ముంబై: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలింది. వైరస్ కట్టడికి పలు దేశాల లాక్‌డౌన్ విధింపు యోచనలు ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను రెకేత్తించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 37 పైసల పతనమైంది. క్రూడాయిల్ అనూహ్య పతనం, వడ్డీ రేట్ల పెంపు భయాలు వెంటాడాయి. ఈ పరిణామాలతో ట్రేడింగ్ మొదలు.., తుదిదాకా అమ్మకాల సునామీ జరిగింది.
ఒక్క ఫార్మా మినహా అన్నిరంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏడాదిలో అతిపెద్ద మూడో పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1688 పాయింట్లు నష్టపోయి 57,107 వద్ద, నిఫ్టీ 510 పాయింట్లు క్షీణించి 17,026 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల పతనం సూచీల భారీ క్షీణతకు కారణమైంది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, ఏషియన్ సిమెంట్స్, టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5786 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.2294 కోట్ల షేర్లను కొన్నారు.
ఇంట్రాడేలో 17వేల దిగువకు నిఫ్టీ
సెన్సెక్స్ ఉదయం 540 పాయింట్ల నష్టంతో 58,255 వద్ద, నిఫ్టీ 17,339 పాయింట్ల పతనంతో 17,339 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 1801 పాయింట్లును కోల్పోయి 56,994 వద్ద, నిఫ్టీ 550 పాయింట్లు పతనమైన 17వేల స్థాయిని కోల్పోయి 16,986 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 2,529 పాయింట్లు, నిఫ్టీ 738 పాయింట్లు నష్టపోయాయి.
నిమిషానికి రూ.1962 కోట్ల నష్టం
సూచీలు మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.7.36 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.1962 కోట్ల నష్టం వాటిల్లింది. వెరసి ఇన్వెస్టర్ల ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.258 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.
నష్టాలకు నాలుగు కారణాలు
కలవరపెట్టిన కొత్త వేరియంట్ ...
ఇప్పటికే డెల్టా వేరియంట్ విజృంభణతో యూరప్ దేశాలు విలవిలాడుతుండగా.., తాజాగా దీని కంటే అత్యంత ప్రమాదకారి, అసాధారణ రీతిలో మ్యూటేషన్ల(ఉత్పరివర్తనాలు)కు గురౌతున్న బి.1.1529 వేరియంట్‌ను దక్షిణాఫిక్రాలో గుర్తించారు. ఈ రకం కొత్త కేసులు రోజురోజుకూ శరవేగంగా పెరుగుతుండటంతో భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ ఒక్కసారిగా దెబ్బతింది. ఆసియాలో జపాన్ 2.53%, హాంగ్‌సెంగ్ 2.67%, జకార్తా 2.06% నష్టపోయాయి. యూరప్‌లోని ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ మార్కెట్లు 3–4 శాతం వరకు క్షీణించాయి. అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ ఫ్యూచర్లు ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.
తెరపైకి లాక్‌డౌన్ విధింపు ఆందోళనలు...
కేసుల కట్టడికి పలు దేశాలు రాత్రి కర్ఫ్యూను విధించాయి. స్లోవేకియా రెండు వారాల సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. జపాన్, బ్రిటన్ దేశాలు ప్రయాణాలపై నిషేధాన్ని విధించాయి. చెక్ రిపబ్లిక్ బార్లు, రెస్టారెంట్లతో సహా జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలను మూసివేసింది. జర్మనీలో కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య లక్ష దాటింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు లాక్‌డౌన్లను ప్రకటించవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మూడో వేవ్ మరింత ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉండడంతో సూచీలు కుంగాయి.
ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు...
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపరం కొనసాగడం ప్రతికూలంగా మారింది. ఈ నవంబర్‌లోనే ఇప్పటి వరకు(25 తేది) రూ.25 వేల కోట్ల దేశీయ ఈక్విటీలను అమ్మినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత స్టాక్ సూచీలు అక్టోబరులో జీవితకాల గరిష్టాలకు చేరుకున్న తరువాత షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయనే కారణంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా అమెరికా వడ్డీరేట్లను వేగంగా పెంచవచ్చనే అంచనాలు వారి విక్రయాల ప్రక్రియను మరింత ప్రేరేపింస్తున్నాయి. తొలి దశ కోవిడ్, లెమన్ బ్రదర్స్ సంక్షోభ సమయాల్లోనూ ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇతర భయాలు...
ద్రవ్యోల్బణ కట్టడికి అమెరికాతో సహా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను వేగంగా పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు తెరపైకి వచ్చా యి. వీలైనంత తొందర్లో ఉద్దీపన ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్‌లో తెలిపింది. ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఈ అంశాలన్నీ సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి.
లాభాల్లో టార్సన్స్ ప్రోడక్ట్స్ లిస్టింగ్...
టార్సన్స్ ప్రోడక్ట్స్ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.662తో పోలిస్తే ఆరుశాతం లాభంతో రూ.700 వద్ద లిస్టయ్యాయి. స్టాక్ మార్కెట్ భారీ పతనంతోనూ ఈ షేర్లకు డిమాండ్ వెల్లువెత్తింది. ఫలితంగా ఇంట్రాడేలో 27% దూసుకెళ్లి రూ.840 అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యాయి. బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో మొత్తం 26.30 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఈ ఏడాదిలో టాప్–3 పతనాలు
తేది సెన్సెక్స్ నిఫ్టీ
ఫిబ్రవరి 26 1,939 568
ఏప్రిల్ 12 1,707 524
నవంబర్ 26 1,687 510
Comments
Please login to add a commentAdd a comment