
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడో రోజూ అమ్మకాలు కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు అధిక వ్యాల్యుయేషన్ భయాలతో బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లలో గురువారం విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 51,325 వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లను కోల్పోయి 15,119 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరంగా అమ్మకాలు జరగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 518 పాయింట్లు కోల్పోయి 51,186 స్థాయిని తాకింది. నిఫ్టీ 131 పాయింట్ల మేర నష్టపోయి 15,078 స్థాయికి దిగివచ్చింది. బ్యాంకింగ్‌తో పాటు ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియల్టీ షేర్లలోనూ అమ్మకాలు జరిగాయి. నష్టాల మార్కెట్లోనూ ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
‘‘మండుతున్న ముడిచమురు ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. దీంతో ఇన్వెస్టర్లలో... ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే రిస్క్ సామర్థ్యం కొంత తగ్గింది. ఇదే అంశం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అయితే కంపెనీలు క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగడం లాంటి సానుకూలాంశాలు భారత మార్కెట్‌కు అండగా నిలుస్తున్నాయి.’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగపు అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
ఓఎన్‌జీసీ షేరు 8% శాతం అప్...
ఓఎన్‌జీసీ షేరు గురువారం 8% శాతం లాభపడి రూ.111 వద్ద స్థిరపడింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు గానూ ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి రూ.7.5 ట్రిలియన్ల మౌలిక సదుపాయాల ప్రణాళికను ప్రకటించింది. అలాగే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిపోయాయి. ఈ రెండు అంశాలు సానుకూలంగా మారడంతో ఓఎన్‌జీసీ షేరు ఇంట్రాడేలో 13 శాతం ర్యాలీ చేసి రూ.115 స్థాయికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment