భారత్‌కు మళ్లీ వస్తాం..! | television and smartphone company re-entry in indian market | Sakshi
Sakshi News home page

భారత్‌కు మళ్లీ వస్తాం..!

Published Sat, Aug 17 2019 5:24 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

television and smartphone company re-entry in indian market - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో 135 కోట్లు దాటిన జనాభా. కోట్లాది మంది యువ కస్టమర్లు. ఉద్యోగులు, వ్యాపారులకు పెరుగుతున్న వ్యయం చేయదగ్గ ఆదాయం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వినియోగదార్లు.. ఇంకేముంది ఈ అంశాలే తయారీ, రిటైల్‌ కంపెనీలకు భారత మార్కెట్‌ బంగారు బాతుగా నిలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్, స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ సంస్థలకైతే ఇండియా ప్రధాన మార్కెట్‌ కూడా. దీంతో భారత్‌ నుంచి వెనుదిరిగిన ఈ రంగ కంపెనీలు మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్లతో రంగంలోకి దిగుతున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే ఏకంగా ప్రైస్‌ వార్‌కు తెరతీస్తున్నాయి కూడా.

ఐవా: దేశీయ టెలివిజన్‌ మార్కెట్లో ఆగస్టు 1న రీ–ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ ఏకంగా 75 అంగుళాల 4కే స్మార్ట్‌ టీవీతో దర్శనమిచ్చింది. వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే ఆరు రకాల స్మార్ట్‌ టీవీలను ప్రవేశపెట్టింది. టీవీల ధరల శ్రేణి రూ.7,999తో మొదలుకుని రూ.1,99,000 వరకు ఉంది. వీటితోపాటు స్మార్ట్‌ హోం ఆడియో సిస్టమ్స్, వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్, బ్లూటూత్‌ స్పీకర్స్, పర్సనల్‌ ఆడియో ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది. వినూత్న, ఆధునిక ఫీచర్లతో ప్రొడక్టులను అన్ని ధరల శ్రేణిలో తీసుకొస్తామని ఐవా ఇండియా ఎండీ మన్‌మిత్‌ చౌదరి తెలిపారు. రానున్న రోజుల్లో రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు.

నూబియా: టెక్నాలజీ కంపెనీ జెడ్‌టీఈ అనుబంధ బ్రాండ్‌ అయిన నూబియా తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రెండేళ్ల క్రితం భారత్‌ నుంచి నిష్క్రమించిన ఈ బ్రాండ్‌ రెడ్‌ మేజిక్‌–3 పేరుతో గేమింగ్‌ ఫోన్‌ ప్రవేశపెట్టింది. 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 6.65 అంగుళాల డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సోనీ సెన్సార్‌తో 48 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను జోడించింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో లిక్విడ్‌ కూలింగ్‌ టెక్నాలజీతో ఇంటర్నల్‌ టర్బో ఫ్యాన్‌ పొందుపరిచారు. ఇక ఆల్ఫా పేరుతో అద్దిరిపోయే స్మార్ట్‌వాచ్‌తో ఎంట్రీ అదరగొట్టింది. ఫోల్డబుల్‌ ఫ్లెక్సిబుల్‌ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌వాచ్‌ ప్రత్యేకత.  

హెచ్‌టీసీ: తైవాన్‌కు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ భారత్‌లో రెండవ ఇన్నింగ్స్‌కి సిద్ధమైంది. వైల్డ్‌ఫైర్‌ ఎక్స్‌ పేరుతో కొత్త మోడల్‌ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. వెనుకవైపు 12, 8, 5 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచింది. ధర 4 జీబీ ర్యామ్‌ రూ.12,999 కాగా, 3 జీబీ ర్యామ్‌ మోడల్‌ రూ.9,999 ఉంది. ఆగస్టు 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో వినూత్నమైన ఫీచర్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. 2018లో కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రీమియం లుక్, నాణ్యమైన మోడళ్లతో కస్టమర్ల మది దోచిన ఈ బ్రాండ్‌కు ఇప్పటికీ మంచి ఇమేజ్‌ ఉంది.  

ఎల్‌జీ: డబ్ల్యూ సిరీస్‌తో భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఎల్‌జీ మొబైల్స్‌ ఈ ఏడాది మరో అయిదు కొత్త స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనుంది. డబ్ల్యూ సిరీస్‌తోపాటు విదేశాల్లో విక్రయిస్తున్న ‘జీ’, ‘క్యూ’ సిరీస్‌ మోడళ్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం సంస్థ ఖాతాలో అయిదు మోడళ్లున్నాయి. 2020 ఏడాది ద్వితీయార్ధానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఎల్‌జీ మొబైల్స్‌ బిజినెస్‌ హెడ్‌ అద్వైత్‌ వైద్య సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఏడాది తర్వాత 5జీ స్మార్ట్‌ఫోన్‌ ‘వి–50’ని భారత్‌లో ఆవిష్కరించనుంది. 5జీలో నాయకత్వ స్థానాన్ని దక్కించుకోవాలన్నదే కంపెనీ లక్ష్యం. దక్షిణ కొరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్‌జీ.. భారత్‌లో తొలిసారిగా డబ్ల్యూ సిరీస్‌ ద్వారా ఫోన్ల అభివృద్ధితో పాటు తయారీ కూడా చేపట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement