ముంబై: ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో బలహీనంగా కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి.
ఇంట్రాడేలో 158 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 78 పాయింట్లు నష్టపోయి 66వేల దిగువున 65,945 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్లను కోల్పోయి 19,665 వద్ద నిలిచింది. పారిశ్రామిక, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.693 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.715 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి.
- మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెల్లరీ ఐపీఓకు 2.25 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 91.20 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 2.05 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగతేతర కోటా 5.18 రెట్లు, రిటైల్ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి.
- నష్టాల మార్కెట్లో స్మాల్ క్యాప్ షేర్లు మెరిశాయి. శ్రేయాస్ షిప్పింగ్ 20%, ఐఎఫ్‌సీఐ 12%, కొచి్చన్ షిప్‌యార్డ్ 11%, ఎన్‌ఐఐటీ 10%, ఓమాక్స్ 9% అశోకా బిల్డ్‌కాన్ 8%, ఎన్‌సీసీ, అపార్ ఇండస్ట్రీస్, ఎంటార్ షేర్లు 7% ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ అరశాతం వరకు లాభపడింది.
- గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పరీస్.., షేరు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,150కి పెంచడంతో ఐషర్ మోటార్స్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 2.5% బలపడి రూ.3471 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.3539 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
- ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు యోచన నేపథ్యంలో డిమాండ్ రికవరీ ఆలస్యం అవ్వొచ్చనే అంచనాలతో ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి. ఎంఫసీస్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 2–1% నష్టపోయాయి.
- బ్యాంక్ ఆఫ్ అమెరికా పాజిటివ్ అవుట్‌లుక్ కేటాయింపుతో వరుణ్ బేవరేజెస్ షేరు ఐదున్నర శాతం ర్యాలీ చేసి రూ.975 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.967 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో మొత్తం 29 లక్షల షేర్లు చేతులు మారాయి.
- రూపాయి విలువ రెండోరోజూ కరిగిపోయింది. డాలర్ మారకంలో 15 పైసలు బలహీనపడి 83.28 వద్ద స్థిరపడింది. క్రూడ్æ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన ఈక్విటీ మార్కెట్ దేశీ కరెన్సీ క్షీణతకు కారణమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment