rupee down
-
భారీగా పతనమైన రూపాయి
-
బలహీన కరెన్సీల్లో రూపాయి
ముంబై: గత వారం రోజుల వ్యవధిలో అత్యంత అధ్వాన్నంగా పడిపోయిన వర్ధమాన దేశాల కరెన్సీల్లో రూపాయి కూడా ఒకటని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ వారం రోజుల్లో 2.4 శాతం క్షీణించింది. అయితే, 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మిగతా వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే మాత్రం రూపాయి గట్టిగానే నిలబడింది. 7.6 శాతం మాత్రమే పతనమైంది. ప్రస్తుతం 81.73 వద్ద ట్రేడవుతోంది. కొరియా కరెన్సీ వోన్ (–16.9 శాతం), ఫిలిప్పీన్స్ పెసో (–14.3 శాతం), థాయ్ బాహత్ (–13.3 శాతం), చైనా యువాన్ (–12.8 శాతం) మరింత భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం తదితర అంశాలు డాలర్ బలోపేతానికి దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీనివల్ల వర్ధమాన మార్కెట్లే కాకుండా సంప న్న మార్కెట్ల కరెన్సీలు కూడా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. యూరో 13.2 శాతం, పౌండ్ స్టెర్లింగ్ .. యెన్ చెరి 18.2 శాతం మేర క్షీణించడం ఇందుకు నిదర్శనమని వివరించింది. రూపాయిని స్థిరపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ మరింత అధిక స్థా యిలో వడ్డీ రేట్లను పెంచాల్సి ఉండవచ్చని నివేదిక తెలిపింది. మరోవైపు, విదేశీ మారక నిల్వలు (ఫారె క్స్) క్షీణించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. -
రూపాయి.. క్రాష్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ భారీగా చరిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 54 పైసలు పతనమై 77.44కు పడిపోయింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో (శుక్రవారం) రూపాయి 55 పైసలు పతనమై 76.90కి చేరింది. అదే వరవడిని కొనసాగిస్తూ, సోమవారం ట్రేడింగ్‌లో బలహీనంగా 77.17 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ఒక దశలో 77.55 కనిష్టాన్ని చూసింది. చివరికి స్వల్పంగా 11పైసలు కోలుకుని 77.44 వద్ద ముగిసింది. క్రితం కన్నా ఇది 54 పైసలు పతనం. క్రితం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 109 పైసలు నష్టపోవడం గమనార్హం. రూపాయి కదలికలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి సోమవారం వరకూ ఇవి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. అటు తర్వాత రూపాయి స్వల్ప ఒడిదుడుకులతో 76 వరకూ బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. కేవలం రెండు నెలలు తిరిగేసరికే రూపాయి మరింత కిందకు జారిపోవడం కరెన్సీ బలహీనతలను తెలియజేస్తోంది. ► అంతక్రితం కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్ 22వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92ని చూసింది. ముగింపులో 2020 ఏప్రిల్ 16వ తేదీన రికార్డు పతనం 76.87. ఆ తర్వాత కొంత బలపడినా, తిరిగి ఆ స్థాయిని కోల్పోడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ► అమెరికా వడ్డీరేట్ల పెంపు, దీనితో ఆ దేశానికి తిరిగి డాలర్ల రాక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణమవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అరశాతంపైగా నష్టంతో 77.55 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 103.64 వద్ద ట్రేడవుతోంది. మరింత క్షీణత..! రూపాయి సమీప కాలంలోనే 77.80 స్థాయికి పతనం కావచ్చన్నది మా అంచనా. బలమైన డాలర్ ఇండెక్స్, అమెరికాలో ట్రెజరీ ఈల్డ్‌లు పెరుగుదల, ఆసియా సహచర కరెన్సీల బలహీనతల నేపథ్యంలో భారత్ రూపాయి విలువ తాజాగా రికార్డు స్థాయికి పడిపోయింది. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఈక్విటీ మార్కెట్లను కూడా తీవ్ర అనిశ్చితికి, బలహీనతకు గురిచేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అధిక రేట్ల పెంపు అవసరాన్ని అంచనా వేస్తున్న పెట్టుబడిదారులు, ప్రస్తుతం మార్కెట్లో రిస్క్ చేయడానికి విముఖతను వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిని మించి (2–6%) ద్రవ్యోల్బణం పెరుగుదల, క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా దేశీయ ఈక్విటీల నుంచి ఎఫ్ఐఐలు వెనక్కు మళ్లడానికి కారణం అవుతున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ మే 4 మధ్యంతర పరపతి సమీక్ష రూపాయికి తక్షణం మద్దతును అందించలేకపోయింది. – రాయిస్ వర్గీస్ జోసెఫ్ కరెన్సీ అండ్ ఎనర్జీ రీసెర్చ్ అనలిస్ట్, ఆనంద్ రాఠి -
రూపాయికి క్రూడ్ కష్టాలు
ముంబై: రూపాయి అయిదు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. డాలర్ మారకంలో 29 పైసలు క్షీణించి 74.84 వద్ద స్థిరపడింది. తూర్పు ఐరోపా దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ సంక్షోభంతో సరఫరా సమస్యలు తలెత్తవచ్చనే భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నాలుగు శాతం ఎగిశాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 98.79 డాలర్లకు చేరింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ అగడం లేదు. ఈ అంశాలు రూపాయి పతనానికి కారణమైనట్లు ట్రేడర్లు తెలిపారు. ఇంట్రాడేలో రూపాయి 31 పైసలు క్షీణించి 74.86 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతులతో ఫారెక్స్ ట్రేడర్లు రిస్క్ ఆఫ్ వైఖరి ప్రదర్శించారు. ఫెడ్ సమావేశ నిర్ణయాలు వెలువడేంత వరకు రూపాయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతోంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దిలీప్ పర్మార్ తెలిపారు. -
ఐదు రోజుల పరుగుకు రూపాయి బ్రేక్
ముంబై: ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచి లాభాల బాటన పయనించిన దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 25పైసలు బలహీనపడి 74.15 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో మార్చి నుంచి వడ్డీరేట్ల పెంపు ఖాయమని ఫెడరల్ రిజర్వ్ అధికారులు చేసిన కామెంట్స్ పలు వర్థమాన దేశాల కరెన్సీల బలహీనతకు, డాలర్ బలోపేతానికి దారితీశాయ. దేశ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్లోనూ ఇదే ధోరణి కనిపించింది. గురువారం రూపాయి ముగింపు 73.90. శుక్రవారం ట్రేడింగ్‌లో రోజంతా 74.05 గరిష్ట– 74.21 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నాలుగు వారాలుగా లాభాల్లోనే... వారం వారీగా చూస్తే రూపాయి విలువ డాలర్ మారకంలో 19 పైసలు బలపడింది. నాలుగు వారాలుగా రూపాయి నికరంగా లాభాల బాటన నడుస్తోంది. గడచిన నెల రోజుల్లో 2.6 శాతం లాభపడింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల ధోరణి లేకపోతే, రూపాయి ఈ కాలంలో మరింత బలోపేతం అయ్యేదని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.11 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కొత్త వేరియంట్ ఒమిక్రాన్, వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయాలు, దేశీయ మార్కెట్ల పనితీరు వంటి అంశాలపై ఆధారపడి రూపాయి తదుపరి కదలికలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. -
75 చేరువకు రూ‘పాయె’
ముంబై: భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో బుధవారం భారీగా 54 పైసలు పడిపోయింది. 74.98 వద్ద ముగిసింది. గడచిన ఐదు నెలల్లో (ఏప్రిల్ 23 తర్వాత) రూపాయి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఆరు నెలల్లో ఇదే తొలిసారి. దీనితో వరుసగా గత తొమ్మిది ట్రేడింగ్ షెషన్లలో ఎనిమిది రోజులు రూపాయి నష్టాలను చవిచూసినట్లయ్యింది. దేశీయంగా ఈక్విటీల బలహీనతలకు తోడు అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయికి ప్రతికూలం అవుతున్నాయి. ట్రేడింగ్‌లో డాలర్ మారకంలో 74.63 వద్ద ప్రారంభమైన రూపాయి, 74.54 కనిష్ట–74.99 గరిష్ట స్థాయిల్లో కదలాడింది. రూపాయి 75 స్థాయిని కాపాడుకోలేకపోతే మరింత పతనం తప్పకపోవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ విశ్లేíÙంచారు. సమీప కాలానికి 73.95 వద్ద మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.82 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 94.30 పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ) కాగా అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర 78.64 వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ విషయంలో ఈ ధర 82.50 వద్ద ఉంది. -
బుల్స్ బౌన్స్‌బ్యాక్
ముంబై: ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలతో భారీగా పతనమైన సూచీలు.., బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అయ్యి లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 604 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 230 పాయింట్ల లాభంతో 52,574 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 177 పాయింట్ల నష్టం నుంచి కోలుకుని 63 పాయింట్లు పెరిగి 15,747 వద్ద నిలిచింది. ఐటీ, ఆటో మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఒక శాతం రాణించి సూచీల పతనాన్ని అడ్డుకుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ బ్యాంక్ ప్రైవేటీకరణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయనే వార్తలతో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకోవడమే కాకుండా లాభాలన్ని ఆర్జించగలిగాయి. ఇటీవల కరెక్షన్తో దిగివచ్చిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతం లాభపడ్డాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెనెక్స్ 803 పాయింట్ల శ్రేణిలో, నిఫ్టీ 259 పాయింట్ల పరిధిలో కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1245 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.138 కోట్ల షేర్లను కొన్నారు. 803 పాయింట్ల శ్రేణిలో ట్రేడైన సెన్సెక్స్ వచ్చే ఏడాదిలో ద్వితీయార్థం చివర్లో వడ్డీరేట్లను పెంచవచ్చని ఫెడ్ రిజర్వ్ ప్రకటనతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న మన మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 456 పాయింట్ల నష్టంతో 51,888 వద్ద, నిఫ్టీ 157 పాయింట్లను కోల్పోయి 15,526 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్లో ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు మరింత నష్టపోయాయి. సెన్సెక్స్ 604 పాయింట్లను కోల్పోయి 51,740 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు నష్టపోయి 15,506 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ దశలో నిఫ్టీకి 15,500 వద్ద సాంకేతిక మద్దతు లభించింది. రిలయన్స్ షేరు ఒక శాతం రాణించి మార్కెట్ పతనాన్ని అడ్డుకుంది. అలాగే బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో సూచీలు క్రమంగా ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. చివర్లో మెటల్ షేర్లు మెరవడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. ‘‘ ఎఫ్అండ్ఓ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపునకు ముందు మార్కెట్ ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు సహజం. అందరికీ ఉచితంగా టీకా బాధ్యత కేంద్రానిదే అని ప్రధాని మోదీ ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ అనుకున్న దానికంటే వేగంగా రికవరీ అవ్వొచ్చనే ఆశలు సూచీలను నష్టాల్లోంచి లాభాల వైపు నడిపించాయి. ట్రెండ్ రివర్స్ అయ్యేంత వరకు మార్కెట్ పతనమైన ప్రతిసారి నాణ్యమైన షేర్లను కొనవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 5% పతనమై రూ.701 వద్ద ముగిసింది. ప్రైవేట్ ఈక్విటీ కార్లైల్ గ్రూప్ సంస్థ నుంచి పీఎన్బీ హౌసిం గ్ ఫైనాన్స్ రూ.4 వేల కోట్ల నిధులను సేకరించాలన్న ప్రతిపాదనను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అడ్డుకోవడం షేరు నష్టానికి కారణమైంది. ► ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గరిష్ట బిడ్‌ను ఆఫర్ చేయడంతో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేరు బీఎస్ఈ ఐదు శాతం లాభపడి రూ.6 వద్ద ముగిసింది. ► వార్షిక సర్వసభ్య సమావేశానికి(జూన్ 24) ముందు రిలయన్స్ షేరు రాణించింది. బీఎస్ఈ ట్రేడింగ్‌లో రూ.2247 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి ఒకశాతం లాభపడి రూ.2247 వద్ద స్థిరపడింది. ► ప్రైవేటీకరణ వార్తలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ బ్యాంక్ షేరు 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. ఈ రెండు షేర్లు వరుసగా రూ.20లు, రూ.24లు వద్ద ముగిశాయి. ► సూక్ష్మ ఆర్థిక సంస్థల రుణాలపై ఆస్సాం ప్రభుత్వం ఉపశమనం కలిగించడంతో బంధన్ బ్యాంక్ 8% లాభపడి రూ. 341 వద్ద ముగిసింది. 24 పైసలు పతనమైన రూపాయి 74.10 స్థాయి వద్ద ముగింపు ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 24 పైసలు పతనమై 74.10 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 74.20 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం రూపాయికి ప్రతికూలంగా మారడంతో తొలి సెషన్లో 42 పైసలు నష్టపోయి 74.08 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. రెండో భాగంలో రికవరీ బాట పట్టింది. ఈ క్రమంలో 74.28 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. క్రూడ్ ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు, డాలర్ ఇండెక్స్ కదలికలు వంటి అంశాలు రానున్న రోజుల్లో రూపాయికి దిశానిర్దేశం కానున్నాయని ఫారెక్స్ నిపుణులు పేర్కొన్నారు. -
క్రాష్ మార్కెట్!
ముంబై: భారత స్టాక్ మార్కెట్లో రెండోరోజూ ‘బేర్’ బాజా కొనసాగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో పాటు లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. మార్చి డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ æఓ) కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో అమ్మకాలకు మొగ్గుచూపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. రూపాయి వరుసగా మూడో రోజూ 7 పైసలు క్షీణించడం కూడా ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 740 పాయింట్లు నష్టపోయి 48,440 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్ల పతనంతో 14,325 వద్ద స్థిరపడింది. మెటల్ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్ వరుస పతనంతో రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,611 పాయింట్లు, నిఫ్టీ 489 పాయింట్లను కోల్పోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు జరగడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రెండోరోజూ రూ.3,384 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,268 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 49 వేల దిగువకు సెన్సెక్స్... మునుపటి రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్ బలహీనంగా మొదలైంది. సెన్సెక్స్ 49,202 వద్ద, నిఫ్టీ 14,571 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ రంగ షేర్లను ఎక్కువగా విక్రయించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 49 వేల స్థాయిని కోల్పోయింది. ఒక దశలో సెన్సెక్స్ 944 పాయింట్లును కోల్పోయి 48,236 వద్ద, నిఫ్టీ 285 పాయింట్లు నష్టపోయి 14,264 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మిడ్‌సెషన్ తర్వాత కొంత రికవరీ కన్పించినా చివరి గంట అమ్మకాలతో సూచీలు రెండోరోజూ భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ‘భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రేటు మళ్లీ పెరిగిపోతోంది. ఈ అంశం ఈక్విటీ మార్కెట్లలో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. డెరివేటివ్స్ ముగింపు తేది కావడం మరింత ప్రతికూలాంశంగా మారింది. సుదీర్ఘ ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్ దిద్దుబాటుకు గురై స్థిరీకరణ దిశగా సాగుతుంది. ఈ దశలో కోవిడ్ వ్యాప్తి భయాలు మార్కెట్ పతనానికి కారణమవుతున్నాయి’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రెండు రోజుల్లో రూ.6.9 లక్షల కోట్లు ఆవిరి మార్కెట్ భారీ పతనంతో గురువారం ఇన్వెస్టర్లు రూ. 3.69 లక్షల కోట్లను కోల్పోయారు. అంతకు ముందు ట్రేడింగ్ సెషన్లోనూ రూ.3.27 లక్షల కోట్ల సంపద ఆవిరవడంతో ఈ రెండు రోజుల్లో రూ.6.96 లక్షల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.200 లక్షల కోట్ల దిగువకు చేరుకొని రూ.198.78 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 3వ తేదీన బీఎస్ఈ ఇన్వెస్టర్ల సంపద రూ. 200 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. -
చమురు భగభగ.. భారత్‌కు సౌదీ ఉచిత సలహా
లండన్: డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నా యి. గురువారం 4% ఎగిసిన ధరలు శుక్రవారం మరో రెండు శాతం పైగా పెరిగాయి. 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ రేటు బ్యారెల్‌కు 2.3 శాతం దాకా పెరిగి 68.26 డాలర్లకు చేరింది. అటు నైమెక్స్ క్రూడాయిల్ ధర దాదాపు 2% పైగా పెరిగి 66.23 డాలర్ల స్థాయిని తాకింది. ఒపెక్, దాని అనుబంధ దేశాలు ఏప్రిల్‌లోనూ ఉత్పత్తి గణనీయంగా పెంచరాదని నిర్ణయించుకున్నాయి. రష్యా, కజకిస్తాన్‌లకు స్వల్ప మినహాయింపునివ్వడం తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఉత్పత్తిపై నియంత్రణ కొనసాగించాలని తీర్మానించుకున్నాయి. ఒపెక్ దేశాలు కనీసం రోజుకు 15 లక్షల బ్యారెళ్ల మేర (బీపీడీ) ఉత్పత్తి పెంచుతాయని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ.. దానికి విరుద్ధంగా 1.5 లక్షల బీపీడీకి మాత్రమే ఒపెక్, అనుబంధ దేశాలు నిర్ణయించడం మార్కెట్ వర్గాలను నిరాశపర్చిందని యూబీఎస్ అనలిస్ట్ జియోవాని స్టానొవో పేర్కొన్నారు. జనవరి 2020: క్రూడ్ గరిష్ట రేటు 65.65 డాలర్లు ఏప్రిల్ 2020: క్రూడ్ కనిష్ట రేటు మైనస్ 40.32 డాలర్లు మార్చి 5 2021: క్రూడ్ గరిష్ట రేటు 66.23 డాలర్లు అంచనాల్లో సవరణలు.. ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేపథ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. రెండో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారెల్‌కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్రెంట్ రేటు 75 డాలర్లకు (బ్యారెల్‌కు), నైమెక్స్ క్రూడ్ 72 డాలర్లకు (బ్యారెల్‌కు) చేరొచ్చని యూబీఎస్ అంచనాలను సవరించింది. భారత్‌కు సౌదీ ఉచిత సలహా.. చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఉత్పత్తిపై నియంత్రణలను సడలించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సౌదీ అరేబియా ఉచిత సలహా ఇచ్చింది. ఒపెక్, అనుబంధ దేశాల నిర్ణయంపై జరిగిన విలేకరుల సమావేశంలో సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్.. భారత్ విజ్ఞప్తిపై స్పందించారు. ‘భారత్ విషయానికొస్తే గతేడాది ఏప్రిల్, మే, జూన్‌లో చౌకగా కొనుగోలు చేసిన చమురును ప్రస్తుతం ఉపయోగించుకోవాలని మా మిత్ర దేశాన్ని కోరుతున్నాము‘ అని ఆయన వ్యాఖ్యానించారు. 2020 ఏప్రిల్-మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్‌తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. కేంద్రచమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్‌ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి సాధారణ స్థితికి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పెట్రో రేట్లు.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్యలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారెల్‌కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం పెంచుకుంటూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్ ధరలో మూడో వంతు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండగా, డీజిల్ ధరలో 40% దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాల పన్నులూ తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు ఇంకా పెరిగితే దేశీయంగా ఇంధనాల రిటైల్ రేట్లు మరింతగా ఎగిసే అవకాశం ఉంది. క్రూడ్ సెగకు కరిగిన రూపాయి 19 పైసల పతనంతో 73 దిగువకు ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, దేశీయ మార్కెట్ల తాజా బలహీన దోరణి ఎఫెక్ట్ రూపాయిపై పడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 73.02కు బలహీనపడింది. ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.00–0.25 శాతం శ్రేణి) మరింత తగ్గబోదని అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ చైర్మన్ పావెల్ సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణలు, దీనితో ఇక ఈజీ మనీకి ముగింపు పలికినట్లేనన్న అంచనాలు, వ్యాక్సినేషన్ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాల నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్టానికి (91.94) చేరింది. -
రికార్డుల ర్యాలీకి బ్రేక్..!
ముంబై: మార్కెట్లో వరుస రికార్డుల ర్యాలీకి గురువారం విరామం పడింది. బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక, ఆటో రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల ఏడురోజుల సుదీర్ఘ ర్యాలీ ఆగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, డాలర్ మారకంలో నీరసించి రూపాయి విలువ వంటి అంశాలు ట్రేడింగ్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 144 పాయింట్లు నష్టపోయి 45,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్లను కోల్పోయి 13,478 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలోనూ ఎఫ్ఎంసీజీ షేర్లు ఎదురీదాయి. మెటల్, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 418 పాయింట్ల వరకు నష్టపోయి 45,686 స్థాయి వద్ద, నిఫ్టీ 130 పాయింట్లను కోల్పోయి 13,399 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ఇటీవల జరిగిన బుల్ ర్యాలీలో భారీగా లాభపడిన బ్యాంకింగ్, చిన్న, మధ్య తరహా షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ జరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ గరిష్టస్థాయిల వద్దే సూచీలు ట్రేడ్ అవుతున్న తరుణంలో జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏదైనా ప్రతికూల సంఘటన జరిగితే లాభాల స్వీకరణ కొనసాగే అవకాశం ఉందని వారంటున్నారు. వరుసగా రెండురోజులు లాభపడిన రూపాయి గురువారం 9 పైసలు నష్టపోయి 73.66 వద్ద స్థిరపడింది. సిమెంట్ షేర్లకు సీఐఐ షాక్... కాంపిటీటివ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పలు సిమెంట్ కంపెనీలపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో గురువారం ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంబుజా సిమెంట్స్ 2 శాతం నష్టంతో రూ.248 వద్ద, ఏసీసీ 1.50 శాతంతో 1,632 వద్ద ముగిశాయి. ఆగని ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం... దేశీ ఈక్విటీల్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. నగదు విభాగంలో గురువారం రూ.2260 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ నెల 15 నుంచి మిసెస్ బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ బ్రెడ్డు, బిస్కెట్లు తయారు చేసే మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాల్టీస్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 15 నుంచి ప్రారంభం కానున్నది. రూ. 10 ముఖ విలువ గల ఈక్విటీ షేర్‌కు ధరల శ్రేణి (ప్రైస్‌బాండ్)ని రూ.286–288గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 17న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 28న ఈ షేర్లు లిస్టవుతాయి. ఐపీఓలో రూ. 40.54 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. -
‘బేర్’ బాజా !
ఆర్థిక రికవరీపై అనుమా నాలు, ఆందోళనతో ప్రపంచమార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,850 పాయింట్ల దిగువకు పడిపోయాయి. రెండో దఫా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ భయాలతో కలవరపడుతున్న ఇన్వెస్టర్లు ఎడాపెడా అమ్మకాలకు దిగారు. మరోవైపు వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి దాదాపు నెల కనిష్ట స్థాయి, 73.89కు పడిపోవడం, సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ చివరి రోజు కావడంతో అమ్మకాలు జోరుగా సాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,115 పాయింట్లు పతనమై 36,554 పాయింట్ల వద్ద, నిఫ్టీ 326 పాయింట్లు నష్టపోయి 10,806 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 3 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్‌కు ఇది ఈ ఏడాది మూడో అతి పెద్ద పతనం. 7 నెలల్లో తొలిసారి... స్టాక్ సూచీలు వరుసగా ఆరో రోజూ క్షీణబాటలోనే సాగాయి. ఈ ఆరు రోజుల్లో సెన్సెక్స్ 2,749 పాయింట్లు, నిఫ్టీ 799 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ రెండు సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం గత 7 నెలల్లో ఇదే తొలిసారి. ఆరంభం నుంచి నష్టాలే... బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో గురువారం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. మన మార్కెట్ కూడా క్షీణబాటలోనే మొదలైంది. సెన్సెక్స్ 386 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. రోజు గడుస్తున్న కొద్దీ ఈ నష్టాలు పెరిగాయే కానీ, తగ్గలేదు. చివర్లో అమ్మకాల సునామీ కారణంగా నష్టాలు మరింతగా ఎగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,172 పాయింట్లు, నిఫ్టీ 342 పాయింట్ల మేర నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్లో క్షీణించాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హిందుస్తాన్ యూనిలివర్ షేర్ మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టపోయాయి. ► గత ఐదు నెలలుగా పుంజుకుంటూ వస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు బాగా నష్టపోయాయి. ► మార్కెట్ భారీ పతనంలోనూ 100కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. రూట్ మొబైల్, మాజెస్కో, అపోలో హాస్పిటల్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 380కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. పతనానికి ప్రధాన కారణాలు ► అగాధంలోకి అమెరికా ఎకానమీ: డిమాండ్ బలహీనంగా ఉండటం, ఉద్యోగ కల్పన కొరవడడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ అగాధంలోకి కూరుకుపోయిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్మన్ రిచర్డ్ క్లారిడ తాజాగా వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థ రికవరీని అతిగా అంచనా వేశారని, మార్కెట్లు ఊహించిన స్థాయిలో రికవరీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► పెరుగుతున్న కరోనా కేసులు: దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ప్రబలి దాదాపు పది నెలలు కావస్తున్నా, కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయే కానీ, తగ్గడం లేదు. ► మళ్లీ లాక్డౌన్ భయాలు: యూరప్ దేశాల్లో రెండో దఫా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల కట్టడికి మళ్లీ లాక్డౌన్ విధించాలని పలు దేశాలు యోచిస్తున్నాయి. లాక్డౌన్ విధిస్తే, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కుంటుపడి రికవరీ మరింత ఆలస్యమవుతుందనే భయాలు నెలకొన్నాయి. ► ప్రపంచ మార్కెట్ల పతనం: కరోనా కేసులు పెరుగుతుండటం, మళ్లీ లాక్డౌన్ భయాలు మొదలవ్వడం, రికవరీకి ఊతమిచ్చేలా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. ► హెవీ వెయిట్స్‌లో అమ్మకాలు: సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► 32 పైసలు పతనమైన రూపాయి: రూపాయి మళ్లీ పతనబాట పట్టింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి 73.89కు చేరింది. ఇది దాదాపు నెల కనిష్ట స్థాయి. ► ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ: సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు చివరి రోజు కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. 6 రోజులు... రూ.11 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా రూ. 3.95 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.95 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.148.76 లక్షల కోట్లకు పడిపోయింది. గత 6 రోజుల నష్టాల కారణంగా మొత్తం రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. మరింత తీవ్రంగా ఒడిదుడుకులు.! ప్రస్తుతం నిఫ్టీ 200 రోజులు సింపుల్ మూవింగ్ యావరేజ్(ఎస్ఎమ్ఏ–10,839 పాయింట్లు), దిగువకు పతనమైంది. 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్(ఈఎమ్ఏ–10,761 పాయింట్లు)కు చేరువయింది. దీంతో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు మరింత తీవ్రంగా ఉంటాయని, ట్రేడర్లు, ఇన్వెస్టర్లు జాగరూకతతో వ్యవహరించాలనేది విశ్లేషకుల సూచన. ఆర్థిక రికవరీపై అధిక అంచనాలు నెలకొన్నాయని, షేర్ల విలువలు అధికంగా ఉన్నాయని, దీంతో మార్కెట్లో కరెక్షన్ తప్పనిసరి అని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల గమనాన్ని బట్టే మన మార్కెట్ కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు. సెన్సెక్స్ టాప్10 పతనాలు తేదీ నష్టం(పాయింట్లు) మార్చి9, 2020 1,942 ఆగస్టు 24,2015 1,625 ఫిబ్రవరి 28, 2020 1,448 జనవరి 21, 2008 1,408 సెప్టెంబర్ 24,2020 1,115 అక్టోబర్ 24,2008 1,071 ఫిబ్రవరి1, 2020 988 మార్చి 17,2008 951 మర్చి 3, 2008 901 మార్చి6,2020 894 -
డాలర్ బలం – రూపాయి బలహీనం
ముంబై: ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ట్రేడయ్యే– డాలర్ ఇండెక్స్ బలోపేతంకావడం రూపాయి సెంటిమెంట్‌పై బుధవారం ప్రభావాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ పారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు బలహీనపడి 73.03 వద్ద ముగిసింది. కరోనా తీవ్ర సవాళ్లు విసరడానికి కొద్ది రోజుల ముందు– మార్చి మధ్యస్థంలో 52 వారాల గరిష్టం 104 వరకూ వెళ్లిన డాలర్ ఇండెక్స్, అటు తర్వాత తీవ్ర ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో క్రమంగా తగ్గుతూ మంగళవారం 52 వారాల కనిష్టం 91.73ను చూసింది. అయితే బుధవారం వెలువడిన అమెరికా తయారీ పరిశ్రమ ఇండెక్స్ ఊహించినదానికన్నా మెరుగ్గా ఉండడంతో డాలర్ కనిష్ట స్థాయిల నుంచి కొంత కోలుకుంది. ఇది రూపాయి సెంటిమెంట్‌పై స్వల్ప ప్రభావాన్ని చూపినట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. అయితే భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక కొనసాగడం, స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగితే, రూపాయి మరింత బలపడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం భారీగా 73 పైసలు లాభపడి 72.87 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
మార్కెట్లు మళ్లీ మునక!
కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ మార్కెట్ వర్గాల అంచనాలకనుగుణంగా లేకపోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మన దేశంలో కరోనా కేసులు ఒక్క రోజులో అత్యధికంగా పెరగడం, లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం...ప్రతికూల ప్రభావమే చూపించాయి. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉన్నా, మన మార్కెట్లో మాత్రం నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 1,069 పాయింట్లు పతనమై 30,029 వద్ద, నిఫ్టీ 314 పాయిం ట్లు నష్టపోయి 8,823 వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. 1,280 పాయింట్ల రేంజ్లో... ఆసియా మార్కెట్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే నిఫ్టీ 9,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఒకింత రికవరీ కనిపించినా, చివరి అరగంటలో అమ్మకాలు మరింతగా వెల్లువెత్తాయి. ఒక దశలో 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 1,130 పాయింట్లకు పడిపోయింది. మొత్తం మీద రోజంతా 1,280 పాయింట్ల రేంజ్లో కదలాడింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పాటు పొడిగించడంతో పొజిషన్లు తీసుకునే విషయమై ట్రేడర్లు ఆచి, తూచి వ్యవహరించారు. ఆర్థిక, వాహన, రియల్టీ, లోహ, ఆయిల్, గ్యాస్ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. రూపాయి మారకం విలువ పతనం కావడంతో ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఫార్మా సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► ఇండస్ఇండ్ బ్యాంక్ 10 శాతం నష్టంతో రూ.377 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► సెన్సెక్స్ 30 షేర్లలో రెండు షేర్లు–టీసీఎస్, ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడగా, మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► బకాయిల చెల్లింపుల్లో విఫలమైనప్పటికీ, రుణగ్రస్తులపై ఏడాది పాటు దివాలా చర్యలు తీసుకోకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంక్, ఆర్థిక రంగ, ఎన్బీఎఫ్సీ. హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 12 శాతం వరకూ నష్టపోయాయి. ► దాదాపు 140కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. పీవీఆర్, ఐనాక్స్ విండ్, ఐనాక్స్ లీజర్, షాపర్స్ స్టాప్, ప్రెస్టీజ్ ఎస్టేట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అలెంబిక్ ఫార్మా, ఇండియా సిమెంట్స్... ఈ రెండు షేర్లు మాత్రమే ఏడాది గరిష్టాలకు ఎగిశాయి. ► 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. స్పైస్‌జెట్, ఎన్బీసీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► వెంటిలేటర్ల తయారీకి సిద్ధమవుతోందన్న వార్తలతో జెన్ టెక్నాలజీస్ షేర్ 10% లాభంతో రూ.37 వద్ద ముగిసింది. ► బొగ్గు మైనింగ్‌లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించడంతో ఇప్పటివరకూ ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న కోల్ ఇండియా షేర్ 6 శాతం మేర నష్టంతో రూ. వద్ద ముగిసింది. ► రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడంతో రక్షణ రంగ కంపెనీలు లాభపడ్డాయి. రూ.3.65 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.65 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ విలువ రూ. 3,65,470 కోట్ల మేర హరించుకుపోయి రూ.119 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే... ప్యాకేజీ.. పైన పటారం.. లోన లొటారం! ఆర్థిక ప్యాకేజీ 2.0... పైన పటారం... లోన లొటారం చందంగా ఉందని నిపుణులంటున్నారు. భారీగా నిధుల వరద పారేలా ప్యాకేజీ ఉంటుందన్న అంచనాలన్నీ తప్పాయని వారంటున్నారు. తక్షణం డిమాండ్‌ను, వినియోగాన్ని పెంచేలా ఉద్దీపన చర్యలు లేకపోవడంతో సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషకులంటున్నారు. పేరుకే ఇది రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, వాస్తవంగా ప్రభుత్వానికి ఖర్చయ్యేది రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని వారంటున్నారు. జీడీపీలో 10 శాతానికి సమానమైన ప్యాకేజీని... రూ.20 లక్షల కోట్ల మేర అందిస్తామని ప్రధాని ప్రకటించినా, వాస్తవిక ప్యాకేజీ ప్రకటించిన ప్యాకేజీలో 10 శాతం మేర ఉండటమే గమనించాల్సిన విషయం. లాక్డౌన్ పొడిగింపు... లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించడం ప్రతికూల ప్రభావమే చూపించింది. లాక్‌డౌన్‌ను పొడిగించడం ఇది మూడోసారి. లాక్డౌన్ 4.0లో కొన్ని వెసులుబాట్లు ఇచ్చినప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం మరింత జాప్యం కాగలదన్న భయాలతో అమ్మకాలు జోరుగా సాగాయి. కరోనా ఉగ్రరూపం భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు 96వేలకు, మరణాలు 3,000కు పైగా పెరిగాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 47 లక్షలకు పైగా, మరణాలు 3.15 లక్షలకు చేరాయి. రూపాయి పతనం డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు క్షీణించి 75.61కు పడిపోయింది. 60 శాతం తగ్గిన ఎగుమతులు... గత నెలలో ఎగుమతులు 60% పతనమయ్యాయి. భారీ లాభాల్లో అమెరికా మార్కెట్ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మానవులపై జరిపిన తొలి దశ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ ప్రకటించింది. మరోవైపు ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ అభయం ఇచ్చారు. ఈ రెండు అంశాల కారణంగా సోమవారం రాత్రి అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ మార్కెట్లు 4–6% లాభాల్లో ముగియ గా, రాత్రి 11.30 సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 2–3% లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
ఆరంభ లాభాలు ఆవిరి
ఆరంభ లాభాల జోష్‌ను మన మార్కెట్ చివరి వరకూ కొనసాగించలేకపోయింది. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఆర్థిక స్థితిగతులు మరింత అధ్వానం కాగలవన్న ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 1.9%కి తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ఠానికి పడిపోవడం, ముడి చమురు ధరలు 4% మేర పతనమవటం, లాక్‌డౌన్‌ను పొడిగించడం.... ప్రతికూల ప్రభావం చూపాయి. రోజంతా 1,346 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 310 పాయింట్ల నష్టంతో 30,380 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 267 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 8,925 వద్దకు చేరింది. సమృద్ధిగానేవర్షాలు.. తప్పని నష్టాలు...!! సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయని, ఎలాంటి లోటు ఉండదని వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 1 శాతానికి తగ్గింది. ఈ రెండు సానుకూలాంశాలతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభం కావడం, అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడవుతుండటంతో మధ్యాహ్నం తర్వాత మన సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. 1930 నాటి మహా మాంద్యం తర్వాత ఈ ఏడాదే ఆర్థిక పరిస్థితులు అత్యంత అధ్వానంగా మారాయని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్ 468 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్టం నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,188 పాయింట్ల మేర నష్టపోయింది. ఇక ఆసియా మార్కెట్లు 1–2 శాతం నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు›కూడా 3–4% నష్టాల్లో ముగిశాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 6.2 శాతం నష్టంతో రూ.1,173 వద్ద ముగిసింది. ► లాక్డౌన్ నుంచి వ్యవసాయ రంగ కార్యకలాపాలను మినహాయించడంతో సంబంధిత షేర్లు లాభపడ్డాయి. దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్స్ 11%, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 11%, చంబల్ ఫెర్టిలైజర్స్ 8 శాతం ఎగబాకాయి. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి డాలర్‌తో పోలిస్తే 76.44కి డౌన్ ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం.. అంతర్జాతీయంగా డాలరు బలపడటం తదితర పరిణామాలతో రూపాయి మారకం విలువ బుధవారం గణనీయంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 17 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 76.44 వద్ద క్లోజయ్యింది. డాలర్ ఇండెక్స్ పటిష్టంగా ఉండటం .. రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. దీంతో పాటు ఇటు దేశీ, అటు ప్రపంచ ఎకానమీలపై కరోనా ఆందోళన కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు కూడా బలహీనంగా ఉన్నట్లు వివరించారు. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజీలో రూపాయి ట్రేడింగ్ గత ముగింపుతో పోలిస్తే పటిష్టంగా 76.07 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.99 గరిష్ట స్థాయితో పాటు 76.48 డాలర్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 76.44 వద్ద ముగిసింది. మే 3 దాకా లాక్డౌన్ కొనసాగించడంతో మరిన్ని సమస్యలు తప్పవనే భయాలు నెలకొనడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు (కమోడిటీ, కరెన్సీ) జతిన్ త్రివేది తెలిపారు. -
మార్కెట్ లాక్డౌన్!
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్ సెషన్లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు. ఇంట్రాడేలో రూపాయి విలువ ఏకంగా 76.30నీ చూసింది. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ కొత్త కనిష్టాలను చూస్తోంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు తాజా పరిస్థితి నేపథ్యం. బంగారం 80 డాలర్లు జంప్ మరోవైపు కోవిడ్ భయాలతో బంగారం ఒక్కసారిగా భారీగా పెరిగింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 11.15కు 84 డాలర్ల లాభంతో 1,568 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లు న్యూఢిల్లీ: కోవిడ్–19 ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో రానున్న 16 రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. స్వల్పకాలిక రెపో వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలను వ్యవస్థలోకి పంప్ చేయాలని నిర్ణయించింది. రూ.50,000 కోట్లకు మొదటి విడత రెపో వేలం సోమవారం జరిగింది. అయితే ఈ మొదటి రెపో వేలం ద్వారా రూ.31,585 కోట్లకు బిడ్లను ఆర్బీఐ పొందింది. 5.16 శాతం కటాఫ్ రేటుకు అన్ని బిడ్లనూ ఆమోదించింది. మరో రూ.50,000 కోట్లకు రెండవ విడత వేలాన్ని మంగళవారం నిర్వహించనుంది. అవసరమైతే తదుపరి కూడా ఇదే విధమైన చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ పేర్కొంది. తమ వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను పునఃకొనుగోలు (రీపర్చేజ్) ఒప్పందంపై బ్యాంకులు ఆర్బీఐ వద్ద తనఖాగా ఉంచి ఆ బాండ్ల విలువ మేరకు నిధులను పొందుతాయి. ఈ నిధులపై ఆర్బీఐ కేవలం రెపో రేటు (ప్రస్తుతం 5.15 శాతం) ప్రకారం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. కోవిడ్ నివారణకు యాక్సిస్, వేదాంత చెరో రూ.100 కోట్ల ఫండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్.. కోవిడ్–19 నివారణ చర్యలకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు రూ.100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్లు, ఉద్యోగులు, వర్తకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి స్వీయ నియంత్రణే అసలైన మందు అని.. అందుకే బాధ్యత గల పౌరులుగా సామాజిక దూరం పాటించాలని కోరారు. కస్టమర్లు సాధ్యమైనంత వరకు బ్యాంక్‌లకు రావొద్దని, డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అందుకే ఈ నెల 31 వరకు సేవింగ్, కరెంట్ ఖాతాలు, ప్రిపెయిడ్ కార్డ్స్ కస్టమర్లకు చార్జీలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యాక్సిస్‌కు 4,415 శాఖలు, 12,173 ఏటీఎంలు, 2.6 కోట్ల మంది కస్టమర్లున్నారు. వేదాంత కూడా...: దినసరి కార్మికుల కోసం మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత రూ.100 కోట్ల ఫండ్ కేటాయించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో జీతాలు కుదించబోమని, తాత్కాలిక కార్మికులను సైతం తొలగించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ వన్ టైం ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. కరోనాపె యుద్ధంలో భాగంగా ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు అండగా నిలవాలని వేదాంత రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. అవసరమైతే మరింత ఫండ్ కేటాయిస్తామని చెప్పారు. కార్మికులకు రిలయన్స్ అండ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్మికులకు అండగా నిలిచింది. కరోనా వైరస్ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ.30,000లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు చేతిలో నగదు ఉండేలా నెలలో రెండుసార్లు వేతనం చెల్లించనుంది. కరోనా పాజిటివ్ రోగుల చికిత్సకై 100 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని లోధివాలిలో ఐసోలేషన్ ఫెసిలిటీ సైతం అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ మాస్కుల తయారీ సామర్థ్యాన్ని రోజుకు లక్ష యూనిట్లకు పెంచింది. అలాగే సూట్స్, గార్మెంట్స్ వంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తయారీని పెద్ద ఎత్తున చేపట్టింది. స్వచ్చంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం అందిస్తోంది. అత్యవసర సర్వీసులు మినహా అత్యధిక మంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేలా ప్రోత్సహించింది. -
చివర్లో టపటపా..!
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందన్న భయాలతో గురువారం కూడా స్టాక్ మార్కెట్ పతనం కొనసాగింది. వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 81 పైసలు పతనమై 75 మార్క్ ఎగువకు పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 29,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 501 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 581 పాయింట్ల నష్టంతో 28,288 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక రోజంతా 742 పాయింట్ల రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 205 పాయింట్ల నష్టంతో 8,263 పాయింట్ల వద్దకు చేరింది. టెలికం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. 2,656 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... ప్రపంచ మార్కెట్ల భారీ నష్టాల నేపథ్యంలో మన మార్కెట్ కూడా భారీ నష్టాలతోనే మొదలయ్యింది. సెన్సెక్స్ 1,097 పాయింట్లు, నిఫ్టీ 406 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. అరగంటలోనే సెన్సెక్స్ 2,155 పాయింట్లు పతనమై 26,715 పాయింట్ల వద్ద, నిఫ్టీ 636 పాయింట్లు క్షీణించి 7,833 పాయింట్ల వద్ద ఇంట్రా డే కనిష్టాలను తాకాయి. ఆ తర్వాత నుంచి నష్టాలు తగ్గుతూ వచ్చాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు 1,000 పాయింట్ల మేర రికవరీ కావడంతో మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్ లాభాల్లోకి మళ్లాయి. అయితే అది స్వల్పకాలమే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 501 పాయింట్లు, నిఫ్టీ 106 పాయింట్ల మేర లాభపడ్డాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 2,656 పాయింట్లు, నిఫ్టీ 742 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి రూ. 4,623 కోట్ల నికర అమ్మకాలను కూడా కలుపుకుంటే, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.47,897 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు. పెట్టుబడులన్నింటినీ నగదుగా మార్చుకోవాలనే తపనతో ఇన్వెస్టర్లు పుత్తడితో సహా పలు ఇతర పెట్టుబడి సాధనాల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో షేర్లు, బాండ్లు, పుత్తడి, కమోడిటీలు అన్నీ పతనమవుతూ ఉన్నాయి. ప్యాకేజీలున్నా.... పతనమే వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్రకటించిన ఉద్దీపన చర్యలు... ప్రపంచ మార్కెట్ల పతనాన్ని ఆపలేకపోయాయి. దక్షిణ కొరియా సూచీ కోస్పి 8 శాతం నష్టపోయింది. ఆసియా మార్కెట్లలో అత్యధికంగా పతనమైన సూచీ ఇదే. యూరప్ కేంద్ర బ్యాంక్ 75,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభమైనా, ఆ త ర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. చివరకు 1– 2% లాభాల్లో ముగిశాయి. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి. ► దాదాపు 1,200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 10 శాతం నష్టంతో రూ.2,746 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. యాక్సిస్ బ్యాంక్ 9.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 9 శాతం, టెక్ మహీంద్రా 8 శాతం, ఓఎన్జీసీ 7 శాతం చొప్పున క్షీణించాయి. ► మరోవైపు ఐటీసీ 7 శాతం లాభంతో రూ.162 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటొకార్ప్ షేర్లు 7.5 శాతం మేర ఎగిశాయి. భారత్ వృద్ధి క్యూ1లో 3.1 శాతమే: బీఓఎఫ్ఏ ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్ త్రైమాసికం వృద్ధి అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ 48 గంటల్లో రెండవసారి ఏకంగా 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) తగ్గించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కేవలం 3.1 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదవుతుందని వివరించింది. 2020–21లో వృద్ధి రేటు 4.1%గా ఉంటుందని విశ్లేషించింది. బుధవారంనాడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక నివేదికను విడుదల చేస్తూ, జూన్ త్రైమాసికంలో భారత్ జీడీపీని 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 4%కి కుదించింది. గురువారం ఈ రేటునూ మరో 90 బేసిస్ పాయింట్లు కుదించడం గమనార్హం. ఇక 2020–21 భారత్ వృద్ధి రేటును 5.1%గా 48 గంటల క్రితం లెక్కకట్టిన ఈ సంస్థ తాజాగా ఈ అంచనాలకూ 100 బేసిస్ పాయింట్లు కోతపెట్టడం (4.1 శాతానికి) గమనార్హం. రిలయన్స్... 4 నెలల్లో 5 లక్షల కోట్లు హాంఫట్ వరుసగా ఐదో రోజూ రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయింది. ఇంట్రాడేలో 8 శాతం పతనమైన ఈ షేర్ చివరకు 5.3 శాతం నష్టంతో రూ.917 వద్ద ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ షేర్ 17 శాతం నష్టపోగా, మార్కెట్ క్యాప్ రూ.1,20,312 కోట్లు తగ్గింది. నాలుగు నెలల క్రితం (గత ఏడాది నవంబర్‌లో)ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం సగం విలువ హరించుకుపోయి రూ.5,81,374 కోట్లకు పడిపోయింది. కాగా ముకేశ్, ఆయన భార్య, పిల్లలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో తమ తమ వాటాను స్వల్పంగా పెంచుకున్నారు. ప్రమోటర్ గ్రూప్ కంపెనీ నుంచే ఈ వాటాలను కొనుగోలు చేయడంతో రిలయన్స్ ప్రమోటర్ల షేర్ల హోల్డింగ్‌లో మార్పుచోటు చేసుకోలేదు. మొత్తం మీద ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అం బానీ, ఆయన పిల్లలు–ఆకాశ్, ఇషా, అనంత్‌లకు ఒక్కొక్కరికి 75 లక్షల షేర్లు ఉన్నాయి. -
చమురు మంట.. పసిడి పంట
న్యూయార్క్/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అటు పసిడిని, ఇటు క్రూడ్‌ను అప్‌ట్రెండ్‌లోనే కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ధర సోమవారం ఔన్స్ (31.1గ్రా) 1,588 డాలర్లను తాకింది. గత శుక్రవారం ముగింపుతో పోల్చితే ఇది 36 డాలర్లు అధికం. అయితే ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి 14 డాలర్ల లాభంతో 1,566 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఒక దశలో స్పాట్ మార్కెట్లో ధర 10 గ్రాములకు రూ.41,730ని తాకింది. ఇది ఇక్కడ జీవితకాల గరిష్టస్థాయి. పసిడి చివరకు రూ.41,690 వద్ద ముగిసింది. ఇక నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ విషయానికి వస్తే, శుక్రవారం ధరతో పోల్చితే ప్రారంభ ట్రేడింగ్‌లో 2 శాతం పెరుగుదలతో 64.72 డాలర్లకు పెరిగింది. 72 స్థాయికి రూపాయి పతనం.. ముంబై: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, దీనితో క్రూడ్ ధరల భారీ పెరుగుదల, దేశంలో ద్రవ్యోల్బణం భయాలు, ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి అంశాలు భారత్ కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 13 పైసలు పతనమై 71.93 వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బలహీనధోరణిలో 72.03 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 72.11 కనిష్టాన్ని కూడా చూసింది. చివరకు గత శుక్రవారం ముగింపు (71.80)తో పోల్చి 13 పైసలు నష్టపోయి 71.93 వద్ద ముగిసింది. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. ఆ తర్వాత పలు సానుకూల అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరినప్పటికీ మళ్లీ పతనబాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో 71–73 శ్రేణిలో ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. పైగా క్రూడ్ అప్‌ట్రెండ్ రూపాయికి ప్రతికూలంగా నిలుస్తోంది. -
ప్యాకేజీ ఆశలు ఆవిరి
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో విధించిన పన్నును తగ్గించవచ్చని... మందగమన ప్రభావంతో కునారిల్లిన రంగాలకు ప్యాకేజీ ప్రకటిస్తారనే ఆశలతో కొద్దిరోజులుగా పెరుగుతున్న మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎలాంటి ప్యాకేజీ ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా వెల్లడించడంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోవడం దీనికి తోడయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 36,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ప్రధానంగా బ్యాంక్, వాహన, లోహ షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. సెన్సెక్స్ 587 పాయింట్లు పతనమై 36,473 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు తగ్గి 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలకు ఇదే కనిష్ట స్థాయి. వరుసగా మూడో రోజూ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పతనానికి ప్రధాన కారణాలు.... ప్యాకేజీ ఆశలు హుళక్కి డిమాండ్ తగ్గి కుదేలైన రంగాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వగలదన్న ఆశలతో ఇటీవల స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతూ వచ్చాయి. కానీ ప్యాకేజీ ఇవ్వడం అనైతికం అంటూ ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించడంతో ప్యాకేజీ ఆశలు అడుగంటాయి. దీంతో బ్లూచిప్‌లతో సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. జోష్‌నివ్వని సెబీ నిర్ణయాలు... ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెబీ సరళతరం చేసింది. అయితే సూపర్ రిచ్ సర్ చార్జీపై ఎలాంటి స్పష్టత లేకపోవడం నిరాశపరిచింది. బడ్జెట్లో ఈ సర్‌చార్జీ ప్రతిపాదన వెలువడినప్పటినుంచి కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు సెబీ నిర్ణయం ఎలాంటి అడ్డుకట్ట వేయలేకపోయింది. ఎఫ్‌పీఐలు జూలైలో రూ.17,000 కోట్లు, ఈ నెలలో రూ.10,000 కోట్ల మేర నిధులను వెనక్కి తీసుకున్నారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు రేట్ల కోత విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వ్యవహరించకపోవచ్చని ఆ సంస్థ తాజా మినట్స్ వెల్లడించాయి. ఫలితంగా భారత్ వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధుల ప్రవాహంపై ప్రభావం పడుతుంది. మరోవైపు చైనా కరెన్సీ యువాన్ 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ, జపాన్ నికాయ్ సూచీలు మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కె ట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. రూపాయి... దిగువ పయనం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, స్టాక్ మార్కెట్ బలహీనంగా ట్రేడవుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు తగ్గి 71.96ను తాకింది. ఈ ఏడాది ఇదే కనిష్ట స్థాయి. మరోవైపు ముడి చమురు ధరలు 0.65 శాతం మేర పెరగడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది. సాంకేతిక కారణాలు కీలక మద్దతు స్థాయిలు... 10,906, 10,800, 10,750 పాయింట్లను నిఫ్టీ సూచీ కోల్పోయింది. దీంతో అమ్మకాలు ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ తదుపరి మద్దతు 10,580–19,455 పాయింట్ల వద్ద ఉందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 11,120 పాయింట్లపైన స్థిరపడగలిగితేనే నిఫ్టీ బలం పుంజుకుంటుందని వారంటున్నారు. మరోవైపు నిఫ్టీ 10,782 పాయింట్ల దిగువకు దిగి వచ్చిందని, ఇలియట్ వేవ్ థియరీలో ఐదో లెగ్ పతనాన్ని ఇది నిర్ధారిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌ల అభిప్రాయం. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి. 14 శాతం నష్టంతో రూ.56.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆర్థిక అవకతవకలు జరిగిన సీజీ కన్సూమర్ కంపెనీలో ఈ బ్యాంక్‌కు కూడా వాటా ఉండటంతో ఈ షేర్ పతనమవుతోంది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 27 శాతం నష్టపోయింది. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందుస్తాన్ యునిలివర్, హెచ్‌సీఎల్ టెక్– ఈ నాలుగు షేర్లు మాత్రమే పెరిగాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి. ► ఇక నిఫ్టీలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1 –2 శాతం మేర లాభపడగా, మిగిలిన 44 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ► డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతలు తమ రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకునే దిశగా ఆలోచిస్తున్నారన్న వార్తల కారణంగా డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 13 శాతం నష్టంతో రూ.39.70 వద్ద ముగిసింది. ► రుణ భారం తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రమోటర్లు్ల చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపుతుండటంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్ 5 శాతం లాభం తో రూ.76.40 వద్ద ముగిసింది. గత నాలు గు రోజుల్లో ఈ షేర్ 21 శాతం ఎగసింది. ► మార్కెట్ భారీగా పతనమైనా, హిందుస్తాన్ యూని లివర్ (హెచ్‌యూఎల్) ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,879ను తాకింది. నెల కాలంలో ఈ షేర్ 12 శాతం పెరిగింది. ► టాటా మోటార్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా కాఫీ, సెయిల్ వంటి దిగ్గజ షేర్లు ఐదేళ్ల కనిష్ట స్థాయిలకు క్షీణించాయి. వీటితో పాటు మరో 140 షేర్లు ఈ స్థాయికి చేరాయి. డీఎల్ఎఫ్, టాటా స్టీల్, ఐటీసీ, రేమండ్ వంటి 270 షేర్లు రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. మరో 400 షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, అవంతి ఫీడ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐషర్ మోటార్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు డెన్ నెట్వర్క్స్, నెస్లే ఇండియాలు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ప్యాకేజీ ఇవ్వడం అనైతికం.. కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి పన్ను చెల్లింపుదార్ల సొమ్ములను ఉపయోగించడం అనైతికమని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్య ఆర్థిక వ్యవస్థకు శాపం లాంటిదన్నారు. మరోవైపు తక్కువ వడ్డీరేట్లు, ప్రైవేట్ రంగానికి రుణ లభ్యత... ఈ రెండూ ప్యాకేజీ కంటే ఉత్తమమైనవని విద్యుత్తు శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. వీరిద్దరి వ్యాఖ్యలూ ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వవచ్చన్న ఆశలను అడియాసలు చేశాయి. మరోవైపు ఈ క్యూ1లో జీడీపీ వృద్ధి మరింతగా తగ్గగలదని (5.5 శాతానికి )గత నెల వరకూ ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన గార్గ్ పేర్కొనడం మరింత ప్రతికూల ప్రభావం చూపించింది. 697 రేంజ్లో సెన్సెక్స్... ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. ప్యాకేజీ ఆశలు ఆడియాసలు కావడం, రూపాయి క్షీణించడం తదితర కారణాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 28 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 669 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 697 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 201 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ ఇంట్రాడేలో 800 పాయింట్లు నష్టపోయింది. దెబ్బతిన్న సెంటిమెంట్ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ ఏడాది కనిష్టానికి పడిపోవడం... స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడానికి ఒక కారణమని షేర్‌ఖాన్ బై బీఎన్పీ పారిబా ఎనలిస్ట్ హేమాంగ్ జణి పేర్కొన్నారు. డిమాండ్ లేక కుదేలైన రంగాలను ఆదుకునే విషయమై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్యాకేజీ ప్రకటనలు రాకపోవడం ప్రతికూల ప్రభావం చూపించిందని తెలియజేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థకు ప్యాకేజీ అవసరం లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందన్నారు. -
పాలసీని స్వాగతించని మార్కెట్!
అంచనాలకు తగ్గట్లుగానే ఆర్బీఐ రేట్ల కోత ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. అంతేకాకుండా తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 38,700 పాయింట్లు, నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సేవల రంగం గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. ప్రధాన స్టాక్ సూచీలు ఆద్యంతం ఒడిడుదుకుల్లోనే ట్రేడయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు పతనమై 38,685 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు తగ్గి 11,598 పాయింట్ల వద్ద ముగిశాయి. అంచనాలకు తగ్గట్లే రేట్ల కోత అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించింది. అంతంతమాత్రం వృద్ధితో మందగమనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గింది. దీంతో రెపో రేటు ఏడాది కనిష్ట స్థాయి 6 శాతానికి చేరింది. ఈ రేట్ల కోత కారణంగా గృహ, వాహన, ఇతర రుణాలు చౌకగా లభిస్తాయి. నెలవారీ వాయిదాలు చౌక అవుతాయి. అయితే అంతర్జాతీయంగా కొన్ని సమస్యలు నెలకొన్నాయని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7.2 శాతానికి తగ్గిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. ముడి చమురు ధరలు పుంజుకుంటుండటంవల్ల తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తామని వివరించింది. కొత్త వర్క్ ఆర్డర్లు మందగమనంగా ఉండటంతో మార్చిలో భారత సేవల రంగం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 52.5 శాతంగా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఈ మార్చిలో 52కు పడిపోయింది. మూడు రోజులుగా లాభపడుతున్న రూపాయి గురువారం భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21ను తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ మినహా మిగిలిన ఆసియా సూచీలు లాభపడ్డాయి. కొనసాగిన లాభాల స్వీకరణ... ప్రధాన స్టాక్ సూచీలు బుధవారం జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా లాభాల స్వీకరణ కొనసాగింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడే వరకూ పరిమిత శ్రేణి లాభ, నష్టాల్లోనే సూచీలు ట్రేడయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఆ తర్వాత అమ్మకాల జోరు పెరిగి నష్టాలు కూడా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 62 పాయింట్లు లాభపడగా, మరో దశలో 296 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 358 పాయింట్ల రేంజ్లో కదిలింది. మిశ్రమంగా ‘వడ్డీ’ ప్రభావిత షేర్లు... వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు 3–1 శాతం రేంజ్లో లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ షేర్లు చెరో అరశాతం మేర నష్టపోయాయి. బ్యాంక్ షేర్లలో సిటీ యూనియన్ బ్యాంక్ 2.2 శాతం, ఎస్బీఐ 0.3 శాతం మేర లాభపడగా, యస్ బ్యాంక్ 2 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.8 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్0.4 శాతం చొప్పున నష్టపోయాయి. ► టీసీఎస్ సెన్సెక్స్‌లో భారీగా 3.1 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది. ► రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.46 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.46 లక్షల కోట్లు తగ్గి రూ.1,51,04,506 కోట్లకు పడిపోయింది. ► షేర్ల విక్రయం ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నదన్న వార్తలతో యస్ బ్యాంక్ షేర్ 2 శాతం క్షీణించి రూ.268 వద్ద ముగిసింది. -
రూపాయి 76పైసలు డౌన్
ముంబై: మూడు రోజుల రూపాయి లాభాలకు గురువారం బ్రేక్ పడింది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించడంతో రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76 పైసలు క్షీణించి 69.17కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం.. రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. వరుసగా రెండో పాలసీలో కీలక రేట్లలో ఆర్బీఐ కోత విధించింది. దీంతో రూపాయి, బాండ్ల ధరలు పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంతో 68.56 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. బుధవారం రూపాయి 33 పైసలు లాభపడిన విషయం తెలిసిందే. -
మళ్లీ పసిడి ‘డ్రీమ్ రన్’!
అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా పసిడి ధర మళ్లీ పరుగుపెడుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం ఒకానొకదశలో 1,330 డాలర్ల పైకి ఎగసింది. ఒకేరోజు దాదాపు 15 డాలర్లు పెరగడం గమనార్హం. గత ఏడాది మే తర్వాత పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. 2018 ఏప్రిల్‌లో పసిడి 1,365 డాలర్ల గరిష్ట స్థాయిని చూసింది. అటు తర్వాత క్రమంగా పడిపోతూ, ఆగస్టు నెల మధ్యకు వచ్చే సరికి 1,167 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అయితే వెంటనే కోలుకుని 1,200 డాలర్ల స్థాయిని చూసినా, 20 డాలర్ల ప్లస్, మైనస్లతో దాదాపు రెండు నెలలు కదిలింది. తాజాగా మళ్లీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగితే అంతర్జాతీయంగా పసిడి పరుగు మున్ముందు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇక దీనికితోడు రూపాయి బలహీనత తోడయితే, దేశీయంగానూ పసిడి ధర చుక్కలను చూసే అవకాశం ఉంది. పసిడి కదలికలను గమనిస్తే... పతన బాటలో... ► అమెరికా వృద్ధి ఊపందుకుందని, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50 శాతం) పెంపు జోరుగా ఉంటుందని, డాలర్ కూడా బలోపేతమవుతుందని గత ఏడాది మే తర్వాత వెలువడిన విశ్లేషణలు పసిడి పరుగును అడ్డుకున్నాయి. ► వృద్ధి బాగుంటుందన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల పరుగుసైతం పసిడిలోకి పెట్టుబడులపై ప్రతికూలత చూపింది. ► అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, ప్రపంచ వృద్ధిపై ఆందోళనలు ఒకవైపు ఉన్నప్పటికీ, మరోవైపు ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు, ఆర్థిక వృద్ధికి సవాళ్లు తొలుగుతాయన్న సానుకూలతలు పసిడిని ఆగస్టులో 52 వారాల కనిష్ట స్థాయి 1,167 డాలర్ల కనిష్ట స్థాయికి పడేశాయి. పరుగు వెంట... ► అయితే పసిడికి 1,167 డాలర్ల ఉన్న సానుకూల పరిస్థితులు, మరింత ముదిరిన వాణిజ్య యుద్ధ భయాలు బంగారానికి బలమయ్యాయి. ► 1,200 డాలర్లు పసిడికి స్వీట్ స్టాప్ అన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ దిగువకు పడిపోతే మైనింగ్ సంస్థలకు గిట్టుబాటు ధర రాదనీ, దీనితో పసిడి ఉత్పత్తి ఆగిపోతుందని, తిరిగి పసిడి 1,200 డాలర్లపైకి రావడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఇది నిజమే అన్నట్లు 1,200 డాలర్ల దిగువకు పసిడి సంబంధిత సమీక్ష కాలంలో ఎప్పుడు పడినా, మళ్లీ ఆ ధర పైకి వెంటనే ఎగసేది. ► అదే సమయంలో చైనా ఫండ్స్‌సహా కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులూ పసిడి కొనుగోళ్లు జరిపాయి. ► అమెరికా– చైనా వాణిజ్య యుద్ధం సవాళ్లు అందరూ భావించినట్లుగా తగ్గకపోగా మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఈ విషయం మరింత సుస్పష్టమైంది. ► మరోవైపు అమెరికా వృద్ధి అనుకున్నంత వేగంగా లేదని, ఫెడ్ ఫండ్‌రేటు పెంపు దూకుడు తగ్గవచ్చని సంబంధిత అధికారుల నుంచి సంకేతాలు అందాయి. దీనితో డాలర్ ఇండెక్స్ (ప్రస్తుతం 95 స్థాయిలో) దూకుడు కూడా తగ్గింది. ► ఆయా వార్తల నేపథ్యంలో అమెరికాసహా అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఈక్విటీ మార్కెట్లూ గరిష్ట స్థాయిల నుంచి వెనక్కు తగ్గడం ప్రారంభమైంది. ► ఈ అంశాలు పసిడి తాజా పరుగుకు కారణమయ్యాయి. పసిడి అంతర్జాతీయ మార్కెట్ల తీవ్ర నిరోధ స్థాయి 1,300 డాలర్లను దాటింది. ► ఇవే పరిస్థితులు కొనసాగితే, పసిడి దూకుడు మున్ముందూ ఖాయమని ఆర్థిక, బ్యాంకింగ్, రిటైల్, వ్యవస్థాగత ఇన్వెస్టర్లు విశ్లేషిస్తున్నారు. 2018లో 4 శాతం పెరిగిన డిమాండ్: డబ్ల్యూజీసీ పసిడి డిమాండ్ 2018లో అంతర్జాతీయంగా 4% పెరిగింది. ఈ పరిమాణం 4,159.9 టన్నుల నుంచి 4,345.1 టన్నులకు పెరిగినట్లు తాజాగా విడుదల చేసిన నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. నివేదిక ప్రకారం... 2018లో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 74% పెరిగాయి. 2017లో ఈ కొనుగోళ్లు 374.8 టన్నులయితే, 2018లో ఈ పరిమాణం 651.5 టన్నులకు చేరింది. భారత్‌లో తగ్గింది...: భారత్‌లో డిమాండ్ 1.4% తగ్గింది. 2017లో దేశం పసిడి డిమాండ్ 771.2 టన్నులయితే, 2018లో ఈ మొత్తం 760కి తగ్గింది. రూపాయి పతనంతో అధిక ధరలు, కరెంట్ అకౌంట్‌లోటు పెరక్కుండా చూసేందుకు పసిడి ఫిజికల్ కొనుగోళ్లను తగ్గించడానికి ప్రభుత్వ చర్యలు, పథకాలు దీనికి కారణం. దేశంలో 2019లో 750 నుంచి 850 టన్నుల బంగారం డిమాండ్ ఉండవచ్చన్నది అంచనా అని కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం తెలిపారు. కాగా, విలువ రూపంలో బంగారం డిమాండ్ 2018లో 5% వృద్ధితో రూ.15.84 లక్షల కోట్ల నుంచి రూ.16.66 లక్షల కోట్లకు ఎగసింది. మొత్తం పెట్టుబడుల డిమాండ్4% తగ్గి 169 టన్నుల నుంచి 162 టన్నులకు పడింది. దేశీయంగా రూ.38,000 వైపు! ఇక దేశీయ మార్కెట్లోనూ పసిడి పటిష్టంగా ఉంది. అంతర్జాతీయంగా సానుకూల అంశాలతో పాటు, దేశీయంగా రూపాయి బలహీనతా దేశీయ మార్కెట్లో పసిడి బలానికి తోడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి పతనం 71పైన కొనసాగి, అంతర్జాతీయంగా ధర ఏడాది గరిష్ట స్థాయిని తాకితే, దేశంలో పసిడి 10 గ్రాముల ధర సమీపకాలంలోనే తేలిగ్గా రూ.38,000 దాటే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వచ్చింది. తాజాగా ప్రధాన మార్కెట్లన్నింటిలో పసిడి ధర రూ.34,000 దాటిపోవడం గమనార్హం. భారత్‌లో 2013 ఆగస్టులో పసిడి ధర గరిష్టస్థాయి రూ.35,000ని తాకింది. అప్పట్లో రూపాయి డాలర్ మారకంలో 68.85 స్థాయిలో ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాగా అంతర్జాతీయంగా పసిడి ఔన్స్ ధర 2011 ఆగస్టులో గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. ఈ ధర 1,917 డాలర్లు. కొనసాగనున్న బంగారం మెరుపు ఫెడ్ సరళతర ద్రవ్య విధానం నేపథ్యంలో పసిడి ధర మరింత పెరుగుదల అవకాశాలు కనిపిస్తున్నాయి.20 రోజుల మూవింగ్ సగటు 1,291 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉంది. కరెన్సీల బలహీనతల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడి కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ‘ఆర్థిక మాంద్యం’ భయాలనూ సృష్టిస్తోంది. ఇవన్నీ ఫిజికల్ గోల్డ్ డిమాండ్‌కు సానుకూల అంశాలే. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతోనే పసిడి తేలిగ్గా 1,425 డాలర్లను చేరే అవకాశం ఉంది. మా తక్షణ టార్కెట్ ధర 1,450. – గోల్డ్‌మెన్ శాక్స్ -
రూపాయి రివర్స్
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ నష్టాల బాట పట్టింది. ఇటీవల రికవరీతో రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న దేశీ కరెన్సీ... బ్యాంకుల నుంచి, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడడం కారణంగా బుధవారం ఫారెక్స్ మార్కెట్లో 17 పైసలు నష్టపోయింది. 68.62 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు రోజు రూపాయి 68.45 వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే. చమురు ధరలు కొన్ని నెలల కనిష్టానికి చేరినప్పటికీ రూపాయి విలువ క్షీణించడం గమనార్హం. ముఖ్యంగా అమెరికా ఆర్థిక రంగ భవిష్యత్తుపై ఫెడ్ చైర్మన్ జీరోమ్ పావెల్ వ్యాఖ్యలతో మరో రెండు సార్లు రేట్ల పెంపు ఉంటుందన్న మార్కెట్ అంచనాలకు జీవం పోసింది. దీంతో డాలర్ ఇండెక్స్ మరి కాస్త బలోపేతం అయింది -
మరో 34పైసలు నష్టపోయిన రుపీ
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ మరింత బలహీనపడింది. ఇటీవల నష్టాలను మరింత పెంచుకున్న రూపాయి కరెన్సీ మార్కెట్లో రూపాయి వరుసగా ఆరో సెషన్‌లోకూడా బలహీనపడింది. డాలర్ మారకంలో సోమవారం కూడా నెగిటివ్‌గానే ముగిసింది. ఆరంభంలో 8పైసల నష్టంతో ట్రేడ్అయిన రూపాయి ఇన్వెస్టర్ల అమ్మకాలతోమరింత నష్టపోయింది. డాలర్ మారకంలో దాదాపు 34పైసలు (0.5శాతం) పతనమై 66.46వద్దకు చేరింది.నింగిని తాకుతున్న చమురు ధరలు రుపీ ట్రెండ్‌ను బలహీన పర్చాయని ట్రేడర్లు చెప్పారు. అలాగే రిజర్వ్ బ్య ాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలు కరెన్సీలో అమ్మకాలకుదారితీసింది. అటు డాలర్ పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు , బ్యాంకర్ల కొనుగోలవైపు మొగ్గు చూపారు. దీంతో మార్చి 2017నాటి కనిష్టానికి చేరింది. -
రూపాయి మరో 14 పైసలు పతనం
సాక్షి,ముంబై: మంగళవారం ఏడు నెలల కనిష్టానికి చేరిన దేశీయ కరెన్సీ రూపాయి నేడు (బుధవారం) మరింత బలహీనపడింది. డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి 65.78 రూపాయలకు పడిపోయింది. దీంతో తాజాగా మరోసారి ఏడు నెలల కనిష్టాన్ని తాకింది. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్ డిమాండ్ పెరరగడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ బలపడిందని ట్రేడర్లు చెప్పారు. చమురు ధరలు, గ్లోబల్ ట్రేడ్ వార్ ముప్పుకు తోడు దేశంలో కరెన్సీ కొరత , వాణిజ్యలోటు తదితర అంశాలు రూపాయిని బలహీనపరుస్తున్నాయని ఎనలిస్టులు చెప్పారు. నిన్న, రూపాయి 15 పైసలు క్షీణించి 7 నెలల కనిష్ఠానికి 65.64 వద్ద ముగిసింది. కాగా గత మూడు ట్రేడింగ్ సెషన్స్‌లోనే రూపాయి 1 శాతం నష్టపోయింది. కీలక మద్దతు స్థాయిని 65.50 బ్రేక్ చేసింది. ఆసియలో ఫిలిప్పీన్స్ పెసో తర్వాత మనదే వరస్ట్ ఫెర్పామింగ్ కరెన్సీ అట. -
జీఎస్టీ ఎఫెక్ట్: రూపాయి బలహీనం
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి విలువ సోమవారం భారీగా క్షీణించింది. జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భారీ ఆర్థిక భారం పడనుందనే భయంతో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. కౌన్సిల్ తాజా నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థపై సంవత్సరానికి రూ .20వేల కోట్ల భారనుంది. డాలర్ మారకరంలో 20 పైసలు క్షీణించి రూ.65.36 కు చేరుకుంది. మరో వైపు డాలర్ బలం కూడా రూపీ విలువ క్షీణతకు దాసింది. ఇతర కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ బలం, విదేశీ ఫండ్ ప్రవాహాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ తో రూపాయి విలువ పతనం కారణమని డీలర్స్ భావిస్తున్నారు. దీంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లనుంచి రూ.529 కోట్ల మేర పెట్టబడులును శుక్రవారం ఉపసంహరించుకున్నారు. శుక్రవారం ముగింపులో రూపాయి 22పైసలు కోల్పోయి రూ.65.16వద్ద ముగిసింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.