ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్ సెషన్‌లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు. ఇంట్రాడేలో రూపాయి విలువ ఏకంగా 76.30నీ చూసింది. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ కొత్త కనిష్టాలను చూస్తోంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు తాజా పరిస్థితి నేపథ్యం.
బంగారం 80 డాలర్లు జంప్
మరోవైపు కోవిడ్ భయాలతో బంగారం ఒక్కసారిగా భారీగా పెరిగింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 11.15కు 84 డాలర్ల లాభంతో 1,568 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: కోవిడ్–19 ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో రానున్న 16 రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. స్వల్పకాలిక రెపో వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలను వ్యవస్థలోకి పంప్ చేయాలని నిర్ణయించింది. రూ.50,000 కోట్లకు మొదటి విడత రెపో వేలం సోమవారం జరిగింది. అయితే ఈ మొదటి రెపో వేలం ద్వారా రూ.31,585 కోట్లకు బిడ్లను ఆర్‌బీఐ పొందింది. 5.16 శాతం కటాఫ్ రేటుకు అన్ని బిడ్లనూ ఆమోదించింది. మరో రూ.50,000 కోట్లకు రెండవ విడత వేలాన్ని మంగళవారం నిర్వహించనుంది. అవసరమైతే తదుపరి కూడా ఇదే విధమైన చర్యలను తీసుకుంటామని ఆర్‌బీఐ పేర్కొంది. తమ వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను పునఃకొనుగోలు (రీపర్చేజ్) ఒప్పందంపై బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తనఖాగా ఉంచి ఆ బాండ్ల విలువ మేరకు నిధులను పొందుతాయి. ఈ నిధులపై ఆర్‌బీఐ కేవలం రెపో రేటు (ప్రస్తుతం 5.15 శాతం) ప్రకారం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది.
కోవిడ్ నివారణకు యాక్సిస్, వేదాంత చెరో రూ.100 కోట్ల ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్.. కోవిడ్–19 నివారణ చర్యలకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు రూ.100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్లు, ఉద్యోగులు, వర్తకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి స్వీయ నియంత్రణే అసలైన మందు అని.. అందుకే బాధ్యత గల పౌరులుగా సామాజిక దూరం పాటించాలని కోరారు. కస్టమర్లు సాధ్యమైనంత వరకు బ్యాంక్‌లకు రావొద్దని, డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అందుకే ఈ నెల 31 వరకు సేవింగ్, కరెంట్ ఖాతాలు, ప్రిపెయిడ్ కార్డ్స్ కస్టమర్లకు చార్జీలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యాక్సిస్‌కు 4,415 శాఖలు, 12,173 ఏటీఎంలు, 2.6 కోట్ల మంది కస్టమర్లున్నారు.
వేదాంత కూడా...: దినసరి కార్మికుల కోసం మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత రూ.100 కోట్ల ఫండ్ కేటాయించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో జీతాలు కుదించబోమని, తాత్కాలిక కార్మికులను సైతం తొలగించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ వన్ టైం ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. కరోనాపె యుద్ధంలో భాగంగా ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు అండగా నిలవాలని వేదాంత రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. అవసరమైతే మరింత ఫండ్ కేటాయిస్తామని చెప్పారు.
కార్మికులకు రిలయన్స్ అండ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్మికులకు అండగా నిలిచింది. కరోనా వైరస్ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ.30,000లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు చేతిలో నగదు ఉండేలా నెలలో రెండుసార్లు వేతనం చెల్లించనుంది. కరోనా పాజిటివ్ రోగుల చికిత్సకై 100 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని లోధివాలిలో ఐసోలేషన్ ఫెసిలిటీ సైతం అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ మాస్కుల తయారీ సామర్థ్యాన్ని రోజుకు లక్ష యూనిట్లకు పెంచింది. అలాగే సూట్స్, గార్మెంట్స్ వంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ తయారీని పెద్ద ఎత్తున చేపట్టింది. స్వచ్చంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం అందిస్తోంది. అత్యవసర సర్వీసులు మినహా అత్యధిక మంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేలా ప్రోత్సహించింది.
మార్కెట్ లాక్‌డౌన్!
Published Tue, Mar 24 2020 2:28 AM | Last Updated on Tue, Mar 24 2020 2:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment