అంతర్జాతీయ మార్కెట్లకు స్థిరత్వం రావడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా ఇటీవల కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్నాయి. రూపాయి కూడా ఇతర వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే స్థిరంగా ఉంది.
అయితే ఇప్పటి మార్కెట్ల రికవరిలో సూచీల్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న (35 శాతం) ఎఫ్‌ఎంసీజీ షేర్లు-ఐటీసీ, హిందుస్తాన్ యూని లివర్ లు, ముకేష్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలు బలహీనంగా కనిష్ట స్థాయి వద్దే ట్రేడవుతున్నాయి. అందుకే మార్కెట్లకు మరింత పతనమయ్యే ముప్పు పొంచి ఉన్నదని భావించాలి. కేవలం ఐటీ, కొద్దిపాటి బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతోనే సూచీలు గరిష్ట స్థాయిల్లో స్థిరపడడం కష్ట సాధ్యం. ఇక సాంకేతికాంశాల విషయానికొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
ఫిబ్రవరి 21తో ముగిసిన వారంలో ఒక్క గురువారం మినహాయిస్తే, సెన్సెక్స్ క్రమేపీ కోలుకోగలిగింది. చివరకు 334 పాయింట్ల లాభంతో 4 వారాల గరిష్ట స్థాయి 20,701 పాయిట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ కీలకమైన 20,700-20,900 నిరోధ శ్రేణి వద్ద నిలిచింది. గత జనవరి చివరి వారంలో ఈ శ్రేణి వద్ద తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడినందున రానున్న రోజుల్లో సెన్సెక్స్ అప్‌ట్రెండ్‌లోకి మళ్లాలంటే ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదించాల్సి ఉంటుంది. అది జరిగితే కొద్ది వారాల్లో మళ్లీ 21,400-21,500 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని సాధించే చాన్స్ ఉంటుంది. పైన ప్రస్తావించిన నిరోధం ఈ వారం దాటలేకపోతే 20,580 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 20,280 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. ఆ లోపల క్రమేపీ 200 రోజుల చలన సగటు రేఖ సంచరించే 20,000 పాయింట్ల సమీప స్థాయికి పతనం కావచ్చు.
నిఫ్టీ నిరోధం 6,180 మద్దతు 6,100
ఫిబ్రవరి 21తో ముగిసిన వారంలో 107 పాయింట్ల ర్యాలీ జరిపిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,155 పాయింట్ల వద్ద ముగిసింది. ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఫ్యూచర్, ఆప్షన్‌ల కాంట్రాక్టుల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జరిపే షార్ట్ కవరింగ్, షార్టింగ్, మార్చి నెలకు రోల్ ఓవర్స్ తదితర కార్యకలాపాల ఆధారంగా నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోను కావచ్చు. అత్యధికమైన పుట్‌బిల్డప్ కలిగిన 6,000 పాయింట్ల స్థాయిని ఈ నెలలో ఇప్పటివరకూ పరిరక్షించుకుంటూ వచ్చిన ఇన్వెస్టర్లు ఇప్పుడా మద్దతు స్థాయిని కాస్త పైకి 6,100 వద్దకు జరుపుకున్నారు. ఈ 6,100 పాయింట్ల వద్ద 60 లక్షల షేర్లకు పైగా పుట్‌బిల్డప్ ఉన్నందున ఈ వారం నిఫ్టీకి ఇదే తక్షణ మద్దతు స్థాయి.. ఈ స్థాయి దిగువన మద్దతు స్థాయిలు... 6,060, 6,000, 5,950 పాయింట్లు. సెన్సెక్స్‌లాగానే నిఫ్టీ 6,135-6,180 పాయింట్ల అవరోధ శ్రేణి వద్ద జనవరి చివరి వారంలో భారీ అమ్మకాలు చవి చూసింది. ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించి ముగిస్తేనే మార్కెట్లు క్రమేపీ అప్‌ట్రెండ్‌లోకి మళ్లే చాన్స్ ఉంటుంది. ఈ శ్రేణి పైన నిఫ్టీకి నిరోధ స్థాయిలు 6,210, 6,250 పాయింట్లు.