equities market
-
రూ.12 లక్షలు ఉన్నాయి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
నా వద్ద రూ.12 లక్షలు ఉన్నాయి. ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – సుర్జిత్ సింగ్ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి 65 శాతం వరకు ఈక్విట్లీలో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మూడింట ఒక వంతు డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. మార్కెట్ల పతనాల్లో అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరి, ఈ ఫండ్స్ మరీ అంత నష్టాలను నమోదు చేయవు. ఇక మీ వద్దనున్న రూ.12లక్షలను ఈ ఫండ్స్‌లో ఒకే విడతలో పెట్టేయకూడదు.12 నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఈక్విటీ ఆటుపోట్లను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఒకే విడత రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి.. ఆ తర్వాత ఈక్విటీలు 20 శాతం పడిపోయినా నష్టం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆందోళనకు గురికావొచ్చు. ఏడాది కాలం పాటు సిప్ రూపంలో రూ.12 లక్షలను ఇన్వెస్ట్ చేయడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది.ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగంలో ఏ పథకాలను ఎంపిక చేసుకోవాలి. – శిల్పారామన్దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడం కష్టం. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యాప్ స్టాక్స్ మంచి ప్రదర్శన చేస్తాయి.కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక అన్నింటిలో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంతో ఆ సైకిల్‌ను అధిగమించగలరు. -
ఈక్విటీల్లో విజయానికి.. బఫెట్ పంచ సూత్రాలు
2020 నుంచి రెండేళ్లపాటు తారాజువ్వలా సాగిన ఈక్విటీల ర్యాలీ చూసి మార్కెట్లోకి ఉత్సాహంగా అడుగుపెట్టిన యువ ఇన్వెస్టర్లు బోలెడు మంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు వారిని ఇప్పుడు అయోమయానికి గురిచేయవచ్చు. అంతెందుకు సుదీర్ఘకాలం నుంచి మార్కెట్లో ఉన్న వారు సైతం షేర్ల ధరలు పేకమేడల్లా రాలుతున్నప్పుడు స్థిరంగా చూస్తూ ఉండలేరు. నష్టానికైనా అమ్ముకుని బయటపడదామనుకుంటారు. కానీ, ఈక్విటీ మార్కెట్లకు సంక్షోభాలు కొత్త కాదు కదా! ఎన్నో స్కాములు, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలను చూసి పడిపోయాయి. అంతే బలంగా పైకి లేచి నిలబడ్డాయి. ఈక్విటీల్లో విజయానికి ముందుగా కావాల్సింది పెట్టుబడి కాదు. విజయ సూత్రాలు. వారెన్ బఫెట్ వంటి విఖ్యాత ఇన్వెస్టర్ల అనుభవాలు, సూత్రాలు లోతుగా పరిశీలిస్తే ఈక్విటీ తత్వం కొంతైనా బోధపడుతుంది. వారెన్ బఫెట్ పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాతవే 1970 నుంచి ఏటా వాటాదారులకు వార్షిక నివేదిక పంపిస్తుంటుంది. ఇందులో వాటాదారులను ఉద్దేశించి బఫెట్ రాసే లేఖ ఇన్వెస్టర్లకు ఒక చుక్కానిలా పనిచేస్తుంది. బఫెట్ అనుసరించిన సూత్రాలు కాల పరీక్షకు నిలబడినవి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కరోనా విపత్తు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక ఆంక్షలు, చైనాలో మందగమనం, అమెరికాలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల శరాఘాతం, దీర్ఘకాలం పాటు ఆర్థిక స్తబ్దత, రూపాయి బలహీనత ఇలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఒకవైపు వృద్ధికి ప్రోత్సాహం కావాలి. మరోవైపు ధరలకు కట్టడి వేయాలి. సెంట్రల్ బ్యాంకులకు ఇదొక సవాలుగా మారిపోయింది. ధరల పెరుగుదలకు సరఫరా వ్యవస్థలో సమస్యలూ తోడయ్యాయి. ఇలా ఒకటికి మించిన ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు గురిచేస్తున్నాయి. స్వల్పకాలంలో కనిపించే ఇలాంటి ప్రకంపనలకు కదిలిపోతే దీర్ఘకాలం పాటు మార్కెట్లో నిలిచి రాణించడం అసాధ్యం. ద్రవ్యోల్బణం ప్రభావం ద్రవ్యోల్బణం ఎగసిపడడం అన్నది తాత్కాలికమేనన్న వాదన గతేడాది నుంచి వినిపిస్తోంది. కానీ, ఇది నిజం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. ఫలితంగా దీర్ఘకాలం పాటు సరళతర విధానాలు కొనసాగడం వల్ల ఉండే రిస్క్‌ను ఇన్వెస్టర్లు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు సైతం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. కానీ, ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం నడుమ సెంట్రల్ బ్యాంకుల ముందున్న ఏకైక మార్గం ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేయడమే. ఇన్నాళ్లూ తక్కువ వడ్డీ రేట్లు, మిక్కిలి ద్రవ్య లభ్యతతో లాభపడిన మార్కెట్లు.. పరిస్థితులకు తగ్గట్టు మార్పునకూ గురి కావాల్సిందే. వడ్డీ రేట్లు పెరగడం స్టాక్స్‌కు ప్రతికూలమే. ద్రవ్యోల్బణాన్ని బఫెట్ టేప్వార్మ్తో పోల్చారు. టేప్‌వార్మ్‌లు పేగుల లోపలి గోడల్లో ఉండి మనం తీసుకునే ఆహారంలోని శక్తిని గ్రహిస్తుంటాయి. అలాగే, ద్రవ్యోల్బణం కంపెనీల నిధుల శక్తిని హరిస్తుంటుంది. రుణాలను భారంగా మారుస్తుంది. అధిక ద్రవ్యోల్బణం తర్వాత కనిపించేది అధిక వడ్డీ రేట్లే. అందుకుని మార్కెట్లు ఖరీదుగా మారినప్పుడు, వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మిగులు నిధులను బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తానని బఫెట్ తన 1986 లేఖలో పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరిగితే టేప్‌వార్మ్ మాదిరిగా ఏ స్టాక్స్ విలువలు హరించుకుపోతాయన్న విశ్లేషణ చేయాలి. కమోడిటీలు ఇన్‌పుట్‌గా (ముడి సరుకులుగా) వ్యాపారం చేసేవి, అధిక రుణభారంతో నడిచే కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. అప్పటి వరకు రుణాల అండతో ఇన్ఫ్రా, పవర్ కంపెనీలు దూకుడు ప్రదర్శించగా.. ఆ తర్వాత కుదేలయ్యాయి. రుణాలు తీర్చలేక ఎన్నో కనుమరుగయ్యాయి. పెన్నీ షేర్లుగా మారిపోయినవీ ఉన్నాయి. వడ్డీ రేట్ల సైకిల్ మారే దశలో ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే, నష్టాలతో వచ్చే న్యూఏజ్ కంపెనీలపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపిస్తాయి. భద్రత పాళ్లు ఎంత? 1991, 1993 వార్షిక లేఖల్లో బఫెట్ ‘మార్జిన్ ఆఫ్ సేఫ్టీ’ (భద్రత) గురించి ప్రస్తావించారు. పెట్టుబడి విజయంలో దీని పాత్ర ఎంతో ఉంటుందన్నది ఆయన అనుభవ సారం. స్టాక్స్ విలువను మదింపు వేసే విషయంలో ఊహించిన, ఊహించని రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా నష్టాలకు దారితీస్తుంది. వచ్చే పదేళ్ల పాటు మార్కెట్లలో సానుకూల పరిస్థితులు ఉంటాయని వినడా నికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవంలో ఇది సాధ్యమేనా? ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కంపెనీలకు సంబంధించి రిస్క్‌లు వీటన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి. లాభాల్లేకుండా ఏటా మార్కెట్ వాటా పెంపు కోసం నష్టాలను అధికం చేసుకుంటూ వెళ్లే కంపెనీలకు సంబంధించి భవిష్యత్తు అంచనాలు ఎంతో ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ, ఆర్జించే ఆదాయానికి 3,000 రెట్లు ధర పలుకుతున్న ఆయా కంపెనీల్లో మీరు పెట్టే పెట్టుబడికి భద్రత పాళ్లు ఎంత? ఎన్నో రేట్ల అధిక స్పందన అందుకున్న ఇటీవలి జొమాటో, పేటీఎం, నైకా, పీబీ ఫిన్‌టెక్, కార్‌ట్రేడ్ షేర్లు.. లిస్ట్ అయిన తర్వాత గరిష్టాల నుంచి చూస్తే 40–70 శాతం స్థాయిలో పడిపోయాయి. కానీ, ద్రవ్యోల్బణం ప్రభావం వీటిపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. జొమాటో రూ.76 ధరకు ఐపీవో తీసుకురాగా, ఆ తర్వాత రూ.179 వరకు వెళ్లింది. ఇప్పడు రూ.79 వద్ద ట్రేడవుతోంది. విలువను సరిగ్గా అంచనా కట్టకుండా రూ.150–179 మధ్య పెట్టుబడులు పెట్టిన వారి స్థితి ఏంటి? వారు మార్జిన్ ఆఫ్ సేఫ్టీని పట్టించుకోలేదన్నది స్పష్టం. స్పెక్యులేషన్‌కు దూరం దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకోవాలంటే స్పెక్యులేటర్గా ఉండకూడదని బఫెట్ చెబుతారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్ వేర్వేరు. ఈ రెండింటి మధ్య విభజన గీత స్పష్టంగా ఉంచుకోవాల్సిందే. ఫలానా షేరు ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలో, ర్యాలీ చేస్తుండడమే మీ పెట్టుబడి వెనుక కారణం అయి ఉంటే, షేరు ధర కంపెనీ మూలాలను ప్రతిఫలించడం లేదంటే అది స్పెక్యులేషన్ అవుతుంది. అయినా కానీ, లాభాలు రావచ్చు. మన దేశంలో కొన్ని పాపులర్ స్టాక్స్ కొన్నేళ్ల పాటు అసాధారణ వ్యాల్యూషన్లతోనే ట్రేడవుతుంటాయి. కానీ, ఒక్కసారిగా ఆయా కంపెనీల్లో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటే ఈ వ్యాల్యూషన్లు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఉదాహరణకు పెయింట్స్ స్టాక్స్ ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్లలోనే, అంతర్గత విలువకుపైనే ట్రేడవుతుంటాయి. కానీ, చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పుడు వాటి ధరలు దిగొస్తున్నాయి. చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగితే పెయింట్స్ స్టాక్స్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వృద్ధి అవకాశాలూ సన్నగిల్లుతాయి. ఎందుకంటే ఆయా కంపెనీలు ధరలను పెంచితే విక్రయాలపై ప్రభావం పడుతుంది. అం దుకని పెట్టుబడికి స్పెక్యులేషన్ ధోరణి పనికిరాదు. అంతర్గత విలువ కంపెనీకి ఫలానా ధర పెట్టొచ్చా అన్నది ఎలా తెలుస్తుంది? దీనికి అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) చూడడం బఫెట్ అనుసరించే సూత్రాల్లో మరొకటి. బెర్క్‌షైర్ వాటాదారులకు బఫెట్ తరచుగా దీన్ని సూచిస్తుంటారు కూడా. కంపెనీ వ్యాపారం నుంచి తీసుకోతగిన ‘డిస్కౌంటెడ్ క్యాష్ వ్యాల్యూ’ను అంతర్గత విలువగా బఫెట్ చెబుతారు. కానీ పెట్టుబడుల నిపుణులకు సైతం ఇది కొరుకుపడని అంశం. ఇందుకు సంబంధించి ఎవరికి వారు తమదైన లెక్కింపు విధానాలను అనుసరిస్తుంటారు. కంపెనీకి సంబంధించి నికర పుస్తక విలువను అంచనా వేసి, దానికి సమీప భవిష్యత్తులో వచ్చే క్యాష్ ఫ్లో, ప్రస్తుత లాభాలను కలిపితే అంతర్గత విలువ వస్తుంది. ఇవన్నీ కష్టంగా అనిపించిన వారు.. కంపెనీ లాభాలు ఆ కంపెనీ గత చరిత్ర సగటు స్థాయిలోనే ఉన్నాయా? అని చూడాలి. తర్వాత స్టాక్ ధర చారిత్రకంగా (గతంతో పోలిస్తే) సగటు వ్యాల్యూషన్ల స్థాయిలోనే ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా? గమనించాలి. ఒకవేళ స్టాక్ ధర చారిత్రక సగటు వ్యాల్యూషన్లకు ఎగువన ట్రేడ్ అవుతుంటే అంతర్గత విలువకు మించి ట్రేడవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీల లాభాల వృద్ధి కంటే వాటి స్టాక్స్ వ్యాల్యూషన్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. దీంతో అవి అంతర్గత విలువను దాటిపోయి ట్రేడవుతున్నాయి. 2011 నుంచి 2021 వరకు నిఫ్టీ–50 ఇండెక్స్ 275 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఈ మొత్తంలో 170 శాతం రాబడులు పీఈ రేషియో పెరగడం రూపంలోనే వచ్చాయి. కానీ, ఫండమెంటల్స్ మెరుగుపడడం వల్ల కాదు. అదంతా బబుల్గానే భావించాల్సి ఉంటుంది. పెరుగుదల వెనుక వాస్తవ బలం 100 శాతంగానే భావించాలి. ఇలాంటప్పుడు అంతర్గత విలువకు లభించే స్టాక్స్ తక్కువగానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. సరైన ధర సరైన ధర వచ్చే వరకు వేచి చూడాలి.. ఇన్వెస్టర్లకు 1993 లేఖలో బఫెట్ ఇచ్చిన సూచన ఇది. పెట్టుబడులకు సంబంధించి ఎలా నడుచుకోవాలో తెలియని ఇన్వెస్టర్లను మార్కెట్ క్షమించదని ఆయన చెబుతారు. అత్యుత్తమమైన కంపెనీ అయినా సరే షేరు ధర సహేతుక స్థాయి వద్ద ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నది బఫెట్ అనుసరించే సూత్రం. ఒక కంపెనీకి సంబంధించి ఆయన అనుసరించే అంశాలను గమనిస్తే.. ఎంపిక చేసుకునే కంపెనీ చేస్తున్న వ్యాపారం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. దీర్ఘకాలం పాటు అనుకూలతలు ఆ కంపెనీకి ఉండాలి. సమర్థులైన, నిజాయతీపరులైన వ్యక్తులు నడిపిస్తుండాలి. ఆకర్షణీయమైన ధర వద్ద ఉండాలి. వీటిల్లో మొదటి మూడు అంశాలకు రైట్ మార్కులు పడే కంపెనీలను ఆయన ఎన్నో సందర్భాల్లో గుర్తిస్తూనే ఉంటారు. కానీ, నాలుగో అంశమైన ఆకర్షణీయమైన ధర వద్ద లేకపోవడంతో బఫెట్ పెట్టుబడులకు దూరంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మార్కెట్లో ప్రతి పతనం పెట్టుబడికి అవకాశం కావాలనేమీ లేదు. కొన్ని సందర్భాల్లో కంపెనీలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం కావచ్చు. పెట్టుబడులకు ముందు భిన్నమైన అంశాలను విశ్లేషించుకోవాలని, వేగంగా స్పందించకుండా ఓపిక పట్టాలన్నది బఫెట్ ఫిలాసఫీ. పెట్టే ధర విషయంలో రిస్క్ తీసుకోవడం బఫెట్‌కు నచ్చదు. అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టడమే ఆయన అనుసరించే విధానం. చక్కని అవకాశాలన్నవి మళ్లీ మళ్లీ వస్తుంటాయని ఆయన నమ్ముతారు. అందుకనే అందరూ ఎగబడి కొంటున్న వేళ అప్రమత్తంగా వ్యవహరించాలని.. అందరూ విక్రయిస్తున్న వేళ కొనుగోళ్లకు మొగ్గు చూపాలన్నది బఫెట్‌కు ఫలితాలిచ్చిన సూత్రాల్లో ఒకటి. ఎగసిపడే కెరటాన్ని పట్టుకోకుండా.. అది నేలను తాకే వరకు ఆగాలంటారు. 100–150–200 పీఈ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ముందు అయినా బఫెట్ సూత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. -
దంతేరాస్ ధమాఖా... 50 టన్నుల బంగారం సోల్డవుట్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగింది. ఫలితంగా రూ.303 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.446 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఆగస్ట్‌లో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.24 కోట్లుగానే ఉన్నాయని.. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు తెలియజేస్తున్నాయి. పండుగల సీజన్ కావడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ కొనసాగినట్టు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతిగుప్తా పేర్కొన్నారు. భారీ దంతేరాస్ విక్రయాలు ఈ ఏడాది దంతేరస్ సందర్భంగా 50 టన్నుల బంగారం విక్రయమైందని.. 2019తో పోలిస్తే 20 టన్నులు ఎక్కువని చెప్పారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో కాస్తంత పెట్టుబడులు తగ్గడానికి.. భౌతిక బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి ఉండొచ్చని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. అలాగే, బంగారం ధరలు పెరగడం కూడా ఒక కారణమై ఉంటుందన్నారు. అయినప్పటికీ అక్టోబర్‌లో వచ్చిన నికర పెట్టుబడుల పరిమాణాన్ని పరిశీలిస్తే ఇన్వెస్టర్లు ఇప్పటికీ బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్ చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఫోలియోల (పెట్టుబడి ఖాతా) సంఖ్య 8 శాతం పెరిగి 26.6 లక్షలకు చేరింది. చదవండి:బంగారం ఎలా ఉన్నా మెరుస్తుంది..! -
ఎఫ్‌పీఐ పెట్టుబడులు.. భళా
ముంబై: కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను దేశీ క్యాపిటల్ మార్కెట్లు విశేషంగా ఆకర్షిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) విదేశీ పెట్టుబడుల రీత్యా మార్కెట్లు రికార్డులు సాధించే వీలుంది. ఏప్రిల్ నుంచి ఈ నెల 15వరకూ చూస్తే ఎఫ్‌పీఐలు అటు ఈక్విటీలు, ఇటు రుణ సాధనాలలో కలిపి ఏకంగా 33.8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. డాలరుతో మారకంలో ప్రస్తుత రూపాయి విలువ(72.65) ప్రకారం వీటి విలువ రూ. 2.45 లక్షల కోట్లకుపైమాటే. ఇంతక్రితం 2014–15లో మాత్రమే ఎఫ్‌పీఐలు ఇంతకంటే అధికంగా అంటే 46 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. వెరసి దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడుల విలువ 592.5 బిలియన్ డాలర్లను తాకింది. వీటిలో ఈక్విటీ పెట్టుబడుల విలువ 537.4 బిలియన్ డాలర్లుకాగా.. రుణ సాధనాలలో 51.38 బిలియన్ డాలర్లను పంప్ చేశారు. దేశీ దిగ్గజం కేర్ రేటింగ్స్ రూపొందించిన గణాంకాలివి. ఫైనాన్షియల్ జోరు: ఎఫ్‌పీఐల పెట్టుబడులు(హోల్డింగ్స్) అత్యధికంగా ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో (191.3 బిలియన్ డాలర్లు) నమోదుకాగా.. సాఫ్ట్వేర్ 76 బిలియన్ డాలర్లను ఆకట్టుకుంది. ఆయిల్, గ్యాస్‌లో 50 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్స్, కాంపోనెంట్స్‌లో 27 బిలియన్ డాలర్లు, బయోటెక్నాలజీలో దాదాపు 23 బిలియన్ డాలర్లు, సావరిన్ డెట్‌లో 21.7 బిలియన్ డాలర్లు చొప్పున ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. వ్యక్తిగత ఉత్పత్తులు, క్యాపిటల్ గూడ్స్, ఆహారం, పానీయాలు, బీమా రంగాలు సైతం 20–13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పొందాయి. 10 ప్రధాన రంగాలు ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో 78% వాటాను ఆక్రమిస్తున్నాయి. డిసెంబర్లో..: ఈ ఏడాది లభించిన దాదాపు 34 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల్లో 8.4 బిలియన్ డాలర్లు ఒక్క డిసెంబర్లోనే లభించడం విశేషం! అయితే కేర్ గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ప్రతికూలంగా నమోదయ్యాయి. 2019–20లో ఎఫ్‌పీఐలు నికరంగా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. దేశీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న విదేశాలలో యూఎస్ వాటా 34 శాతంకాగా.. మారిషస్ 11 శాతం, సింగపూర్ 8.8 శాతం, లగ్జెమ్‌బర్గ్ 8.6 శాతం, బ్రిటన్ 5.3 శాతం, ఐర్లాండ్ 4%, కెనడా 3.4 శాతం, జపాన్ 2.8 శాతం చొప్పున వాటాను ఆక్రమిస్తున్నాయి. నెదర్లాండ్స్, నార్వే సైతం 2.4% వాటాను కలిగి ఉన్నాయి. -
మార్కెట్ లాక్డౌన్!
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్ సెషన్లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు. ఇంట్రాడేలో రూపాయి విలువ ఏకంగా 76.30నీ చూసింది. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ కొత్త కనిష్టాలను చూస్తోంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు తాజా పరిస్థితి నేపథ్యం. బంగారం 80 డాలర్లు జంప్ మరోవైపు కోవిడ్ భయాలతో బంగారం ఒక్కసారిగా భారీగా పెరిగింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 11.15కు 84 డాలర్ల లాభంతో 1,568 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లు న్యూఢిల్లీ: కోవిడ్–19 ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో రానున్న 16 రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. స్వల్పకాలిక రెపో వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలను వ్యవస్థలోకి పంప్ చేయాలని నిర్ణయించింది. రూ.50,000 కోట్లకు మొదటి విడత రెపో వేలం సోమవారం జరిగింది. అయితే ఈ మొదటి రెపో వేలం ద్వారా రూ.31,585 కోట్లకు బిడ్లను ఆర్బీఐ పొందింది. 5.16 శాతం కటాఫ్ రేటుకు అన్ని బిడ్లనూ ఆమోదించింది. మరో రూ.50,000 కోట్లకు రెండవ విడత వేలాన్ని మంగళవారం నిర్వహించనుంది. అవసరమైతే తదుపరి కూడా ఇదే విధమైన చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ పేర్కొంది. తమ వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను పునఃకొనుగోలు (రీపర్చేజ్) ఒప్పందంపై బ్యాంకులు ఆర్బీఐ వద్ద తనఖాగా ఉంచి ఆ బాండ్ల విలువ మేరకు నిధులను పొందుతాయి. ఈ నిధులపై ఆర్బీఐ కేవలం రెపో రేటు (ప్రస్తుతం 5.15 శాతం) ప్రకారం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. కోవిడ్ నివారణకు యాక్సిస్, వేదాంత చెరో రూ.100 కోట్ల ఫండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్.. కోవిడ్–19 నివారణ చర్యలకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు రూ.100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్లు, ఉద్యోగులు, వర్తకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి స్వీయ నియంత్రణే అసలైన మందు అని.. అందుకే బాధ్యత గల పౌరులుగా సామాజిక దూరం పాటించాలని కోరారు. కస్టమర్లు సాధ్యమైనంత వరకు బ్యాంక్‌లకు రావొద్దని, డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అందుకే ఈ నెల 31 వరకు సేవింగ్, కరెంట్ ఖాతాలు, ప్రిపెయిడ్ కార్డ్స్ కస్టమర్లకు చార్జీలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యాక్సిస్‌కు 4,415 శాఖలు, 12,173 ఏటీఎంలు, 2.6 కోట్ల మంది కస్టమర్లున్నారు. వేదాంత కూడా...: దినసరి కార్మికుల కోసం మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత రూ.100 కోట్ల ఫండ్ కేటాయించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో జీతాలు కుదించబోమని, తాత్కాలిక కార్మికులను సైతం తొలగించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ వన్ టైం ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. కరోనాపె యుద్ధంలో భాగంగా ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు అండగా నిలవాలని వేదాంత రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. అవసరమైతే మరింత ఫండ్ కేటాయిస్తామని చెప్పారు. కార్మికులకు రిలయన్స్ అండ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్మికులకు అండగా నిలిచింది. కరోనా వైరస్ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ.30,000లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు చేతిలో నగదు ఉండేలా నెలలో రెండుసార్లు వేతనం చెల్లించనుంది. కరోనా పాజిటివ్ రోగుల చికిత్సకై 100 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని లోధివాలిలో ఐసోలేషన్ ఫెసిలిటీ సైతం అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ మాస్కుల తయారీ సామర్థ్యాన్ని రోజుకు లక్ష యూనిట్లకు పెంచింది. అలాగే సూట్స్, గార్మెంట్స్ వంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తయారీని పెద్ద ఎత్తున చేపట్టింది. స్వచ్చంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం అందిస్తోంది. అత్యవసర సర్వీసులు మినహా అత్యధిక మంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేలా ప్రోత్సహించింది. -
ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
ఇరాన్ డీల్‌తో ఇన్వెస్టర్లలో వెల్లువెత్తిన ఉత్సాహం ఒక్కరోజులోనే చల్లారిపోయింది. మంగళవారం తిరిగి ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 111 డాలర్లకు పెరగడంతో ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లు కోల్పోయి 20,425 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 6,059 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరో రెండు రోజుల్లో నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండటం, శుక్రవారం క్యూ2 జీడీపీ డేటా వెల్లడికానుండటంతో చాలావరకూ లాంగ్ పొజిషన్లను ఇన్వెస్టర్లు స్క్వేర్‌ఆఫ్ చేసుకున్నారని, మార్కెట్ క్షీణతకు ఇది కూడా ఒక కారణమని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. ప్రధాన ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లు కూడా బలహీనంగా ముగిసాయి. క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన ఆయిల్ రిఫైనరీ షేర్లు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు 5-6 శాతం పడిపోయాయి. చమురు ఉత్పాదక షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, కెయిర్న్లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంకింగ్ షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-4 శాతం మధ్య తగ్గాయి. ప్రపంచ ఇన్వెస్టర్లు ట్రాక్‌చేసే మోర్గాన్ స్టాన్లీ ఇండెక్స్ నుంచి తొలగించిన కారణంతో కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనీటెక్లు 5-8 శాతం మధ్య పతనమయ్యాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) తిరిగి రూ. 339 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరిపారు. దేశీయ సంస్థలు రూ. 357 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. ఆర్ఐఎల్ కౌంటర్లో భారీ రోలోవర్స్... రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) షేరు 8 వారాల కనిష్టస్థాయి రూ. 841 వద్ద ముగియడం, ఈ షేరు సాంకేతికంగా కీలకమైన 830-840 మద్దతు శ్రేణి వద్దవుండటంతో డిసెంబర్ డెరివేటివ్ సిరీస్‌కు మంగళవారం రోలోవర్స్ భారీ జరిగాయి. నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 10 లక్షల షేర్లు కట్‌కాగా, డిసెంబర్ సిరీస్‌లో 23 లక్షల షేర్లు యాడ్కావడం విశేషం. ఈ నెల సిరీస్ ముగియడానికి మరో రెండురోజులు సమయం వున్నా, ఇప్పటికే డిసెంబర్ సిరీస్ ఆర్ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో బిల్డప్ 80.24 లక్షల షేర్లకు చే రింది. నవంబర్ సిరీస్ ప్రారంభంకావడానికి రెండు రోజుల ముందు.... అంటే అక్టోబర్ 29న నవంబర్ కాంట్రాక్టు బిల్డప్ 58 లక్షల షేర్లవర కే వుండేది. షేరు కీలక మద్దతుస్థాయిని సమీపించడంతో అటు షార్ట్, ఇటు లాంగ్ రోలోవర్స్ పెరగడాన్ని డిసెంబర్ బిల్డప్ సూచిస్తున్నది. సమీప భవిష్యత్తులో ఆర్ఐఎల్ ప్రస్తుత మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వచ్చే నెలలో ర్యాలీ జరపవచ్చని, మద్దతును కోల్పోతే వేగంగా పతనంకావొచ్చన్నది ఈ భారీ బిల్డప్ అంతరార్థం. కేజీ డీ6 క్షేత్రంలో మరో బావిని రిలయన్స్ మూసివేయడంతో అత్యంత కనిష్టస్థాయికి గ్యాస్ ఉత్పత్తి పడిపోయిందని, వచ్చే ఏప్రిల్ నుంచి రెట్టింపు గ్యాస్ ధరను గ్యారంటీ మొత్తాన్ని తీసుకుని ఆర్ఐఎల్కు వర్తింపచేస్తామంటూ కేంద్ర పెట్రో మంత్రి ప్రకటించడం వంటి అనుకూల, ప్రతికూల వార్తలు తాజాగా వెలువడ్డ నేపథ్యంలో ఈ బిల్డప్ జరగడం గమనార్హం.