 క్యూ1’ పేరుతో విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విలువ పరంగా జనవరి–మార్చి కాలంలో బంగారం డిమాండ్ 12 శాతం తగ్గి రూ.61,550 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది కాలంలో ఈ విలువ రూ.69,720 కోట్లు. ► జనవరిలో బంగారం ధరలు పెరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10 గ్రాముల ధర (పన్నులు లేకుండా) 8 శాతం పెరిగి రూ. 45,434కు చేరుకుంది. ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం. 2021 జనవరి– మార్చి మధ్య ధర రూ.42,045గా ఉంది. ► మార్చి త్రైమాసికంలో దేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 26 శాతం తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఇది 126.5 టన్నులు. ► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విలువ పరంగా ఆభరణాల డిమాండ్ 20 శాతం క్షీణించి రూ.42,800 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.53,200 కోట్లు. ► 2021 నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–నవంబర్–డిసెంబర్) ధర రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత, భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 26 శాతం తగ్గి 94 టన్నులకు పడిపోయింది. 2010 నుండి (మహమ్మారి కాలాలను మినహాయించి) భారత్ బంగారు ఆభరణాల డిమాండ్ 100 ట న్నుల దిగువకు పడిపోవడం ఇది మూడవసారి. ► శుభ దినాల సందర్భాల్లో నెలకొన్న మహమ్మారి భయాలు, బంగారం ధరలు గణనీయంగా పెరగడం వంటి అంశాలు రిటైల్ డిమాండ్ తగ్గడానికి కారణం. ఆయా కారణాలతో కుటుంబాలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్నాయి. ► ఈ ఏడాది మొత్తంగా బంగారానికి డిమాండ్ 800–850 టన్నులు ఉండవచ్చు. ► కాగా, మార్చి త్రైమాసికంలో బంగారం విషయంలో పెట్టుబడి డిమాండ్ 5 శాతం పెరిగి 41.3 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 39.3 టన్నులు. ► విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 13 శాతం పెరిగి రూ.18,750 కోట్లకు చేరుకుంది. ఇది 2021 అదే త్రైమాసికంలో రూ.16,520 కోట్లు. ► పెట్టుబడుల్లో ప్రధానంగా బంగారు కడ్డీలు, నాణేలు ఉన్నాయి. వీటి డిమాండ్ 5 శాతం పెరిగి 41 టన్నులకు చేరింది. ధరలు పెరగడం, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా బంగారాన్ని ఎంచుకోవడం, ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు పసిడి పెట్టుబడుల డిమాండ్‌కు మద్దతునిచ్చాయి. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. ఈ కాలంలో సెంట్రల్ బ్యాంక్ 8 టన్నులను కొనుగోలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ 2017 చివరి నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి 200 టన్నులను కొనుగోలు చేసింది. ► 2022 మొదటి త్రైమాసికంలో దేశంలో రీసైకిల్ అయిన మొత్తం బంగారం 88 శాతం పెరిగి 27.8 టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 14.8 టన్నులు. ► మార్చి త్రైమాసికంలో మొత్తం నికర బులియన్ దిగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 313.9 టన్నుల నుంచి 58 శాతం తగ్గి 132.2 టన్నులకు పడిపోయాయి. అంతర్జాతీయంగా మెరుపులు... కాగా, మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ 34 శాతం పెరిగి 1,234 టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు పసిడివైపు చూడ్డం, వంటి అంశాలు దీనికి కారణం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి డిమాండ్ భారీగా వచ్చిందని నివేదిక గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ1, 2022 నివేదిక పేర్కొంది. 2021 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 919.1 టన్నులు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులలో బంగారం కోసం డిమాండ్ వంటి అంశాలు యరో మెటల్‌కు ఆకర్షణ తీసుకుని వస్తాయిన డబ్ల్యూజీసీ సీనియర్ విశ్లేషకులు లూయిస్ స్ట్రీట్ పేర్కొన్నారు. పలు అంశాల ప్రభావం ధరలపై మార్కెట్లో మిశ్రమ ధోరణి, చైనా నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో కోవిడ్‌పై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, భౌగోళిక సంఘర్షణలు వంటి అంశాలు పసిడి ధరను నిర్ణయిస్తాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు గ్రామీణ మార్కెట్లలో డిమండ్ పునరుద్ధరణ, సాధారణ రుతుపవన అంశాలు కూడా యల్లో మెటల్ డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి. – పీఆర్ సోమసుందరం, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
సప్లయి తగ్గింది.. డిమాండ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అందుబాటు గృహాల సరఫరా తగ్గినప్పటికీ.. డిమాండ్ మాత్రం పుంజుకుంది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇన్వెంటరీ 21 శాతం క్షీణించాయి. 2020 జనవరి–మార్చి (క్యూ1)లో 2,34,600 అఫర్డబుల్ యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1,86,150 యూనిట్లకు తగ్గాయని అనరాక్ డేటా వెల్లడించింది. ► రెండేళ్ల కోవిడ్ కాలంలో అఫర్డబుల్ గృహాల సప్లయి తగ్గింది. కరోనా కంటే ముందు 2019 జనవరి–మార్చి (క్యూ1)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 70,480 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో అందుబాటు గృహాల వాటా 44 శాతంగా ఉంది. కరోనా మొదలైన ఏడాది 2020 క్యూలోని గృహాల సప్లయిలో అఫర్డబుల్ వాటా 38 శాతం, 2021 క్యూ1లో 30 శాతం, ఈ ఏడాది క్యూ1 నాటికి 25 శాతానికి తగ్గింది. సప్లయి తగ్గడం వల్ల డెవలపర్లు అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ)ని విక్రయించడంపై దృష్టిసారించారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దీంతో గత రెండేళ్లలో ఏడు నగరాల్లోని అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ 21 శాతం, లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం తగ్గుముఖం పట్టాయి. ► ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 6,27,780 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. ఇందులో 1,86,150 యూనిట్లు రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలే. అదే గతేడాది క్యూ1లో ఇవి 2,17,63, 2020 క్యూ1లో 2,34,600 యూనిట్లున్నాయి. 2021 క్యూ1లో అత్యధికంగా చెన్నైలో 52%, పుణేలో 33 శాతం, ముంబైలో 27% అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. ► ఇదే రెండేళ్ల కరోనా సమయంలో రూ.2.5 కోట్లకు పైగా ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం మేర తగ్గింది. 2020 క్యూ1లో 41,750 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 42,080కు, ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లకు క్షీణించాయి. అత్యధికంగా ముంబైలో 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. -
నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల షాక్!!
శాన్ ఫ్రాన్సిస్కో: స్ట్రీమింగ్ సేవల దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షేరు బుధవారం భారీగా పతనమైంది. ఒక దశలో ఏకంగా 39 శాతం క్షీణించి 212.51 డాలర్ల స్థాయికి పడిపోయింది. దీంతో మార్కెట్ విలువ దాదాపు 60 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. దశాబ్ద కాలంలోనే తొలిసారిగా ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో యూజర్లపరంగా భారీ ఎదురుదెబ్బ తగలడం ఇందుకు కారణం. సమీక్షాకాలంలో కొత్తగా 25 లక్షల మంది యూజర్లు చేరతారని అంచనా వేసుకోగా .. దానికి విరుద్ధంగా నికరంగా 2,00,000 మంది సబ్‌స్క్రయిబర్స్‌ను నెట్‌ఫ్లిక్స్ పోగొట్టుకుంది. ఉక్రెయిన్‌పై దాడులకు నిరసనగా రష్యా మార్కెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మరో 20 లక్షల మంది దాకా యూజర్లను కోల్పోయే అవకాశం ఉందన్న నెట్‌ఫ్లిక్స్ అంచనాలు.. షేర్హోల్డర్లను కలవరపరుస్తున్నాయి. దీంతో షేరు భారీగా పతనమైంది. కంపెనీ పనితీరుపై సందేహాలతో గత నాలుగు నెలల్లో 150 బిలియన్ డాలర్ల మేర షేర్‌హోల్డర్ల సంపద కరిగిపోయింది. మార్చి ఆఖరు నాటికి కంపెనీ యూజర్ల సంఖ్య 22.16 కోట్లుగా ఉంది.