ముంబై: అధిక వెయిటేజీ గల రిలయన్స్ షేరు పతనంతో పాటు మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 540 పాయింట్లను కోల్పోయి 40,146 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 162 పాయింట్లను నష్టపోయి 11,768 వద్ద ముగిసింది. అమెరికా, ఐరోపాల్లో భారీగా నమోదైన కరోనా కేసులు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల పతనం ఆందోళనలను కలిగించాయి.
డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసల క్షీణత ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ట్రేడింగ్ ఆద్యంతం మార్కెట్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ఏ ఒక్క రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఇంట్రాడేలో సెనెక్స్ 734 పాయింట్లను నష్టపోయి 39,948 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 218 పాయింట్లను కోల్పోయి 11,712 స్థాయికి దిగివచ్చింది. ఎఫ్‌ఐఐలు రూ.119.40 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.976.16 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4 శాతం నష్టంతో రూ.2029 వద్ద స్థిరపడింది. సోమవారం సెన్సెక్స్ 540 పాయింట్ల పతనంలోని ఒక్క రిలయన్స్ షేరువి ఏకంగా 111 పాయింట్లు కావడం విశేషం.
నిఫ్టీ మెటల్, ఆటో ఇండెక్స్ 3.50శాతం నష్టపోయాయి. ఆసియాలో హాంగ్‌కాంగ్, తైవాన్ మినహా మిగిలిన అన్ని మార్కెట్లు అరశాతం నుంచి 1శాతం నష్టంతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు 3 నుంచి 1 శాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.
రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి...
మార్కెట్ భారీ నష్టంతో రూ.1.92 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ రూ.160.57 లక్షల కోట్ల నుంచి రూ.158.66 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘పాజిటివ్ క్యూ2 ఫలితాలతో మార్కెట్ ర్యాలీ చేసింది. ఇప్పుడు దిద్దుబాటుకు లోనైంది. స్వల్పకాలంలో మార్కెట్లో బలహీనత కొనసాగవచ్చు. కంపెనీల ద్వితియా క్వార్టర్ ఫలితాలు, అమెరికా పరిణామాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయి’ జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment