ముంబై: కరోనా కేసుల పెరుగుదల భయంతో స్టాక్ మార్కెట్ మరోసారి కుదేలయింది. కోవిడ్ ఉధృతి, లాక్‌డౌన్ విధింపు చర్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కేసుల కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. స్థానిక లాక్‌డౌన్ల విధింపుతో ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగించవచ్చనే ఆందోళననలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఆర్థిక రికవరీ మందగించవచ్చని భావిస్తున్న బ్రోకరేజ్ సంస్థలు దేశీయ జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడం మార్కెట్ వర్గాలను కలవరపెట్టింది.
ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి భారీ క్షీణత కూడా ప్రతికూలాంశంగా మారింది. ఈ పరిణామాలతో సోమవారం మార్కెట్ భారీ నష్టంతో ముగిసింది. ఫలితంగా సెన్సెక్స్ 883 పాయింట్లను కోల్పోయి 48 వేల దిగువున 47,949 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 258 పాయింట్ల నష్టంతో 14,359 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల సునామీని ఆపలేకపోయాయి.
రూపాయి పతనంతో లాభపడే ఒక్క ఫార్మా షేర్లు తప్ప.., మిగిలిన అన్ని రంగాల అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలు సూచీల భారీ పతనానికి కారణమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,469 పాయింట్లు, నిఫ్టీ 427 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఒక్క డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ షేర్లు తప్ప, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్‌లోని 50 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,644 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2356 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
భారీ నష్టాలతో ప్రారంభం
ఆసియా మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నప్పటికీ.., కరోనా కేసుల ఉధృతి భయాలతో దేశీయ మార్కెట్ భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 891 పాయింట్ల పతనంతో 47,941 వద్ద, నిఫ్టీ 311 పాయింట్ల నష్టంతో 14,307 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ముఖ్యంగా బ్యాంక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో సూచీలు కుప్పకూలాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,469 పాయింట్లను కోల్పోయి 47,363 వద్ద, నిఫ్టీ 427 పాయింట్లు పతనమై 14,191 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
కోలుకున్నా.., భారీ నష్టాలే...!
ఉదయం సెషన్‌లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్ మిడ్‌సెషన్‌లో కొంత కోలుకుంది. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం కలిసొచ్చింది. బ్యాంకింగ్ రంగ షేర్లకు కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి పతనంతో ఐటీ, ఫార్మా ర్యాలీ చేశాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం నుంచి 658 పాయింట్లు, నిఫ్టీ కనిష్ట స్థాయి నుంచి 191 పాయింట్లను ఆర్జించగలిగాయి. మిడ్ సెషన్‌లో కోలుకున్నా సూచీలు భారీ నష్టాల ముగింపును తప్పించుకోలేకపోయాయి.
వచ్చే వారం రోజులు కీలకం...
స్టాక్ మార్కెట్ వచ్చే వారం రోజులు ఎంతో కీలకమని నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోతే నిఫ్టీ మరో 1000 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘నిఫ్టీ ఇండెక్స్ సాంకేతికంగా కీలకమైన 14,200 స్థాయిని కోల్పోయింది. అయితే మార్కెట్ బౌన్స్‌బ్యాక్‌తో నిఫ్టీ స్థాయిని నిలుపుకోగలిగింది. కరోనా కేసులు రోజుకో గరిష్టస్థాయిలో నమోదయితే.., ఈసారి కొనుగోళ్ల మద్దతు లభించడం కష్టమే. ఈ తరుణంలో నిఫ్టీ 14,200 మద్దతు స్థాయిని కోల్పోతే భారీ నష్టాలు తప్పవు’’ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు.
నిరాశపరిచిన మాక్రోటెక్ లిస్టింగ్
రియల్‌ఎస్టేట్ దిగ్గజం మాక్రోటెక్ డెవలపర్స్ షేర్ల లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధర రూ.486తో పోలిస్తే దాదాపు 10% నష్టంతో రూ.439 వద్ద లిస్ట్ అయ్యాయి. మార్కెట్ పతనంతో ఒక దశలో 13% మేర నష్టపోయి రూ.421 వద్దకు చేరుకుంది. ఆఖర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని 5% నష్టంతో రూ.463 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో 3.33 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఒక్కరోజులో రూ. 3.5 లక్షల కోట్లు ఆవిరి
సూచీల రెండు శాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.3.53 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.202 లక్షల కోట్లకు దిగివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment