indian market s
-
Samsung : రూ.10,000 కోట్ల వ్యాపార లక్ష్యం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం శామ్సంగ్ టీవీల అమ్మకాల ద్వారా 2024లో భారత మార్కెట్లో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. రూ.10 వేల కోట్ల మైలురాయిని చేరుకోవడం ఇప్పటి వరకు ఏ కంపెనీ సాధించలేదని కంపెనీ వెల్లడించింది. మధ్య స్థాయి, ప్రీమియం టీవీల విభాగంలో పరిమాణం పరంగా వృద్ధిలో ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా విజువల్ డిస్ప్లే బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. ‘ప్రీమియం టీవీలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశాం. కంపెనీ విక్రయాల్లో ఈ విభాగం వాటా 40%. యూహెచ్డీ, పెద్ద స్క్రీన్ టీవీల విక్రయాలతో ఈ ఏడాది వృద్ధి ఉంటుంది. ప్రీమియం ఉత్పత్తులకు మెట్రోలు, చిన్న పట్టణాల నుంచీ డిమాండ్ ఉంది’ అని వివరించారు. సంస్థకు 21 శాతం వాటా.. శామ్సంగ్ భారత్‌లో 2022–23లో రూ.98,924 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇందులో 70 శాతం మొబైల్స్ అమ్మకాల ద్వారా కాగా మిగిలినది టీవీలు, ఇతర ఉపకరణాల ద్వారా సమకూరింది. దేశీయ టీవీల విపణిలో పరిమాణం పరంగా సంస్థకు 21 శాతం వాటా ఉంది. శామ్సంగ్ తాజాగా ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టింది. పిక్చర్ స్పష్టంగా, సహజత్వం ఉట్టిపడేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటి ప్రారంభ ధర రూ.1.39 లక్షలు. ఓఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ.1.64 లక్షలు. కాగా, శామ్సంగ్ దేశీ విక్రయ టీవీల్లో 90% భారత్‌లో తయారైనవే. దేశంలో ఏటా అన్ని బ్రాండ్లలో కలిపి 1.2 కోట్ల యూనిట్ల టీవీలు అమ్ముడవుతున్నాయని అంచనా. -
పీసీ మార్కెట్ 30 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల (పీసీలు) రవాణా (షిప్మెంట్/విక్రేతలకు సరఫరా) జనవరి–మార్చి త్రైమాసికంలో 29.92 లక్షల యూనిట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో షిప్‌మెంట్‌తో పోల్చి చూసినప్పుడు 30 శాతం తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికం పీసీ షిప్మెంట్ వివరాలను విడుదల చేసింది. 2022 ఏడాది మొదటి మూడు నెలల్లో మన దేశ మార్కెట్లో పీసీల షిప్మెంట్ 42.82 లక్షల యూనిట్లుగా ఉంది. మార్చి త్రైమాసికంలో డెస్క్‌టాప్‌లకు డిమాండ్ ఉందని, నోట్‌బుక్‌ల డిమాండ్ మరో విడత బలహీనంగా నమోదై, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు 41 శాతం తగ్గినట్టు ఐడీసీ నివేదిక తెలిపింది. వినియోగ డిమాండ్ 36.1 శాతం తగ్గితే, వాణిజ్య డిమాండ్ 25.1 శాతం తగ్గింది. అగ్రస్థానంలోనే హెచ్‌పీ కంపెనీ హెచ్‌పీ కంపెనీ 33.8 శాతం వాటాను పీసీ మార్కె ట్లో కలిగి ఉంది. ఈ కంపెనీ పీసీల రవాణా మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 30.2 శాతం తగ్గింది. లెనోవో చేతిలో 15.7 శాతం వాటా ఉంది. లెనోవో పీసీ షిప్మెంట్ మార్చి త్రైమాసికంలో 37.5 శాతం క్షీణించి 4.72 లక్షల యూనిట్లుగా ఉంది. డెల్ మార్కెట్ వాటా 19.4 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది. 4.17 లక్షల పీసీలను షిప్ చేసింది. ఏసర్ గ్రూప్ వాటా 12.3 శా తంగా, ఆసుస్ మార్కెట్ వాటా 6.6 శాతం చొప్పున ఉంది. -
మదుపర్లకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్లో బేర్ స్వైరవిహారంతో గురువారం సూచీలు కుప్పకూలాయి. కొన్నిరోజులుగా బుల్ ఆధిపత్యంతో స్తబ్ధుగా ఉన్న బేర్ ఒక్కసారిగా అదును చూసి పంజా విసిరింది. అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూలతల సంకేతాలు అందాయి. దేశీయ కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. తాజాగా మోర్గాన్ స్టాన్లీ భారత మార్కెట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. ఈ అంశాలు దేశీయ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మార్కెట్ మొదలు.., తుదిదాకా బేర్ సంపూర్ణ ఆధిపత్యం కనబరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ నెలకొంది. ఫలితంగా స్టాక్ సూచీలు గత ఆరునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,159 పాయింట్ల నష్టంతో 60వేల దిగువున 59,985 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18,000 వేల స్థాయిని కోల్పోయి 354 పాయింట్ల పతనంతో 17,857 వద్ద నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదితో తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టం. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలోని మొత్తం షేర్లలో కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముంగింపు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,819 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.837 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడంతో రూపాయి 11 పైసలు బలపడి 74.92 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు... ఆసియా మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ ఉదయం 62 పాయింట్ల లాభంతో 61,081 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 18,188 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల కౌంటర్లలో అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో సూచీలు మార్కెట్ ముగిసే వరకూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1365 పాయింట్లు నష్టపోయి 59,778 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు కోల్పోయి 17,799 ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఐటీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఆరుశాతం నష్టపోయి రూ.225 వద్ద ముగిసింది. ► నష్టాల మార్కెట్లోనూ ఎల్అండ్టీ షేరు రాణించింది. 2% లాభంతో రూ.1814 వద్ద నిలిచింది. ► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో టైటాన్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.2,375 వద్ద స్థిరపడింది. పతనానికి ఐదు కారణాలు... ఎఫ్అండ్ఓ ముగింపు... అక్టోబర్ ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్యేర్ ఆఫ్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం సూచీల భారీ నష్టాలకు కారణమైంది. కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు.. ఇటీవల పలు కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడిసరుకు ధరల పెరుగదలతో ఆయా కంపెనీల లాభాలు పరిమితమయ్యాయి. చాలా కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూ పింది. ఐటీసీ, కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రస్ షేర్లు 5% నుంచి 2% నష్టపోయాయి. ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ.... విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టడం ప్రస్తుత కరెక్షన్కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐలు రూ.13 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూలతలు... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక రికవరీ అందోళనలతో ఆసియా మార్కెట్లు 1.5%నష్టంతో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ద్రవ్యపాలసీ, యూఎస్ మూడో క్వార్టర్ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో యూరప్, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రేటింగ్ డౌన్‌గ్రేడ్... అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతుందనే కారణంతో నోమురా, యూఎస్బీ రేటింగ్ భారత స్టాక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. తాజాగా మోర్గాన్‌స్టాన్లీ మన మార్కెట్ రేటింగ్ ‘అధిక వెయిటేజీ’ నుంచి ‘సమాన వెయిటేజీ(ఈక్వల్ వెయిటేజీ)’ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థల డౌన్‌గ్రేడ్ రేటింగ్ కేటాయింపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ సూచీలు దాదాపు రెండుశాతం మేర కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.4.82 లక్షల కోట్లు నషపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘వ్యవస్థలో అధిక లిక్విడిటీ, రిటైల్ ఇన్వెస్టర్ల రూపంలో కొత్త తరం(యువత) పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడంతో ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీలు 25% ర్యాలీ చేశాయి. ఇప్పటికే అధిక విలువలతో ట్రేడ్ అవుతున్న షేర్లలో ఎఫ్అండ్ఓ ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బుల్ సుదీర్ఘ ర్యాలీ నేపథ్యంలో 10–20 శాతం వరకూ కరెక్షన్కు అవకాశం ఉంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ పట్ల అప్రమత్తత అవసరం’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. -
హైస్పీడులో లగ్జరీ కార్ సేల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెర్సిడెస్ మైబాహ్ జీఎల్ఎస్ 600.. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.43 కోట్లు. ఇందులో విశేషం ఏమిటంటారా? ఈ సూపర్ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి రాక ముందే ఇక్కడి కస్టమర్లు బుక్ చేసుకున్నారట. కంపెనీ భారత్ కోసం కేటాయించింది అటూ ఇటుగా 50 యూనిట్లు మాత్రమే. రెండవ లాట్ వచ్చేది 2022 జనవరి–మార్చిలోనే. సూపర్ లగ్జరీ కార్లకు భారత విపణిలో ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ఇదొక్కటే చెబుతోంది. ఇక రూ.2.5 కోట్లకుపైగా ధర కలిగిన సూపర్ లగ్జరీ కార్లు 2019లో దేశవ్యాప్తంగా 265 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోవిడ్–19 ముందస్తు స్థాయికి ఈ ఏడాది విక్రయాలు ఉంటాయని లంబోర్గినీ అంచనా వేస్తోంది. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి నుంచి మొత్తం 50కిపైగా కొత్త మోడళ్లు ఈ ఏడాది విడుదల కానుండటం కంపెనీల ఆసక్తికి నిదర్శనం. చిన్న మార్కెట్ అయినప్పటికీ భారత్‌పై సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. కోవిడ్–19 సమయంలోనూ.. దేశంలో సూపర్ లగ్జరీ కార్ల అమ్మకాలు కోవిడ్–19 సమయంలోనూ కొనసాగుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం 2020–21లో పోర్ష 249 కార్లను విక్రయించింది. లంబోర్గినీ 26 కార్లు, రోల్స్ రాయిస్ 21, ఫెరారీ 16, బెంట్లే నుంచి 12 కార్లు రోడ్డెక్కాయి. 2019–20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో లంబోర్గినీ ఏకంగా 100 శాతం వృద్ధి సాధించింది. ఊరూస్ మోడల్‌కు విపరీత డిమాండ్ కారణంగానే ఈ స్థాయి వృద్ధి నమోదు చేసింది. ఎక్స్‌షోరూంలో ఊరూస్ ధర రూ.3.15 కోట్ల నుంచి ప్రారంభం. మెర్సిడెస్ 2021లో 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి–జూన్‌లో ఇప్పటికే ఎనిమిది మోడళ్లు కొలువుదీరాయని తెలిపింది. కన్జూమర్ సెంటిమెంట్ తిరిగి బలపడిందనడానికి మైబాహ్ జీఎల్ఎస్ 600 బుకింగ్స్ ఉదాహరణగా వివరించింది. తొలి అర్ధ భాగంలో 50% వృద్ధి సాధించామని.. వచ్చే త్రైమాసికాల్లోనూ అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తోంది. ఇన్నాళ్లు ఖర్చులకు దూరంగా.. షికార్లు, షాపింగ్‌కు సంపన్నులు తరచూ విదేశాలు చుట్టి వస్తుంటారు. కోవిడ్–19 మూలంగా విమాన ప్రయాణాలకు పరిమితులు ఉండడం, వైరస్ భయం కారణంగా గతేడాది నుంచి వీరంతా షికార్లు, షాపింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరి వద్ద ఆర్థిక సామర్థ్యం ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘మెరుగైన ఇల్లు, కార్లవైపు వినియోగదార్లు చూస్తున్నారు. ఆరోగ్యం, జీవితంపై అనిశ్చితి నేపథ్యంలో స్తోమత ఉన్నప్పుడు ఈ రోజే ఎందుకు సొంతం చేసుకోకూడదు. ఎందుకు ఓ అయిదేళ్లు ఆగాలి అన్న భావన కస్టమర్లలో ఉంది. ఈ అంశమే అమ్మకాలకు బూస్ట్‌నిస్తోంది’ అని లంబోర్గినీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 30–40 సూపర్ లగ్జరీ కార్లు రోడ్డెక్కుతున్నాయని వసంత్ మోటార్స్ ఫౌండర్ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి తెలిపారు. రూ.220 కోట్లకుపైగా సంపద కలిగిన అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ప్రస్తుతం దేశంలో 6,884 మంది ఉన్నారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 63% వృద్ధి చెందుతుం దని ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
భారత్‌కు మళ్లీ వస్తాం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 135 కోట్లు దాటిన జనాభా. కోట్లాది మంది యువ కస్టమర్లు. ఉద్యోగులు, వ్యాపారులకు పెరుగుతున్న వ్యయం చేయదగ్గ ఆదాయం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వినియోగదార్లు.. ఇంకేముంది ఈ అంశాలే తయారీ, రిటైల్ కంపెనీలకు భారత మార్కెట్ బంగారు బాతుగా నిలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్, స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థలకైతే ఇండియా ప్రధాన మార్కెట్ కూడా. దీంతో భారత్ నుంచి వెనుదిరిగిన ఈ రంగ కంపెనీలు మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్లతో రంగంలోకి దిగుతున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే ఏకంగా ప్రైస్ వార్‌కు తెరతీస్తున్నాయి కూడా. ఐవా: దేశీయ టెలివిజన్ మార్కెట్లో ఆగస్టు 1న రీ–ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ ఏకంగా 75 అంగుళాల 4కే స్మార్ట్ టీవీతో దర్శనమిచ్చింది. వాయిస్ కమాండ్‌తో పనిచేసే ఆరు రకాల స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. టీవీల ధరల శ్రేణి రూ.7,999తో మొదలుకుని రూ.1,99,000 వరకు ఉంది. వీటితోపాటు స్మార్ట్ హోం ఆడియో సిస్టమ్స్, వైర్లెస్ హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, పర్సనల్ ఆడియో ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది. వినూత్న, ఆధునిక ఫీచర్లతో ప్రొడక్టులను అన్ని ధరల శ్రేణిలో తీసుకొస్తామని ఐవా ఇండియా ఎండీ మన్మిత్ చౌదరి తెలిపారు. రానున్న రోజుల్లో రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. నూబియా: టెక్నాలజీ కంపెనీ జెడ్‌టీఈ అనుబంధ బ్రాండ్ అయిన నూబియా తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రెండేళ్ల క్రితం భారత్ నుంచి నిష్క్రమించిన ఈ బ్రాండ్ రెడ్ మేజిక్–3 పేరుతో గేమింగ్ ఫోన్ ప్రవేశపెట్టింది. 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 6.65 అంగుళాల డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సోనీ సెన్సార్‌తో 48 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను జోడించింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో ఇంటర్నల్ టర్బో ఫ్యాన్ పొందుపరిచారు. ఇక ఆల్ఫా పేరుతో అద్దిరిపోయే స్మార్ట్‌వాచ్‌తో ఎంట్రీ అదరగొట్టింది. ఫోల్డబుల్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకత. హెచ్‌టీసీ: తైవాన్‌కు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ భారత్‌లో రెండవ ఇన్నింగ్స్‌కి సిద్ధమైంది. వైల్డ్‌ఫైర్ ఎక్స్ పేరుతో కొత్త మోడల్‌ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. వెనుకవైపు 12, 8, 5 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచింది. ధర 4 జీబీ ర్యామ్ రూ.12,999 కాగా, 3 జీబీ ర్యామ్ మోడల్ రూ.9,999 ఉంది. ఆగస్టు 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వినూత్నమైన ఫీచర్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. 2018లో కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రీమియం లుక్, నాణ్యమైన మోడళ్లతో కస్టమర్ల మది దోచిన ఈ బ్రాండ్‌కు ఇప్పటికీ మంచి ఇమేజ్ ఉంది. ఎల్జీ: డబ్ల్యూ సిరీస్‌తో భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఎల్జీ మొబైల్స్ ఈ ఏడాది మరో అయిదు కొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనుంది. డబ్ల్యూ సిరీస్‌తోపాటు విదేశాల్లో విక్రయిస్తున్న ‘జీ’, ‘క్యూ’ సిరీస్ మోడళ్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం సంస్థ ఖాతాలో అయిదు మోడళ్లున్నాయి. 2020 ఏడాది ద్వితీయార్ధానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఎల్జీ మొబైల్స్ బిజినెస్ హెడ్ అద్వైత్ వైద్య సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏడాది తర్వాత 5జీ స్మార్ట్‌ఫోన్ ‘వి–50’ని భారత్‌లో ఆవిష్కరించనుంది. 5జీలో నాయకత్వ స్థానాన్ని దక్కించుకోవాలన్నదే కంపెనీ లక్ష్యం. దక్షిణ కొరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్జీ.. భారత్‌లో తొలిసారిగా డబ్ల్యూ సిరీస్ ద్వారా ఫోన్ల అభివృద్ధితో పాటు తయారీ కూడా చేపట్టింది. -
నిరోధ శ్రేణి 20,700-20,900
అంతర్జాతీయ మార్కెట్లకు స్థిరత్వం రావడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా ఇటీవల కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్నాయి. రూపాయి కూడా ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే స్థిరంగా ఉంది. అయితే ఇప్పటి మార్కెట్ల రికవరిలో సూచీల్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న (35 శాతం) ఎఫ్ఎంసీజీ షేర్లు-ఐటీసీ, హిందుస్తాన్ యూని లివర్ లు, ముకేష్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలు బలహీనంగా కనిష్ట స్థాయి వద్దే ట్రేడవుతున్నాయి. అందుకే మార్కెట్లకు మరింత పతనమయ్యే ముప్పు పొంచి ఉన్నదని భావించాలి. కేవలం ఐటీ, కొద్దిపాటి బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతోనే సూచీలు గరిష్ట స్థాయిల్లో స్థిరపడడం కష్ట సాధ్యం. ఇక సాంకేతికాంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు ఫిబ్రవరి 21తో ముగిసిన వారంలో ఒక్క గురువారం మినహాయిస్తే, సెన్సెక్స్ క్రమేపీ కోలుకోగలిగింది. చివరకు 334 పాయింట్ల లాభంతో 4 వారాల గరిష్ట స్థాయి 20,701 పాయిట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ కీలకమైన 20,700-20,900 నిరోధ శ్రేణి వద్ద నిలిచింది. గత జనవరి చివరి వారంలో ఈ శ్రేణి వద్ద తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడినందున రానున్న రోజుల్లో సెన్సెక్స్ అప్ట్రెండ్లోకి మళ్లాలంటే ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించాల్సి ఉంటుంది. అది జరిగితే కొద్ది వారాల్లో మళ్లీ 21,400-21,500 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని సాధించే చాన్స్ ఉంటుంది. పైన ప్రస్తావించిన నిరోధం ఈ వారం దాటలేకపోతే 20,580 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 20,280 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. ఆ లోపల క్రమేపీ 200 రోజుల చలన సగటు రేఖ సంచరించే 20,000 పాయింట్ల సమీప స్థాయికి పతనం కావచ్చు. నిఫ్టీ నిరోధం 6,180 మద్దతు 6,100 ఫిబ్రవరి 21తో ముగిసిన వారంలో 107 పాయింట్ల ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,155 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఫ్యూచర్, ఆప్షన్ల కాంట్రాక్టుల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జరిపే షార్ట్ కవరింగ్, షార్టింగ్, మార్చి నెలకు రోల్ ఓవర్స్ తదితర కార్యకలాపాల ఆధారంగా నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. అత్యధికమైన పుట్బిల్డప్ కలిగిన 6,000 పాయింట్ల స్థాయిని ఈ నెలలో ఇప్పటివరకూ పరిరక్షించుకుంటూ వచ్చిన ఇన్వెస్టర్లు ఇప్పుడా మద్దతు స్థాయిని కాస్త పైకి 6,100 వద్దకు జరుపుకున్నారు. ఈ 6,100 పాయింట్ల వద్ద 60 లక్షల షేర్లకు పైగా పుట్బిల్డప్ ఉన్నందున ఈ వారం నిఫ్టీకి ఇదే తక్షణ మద్దతు స్థాయి.. ఈ స్థాయి దిగువన మద్దతు స్థాయిలు... 6,060, 6,000, 5,950 పాయింట్లు. సెన్సెక్స్లాగానే నిఫ్టీ 6,135-6,180 పాయింట్ల అవరోధ శ్రేణి వద్ద జనవరి చివరి వారంలో భారీ అమ్మకాలు చవి చూసింది. ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించి ముగిస్తేనే మార్కెట్లు క్రమేపీ అప్ట్రెండ్లోకి మళ్లే చాన్స్ ఉంటుంది. ఈ శ్రేణి పైన నిఫ్టీకి నిరోధ స్థాయిలు 6,210, 6,250 పాయింట్లు.