డిపాజిట్‌లా.. స్టాక్‌మార్కెట్టా.. మన కష్టార్జితం ఎటువైపు..? | Deposit or stock market which is better | Sakshi
Sakshi News home page

డిపాజిట్‌లా.. స్టాక్‌మార్కెట్టా.. మన కష్టార్జితం ఎటువైపు..?

Published Sun, Dec 8 2024 8:06 AM | Last Updated on Sun, Dec 8 2024 10:04 AM

Deposit or stock market which is better

చినుకు చినుకు కలిస్తే జడివాన అవుతుందన్నది ఎంత వాస్తవమో... రూపాయి రూపాయి కూడబెడితేనే రేప్పొద్దున్న అవి వేలు, లక్షలుగా మారతాయి అన్నది కూడా అంతే వాస్తవం. ఇలా కూడబెట్టడానికి, సంపద పెంచుకోవడానికి రకరకాల అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టార్జితంతో చెలగాటం ఆడలేం కాబట్టి... ముందు చూపుతో తెలివిగా వ్యవహరించడం అత్యంత ప్రధానం. ఇదివరకటి రోజుల్లో మన ఖర్చులు పోగా మిగిలే డబ్బుల్ని బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో డిపాజిట్‌ చేసుకునేవారు. లేదంటే ఏ బంగారమో కొనుక్కునే వారు. ఇప్పుడు రోజులు మారాయి. 

సంప్రదాయ మార్గాలు కొత్త రూటు వెతుక్కున్నాయి. అలా ఈమధ్య కాలంలో నలుగురూ కొత్తగా దృష్టి పెడుతున్నదే షేర్లలో పెట్టుబడులు. మన డబ్బులు స్వల్ప వ్యవధిలోనే ఇంతలింతలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే క్రమశిక్షణ పాటించాలి సుమా.... మన దగ్గరున్న డబ్బులు ఏయే మార్గాల్లో దాచుకుంటే/పెట్టుబడి పెడితే ఎంత అవ్వడానికి అవకాశం ఉంటుందో ఉదాహరణ పూర్వకంగా పరిశీలిద్దాం. ఉదాహరణకు... మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి అనుకుందాం. వాటిని ఏయే మార్గాలకు మళ్లిస్తే ఎంత గిట్టుబాటు అవుతుందో పరిశీలిద్దాం.

1. పోస్ట్ఆఫీస్

వడ్డీరేట్లు 7-7.5 స్థాయిలోఉన్నాయి. అయిదేళ్లకాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్‌ చేస్ తేదానిపై వచ్చే వడ్డీ ఏడాదికి రూ. 7,000-7,500. ఐదేళ్లకురూ.35,000 -37,500.

* ఎలాంటి రిస్క్ ఉండదు.
* ఒకసారి పెట్టుబడి పెట్టి అయిదేళ్లపాటు వదిలేయడమే. 
* చాలా తక్కువ రాబడి. 
* పెట్టుబడి సురక్షితం. 
* అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్‌ చేసుకోవచ్చు. 
* అయితే పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. 
* డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించలేకపోయినా, మధ్యలో అవసరానికి వెనక్కి తీసుకున్నా చార్జీలు వసూలు చేస్తారు. 
* డిపాజిట్ చేసిన ఆరు నెలలలోపు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. 
* ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఎఫ్‌డీ వడ్డీ రేటు కాకుండా సేవింగ్స్ వడ్డీరేటు చెల్లిస్తారు.  
* ఏడాది పైబడితే.. వాస్తవానికి నిర్ధారించిన ఎఫ్‌డీ రేటు కంటే 2% తక్కువగా అప్పటికి ఎన్నినెలలు పూర్తయితే ఆనెలలకు లెక్కగడతారు. మిగతా కాలానికి సేవింగ్స్ రేటుని పరిగణనలోకి తీసుకుంటారు.

2. బ్యాంకు డిపాజిట్

వడ్డీ రేట్లు గరిష్టంగా 7 శాతం దాకా ఉన్నాయి. అయిదేళ్ల కాలవ్యవధికి ఈ రూ. లక్ష డిపాజిట్ చేస్ తేదానిపై వచ్చే వడ్ డీఏడాదికి రూ. 7,000. అయిదేళ్లకు రూ.35,000.

* ఇంచుమించు పోస్ట్ఆఫీస్ మాదిరిగానే ప్రతిఫలాలు ఉంటాయి. 
* ఎలాంటి రిస్క్ ఉండదు.
* ఒకసారి పెట్టుబడి పెట్టి మెచ్యూర్ అయ్యే వరకు ఆగొచ్చు. 
* తక్కువ రాబడి కానీ పెట్టుబడి సురక్షితం. 
* అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే భార్య/భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు... ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. 
* పెట్టుబడిని పూర్తికాలం కొనసాగించ లేకపోతే చేతికొచ్చే ప్రతిఫలం తగ్గిపోతుంది. 
* డిపాజిట్ ను ఐదేళ్లూ కొనసాగించకపోతే అరశాతం నుంచి 1% దాకా (బ్యాంకునుబట్టి) 
చార్జీలు వసూలు చేస్తారు.
* నిర్ణీత వ్యవధిలోపు డిపాజిట్‌ను  ఉపసంహరించుకుంటే అప్పటిదాకా జమకూడిన వడ్డీ నుంచి గాని, అసలు మొత్తం నుంచి గాని ఈ చార్జీలను మినహాయించుకుంటారు.   
* మధ్యలోనే వెనక్ కితీసుకుంటే డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు వచ్చే పూర్తి వడ్డీ మొత్తం కోల్పోతారు.

3. స్టాక్ మార్కెట్

కరోనా తర్వాతి కాలంలో చాలా మందిని ఆకర్షించిన పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది స్టాక్‌ మార్కెట్టేనని చెప్పుకోవచ్చు. కుప్పలు తెప్పలుగా డీమ్యాట్ అకౌంట్లు పుట్టుకొచ్చేశాయి. అయితే ఇలా ఖాతాలు తెరిచినవారిలో ఎక్కువ మంది పెట్టుబడుల కంటే ట్రేడింగ్ పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అలా కాకుండా దీన్నో పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటే కచ్చితంగా అధిక ప్రతిఫలాన్ నిపొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిట్లో ఉన్నట్లే ఇందులోనూ ప్రయోజనాలు లోటుపాట్లు ఉండటం సహజం. అవేమిటంటే...

* నిర్ణీత పెట్టుబడితోనూ అధిక రాబడి పొందొచ్చు. 
* డిపాజిట్లతో పోలిస్తే వచ్చే ప్రయోజనం ఎక్కువ. అదేసమయంలో రిస్క్ కూడా ఎక్కువే. 
* పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక దృక్పథంతో వ్యవహరిస్తే గ్యారంటీ ప్రతిఫలాన్ని పొందవచ్చు. 
* పై ఉదాహరణనే పరిశీలిస్తే లక్ష రూపాయల పెట్టుబడిని ఏడాది కాలవ్యవధితో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఉదా: ఈ రూ. లక్షతో రూ. 2000 విలువ చేసే షేర్లు కొంటే 50 వస్తాయి. ఇంత విలువ ఉన్న షేర్లు ఏడాది వ్యవధిలో కనీసం రూ.200 పెరిగే అవకాశం ఉంటుంది (మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బాగోకపోతే షేర్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మార్కెట్లోకి అడుగు పెట్టేటప్పుడే మనం ఎంత వరకు రిస్క్ భరించగలమో చూసుకుని దిగాలి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎప్పుడూ మంచి ప్రతిఫలాలనే ఇస్తాయని చరిత్ర చెబుతున్న వాస్తవం).
 

* మన 50 షేర్ల మీద రూ. 10,000 రిటర్న్‌ వచ్చినట్లన్నామాట. దీన్ని అయిదేళ్లకు లెక్కగడితే రూ. 50,000 ప్రతిఫలం ముట్టినట్లు. 
* బ్యాంకు డిపాజిట్లు, పోస్ట్ఆఫీస్ డిపాజిట్లతో పోలిస్తే అధిక రాబడి సాధించినట్లే అవుతుంది. ఇక్కడ నేను చెప్పింది కనీస స్థాయిలో లెక్కగట్టి మాత్రమే అన్న విషయాన్ని గ్రహించాలి. ఇంతకంటే ఎక్కువ కూడా... అంటే లక్షకు లక్ష, రెండు లక్షలు... అంతకుమించి కూడా సంపాదించిపెట్టే అవకాశం స్టాక్ మార్కెట్‌కు  మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
* చెప్పానుగా..రిస్క్ కూడా ఎక్కువే... ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు షేర్ ధరను పడగొడితే సంపాదించడం మాట అటుంచి పోగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయితే మనం కొనే షేర్/షేర్ల నుబట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఏ చెత్తపడితే ఆచెత్త షేర్ ను కొనేయకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. దీనికి సంబంధించి మళ్ళీ మరోసారి విడమర్చి చెబుతా..

డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో మనం ఏది ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో అర్ధం అయిందనుకుంటా... బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీచేతుల్లోనే ఉంది.

-బెహరా శ్రీనివాసరావు, స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement