ముంబై: స్టాక్ మార్కెట్‌ను కరోనా భయాలు మరోసారి వెంటాడాయి. ఒక్క రోజులోనే లక్షకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు రెకెత్తాయి. ఆర్థిక రాజధాని ముంబైలో లాక్‌డౌన్ విధింపు మార్కెట్ వర్గాలను కలవరపెట్టింది. కేసుల కట్టడికి మరిన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ వైపు చూస్తున్నాయనే వార్తలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. మరోవైపు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ సూచీ మార్చిలో 55.4కు పడిపోయి ఏడు నెలల కనిష్టస్థాయికి దిగివచ్చింది. డాలర్ మారకంలో రూపాయి 18 పైసలు పతనమైంది. సూచీల గరిష్ట స్టాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.
ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తత కొనసాగింది. ఈ ప్రతికూలాంశాలన్ని సోమవారం స్టాక్ మార్కెట్‌ను కుదిపేశాయి. ఫలితంగా సెన్సెక్స్ 871 పాయింట్లు నష్టపోయి 50 వేల దిగువన 49,159 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 230 పాయింట్లు పతనమైన 14,638 వద్ద నిలిచింది. మెటల్, ఐటీ రంగాల షేర్లు మినహా... తక్కిన రంగాల షేర్లన్ని నష్టాలను చవిచూశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో కేవలం ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.931.66 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.75 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాలకు చెందిన సూచీలు ఒకశాతానికి పైగా నష్టాన్ని చవిచూశాయి.
ఇంట్రాడేలో 1449 పాయింట్లు క్రాష్...
మూడురోజుల విరామం తర్వాత మార్కెట్ ప్రతికూలంగా మొదలైంది. సెన్సెక్స్ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా భయాలు ఇన్వెస్టర్లను వెంటాడంతో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల సునామీ మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 1449 పాయింట్లు నష్టపోయి 48,581 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ 408 పాయింట్లను కోల్పోయి 14,459 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మిడ్‌సెషన్‌లో ఈ కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించిన నేపథ్యంలో సూచీలు నష్టాలను కొంత పూడ్చుకోగలిగాయి.
అయితే భారీ నష్టాల ముగింపు మాత్రం తప్పలేదు. ‘‘కోవిడ్ మహమ్మారి విజృంభణతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. భారత కంపెనీల షేర్ల వ్యాల్యుయేషన్లు అధిక స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నానే భావనతో విదేశీ ఇన్వెస్టర్లు కొంతకాలంగా దేశీయ ఈక్విటీ మార్కెట్ పట్ల బేరిష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. వేగంగా పెరుగుతున్న కోవిడ్–19 కేసులు ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. ద్రవ్య పాలసీపై ఆర్‌బీఐ నిర్ణయ ప్రభావం, కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలే రానున్న రోజుల్లో సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయి’’ అని బీఎన్‌బీ పారీబా రీసెర్చ్ హెడ్ లలితాబ్ శ్రీవాస్తవ తెలిపారు.
ఎదురీదిన ఐటీ, మెటల్ షేర్లు...
నష్టాల మార్కెట్లోనూ ఐటీ, మెటల్ రంగాల షేర్లు ఎదురీదాయి. డాలర్ మారకంలో రూపాయి 18 పైసలు బలహీనపడటం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రెండుశాతం లాభపడింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో సోమవారం లాభపడిన మొత్తం 5 షేర్లలో నాలుగు షేర్లు ఐటీ రంగానికి కావడం విశేషం. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటంతో మెటల్ షేర్లు లాభపడ్డాయి.
రూ. 2.16 లక్షల కోట్లు ఆవిరి...
మార్కెట్ ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.2.16 లక్షల కోట్లను కోల్పోయాయి. ఇన్వెస్టర్లు సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.205 లక్షల కోట్లకు పరిమితమైంది. ఉదయం సూచీల భారీ పతనం నేపథ్యంలో ఒక దశలో రూ.4 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. అయితే మిడ్‌సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించిన నేపథ్యంలో నష్టం పరిమితమైంది.
మరిన్ని సంగతులు...
► మార్చి క్వార్టర్‌లో రికార్డు విక్రయాలు, ఉత్పత్తి జరగడంతో సెయిల్ కంపెనీ షేరు రూ.90 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. 7% లాభంతో రూ.89.65 వద్ద స్థిరపడింది.
► కృష్ణపట్నం పోర్టులో మిగిలిన 25% వాటాను దక్కించుకోవడంతో అదానీ పోర్ట్స్ షేరు 1% లాభంతో రూ.744 వద్ద ముగిసింది.
► మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధింపులో భాగంగా సినిమా హాళ్లను మూసివేయడంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు 4–5% నష్టపోయాయి.
► డివిడెండ్‌కు ఆమోదంతో బ్రిటానియా 2% లాభంతో రూ.3,700 వద్ద నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment