ఆర్థిక రికవరీపై అనుమా నాలు, ఆందోళనతో ప్రపంచమార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ భయాలతో కలవరపడుతున్న ఇన్వెస్టర్లు ఎడాపెడా అమ్మకాలకు దిగారు. మరోవైపు వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి దాదాపు నెల కనిష్ట స్థాయి, 73.89కు పడిపోవడం, సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ చివరి రోజు కావడంతో అమ్మకాలు జోరుగా సాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,115 పాయింట్లు పతనమై 36,554 పాయింట్ల వద్ద, నిఫ్టీ 326 పాయింట్లు నష్టపోయి 10,806 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 3 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్‌కు ఇది ఈ ఏడాది మూడో అతి పెద్ద పతనం.
7 నెలల్లో తొలిసారి...
స్టాక్ సూచీలు వరుసగా ఆరో రోజూ క్షీణబాటలోనే సాగాయి. ఈ ఆరు రోజుల్లో సెన్సెక్స్ 2,749 పాయింట్లు, నిఫ్టీ 799 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ రెండు సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం గత 7 నెలల్లో ఇదే తొలిసారి.
ఆరంభం నుంచి నష్టాలే...
బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో గురువారం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. మన మార్కెట్ కూడా క్షీణబాటలోనే మొదలైంది. సెన్సెక్స్ 386 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ ఈ నష్టాలు పెరిగాయే కానీ, తగ్గలేదు. చివర్లో అమ్మకాల సునామీ కారణంగా నష్టాలు మరింతగా ఎగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,172 పాయింట్లు, నిఫ్టీ 342 పాయింట్ల మేర నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్‌లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్‌లో క్షీణించాయి.
► సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హిందుస్తాన్ యూనిలివర్ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి.
► గత ఐదు నెలలుగా పుంజుకుంటూ వస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు బాగా నష్టపోయాయి.
► మార్కెట్ భారీ పతనంలోనూ 100కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. రూట్ మొబైల్, మాజెస్కో, అపోలో హాస్పిటల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► దాదాపు 380కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి.
పతనానికి ప్రధాన కారణాలు
► అగాధంలోకి అమెరికా ఎకానమీ: డిమాండ్ బలహీనంగా ఉండటం, ఉద్యోగ కల్పన కొరవడడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ అగాధంలోకి కూరుకుపోయిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్మన్ రిచర్డ్ క్లారిడ తాజాగా వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థ రికవరీని అతిగా అంచనా వేశారని, మార్కెట్లు ఊహించిన స్థాయిలో రికవరీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
► పెరుగుతున్న కరోనా కేసులు: దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ప్రబలి దాదాపు పది నెలలు కావస్తున్నా, కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయే కానీ, తగ్గడం లేదు.
► మళ్లీ లాక్‌డౌన్ భయాలు: యూరప్ దేశాల్లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల కట్టడికి మళ్లీ లాక్‌డౌన్ విధించాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. లాక్‌డౌన్ విధిస్తే, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కుంటుపడి రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలు నెలకొన్నాయి.
► ప్రపంచ మార్కెట్ల పతనం: కరోనా కేసులు పెరుగుతుండటం, మళ్లీ లాక్‌డౌన్ భయాలు మొదలవ్వడం, రికవరీకి ఊతమిచ్చేలా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి.
► హెవీ వెయిట్స్‌లో అమ్మకాలు: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
► 32 పైసలు పతనమైన రూపాయి: రూపాయి మళ్లీ పతనబాట పట్టింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి 73.89కు చేరింది. ఇది దాదాపు నెల కనిష్ట స్థాయి.
► ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ: సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు చివరి రోజు కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది.
6 రోజులు... రూ.11 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ. 3.95 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.95 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.148.76 లక్షల కోట్లకు పడిపోయింది. గత 6 రోజుల నష్టాల కారణంగా మొత్తం రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది.
మరింత తీవ్రంగా ఒడిదుడుకులు.!
ప్రస్తుతం నిఫ్టీ 200 రోజులు సింపుల్ మూవింగ్ యావరేజ్(ఎస్‌ఎమ్‌ఏ–10,839 పాయింట్లు), దిగువకు పతనమైంది. 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్(ఈఎమ్‌ఏ–10,761 పాయింట్లు)కు చేరువయింది. దీంతో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు మరింత తీవ్రంగా ఉంటాయని, ట్రేడర్లు, ఇన్వెస్టర్లు జాగరూకతతో వ్యవహరించాలనేది విశ్లేషకుల సూచన. ఆర్థిక రికవరీపై అధిక అంచనాలు నెలకొన్నాయని, షేర్ల విలువలు అధికంగా ఉన్నాయని, దీంతో మార్కెట్లో కరెక్షన్ తప్పనిసరి అని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల గమనాన్ని బట్టే మన మార్కెట్ కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు.
సెన్సెక్స్ టాప్10 పతనాలు
తేదీ నష్టం(పాయింట్లు)
మార్చి9, 2020 1,942
ఆగస్టు 24,2015 1,625
ఫిబ్రవరి 28, 2020 1,448
జనవరి 21, 2008 1,408
సెప్టెంబర్ 24,2020 1,115
అక్టోబర్ 24,2008 1,071
ఫిబ్రవరి1, 2020 988
మార్చి 17,2008 951
మర్చి 3, 2008 901
మార్చి6,2020 894
Comments
Please login to add a commentAdd a comment