క్రాష్‌ మార్కెట్‌! | Rising Covid cases pull sensex down 740 points | Sakshi
Sakshi News home page

క్రాష్‌ మార్కెట్‌!

Published Fri, Mar 26 2021 5:08 AM | Last Updated on Fri, Mar 26 2021 5:41 AM

Rising Covid cases pull sensex down 740 points - Sakshi

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌లో రెండోరోజూ ‘బేర్‌’ బాజా కొనసాగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో పాటు లాక్‌డౌన్‌ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. మార్చి డెరివేటివ్స్‌ (ఎఫ్‌ అండ్‌ æఓ) కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో అమ్మకాలకు మొగ్గుచూపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. రూపాయి వరుసగా మూడో రోజూ 7 పైసలు క్షీణించడం కూడా ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సెన్సెక్స్‌ 740 పాయింట్లు నష్టపోయి 48,440 వద్ద ముగిసింది.

నిఫ్టీ 225 పాయింట్ల పతనంతో 14,325 వద్ద స్థిరపడింది. మెటల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్‌ వరుస పతనంతో రెండు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,611 పాయింట్లు, నిఫ్టీ 489 పాయింట్లను కోల్పోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు జరగడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ సూచీలోని మొత్తం 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రెండోరోజూ రూ.3,384 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,268 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

49 వేల దిగువకు సెన్సెక్స్‌...  
మునుపటి రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్‌ బలహీనంగా మొదలైంది. సెన్సెక్స్‌ 49,202 వద్ద, నిఫ్టీ 14,571 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లను ఎక్కువగా విక్రయించారు. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 49 వేల స్థాయిని కోల్పోయింది. ఒక దశలో సెన్సెక్స్‌ 944 పాయింట్లును కోల్పోయి 48,236 వద్ద, నిఫ్టీ 285 పాయింట్లు నష్టపోయి 14,264 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మిడ్‌సెషన్‌ తర్వాత కొంత రికవరీ కన్పించినా చివరి గంట అమ్మకాలతో సూచీలు రెండోరోజూ భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ‘భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రేటు మళ్లీ పెరిగిపోతోంది. ఈ అంశం ఈక్విటీ మార్కెట్లలో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. డెరివేటివ్స్‌ ముగింపు తేది కావడం మరింత ప్రతికూలాంశంగా మారింది. సుదీర్ఘ ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్‌ దిద్దుబాటుకు గురై స్థిరీకరణ దిశగా సాగుతుంది. ఈ దశలో కోవిడ్‌  వ్యాప్తి భయాలు మార్కెట్‌ పతనానికి కారణమవుతున్నాయి’ అని జియోజిత్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

రెండు రోజుల్లో రూ.6.9 లక్షల కోట్లు ఆవిరి  
మార్కెట్‌ భారీ పతనంతో గురువారం ఇన్వెస్టర్లు రూ. 3.69 లక్షల కోట్లను కోల్పోయారు. అంతకు ముందు ట్రేడింగ్‌ సెషన్‌లోనూ రూ.3.27 లక్షల కోట్ల సంపద ఆవిరవడంతో ఈ రెండు రోజుల్లో రూ.6.96 లక్షల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) రూ.200 లక్షల కోట్ల దిగువకు చేరుకొని రూ.198.78 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 3వ తేదీన బీఎస్‌ఈ ఇన్వెస్టర్ల సంపద రూ. 200 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement