ముంబై: స్టాక్ మార్కెట్లో బేర్ స్వైరవిహారంతో గురువారం సూచీలు కుప్పకూలాయి. కొన్నిరోజులుగా బుల్ ఆధిపత్యంతో స్తబ్ధుగా ఉన్న బేర్ ఒక్కసారిగా అదును చూసి పంజా విసిరింది. అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూలతల సంకేతాలు అందాయి. దేశీయ కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. తాజాగా మోర్గాన్ స్టాన్లీ భారత మార్కెట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. ఈ అంశాలు దేశీయ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మార్కెట్ మొదలు.., తుదిదాకా బేర్ సంపూర్ణ ఆధిపత్యం కనబరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ నెలకొంది.
ఫలితంగా స్టాక్ సూచీలు గత ఆరునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,159 పాయింట్ల నష్టంతో 60వేల దిగువున 59,985 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18,000 వేల స్థాయిని కోల్పోయి 354 పాయింట్ల పతనంతో 17,857 వద్ద నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదితో తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టం. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలోని మొత్తం షేర్లలో కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముంగింపు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,819 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.837 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడంతో రూపాయి 11 పైసలు బలపడి 74.92 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు...
ఆసియా మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ ఉదయం 62 పాయింట్ల లాభంతో 61,081 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 18,188 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల కౌంటర్లలో అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో సూచీలు మార్కెట్ ముగిసే వరకూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1365 పాయింట్లు నష్టపోయి 59,778 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు కోల్పోయి 17,799 ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► ఐటీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్‌ఈలో ఆరుశాతం నష్టపోయి రూ.225 వద్ద ముగిసింది.
► నష్టాల మార్కెట్లోనూ ఎల్‌అండ్‌టీ షేరు రాణించింది. 2% లాభంతో రూ.1814 వద్ద నిలిచింది.
► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో టైటాన్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.2,375 వద్ద స్థిరపడింది.
పతనానికి ఐదు కారణాలు...
ఎఫ్‌అండ్‌ఓ ముగింపు...
అక్టోబర్ ఎఫ్‌అండ్‌ఓ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్యేర్ ఆఫ్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం సూచీల భారీ నష్టాలకు కారణమైంది.
కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు..
ఇటీవల పలు కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడిసరుకు ధరల పెరుగదలతో ఆయా కంపెనీల లాభాలు పరిమితమయ్యాయి. చాలా కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూ పింది. ఐటీసీ, కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రస్ షేర్లు 5% నుంచి 2% నష్టపోయాయి.
ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ....
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టడం ప్రస్తుత కరెక్షన్‌కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌ఐఐలు రూ.13 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో ఎఫ్‌ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.
ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూలతలు...
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక రికవరీ అందోళనలతో ఆసియా మార్కెట్లు 1.5%నష్టంతో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ద్రవ్యపాలసీ, యూఎస్ మూడో క్వార్టర్ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో యూరప్, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
రేటింగ్ డౌన్‌గ్రేడ్...
అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతుందనే కారణంతో నోమురా, యూఎస్‌బీ రేటింగ్ భారత స్టాక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. తాజాగా మోర్గాన్‌స్టాన్లీ మన మార్కెట్ రేటింగ్ ‘అధిక వెయిటేజీ’ నుంచి ‘సమాన వెయిటేజీ(ఈక్వల్ వెయిటేజీ)’ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థల డౌన్‌గ్రేడ్ రేటింగ్ కేటాయింపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ సూచీలు దాదాపు రెండుశాతం మేర కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.4.82 లక్షల కోట్లు నషపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు దిగివచ్చింది.
‘‘వ్యవస్థలో అధిక లిక్విడిటీ, రిటైల్ ఇన్వెస్టర్ల రూపంలో కొత్త తరం(యువత) పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడంతో ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీలు 25% ర్యాలీ చేశాయి. ఇప్పటికే అధిక విలువలతో ట్రేడ్ అవుతున్న షేర్లలో ఎఫ్‌అండ్‌ఓ ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బుల్ సుదీర్ఘ ర్యాలీ నేపథ్యంలో 10–20 శాతం వరకూ కరెక్షన్‌కు అవకాశం ఉంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ పట్ల అప్రమత్తత అవసరం’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment