నా వద్ద రూ.12 లక్షలు ఉన్నాయి. ఐదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు?
– సుర్జిత్ సింగ్
ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి 65 శాతం వరకు ఈక్విట్లీలో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మూడింట ఒక వంతు డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. మార్కెట్ల పతనాల్లో అచ్చమైన ఈక్విటీ పథకాల మాదిరి, ఈ ఫండ్స్ మరీ అంత నష్టాలను నమోదు చేయవు. ఇక మీ వద్దనున్న రూ.12లక్షలను ఈ ఫండ్స్‌లో ఒకే విడతలో పెట్టేయకూడదు.
12 నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఈక్విటీ ఆటుపోట్లను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఒకే విడత రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి.. ఆ తర్వాత ఈక్విటీలు 20 శాతం పడిపోయినా నష్టం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆందోళనకు గురికావొచ్చు. ఏడాది కాలం పాటు సిప్ రూపంలో రూ.12 లక్షలను ఇన్వెస్ట్ చేయడం వల్ల విశ్వాసం కూడా పెరుగుతుంది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగంలో ఏ పథకాలను ఎంపిక చేసుకోవాలి.
– శిల్పారామన్
దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడం కష్టం. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యాప్ స్టాక్స్ మంచి ప్రదర్శన చేస్తాయి.
కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక అన్నింటిలో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌కు ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. మార్కెట్ సైకిల్‌లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంతో ఆ సైకిల్‌ను అధిగమించగలరు.
Comments
Please login to add a commentAdd a comment